Saturday, May 2, 2020

ఫలితం...... ' చిన్నారి ' కథ

ఫలితం 
----------
   లక్ష్మీపురం ఉన్నత పాఠశాలలో  పదవ తరగతి విద్యార్థులకు యూనిట్ పరీక్ష జరుగుతోంది. పరీక్ష కేమేమి చదవాలో టీచర్ వారం క్రితమే చెప్పినా వినోద్ పుస్తకం ముట్టిన పాపాన పోలేదు. అందుకే ఈ రోజు ఒక్క ప్రశ్నక్కూడా జవాబు రాయలేక దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. వాడికి అటువైపు కూర్చున్న వికాస్ పరిస్థితీ దాదాపు అలాగే ఉంది. కానీ వినోద్ లాగా వికాస్ చదవకుండా పరీక్షకు రాలేదు. వారం నుండీ చదవాల్సిందంతా బట్టీ పడుతూనే ఉన్నాడు. కానీ వాడి జ్ఞాపకశక్తి అంతంత మాత్రమే. అందుకే  నేర్చు కున్న దంతా మరిచిపోయి, ఎంత ఆలోచించినా గుర్తురాక తల పట్టుక్కూచున్నాడు. 
    ఇంతలో వినోద్ కు వాడు ఎదురు చూస్తున్న అవకాశం దొరికింది. వాడి ముందు కూర్చున్న అబ్బాయి కాస్త పక్కకు జరగడంతో వాడు రాస్తున్న జవాబులు వినోద్ కు స్పష్టంగా కనిపించసాగాయి.  అంతే ! ఆక్షణం కోసమే ఎదురు చూస్తోన్న వినోద్ అది చూసి ఎంచక్కా చకచకా రాసేయడం మొదలెట్టాడు. సమయం అయిపోయేలోగా పాస్ మార్కులకు అవసరమైనన్ని జవాబులు రాసేసుకున్నాడు. 
       వారం తర్వాత టీచర్ అందరి పేపర్లు దిద్ది, క్లాసులో ఇచ్చేసింది. వినోద్ పాసై పోయాడు. వికాస్ మాత్రం ఫెయిలై బిక్కమొగం వేసాడు. టీచర్ వాడికి చీవాట్లు వేస్తూ, ఎందుకు చదవలేదంటూ నిలదీసింది. వికాస్ వెక్కివెక్కి ఏడుస్తూ తన గోడు చెప్పుకున్నాడు. వాడి బాధ అర్థం చేసుకున్న టీచర్ వాణ్ణి ఓదారుస్తూ, అందరివేపు చూస్తూ, " చదివింది గుర్తుండాలంటే ముందుగా అర్థం చేసుకుని చదవాలి. నేర్చుకున్న తర్వాత ఒకసారి చూడకుండా రాసి చూసుకోవాలి. అప్పుడు మీమీద మీకు నమ్మకం కలుగుతుంది. అంతటితో ఆగక అలా నేర్చుకున్నవి మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి, " అంటూ కొన్ని చిట్కాలు చెప్పింది. 
      వికాస్ బుద్ధిగా తలూపి, మరోసారి ఫెయిల్ కానంటూ టీచర్ కు మాటిచ్చాడు. వినోద్ కు ఇవేమీ పట్టలేదు. పాసయానన్న ఆనందంలో వాడి తప్పిదం వాడికి తెలియలేదు. తెలిసినా బుర్ర కెక్కించుకునే స్థితిలో వాడు లేడు. 
         తర్వాతి యూనిట్ పరీక్షకు వికాస్ కష్టపడి చదువుతుంటే వాడిపక్కన జేరి, " రేయ్, ఎందుకురా బుర్ర పాడుజేసుకుంటావ్?  ఎంచక్కా గైడ్ పక్కన పెట్టుకుని చూసి రాయొచ్చు గదా, లేదంటే ఎవడైనా బాగా రాసే వాడి పక్కన కూచున్నా సరిపోతుంది గదా, " అంటూ ఉచిత సలహా పారేశాడు. 
     రెండవ యూనిట్ పరీక్ష అయిపోయింది. వికాస్ పాసయ్యాడు. వినోద్ కూడా పాసయ్యాడు, వికాస్ కంటే ఎక్కువ మార్కులతో ! వాడి పద్ధతి షరా మామూలే. చకచకా అర్ధసంవత్సర పరీక్షలు వచ్చేశాయి. టీచర్ సలహాలు తు. చ తప్పక పాటించిన వికాస్ తలెత్తకుండా రాసుకుంటూ పోతున్నాడు. తనకలవాటైన పద్దతిలో గైడ్ కింద పెట్టి కాపీ కొడుతూ రాస్తున్న వినోద్ భుజం మీద ఒక్కసారిగా టీచర్ చేయి పడింది. 
