మండే ఎండలు చప్పున చల్లారిపోయాయి. రుతుపవనాలు ప్రవేశించి, వానలు పలకరిస్తూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అంతా సేదదీరడం మొదలైంది.
మరోపక్క వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అంతవరకూ ఆటపాటలతో, టీవీ లతో, సినిమాలు చూస్తూ బాగా రిలాక్స్ అయిన పిల్లలంతా బద్ధకం వదిలించుకోవాలంటే ఇబ్బంది పడే సమయం ఆసన్నమైంది. ఉదయం లేవడం... హడావుడిగా తయారవడం... పరుగులు తీయడం... మళ్లీ మొదలు...
కాకపోతే...సంతోషం కలిగించే ఓ విశేషం వాళ్లకి...! అంతా కొత్త తరగతుల్లోకి మారడం! కొత్త పుస్తకాలు, కొత్త పాఠాలు, కొత్త బట్టలు, కొత్త యూనిఫారాలు...! వాటితో పాటు కొత్త టీచర్లు !! ఆ సంబరంలో కొన్నాళ్ళు హుషారు పుడుతుంది పిల్లలందరికీ. కొత్త పుస్తకాలు అన్నింటికీ అట్టలు (కవర్స్ ) వేసుకోవడం... అదో ముచ్చట! కొందరికి అదో అలవాటు. పుస్తకాలు చాలా నీట్ గా ఉంచుకుంటారు. సంవత్సరం పూర్తి కావస్తున్నా అవి సరికొత్తగానే ఉంటాయి. మరికొందరుంటారు... అవేవీ పట్టవు వాళ్ళకి... మొదట్లో వారం పది రోజులు వారికి అవి అపురూపమే ! ఓ నెల దాటిన తర్వాత చూస్తే... ఏముంది...! అట్టలు చిరిగిపోయి, చివర్లు ముడతలు పడి పాత వాటి లాగా దర్శనమిస్తాయి. ఈ విషయంలో మగ పిల్లల కంటే ఆడపిల్లలు చాలా బెటర్ అని నా అభిప్రాయం.
సరే...ఇప్పుడేగా... స్కూళ్లు తెరిచారు... మొదట్లో కాస్త కష్టం అనిపించినా... ఓనెల దాటితే తర్వాత అంతా మామూలైపోయి పిల్లలంతా సర్దుకుని గాడిలో పడతారు. కొత్త క్లాస్ కాస్తా పాత బడిపోతుంది. అలా అలా... పిల్లల విద్యాభ్యాసపయనం కొనసాగుతూ పోతుంది... అంతేగా... 🙂
*****************************************
No comments:
Post a Comment