Monday, June 24, 2024

రిపోర్ట్..... నిల్

 అవనిలో వనిత...... ఇదో కథ గాని కథ  !
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    ఉస్సురని నిట్టూర్చి మరోసారి సర్దుక్కూర్చుంది ప్రసూన. అరగంట దాటిపోయింది. ఇంకా తనకి పిలుపు రావడం లేదు. ఆరు నెలలుగా ఏదో గైనిక్ ప్రాబ్లం తో సతమతమవుతూ, పేరున్న డాక్టర్ అని కొలీగ్స్ చెబితే, వారం రోజుల నుండి ప్రయత్నిస్తూ ఎలాగోలా మొన్నటి దినం తీరిక చేసుకుని వస్తే, ఆ డాక్టరమ్మ కాస్తా ఆరోజు రావడం లేదంటూ ఫోన్ చేసిందని చల్లటి కబురు నింపాదిగా చెప్పేసింది, అక్కడున్న అటెండరమ్మ  ! " సరే, డాక్టర్ మాత్రం మనిషి కాదా, వాళ్లకు మాత్రం పనులుండవా.  " అని సర్దిచెప్పుకొని వెనుదిరిగింది. నిన్నటి రోజు మళ్ళీ తయారై అరగంట ముందైతే వచ్చింది గానీ, అప్పటికే అక్కడంతా నిండిపోయి, కొందరు ఓ వారగా నిల్చుని ఉన్నారు. ఎలాగోలా ఓ సీటు దొరకబుచ్చుకుని తన నెంబర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది ప్రసూన. 
     మరో పావు గంట గడిచాక, అటెండరమ్మ కను సైగ చేస్తూ పిలిచింది. ఆవిడ వైపు ప్రసన్నంగా చూస్తూ లోన అడుగుపెట్టింది. గంటన్నర నిరీక్షణ ! అయిదే అయిదు నిమిషాల్లో నాలుగే నాలుగు మాటలు మాట్లాడి, పెన్ తో బరబరా గీకేసి ప్రసూన చేతిలో ఓ కాగితం పెట్టేసింది, డాక్టర్!
    " ఈ టెస్ట్ లు చేయించుకుని రండి, ఈరోజు రేపు ఈ టాబ్లెట్లు వాడండి, " అంటూ అప్పటికే వచ్చి కూర్చున్న మరో పేషెంట్ వేపు దృష్టి సారించింది, ఇక నీవు వెళ్ళొచ్చు అన్నట్లు ! అయినా ఏదో అడుగుదామనేలోపే అటెండర్ బయటకు రమ్మని పిలిచేసింది. ఇక చేసేదేమీ లేక ఆమె వెంట నడిచింది ప్రసూన. 
    " ఈ వెనకే డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంది. అక్కడ యూరిన్, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి వెళ్లండి. రేపు వచ్చి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని డాక్టర్ గారికి చూపిస్తే, దాన్ని బట్టి మందులు రాస్తారు,  " అని చెప్పి మళ్లీ లోనికి వెళ్లి పోయిందా సహాయకురాలు. 
    తమ శ్రమ తగ్గించుకోవడానికి డాక్టర్లు ఏర్పాటు చేసుకున్న సౌలభ్యం ఈ సహాయకులన్నమాట ! తన సమస్యంతా వివరంగా చెప్పాలని ఎంతగా అనుకుంది ! మరీ ఇంత యాంత్రికంగా మారిపోయారేమిటి ఈ డాక్టర్లు ! నిస్సహాయ స్థితిలో కాసేపు మెదడంతా మొద్దుబారినట్లయిందామెకి. తేరుకుని, ల్యాబ్  కెళ్ళి, వాళ్ళు అడిగిన శాంపిల్స్ ఇచ్చి, రెండు వేలు సమర్పించుకుని తిరుగుముఖం పట్టింది ప్రసూన. 
   మళ్లీ ఈ రోజు సాయంత్రం ఏడింటికి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని వచ్చి, క్లినిక్ ముందు ఇదిగో ఇలా అరగంట నుండీ నిరీక్షిస్తూ కూర్చుని ఉంది. 
    మొత్తం నాల్గు రకాల టెస్టులు. రెండింటిలో ' నార్మల్ అని ఉంది. మిగతా రెండే అర్థం కాని విధంగా ఉన్నాయి. డాక్టర్ మాత్రమే చెప్పగలిగిన ఆ రిపోర్ట్స్ గురించే ' టెన్షన్ ' పడుతోంది ప్రసూన. బహుశా వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో?  ఆరు నెలలుగా ఎన్నడూలేనివిధంగా అలసట, నీరసం! ఏ సీరియస్ ప్రాబ్లం కు సూచనో ఏమిటో? కొంపదీసి ఏ క్యాన్సర్ కో.... " ఒక క్షణం ఆమె గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది. గతంలో, ఇంతకుముందూ ఎన్నో రకాల టెస్టులు, ఎన్నో సందర్భాల్లో చేయించుకుంది. కానీ ఎన్నడూ ఇలా డీలా పడలేదు. మొట్టమొదటిసారిగా ఎవరినైనా వెంట తోడు తెచ్చుకుని ఉంటే బాగుండేదేమో అనిపించిందామెకా స్థితిలో. 
    ఉన్నట్టుండి ఆమె మస్తిష్కంలో ఇంకా ఎలిమెంటరీ స్కూల్ దశ కూడా దాటని తన ఇద్దరు పిల్లలు  ఒక్కసారి కదలాడి కళ్ళ నీళ్ళు తిరిగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో రకరకాల రాకూడని అనుమానాలేవేవో బుర్రలో చొరబడి ఆమెను అతలాకుతలం చేస్తూ కుదిపేశాయి. గుండె దిటవు పరుచుకుంటూ నిస్త్రాణగా కళ్ళుమూసుకుంది. అప్పుడే పక్కనున్నామె తన భుజం మీద తట్టి నిన్నే రమ్మంటున్నారని చెప్పగానే ఉలిక్కిపడి, భారంగా అడుగులేస్తూ డాక్టర్ ముందుకెళ్ళి అచేతనంగా రిపోర్ట్ కాయితాలు ఆమె చేతిలో పెట్టేసింది. 
    ఒకే ఒక్క క్షణం అవి తిరగేసి,  " ఓ. కె అమ్మా, మరేమీ భయపడాల్సింది లేదు. అంతా నార్మల్ గా ఉంది. ఇవిగో, ఈ ఐరన్ టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్ లు వాడు. ఇంకా ఈ టానిక్స్ రోజూ తీసుకో, వారం రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఇకపోతే, పని ఒత్తిడి కాస్త తగ్గించుకో, వేళకు భోం చేస్తూ ఉండు.... " అంటూ చీటీ రాసి, ప్రసూన చేతిలో పెట్టేసింది. 
    ఒక్కసారిగా గుండెల మీద నుండి కొండంత భారం అలా పక్కకు వైదొలగి పోయినట్లు అయింది ప్రసూన కు. ఆమె పలుకులు అమృత గుళికల్లా అనిపించి, " నిన్న ఏదో అనుకున్నాను గానీ, ఎక్స్పీరియన్స్డ్  డాక్టర్ పది ప్రశ్నలడిగి, పది మాటలు మాట్లాడాలా ఏమిటి? పేషెంటును చూడంగానే ప్రాబ్లం అర్థమై పోదూ!అయినా ప్రతిరోజు బోలెడు మందిని చూడాలాయె, అంతకంటే వాళ్లు మాత్రం ఏం వినగలరు!  "
    నిన్నటికీ, ఈరోజుకి డాక్టర్ల గురించి ప్రసూన వైఖరిలో అనూహ్యమైన తేడా! ఆ క్షణంలో ఆమెకు డాక్టర్ ఓ దేవతలా కనిపించింది. థాంక్స్ చెప్పుకుని ఉత్సాహంగా బయటకు నడిచింది. పక్కనే మెడికల్ షాప్ లో అన్ని తీసుకుని ' అమ్మయ్య' అనుకుందోసారి. అయినా నాలాంటి ఉద్యోగినులకు పని వత్తిడిని మించిన అనారోగ్యం ఏముంటుంది? అది కాస్తా తగ్గించుకుంటే అంతా నార్మలే కదా! హఠాత్తుగా జ్ఞానోదయమైంది ఆమెకి. 
    ఆమె మనసిప్పుడు మబ్బు వీడిన ఆకాశంలా ప్రశాంతంగా ఉంది. శరీరమంతా దూదిపింజలా తేలిపోతున్నట్లు వడివడిగా అడుగులు పడుతుండగా మెయిన్ రోడ్డు మీదకొచ్చి నిలబడింది.. సమయం రాత్రి తొమ్మిది దాటిపోయింది. ఇక ఆటో కోసం వేట!
 అంతవరకు ఆవరించి ఉన్న ఆనందం సగం ఆవిరైపోయి, మళ్లీ నీరసం ముంచుకొచ్చేసింది ప్రసూన కు. రిపోర్ట్స్ టెన్షన్ తో మధ్యాహ్నం అన్నం సయించలేదు. సాయంత్రం అందరికీ టీ ఇచ్చి, హడావిడిలో తను మాత్రం తాగకుండానే రాత్రికి వంట ప్రయత్నాల్లో పడిపోయింది. ఇంతసేపు మరుగున పడ్డ ఆకలి ఒక్కసారిగా మేలుకొందామెలో. మరోవైపు కాళ్లు లాగుతున్నాయి !
    ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఓ ఆటో వచ్చి ఆగింది. ఎక్కడికో చెప్పీ చెప్పగానే తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చింది గానీ విపరీతంగా అడిగాడు. మరోటి క్రిక్కిరిసి వచ్చింది. మరో ఐదు నిమిషాలు ఆటో జాడే లేదు. 
   " ఎక్కువ అయితే మానే, ఇందాక ఆటో ఎక్కి ఉండాల్సింది, ఈ పాటికి ఇల్లు చేరి ఉండేదాన్ని.ఛీఛీ, అత్యవసర సమయాల్లో కూడా ఈ దిక్కుమాలిన పొదుపేమిటో !" తన మీద తనే విసుక్కుంటూ, ఏమైనా సరే, ఈసారి వాడడిగినంతా పడేసి వెళ్లి తీరాలి  " అని డిసైడ్ అయిపోయింది. 
    దేవుడు కరుణించాడు. ఆటో వచ్చింది. అదృష్టం !అనుకున్నదానికంటే తక్కువే అడిగాడు. " బ్రతుకు జీవుడా " అంటూ ఎక్కి చతికిలబడి, దీర్ఘంగా నిట్టూర్చిందోసారి. ఏమిటో ! ఆటోవాళ్ళలో కూడా అప్పుడప్పుడూ దేవుడు కనిపిస్తుంటాడామెకు. 
     మరో పావుగంటలో ఇంటిముందు దిగింది. అంతా భోజనాలు చేస్తున్నారు. ఆటో చప్పుడు విని పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి,  " మమ్మీ, ఏం తెచ్చావ్? " అంటూ తల్లిని చుట్టేశారు. ఇందాకా పడ్డ టెన్షన్ గుర్తొచ్చి ఇద్దర్నీ ఓసారి హత్తుకుంది. మమ్మీ మూడు రోజుల్నుండీ డాక్టర్ చుట్టూ తిరుగుతోందన్న సంగతి తెలీని వయసు వాళ్ళది మరి ! ఠక్కున ఏదో గుర్తొచ్చి బ్యాగ్ లో చేయి పెట్టింది, మొన్నెప్పుడో కొని పడేసుకున్న బార్ చాక్లెట్లు తగిలాయి. చెరోటిచ్చి, లోనికెళ్ళి కుర్చీలో కూలబడింది. ఇంట్లో అత్తమామలు, పతిదేవుడు భోంచేస్తూ సీరియస్ గా ఏదో చర్చించుకుంటున్నారు. తర్వాత తీరిగ్గా వచ్చి,  " ఏమిటి? ఏమిటిట ? ఏమీ లేదంట గదా ! "అంటూ ప్రశ్న, జవాబు తానే అయి పరామర్శిస్తాడాయన. 
   ఉస్సురంటూ లేచి, తినే ఓపిక కూడా లేక వెళ్లి మంచం మీద వాలిపోయింది ప్రసూన. ఒక్కసారిగా 
' రిలాక్స్ ' అయిన ఫీలింగ్ !
    ఏది ఏమైనా ఒకందుకు రిలీఫ్ ! రిపోర్ట్ నిల్ ! ఎవెరీ థింగ్ ఈస్ నార్మల్ !  తృప్తిగా కళ్ళు మూసుకుంది ప్రసూన.

( ఇలాంటి ప్రసూనలు ప్రతీ చోట ప్రతీ ఇంట్లో ఉంటారు. వాళ్ళ సహనానికీ, ఆత్మస్థైర్యానికి నా జోహార్లు ! )
🌷🌺🌹🌺🌷🌺🌹🌺🌷🌺🌹🌺🌷🌺🌹🌺

Saturday, June 15, 2024

పాఠశాలల పునః ప్రారంభం... బడివైపు పిల్లల పయనం...



   మండే ఎండలు చప్పున చల్లారిపోయాయి. రుతుపవనాలు ప్రవేశించి, వానలు పలకరిస్తూ ఒక్కసారిగా  వాతావరణం మారిపోయి అంతా సేదదీరడం మొదలైంది.
    మరోపక్క వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అంతవరకూ   ఆటపాటలతో, టీవీ లతో, సినిమాలు చూస్తూ బాగా రిలాక్స్ అయిన పిల్లలంతా బద్ధకం  వదిలించుకోవాలంటే ఇబ్బంది పడే సమయం ఆసన్నమైంది. ఉదయం లేవడం... హడావుడిగా తయారవడం... పరుగులు తీయడం... మళ్లీ మొదలు...
     కాకపోతే...సంతోషం కలిగించే ఓ విశేషం వాళ్లకి...! అంతా కొత్త తరగతుల్లోకి మారడం! కొత్త పుస్తకాలు, కొత్త పాఠాలు, కొత్త బట్టలు, కొత్త యూనిఫారాలు...! వాటితో పాటు కొత్త టీచర్లు !! ఆ సంబరంలో కొన్నాళ్ళు హుషారు పుడుతుంది పిల్లలందరికీ. కొత్త పుస్తకాలు అన్నింటికీ అట్టలు  (కవర్స్ ) వేసుకోవడం... అదో ముచ్చట! కొందరికి అదో అలవాటు. పుస్తకాలు చాలా నీట్ గా ఉంచుకుంటారు. సంవత్సరం పూర్తి కావస్తున్నా అవి సరికొత్తగానే ఉంటాయి. మరికొందరుంటారు... అవేవీ పట్టవు వాళ్ళకి... మొదట్లో వారం పది రోజులు వారికి అవి అపురూపమే ! ఓ నెల దాటిన తర్వాత చూస్తే... ఏముంది...! అట్టలు చిరిగిపోయి, చివర్లు ముడతలు పడి పాత వాటి లాగా దర్శనమిస్తాయి. ఈ విషయంలో మగ పిల్లల కంటే ఆడపిల్లలు చాలా బెటర్ అని నా అభిప్రాయం.
    సరే...ఇప్పుడేగా... స్కూళ్లు తెరిచారు... మొదట్లో కాస్త కష్టం అనిపించినా... ఓనెల దాటితే  తర్వాత అంతా మామూలైపోయి పిల్లలంతా సర్దుకుని గాడిలో పడతారు. కొత్త క్లాస్ కాస్తా పాత బడిపోతుంది. అలా అలా... పిల్లల విద్యాభ్యాసపయనం కొనసాగుతూ పోతుంది... అంతేగా... 🙂

