Thursday, June 18, 2020

రిపోర్ట్..... నిల్

 అవనిలో వనిత...... ఇదో కథ గాని కథ  !
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    ఉస్సురని నిట్టూర్చి మరోసారి సర్దుక్కూర్చుంది ప్రసూన. అరగంట దాటిపోయింది. ఇంకా తనకి పిలుపు రావడం లేదు. ఆరు నెలలుగా ఏదో గైనిక్ ప్రాబ్లం తో సతమతమవుతూ, పేరున్న డాక్టర్ అని కొలీగ్స్ చెబితే, వారం రోజుల నుండి ప్రయత్నిస్తూ ఎలాగోలా మొన్నటి దినం తీరిక చేసుకుని వస్తే, ఆ డాక్టరమ్మ కాస్తా ఆరోజు రావడం లేదంటూ ఫోన్ చేసిందని చల్లటి కబురు నింపాదిగా చెప్పేసింది, అక్కడున్న అటెండరమ్మ  ! " సరే, డాక్టర్ మాత్రం మనిషి కాదా, వాళ్లకు మాత్రం పనులుండవా.  " అని సర్దిచెప్పుకొని వెనుదిరిగింది. నిన్నటి రోజు మళ్ళీ తయారై అరగంట ముందైతే వచ్చింది గానీ, అప్పటికే అక్కడంతా నిండిపోయి, కొందరు ఓ వారగా నిల్చుని ఉన్నారు. ఎలాగోలా ఓ సీటు దొరకబుచ్చుకుని తన నెంబర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది ప్రసూన. 
     మరో పావు గంట గడిచాక, అటెండరమ్మ కను సైగ చేస్తూ పిలిచింది. ఆవిడ వైపు ప్రసన్నంగా చూస్తూ లోన అడుగుపెట్టింది. గంటన్నర నిరీక్షణ ! అయిదే అయిదు నిమిషాల్లో నాలుగే నాలుగు మాటలు మాట్లాడి, పెన్ తో బరబరా గీకేసి నా చేతిలో ఓ కాగితం పెట్టేసింది, డాక్టర్!
    " ఈ టెస్ట్ లు చేయించుకుని రండి, ఈరోజు రేపు ఈ టాబ్లెట్లు వాడండి, " అంటూ అప్పటికే వచ్చి కూర్చున్న మరో పేషెంట్ వేపు దృష్టి సారించింది, ఇక నీవు వెళ్ళొచ్చు అన్నట్లు ! అయినా ఏదో అడుగుదామనేలోపే అటెండర్ బయటకు రమ్మని పిలిచేసింది. ఇక చేసేదేమీ లేక ఆమె వెంట నడిచింది ప్రసూన. 
    " ఈ వెనకే డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంది. అక్కడ యూరిన్, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి వెళ్లండి. రేపు వచ్చి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని డాక్టర్ గారికి చూపిస్తే, దాన్ని బట్టి మందులు రాస్తారు,  " అని చెప్పి మళ్లీ లోనికి వెళ్లి పోయిందా సహాయకురాలు. 
    తమ శ్రమ తగ్గించుకోవడానికి డాక్టర్లు ఏర్పాటు చేసుకున్న సౌలభ్యం ఈ సహాయకులన్నమాట ! తన సమస్యంతా వివరంగా చెప్పాలని ఎంతగా అనుకుంది ! మరీ ఇంత యాంత్రికంగా మారిపోయారేమిటి ఈ డాక్టర్లు ! నిస్సహాయ స్థితిలో కాసేపు మెదడంతా మొద్దుబారినట్లయిందామెకి. తేరుకుని, ల్యాబ్  కెళ్ళి, వాళ్ళు అడిగిన శాంపిల్స్ ఇచ్చి, రెండు వేలు సమర్పించుకుని తిరుగుముఖం పట్టింది ప్రసూన. 
   మళ్లీ ఈ రోజు సాయంత్రం ఏడింటికి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుని వచ్చి, క్లినిక్ ముందు ఇదిగో ఇలా అరగంట నుండీ నిరీక్షిస్తూ కూర్చుని ఉంది. 
    మొత్తం నాల్గు రకాల టెస్టులు. రెండింటిలో ' నార్మల్ అని ఉంది. మిగతా రెండే అర్థం కాని విధంగా ఉన్నాయి. డాక్టర్ మాత్రమే చెప్పగలిగిన ఆ రిపోర్ట్స్ గురించే ' టెన్షన్ ' పడుతోంది ప్రసూన. బహుశా వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో?  ఆరు నెలలుగా ఎన్నడూలేనివిధంగా అలసట, నీరసం! ఏ సీరియస్ ప్రాబ్లం కు సూచనో ఏమిటో? కొంపదీసి ఏ క్యాన్సర్ కో.... " ఒక క్షణం ఆమె గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది. గతంలో, ఇంతకుముందూ ఎన్నో రకాల టెస్టులు, ఎన్నో సందర్భాల్లో చేయించుకుంది. కానీ ఎన్నడూ ఇలా డీలా పడలేదు. మొట్టమొదటిసారిగా ఎవరినైనా వెంట తోడు తెచ్చుకుని ఉంటే బాగుండేదేమో అనిపించిందామెకా స్థితిలో. 
    ఉన్నట్టుండి ఆమె మస్తిష్కంలో ఇంకా ఎలిమెంటరీ స్కూల్ దశ కూడా దాటని తన ