🌳🌴🌴🌳🌲🪻🫒🍀🎋🪴🍍🌱🍂🌿🎋🌳
ఉదయం 6.30 దాటింది.గబగబా తాళం వేసి, బ్యాగ్ భుజానికి తగిలించుకుని రోడ్డెక్కాను. ఆటో కోసం ఐదారు నిమిషాలు నడవాల్సిందే! అటు ఇటు చూస్తూ నడుస్తున్న నాకు రోడ్డు రెండు వైపులా చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు..ఇంకా రకరకాల వ్యర్థాలు పేరుకుపోయి కనిపించాయి. నిన్న రాత్రి వర్షం కురిసిందేమో.. రోజూ నడుస్తున్న దారే అయినా మరీ అధ్వాన్నంగా ఇంకా చెప్పాలంటే అసహ్యంగా కనిపించింది. ఇళ్ల నుండి రోజూ చెత్త సేకరిస్తూనే ఉన్నారు.. అయినా..రోడ్ల పక్కన ఇంతలా ఎలా పేరుకు పోతోంది ! చుట్టుపక్కల హోటళ్ల వాళ్ళు మిగిలిపోయినవన్నీ పారవేయడం కూడా ఇక్కడే..! పర్యావరణం కలుషితం అవమంటే అవ్వదా! రోగాలు రాకుండా ఎలా ఉంటాయి?
అలా ఆలోచిస్తున్న నా ముందు ఆటో వచ్చి ఆగింది. ఎక్కి కూర్చుని, బస్టాప్ లో దిగాను. ఏడు గంటలకు నేను వెళ్లాల్సిన బస్సు వచ్చింది. ఎక్కి ఖాళీగా ఉన్న కిటికీ పక్క సీట్లో కూర్చున్నాను. చల్లగాలి వీస్తోంది. హాయిగా అనిపించింది. కానీ,అది కాసేపే..! కిటికీలోంచి కనిపిస్తున్న దృశ్యాలకు ఆ ఆహ్లాదం కాస్తా ఆవిరైపోయింది. కంపచెట్లకు అడ్డదిడ్డంగా తగులుకున్న ప్లాస్టిక్ కవర్లు దారి పొడవునా దర్శనమిస్తూఉంటే మూడ్ అంతా పాడయిపోయింది.
ప్లాస్టిక్ వాడకం తగ్గించండి అంటారు..అసలు వాడొద్దు అంటారు.. కానీ, అవి ఉత్పత్తి కాకుండా నిరోధించరు.మన ప్రారబ్దం ! అవి లేకుండా మనకు రోజు గడవదు. ఫలితంగా ఎన్ని అనర్థాలో! ఏం చేయగలం! ఇవన్నీ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్ళు పడతాయట! పెరుగుతున్న టెక్నాలజీతో రకరకాల పరికరాలు, వస్తువులు కనిపెడుతున్నారు. ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ, సౌకర్యాలతో పాటు అనివార్యమైన అసౌకర్యాలూ, అనారోగ్యాలు భరించక తప్పడం లేదు.. అవి మనల్ని చుట్టు ముడుతున్నాయి, చాప కింద నీరులా..!
వంట పాత్రల నుండి, తాగే నీటి బాటిళ్ల వరకూ అంతా ప్లాస్టిక్ మయమే. నివారించలేము.. వాడకుండా ఉండలేము. అంతకన్నా మనకు మరోదారి ఉండడం లేదు. ఒకప్పటిలా మట్టికుండలు వాడమంటున్నారు.ఆకర్షణీయమైన,సౌకర్యవంతమైన వస్తుసామాగ్రి కనిపెట్టి జనాల మీదకి వదిలేసి, ఇప్పుడు వాటన్నింటినీ పక్కకు పెట్టేయండి.. మళ్లీ పాత రోజుల్లోకి వెళ్ళండి.. అంటే సాధ్యపడుతుందా!! సుఖానికి అలవడ్డ ప్రాణాలు మరి!
అయినా.. చెప్పుకుంటూ పోతే ఒక్క.. ప్లాస్టిక్ మాత్రమేనా పరిసరాల్ని కలుషితం చేస్తూ ఆరోగ్యానికి చేటు తెస్తున్నది..!? గాలి కాలుష్యం చేస్తున్న హాని అంతా ఇంతా కాదుగదా!
అయినా.. ప్రతిరోజూ నేను ప్రయాణిస్తున్న దారే ఇది. ఉద్యోగరీత్యా రోజూ ఉదయం, సాయంత్రం ఈ ప్రయాణం తప్పదు నాకు. కానీ ఈ రోజే ఎందుకో చుట్టూ చూడాలనిపిండానికి కారణం ఉంది... అదేంటంటే.. ఈ దినం ప్రపంచ పర్యావరణ దినం (5.6.25) కాబట్టి...
మన చుట్టూ పరిసరాలు శుభ్రగా, ఆహ్లాదంగా ఉండాలంటే అది ముందుగా మన ఇంటి నుండే మొదలవ్వాలి అంటాను నేను. ప్రతివారూ ఇంటి ముందు రెండు మొక్కలైనా నాటాలి.స్థలం లేపోతే నాలుగైదు తొట్లు పెట్టుకుని అందులో ఏ పచ్చని మొక్కలో నాటుకోవాలి. ఇంట్లో, ఇంటి ముందు చెత్తా చెదారం లేకుండా శుభ్రత పాటించాలి.ఇలా ప్రతీ ఇల్లు తయారైతే వీధులన్నీ శుభ్రంగా,ఆహ్లాదంగా తయారై అందంగా కూడా కనిపిస్తాయి. ఆవిధంగా పర్యావరణం బాగుపడుతుంది. కాదంటారా!, ప్రతి ఒక్కరం పాటించాల్సిన నియమం ఇది.
ఆవిధంగా ఆహ్లాదం, ఆరోగ్యం, ఆనందం మన సొంతమవుతాయి. పర్యావరణ దినోత్సవం నాడు అందరం ఈ నిర్ణయం తీసుకుందాం. తద్వారా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం....
🌴🌵🌿🌲🌳🍀🫒🎋🪴🍍🌱🍂🌾🌴🌳🌲
No comments:
Post a Comment