*****************************************
     

Thursday, June 6, 2024

శ్రమైక జీవనం


                                            
    మీరెప్పుడైనా ఇల్లు కట్టించారా? లేదా! పోనీ ఎక్కడైనా కడుతున్న ఇంటిని గమనించారా? నాకైతే కొద్ది రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని బాగా దగ్గరగా చూసే అవకాశం లభించింది.
" ఇల్లు కట్టి చూడు,  "పెళ్లి చేసి చూడు", అని మన పెద్ద వాళ్ళు ఎందుకన్నారో  నాకు అప్పుడు తెలిసి వచ్చింది. మొదలుపెట్టినప్పటి నుంచీ పూర్తయ్యేదాకా ఎన్ని రకాల అంశాలు అందులో చోటు చేసుకుంటాయో గదా అనిపించింది. వాటన్నింటిలో నన్ను బాగా ఆకర్షించింనదీ, ఎక్కువగా ఆసక్తి గొలిపినదీ ఏంటంటే-
    -- అక్కడ మేస్త్రీల దగ్గర పని చేసే పనివారు! మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ! తాము  ఆడవాళ్ళం, శారీరకంగా బలహీనులం అన్న ఆలోచన ఏ మాత్రం దరిజేరనీయకుండా వాళ్ళు  చేసే కష్టం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. ఇంతకీ విషయం లోకి వస్తే-
    ఉదయం ఆరు ఆరున్నర కంతా పనిలోకి వస్తారు ఆడ, మగ  పనివాళ్ళు. ఆడవాళ్ళయితే వచ్చేటప్పుడు ఓ మోస్తరు చీరలో చక్కగానే వస్తారు. కేవలం ఓ  పది నిమిషాల్లో వాళ్ళ వేషధారణ మొత్తం మారిపోతుంది. చీరను ఎగదోపి దాని చుట్టూ ఓ పాత వస్త్రం చుట్టేసుకుని పైన ఓ పాత షర్టు వేసుకుంటారు. ఆపై తలకో  గుడ్డ కట్టుకుంటారు. అసలు పది  నిమిషాల క్రితం వచ్చింది వీళ్లేనా అన్న అనుమానం వచ్చేలా ఉంటుంది వాళ్ళ ఆహార్యం ! మగవాళ్లూ దాదాపు ఇంతే. మంచి డ్రెస్ తీసేసి, పాత దుస్తులేవో వేసుకుని ఇక పనిలోకి దిగుతారు. గోడ నిర్మాణంలాంటి పనులు మగవాళ్ళు చేస్తుంటే ఆడవాళ్ళు ఇటుకలు అందించడం, ఇసుక, సిమెంటు, కంకర కలిపేసి తట్టల్లో  నింపి మోయడం లాంటి పనులు చకచకా చేసేస్తుంటారు. కొందరు ఆడవాళ్లు గడ్డపారల్తో గుంతలు తవ్వడం కూడా చేస్తుంటారు. మట్టి పనులు చేయడం వాళ్లకు కరతలామలకమేమో అనిపిస్తుంది వాళ్ల నైపుణ్యం చూస్తుంటే. వాళ్లను చూస్తూ ఇంతటి శక్తి సామర్థ్యం వీళ్ళకెలా వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోయాన్నేను ! 
     కులాసాగా నవ్వుకుంటూ చలాకీగా కదులుతూ ఉంటారు, అలుపన్నది తెలియకుండా ఉండేందుకో ఏమో ! పని భారం ఎక్కువైనప్పుడు ఒకరిమీద ఒకరు గయ్యి గయ్యి మంటూ అరుచుకుంటూ ఉంటారు. మళ్లీ అంతలోనే సర్దుకుని మామూలయిపోతుంటారు.
     తెచ్చుకున్న భోజనాలు అందరూ గుంపుగా కూర్చుని, కబుర్లాడుకుంటూ తింటారు. కాసేపు అలా కూర్చుంటారోలేదో..మళ్లీ యధాలాపంగా పనిలోకి దిగుతారు. అంతే! సాయంత్రం ఆరైనా ఆరోజు నిర్ణయింపబడిన పని పూర్తయ్యేదాకా వాళ్లకదే ధ్యాస!
    వెళ్లేటప్పుడు మళ్ళీ వాళ్ళ వేషధారణ మారిపోతుంది. చుట్టుకున్న పాత వస్త్రం, వేసుకున్న షర్టు అన్నీ  తీసేసి  ఉదయం వచ్చేటప్పుడు ఎలా వచ్చారో అలాగే తయారైపోయి, శుభ్రంగా ఇళ్లకు కదులుతారు.  రోజు అలా ముగుస్తుంది వాళ్ళకి! మరుసటిరోజు తెల్లారేసరికి మళ్లీ ప్రత్యక్షమయేవారు. రాత్రి ఎంతసేపు నిద్రపోతారో..!ఎప్పుడు వండుకుంటారో ఏమో.. మాములుగా సద్ధిమూటలతో వచ్చేసేవారు!ఆ విధంగా వారానికి ఆరు రోజులు శ్రమిస్తూనే ఉంటారు.
      ఈ శ్రమజీవులు కార్చే చెమట ధారలే వారికి కాసులు కురిపిస్తాయి. అవే వారి జీవనాధారాలు మరి! ఒక ఇల్లు తయారవాలంటే, ఓ ఇంజనీరు వెనక ఇందరు శ్రమజీవుల హస్తాలు, వారి చెమటధారలు ఇమిడి ఉంటాయన్న వాస్తవం తెలిసిన క్షణాన నాలో కలిగిన స్పందన ఇది !

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
       



          

Friday, May 31, 2024

ఎవరు వింటారు నోరున్న మనుషుల ఆర్తనాదాలు...!!

 **************************************
🐕🐶

వీధివీధినా విచ్చలవిడిగా 
విహరించే వీధి శునకాలు..
అడ్డు అదుపూ లేక....
సమయం సందర్భం గానక..
చెవులు చిల్లులు పడేలా 
భౌభౌమంటూ అరుపులు..
ఆ వీధి కుక్క పొరబడి 
ఈ వీధిని అడుగిడెనా...
తమ సామ్రాజ్యమేదో 
ఆక్రమించినంతగా రగులుతాయి 
రౌద్రా వేశాలు..!
మానవజాతిని మించి 
పెచ్చరిల్లుతాయి పగలూ ద్వేషాలు!!
ఆ గగ్గోలు తాళలేక 
జడుసుకుంటూ జనాలు !!
మరోవైపు....
పురిటికందును పీక్కుతింటున్న హృదయవిదారక దృశ్యాలు!🙁
పసివాడిపై దాడి...
నూరేళ్ళ వాడి బ్రతుకు సమాధి !!😓
మిన్నంటిన ఆప్తుల రోదనలు!
తప్పని జీవితకాల వేదనలు !!
చిత్రం! జాతి ఒక్కటే..!
పెంపుడు కుక్కలకూ 
వీధికుక్కలకూ క్షణం పడదాయె !!
విశ్వాసానికి మారుపేరంటారే...
మరి.. ఈ కొరగాని బుద్ధి బహువింతే !
అనాదిగా ఉంటోందిగా ఇంటికి కాపలా 
యజమానికి అదో ఆసరా.. భరోసా..
పిడికెడు మెతుకులు విదిలిస్తే 
వదలక వేళ్ళాడే మూగప్రాణి ఇది కదా!
పెంపుడు జంతువుగా ముందు వరుసలో మున్ముందుగా నిలిచి మది గెలిచే 
సాధుజీవి ఇది కాక ఇలను 
ఇంకొకటున్నదా !మరి..నేడు...
క్రూర జంతువుగా 
నలుగురి నోళ్లలో నానుతూ 
నిందలు మోయుచున్నదే...!అకటా !!
జాతి రక్షణ మన ధర్మం 
జనాల పరిరక్షణ కాదే అప్రాధాన్యం...
నోరులేని జీవులకు 
హాని చేయరాదంటూ చట్టాలు...
ఎవరు వింటారు...?!
నోరున్న మనుషుల ఆర్తనాదాలు...!!
అందుకే మరి...!
ఈ వీధి కుక్కల బెడద 
ఇంతింత కాదయా...
భరించడం తప్ప దారి 
వేరే  లేనే లేదా...!!!😞
పరిష్కారం ఏదయా ??? !
దారి చూపవా దయామయా... 😂

********************************




Thursday, May 23, 2024

కనిపించని కోయిల... వినిపించిందిలా...!


                       🦜

సంధ్యాసమయం...
వర్షం కురిసి వెలిసిన క్షణం...
కనిపించని కోయిల...
వినిపించిందిలా...
వెతికాను కొమ్మల్లో... 
కొమ్మ చాటు రెమ్మల్లో..
బదులిచ్చింది వీనుల విందుగ..
కుహూ కుహూ...అంటూ...
ఆ గొంతులో  కమ్మదనం...!
ఆ గానంలో మాధుర్యం..!
అనిర్వచనీయం..!
అనితరసాధ్యం..!
అదిగో మళ్ళీ..మళ్లీ మళ్లీ..కూస్తోంది..
కాదు కాదు.. పాడుతోంది..
కుహూ కుహూ అంటూ...! 
అది కోకిల గానం...!
పరవశిస్తూ... పరవశింప  జేస్తూ...
అలా... కనిపించని కోయిల...
నాకు వినిపించిందిలా..!!  🦜

🤱🌺🤱🌺🤱🌺🤱🌺🤱🌺🤱🌺🤱🌺




Monday, May 20, 2024

హ్యాండ్ బ్యాగ్

ఓ కథ కాని కథ 
--------------------   😊
      ' వదినా, రెడీయా? ' 
 గేటు చప్పుడు ఆ వెంటనే వసంత పిలుపు వినిపించడంతో హడావిడిగా చీర కుచ్చిళ్ళు దోపుకుంటూ, 
" ఆ, రెడీయే !ఒక్క నిమిషం, రా, వచ్చి కూర్చో వసంతా ' అంటూ లోపలి నుంచే ఆహ్వానం పలికింది ప్రసూనాంబ.
  వసంత, ప్రసూనాంబ ఇద్దరూ ఒకే వీధిలో ఉంటున్నారు. ఇద్దరూ ఇంటిపట్టున ఉండే గృహిణులే. భర్తలు వాళ్ల వాళ్ల ఉద్యోగ నిర్వహణ మీద, పిల్లలేమొ స్కూళ్లకు బయటికి వెళ్ళగానే పనులన్నీ ముగించుకుని, పిచ్చాపాటి కోసం ఒకరిళ్లకొకరు వెళ్తుంటారు. దాదాపు నాలుగేళ్లుగా ఒకే చోట ఉంటున్నందుకో ఏమో ఇద్దరూ బాగా స్నేహితులై పోయారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరగడానికి కారణం నెలకు కనీసం ఒక్కసారైనా వారు చేసే రకరకాల షాపింగ్ లేనంటే అతిశయోక్తి కాదేమో! మరీ ముఖ్యంగా ఆ డిస్కౌంట్, ఈ డిస్కౌంట్ అంటూ వస్త్ర దుకాణాలవాళ్ళు చేసే హంగామా వీళ్లను నిలబడనీయదు. దాంతో వీళ్లకు ఎక్కడ లేని ఉత్సాహం ముంచుకొచ్చి, వెంటనే వెళ్లి ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చేసుకుంటే గానీ నిద్ర పట్టదు. రాను రానూ అదొక వ్యసనం అయిపోయింది ఇద్దరికీ. ఇప్పుడు కూడా అంతే. దసరా పండుగ సందర్భంగా యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం అంటూ టీవీల్లో ఒకటే మోత ! అది చాలదన్నట్టు నాలుగు రోజుల నుండి వీధి వీధీ తిరుగుతూ వ్యాన్లలో, ఆటోల్లో మైకుల ద్వారా ఒకటే అరుపులు!
  దీంతో వసంత, ప్రసూనాంబ లకు మళ్లీ పనివడినట్లయింది. రెండ్రోజుల క్రితమే ఇద్దరూ సమావేశమై ఈరోజు ఒంటి గంటకంతా భోంచేసి మరీ షాపింగుకు బయలుదేరాలని ప్రోగ్రాం నిర్ణయించేసుకున్నారు, ఎటొచ్చి భర్త, పిల్లలు ఇద్దరిళ్లలోనూ ఇల్లు చేరేది సాయంత్రం నాలుగు తర్వాతే కాబట్టి.
  కానీ, ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రసూనాంబ కెందుకో లోపల గుబులుగా ఉంది. దానికి కారణం లేకపోలేదు. దాదాపు నెలా రెండు నెలల నుంచీ వింటున్న దొంగతనాల వార్తలు -- అదీ, ఇటీవలే వాళ్ల వీధిలోనే రెండిళ్లలో కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే జరిగినవి తలచుకుంటే గుండె గుభిల్లుమంటోందామెకు. రెండు మూడు గంటలు ఇంటికి తాళం వేసి వెళ్ళినా చాలు, తాళాలు పగులగొట్టి ఇంట్లో దూరి పోతున్నారు దొంగలు, అదీ పట్టపగలే !
  ఇదిలాగుంటే  -- వారం క్రితం పేపర్లో వార్త మరీ చోద్యంలా అనిపించింది. ఒకావిడ ఉదయమే లేచి ఇంటి ముంగిట కల్లాపి జల్లి ముగ్గేస్తోంటే, వెనకాలనుంచి బైకు మీద ఒకడు రివ్వుమని వచ్చి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు పుటుక్కున తెంపుకుని రయ్యిమని దూసుకుపోయాట్ట  ! ఆమె తేరుకుని అరిచే లోగానే కనుమరుగైపోయి లబోదిబోమంటూ కూలబడి పోయిందట! మరో సంఘటన. ఇంకొకావిడ, ఇంటికి దగ్గర్లోనే ఉన్న రోడ్డు మీద మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటే బైక్ మీద ఇద్దరు యమస్పీడుగా వెళుతూ ఆమె మెడలో గొలుసు అతి లాఘవంగా లాగేసుకుని క్షణాల్లో అదృశ్యమై పోయారట ! ఆ ఊపు కి ఆమె కిందపడిపోయి పెద్ద ప్రమాదం కాస్తలో తప్పిపోయిందన్న వార్త అంతటా పాకిపోయింది. ఎంత దారుణం ! బంగారానికి ఇంట్లో ఉన్నా, ఒంటి మీద ఉన్నా రక్షణ లేకుండా పోతోందే ! ఇవన్నీ వింటూ నగలతో వీధిలో కెళ్ళాలంటే తిరిగి వాటితో తిరిగి వస్తామా అన్న శంక వేధిస్తోంది ఆమెను. ఇంట్లో బీరువాలో దాచి, ఒకట్రెండు రోజులు అత్యవసరమై ఎక్కడికన్నా వెళ్లాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. పోనీ ఏదైనా బ్యాంకులో లాకర్ తీసుకొని అందులో ఉంచేద్దామా అంటే హఠాత్తుగా ఏ శుభకార్యమో అనుకోకుండా పడిందంటే మరీ బొత్తిగా బోసి మెడతో ఎలా వెళ్ళగలం? ఈ మాటే ఓసారి వసంతతో అంటే తను తేలిగ్గా కొట్టి పారేసింది
   నగల కోసం ప్రాణాలు కూడా తీస్తున్నారన్న వార్తలు అడపాదడపా వింటుంటే ప్రసూనాంబకు ఠారెత్తి పోతోంది. భర్త కష్టార్జితంతో ఎంతో పొదుపుగా దాచుకున్న డబ్బుతో కొన్న రెండు మూడు నగలు ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వస్తోంది ఇన్నేళ్లుగా. అవి కాస్తా దొంగల పాలయితే ! అమ్మో! ఇంకేమైనా ఉందా! జన్మలో మళ్ళీ చేయించుకోగలదా? అసలే ఇప్పుడు బంగారం ధర ఆకాశం అంటింది. చిన్న మెత్తు కొనాలన్నా  లక్ష పైగా ధారపోయాల్సి వస్తోంది. 
   ఇన్నాళ్లుగా షాపింగ్ అంటే ఎంతో హుషారుగా బయలుదేరే ఆమెకు ఈమధ్య ఇదే దిగులు పట్టిపీడించ సాగింది. తాళం వేసి వెళ్తే తిరిగి వచ్చేలోగా ఏ దొంగ వెధవో ఇంట్లో దూరి, ఉన్న నగానట్రా కాస్త దోచుకుని పోతే తన గతేం కాను?  ఇదీ ఆమెను ప్రస్తుతం వేధిస్తున్న సమస్య. అందుకే ఎప్పట్లా హుషారుగా ఉండ లేక పోతోంది. దీనికి పరిష్కారం ఏమిటబ్బాఅన్న  ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కిపోతోంది.
 ఆమె ఆలోచనలిలా సాగిపోతూండగా  -- లోనికి వచ్చిన వసంతను అన్యమనస్కంగానే కూర్చోమని చెప్పి, లోపలికెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయటకు రాబోతూ, క్షణంలో మెరుపులా ఓ ఆలోచన రావడంతో ఠక్కున ఆగిపోయింది.
" నిజమే, అలా చేస్తే పోలా,.... " అనుకుంటూ అంతటి దివ్యమైన ఆలోచన వచ్చినందుకు తనను తానే లోలోపల అభినందించుకుంటూ గబగబా లోనికెళ్ళి ఐదు నిమిషాల్లో హుషారుగా బయటకొచ్చేసింది. ఇద్దరూ కలిసి బిలబిలమంటూ ఆటో ఎక్కి షాపింగ్ సెంటర్ కు పోనిమ్మన్నారు. దాదాపు మూడు గంటలు అన్ని షాపులూ తెగ తిరిగి చెరో రెండు వేలు ఖర్చు చేసి, రెండేసి ప్యాకెట్లు పట్టుకుని బయట పడ్డారు.
   అసలే ఎండలు మండిపోతున్నాయి. అంతవరకూ తెలీని శ్రమ ఆటో ఎక్కగానే తెలిసొచ్చి, ఇద్దరూ రిలాక్స్ అయిపోయారు. ప్రసూనాంబ అంతవరకూ చేత్తో జాగ్రత్తగా పట్టుకున్న ప్యాకెట్లను ఆటోలో పక్కన పెట్టుకుని కర్చీఫ్ తీసుకుని మొహాన పట్టిన చెమటంతా తుడుచుకొంది. 
    మరో ఇరవై నిమిషాల్లో ఇద్దరూ ఇంటికి దగ్గర్లో రోడ్డుపై ఆటో దిగారు. ఇద్దరికీ కలిపి వసంతే ఆటో వాడికి డబ్బిచ్చేసింది. ప్యాకెట్లు పట్టుకొని ఆనందంగా నవ్వుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరిపోయారు.
  వాకిట్లోనే ఎదురైన భర్త ప్రకాశరావు ను చూసి సంతోషంతో డిస్కౌంట్ లో తాను చవగ్గా కొట్టేసిన చీరలు చూపిద్దామని గబగబా ఇంట్లోకి వెళ్లిన ప్రసూనాంబ చేతుల్లో ఉన్న ప్యాకెట్లు టీపాయ్ మీద పెట్టేసింది. ఉన్నట్టుండి గుర్తొచ్చి, హ్యాండ్ బ్యాగ్ కోసం చూసింది. అది కనిపించలేదు. ఒక్కసారిగా గుండె గుభిల్లుమనగా కెవ్వున కేకేసింది. కంగారుగా వచ్చిన ప్రకాశరావు కొయ్యబారిపోయిన భార్యను చూసి ఆమెను పట్టుకొని గట్టిగా కుదిపాడు. 
    ప్రసూనాంబ బిత్తర చూపుల్తో టీపాయ్ వేపు చేయి చూపిస్తూ, 
" బ్యాగ్... నా హ్యాండ్ బ్యాగ్....." 
 అంటూ అక్కడ కనిపించని తన హ్యాండ్ బ్యాగ్ కోసం కళ్ళతో వెతుకుతూ నోట మాట రాక అచేతనంగా నిలబడిపోయింది.
  ఆటోలో చీరల ప్యాకెట్ల తో పాటు అనాలోచితంగా హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టి, దిగేటప్పుడు ప్యాకెట్లు మాత్రమే పట్టుకుని దిగిన ప్రసూనాంబ కు తన హ్యాండ్ బ్యాగ్ ఆటోలోనే ఉండి పోయిందన్న విషయం స్పురణకు రాగానే ఒక్కసారిగా ఆమె గుండె లయ తప్పింది.
   షాపింగ్ కి వెళ్లేముందు తనకు వచ్చిన దివ్యమైన ఆలోచనతో ( అతి జాగ్రత్తతో ) లోనికి వెళ్లి బీరువాలో భద్రంగా దాచుకున్న లాంగ్ చైన్, రెండు జతల గాజులు, మూడు తులాల నెక్లెస్-- అన్నీ గబ గబా తీసి తన హ్యాండ్ బ్యాగులో పడేసుకున్న వైనం గుర్తొచ్చి, భర్త వైపు చూస్తూ గుడ్లు తేలేసింది.