      " ఇన్నాళ్లూ మార్కులు బాగా వస్తుంటే చక్కగా చదువుతున్నావనుకున్నా, ఇదన్నమాట అసలు సంగతి ! " వాడి చేయి పట్టుకుని హెడ్మాస్టర్ గారి గదికి బరబరా లాక్కెళ్ళింది. అక్కడ తల వాచేలా చీవాట్లు తిని, బయటకొచ్చి ఒక్కసారి తల విదిలించుకున్నాడు. అంతేగానీ వాళ్ళ మాటలు ఇసుమంతైనా తలకెక్కించుకోలేదు. 
       తిరిగి చూసేలోగా పరీక్షలయిపోయాయి. ఈసారి వికాస్ మొదటి ఐదుగురిలో ఒకడిగా నిలిచాడు. వినోద్ కాపీ కొట్టిన మార్కులతో ఏదో పాసయాననిపించాడు. 
      సంవత్సరాంత పరీక్షలకు ఉపాధ్యాయులంతా కష్టపడి విద్యార్థులందరినీ చదివిస్తున్నారు. ఒకరోజు ఏకాగ్రతతో చదువుకుంటున్న వికాస్ చెంతకు వినోద్ చేరాడు, " రేయ్, ఎందుకురా మరీ ఇంత కష్టపడతావు ? నేను చూడు టీచర్ల నందరినీ ఎలా బురిడీ కొట్టిస్తున్నానో ! పాపం! వాళ్లంతా నేను నిజంగానే చదివి పాసవుతున్నాననుకుంటున్నారు.."
ఓసారి ముక్క చీవాట్లు తిన్నసంగతి మరుగున పడిపోయిందేమో, వికాస్ కు దగ్గరగా జరుగుతూ ఇంకా ఏదో చెప్పబోయాడు. వాడి మాట మధ్యలోనే తుంచేస్తూ వికాస్ అందుకున్నాడు, 
     " రేయ్, నీవు బురిడీ కొట్టిస్తున్నది టీచర్లను కాదురా, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అన్ని వేళలా నీ ఎత్తులు పారవని తెలుసుకో. కనీసం ఇప్పటి నుండైనా కష్టపడి చదువు, బాగుపడతావు..." అంటూ అక్కడినుండి విసురుగా లేచి వెళ్ళిపోయాడు. కానీ, వికాస్ మాటలు వాడికి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే అయ్యాయి. 
      చూస్తుండగానే పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. వినోద్ పర్యవేక్షణ చాలా కఠినంగా ఉండే సెంటర్లో పడ్డాడు. పైగా ఆ సంవత్సరం అన్ని ప్రశ్నాపత్రాలు చాలా క్లిష్టంగా వచ్చాయి. ఇక వినోద్ పరిస్థితి చెరువు లో నుండి బయట పడ్డ చేపలా తయారైంది. ప్రతీరోజు తెచ్చుకున్న కాపీ చీటీలన్నీ పరీక్ష ప్రారంభానికి ముందే లాగేసుకునేవాళ్ళు ఇన్విజిలేటర్లు. వాళ్ళు తల కూడా తిప్ప నీయకుండా తిరుగుతూ ఉంటే పక్కవాడి వంక చూసి సాహసం చేయలేకపోయాడు వినోద్. కళ్ళనీళ్ళ పర్యంతమై ప్రతీరోజు రెండు గంటల పాటు నరకం అనుభవిస్తూ నీరసంగా బయటికి రావడం వాడి వంతయింది. 
      ఆఖరి రోజు పరీక్ష అయిపోయాక నీరసంగా అడుగులు వేస్తూ ఓవారగా వెళ్లి నిల్చున్నాడు వినోద్. మిగతా పిల్లలంతా హుషారుగా నవ్వుతూ తుళ్ళుతూ వెళ్తున్నారు. 
    ఒక్కసారిగా వాడి కళ్ళముందు తరగతి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు మెదిలారు. 
   " అన్ని వేళలా నీ ఎత్తులు పారవని తెలుసుకో" 
 వికాస్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చి తల తిరిగి పోయింది వాడికి. 
     వాళ్లందరి మాటలు పెడచెవిని పెట్టిన ఫలితం! ఎంతో విలువైన ఓ విద్యాసంవత్సరం కోల్పోయి, అందరిలోనూ అవమాన పడాల్సిన పరిస్థితి దాపురించే సరికి మొదటిసారిగా వాడి కళ్ళ నుండి బొటబొటా నీళ్ళు కారాయి. 

******************************************
మళ్ళీ కలుద్దాం 
*********

2 comments:

  1. LRSR: సోమరుల తెలివితేటలు అడ్డదారిలో గడ్డి తినుటకే

    ReplyDelete