*************************************
                🌺 భువి భావనలు 🌺
*************************************
    
    

Saturday, May 11, 2024

మేమే వస్తున్నాం తల్లీ... చిన్న కథ

🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱
  
  మధ్యాహ్నం వంటింట్లో ఉన్న శాంతమ్మ ఫోన్ రింగ వ్వడం విని కొంగుతో ధారగా కారుతున్న చెమట తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి సెల్ అందుకుంది. కూతురు వనజ..
" అమ్మా, ఏం చేస్తున్నావు? "
" ఈ టైంలో ఏం చేస్తాను...! వంటింట్లో ఉన్నాను.. "
" సరె సరే గానీ.. వచ్చే శుక్రవారం నాడు నేను,పిల్లలు,ఆయన అందరం వస్తున్నాం. మదర్స్ డే కదా..!"
గుండె గుభిల్లుమంది శాంతమ్మకు. ఒక్కసారి గత సంవత్సరం  మదర్స్ డే ఆమె కళ్ళ ముందు కదలాడింది. తల్లిని సంతోషపెట్టాలని కూతురు, ఇద్దరు కొడుకులు అనుకోవడం వరకు  బాగానే ఉంది గానీ.. ఆ నెపంతో పిల్లాజెల్లా తో అంతా దిగిపోయి తల్లిని మరింత హైరానా పెడుతున్నామన్న ఆలోచనైతే వాళ్లకు ఏకోశానా రాకపోవడం ఆమెకు ఎందుకో ఓ మూల బాధనిపించింది. పోయినసారి ఇలాగే ఫోన్ చేసి, తనే కాక ఇద్దరు తమ్ముళ్లకూ విషయం చేరవేసి వాళ్లనూ సమాయత్తం చేసేసింది. ఆ విధంగా అందరూ కలిసి మదర్స్ డే కి రెండు రోజులు ముందే అమ్మానాన్నల ముందు వాలిపోయారు. ఇప్పుడు మళ్లీ ఈ ఫోన్..!!
   పేరుకు తగ్గట్టే శాంతమ్మకు సహనం, దాంతోపాటు ఓపిక ఎక్కువే. విసుక్కోకుండా ఇంటిల్లిపాదికీ వండి వార్చడమే కాకుండా అన్ని సేవలు చిరునవ్వుతో చేస్తూ ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి ఉగాది,దసరా సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు అన్నింటికీ ముగ్గురు పిల్లలు వాళ్ల పిల్లల్ని తీసుకుని రావడం ఏళ్లుగా సాగుతున్నదే. అల్లుళ్ళు, కోడళ్ళు సరే సరి..  గతేడాది నుండీ వనజ ఈ మదర్స్ డే అన్నది కొత్తగా కనిపెట్టింది. అంతటితో ఊరుకోక ఇద్దరు తమ్ముళ్లనీ ఉసిగొలిపింది. పెద్దదానిగా పుట్టింది... తనూ ఇద్దరు ఆడపిల్లల తల్లి  అయింది. కానీ ఏమాత్రం అర్థం,అవగాహన లేక తల్లిదండ్రుల శ్రమ,ఆరోగ్యం,వయసు దృష్టిలోకి తీసుకోకుండా ఇలా ప్రవర్తించడం తండ్రి నారాయణమూర్తికి ఏమాత్రం నచ్చలేదు.కానీ ఏంచేయ గలడు... కడుపున పుట్టిన పిల్లలాయే!
   అలా పోయినసారి మదర్స్ డే అంటూవచ్చారా.. తల్లికి వంటింట్లో కాస్త చేయందుకోవాలా...! అబ్బే...! ఒకరోజు సినిమా అంటూ, ఇంకో రోజు  షాపింగ్ అంటూ ఆరుగురు పిల్లల్ని ఇంట్లో వదిలేసి మూడు జంటలూ పొలోమని తిరిగి రావడం...! ఇక్కడ పిల్లలు అంతా ఇల్లు పీకి పందిరేయడం! వాళ్లను కంట్రోల్ లో పెట్టలేక తామిద్దరూ బేజారయిపోవడం!! పోనీ... బయటికి వెళ్ళిన వాళ్ళు బయటే ఏదో ఒకటి తినేసి వస్తారా  అంటే... అదీ లేదు... వస్తూనే వంటింట్లో దూరి ఆవురావురంటూ అమ్మ చేతి వంట తినేయడం...!
    మదర్స్ డే అన్నారా...! ఆరోజన్నా వంటింట్లో  చేరి కూతురు గానీ,కోడళ్లు గానీ పెద్దావిడకు సాయం చేశారా అంటే... అహ... ఎక్కడ తీరింది వాళ్ళకి! వాళ్ల షోకులు.. పిల్లల్ని తయారు చేయడాలు!అదే సరిపోయే!మగవాళ్లేమో టీ వీ కి అతుక్కుపోయారు.    సాయంత్రం ఇద్దరినీ కూర్చోబెట్టి ఓ పూలదండ ఇద్దరికీ చుట్టబెట్టేశారు. ఓ బొకే అందించి, చెరో స్వీట్ ముక్క నోట్లో కుక్కేశారు. అదీ... వాళ్ల మదర్స్ డే సెలబ్రేషన్!
 కనీసం తల్లికి ఓ చీర బహుకరించాలన్న ధ్యాస కూడా ముగ్గురు ఆడవాళ్లకు ఏకోశానా పట్టలేదు. వెళ్ళేటప్పుడు  భార్య పోరగా పిల్లలందరికి చేతుల్లో తలా ఓ ఐదొందలు పెట్టి సాగనంపారు. ఆ తర్వాత వారం రోజులు భార్య మంచానపడ్డ సంగతి ఆయన ఇంకా మర్చిపోలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా... ఎందుకో గతసంవత్సరం నుండే ఆయనలో అంతర్మధనం మొదలైంది. అరవై దాటిన భార్యను అడపాదడపా పలకరిస్తున్న అనారోగ్య సమస్యలు, ప్రయాసపడుతూ పనివత్తిడిని ఆమె ఎదుర్కొంటున్న తీరు... ఆయన్ని పరిష్కారం కోసం వెతికేలా పురికొల్పాయి. అక్కడే పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న ఆయన కూతురుతో భార్య మాట్లాడటం చూశాడు. ఆమె ముఖంలో మారిన రంగుల్ని గమనించిన ఆయన వెంటనే విషయం గ్రహించాడు.తాను ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైందనిపించి, ఆ వెంటనే లేచి భార్య చేతిలో ఫోన్ అందుకున్నాడు.
" హలో వనజ,బాగున్నావా తల్లీ.."
" బాగున్నా నాన్నా... "
" ఏమిటి చెప్పు తల్లి విశేషాలు... "
" ఏమీ లేదు నాన్న.. మదర్స్ డే వస్తోంది కదా... అక్కడికి రావాలని ప్లాన్ చేస్తున్నాం. తమ్ముళ్లకు కూడా ఫోన్ చేశాను... "
" అలాగా.. కానీ వనజమ్మా, ఈసారి మేము ఇంకోలా ప్లాన్ చేశాం కద తల్లి... "
" ఏంటి నాన్న...? "
" చాలా రోజులైంది కదా... మేము ఇల్లు వదిలి బయటకి రాక.. అందుకని ఈసారి హైదరాబాద్ మేమే మీ దగ్గరకు రావాలనుకుంటున్నాం.. ఎలాగూ తమ్ముళ్లు కూడా అక్కడే ఉంటున్నారాయే.. ముగ్గురి దగ్గర ఓ వారం పాటు గడపాలని ఉంది తల్లీ... "
 అవతల కాసేపు మౌనం...!
" వనజమ్మా,.. వింటున్నావా..? "
" ఆ.. నాన్న.. వింటున్నా.. "
" రెండు రోజుల్లో బయలుదేరి వస్తాము. మాకు,మీకు ఇద్దరికీ కాస్త వెరైటీగా ఉంటుంది... ఏమంటావ్ తల్లి.."
" అ.. అ.. అలాగే నాన్న తప్పకుండా... రండి"
 తడబాటు కప్పిపుచ్చుకుంటూ అంది.
" తమ్ముళ్లకు కూడా  ఇదే విషయం చెప్పు తల్లి... ఉంటాం మరి.. "
 ఫోన్ పెట్టేశాడు నారాయణమూర్తి. భార్య మంచితనాన్ని, ఓర్పుని భరిస్తోంది కదా అని కడుపున పుట్టిన పిల్లలు సైతం ఇలా వాడుకోవడం చూసి చూసీ విసుగు పుట్టిన ఆయన ఇక రంగంలోకి దిగక తప్పలేదు. భార్యకు సహనం తప్ప చాకచక్యం, గడసరితనం మచ్చుకైనా లేవని  ఆయనకు బాగా తెలుసు మరి...
" అయ్యో అదేంటండి అలా అనేశారు.. "
 కంగారుగా అంది శాంతమ్మ.
" మరేం పర్వాలేదు లేవే.. "
" అది కాదండి,ఈ ఎండలకు మనం గడప దాటడం లేదు.. ఇప్పుడు హైదరాబాద్ అంటే.. "
" పిచ్చి మొహమా... మనం వెల్తామా పాడా...!"
" అంటే... "
" ఎక్కడికీ వెళ్ళం. ఇక్కడే.. మన ఇంట్లోనే... మనిద్దరమే... "
" మరి వాళ్ళు ఫోన్ చేస్తే... "
" అదంతా నేను చూసుకుంటాగా... వెళ్ళు..వెళ్లి వంట పూర్తి చెయ్.. ఆకలి దంచేస్తోంది... "
 చిద్విలాసంగా నవ్వుతూ తీరిగ్గా వెళ్లి మళ్లీ పేపర్ అందుకున్నాడాయన. భర్త మనోగతం అవగతమైన  శాంతమ్మ చిరునవ్వుతో వంటింటి వైపు నడిచింది. భార్య కష్టం అర్థం చేసుకునే భర్త లభించిన ఇల్లాలికి అంతకంటే అదృష్టం మరొకటుంటుందా..!!

🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱

  అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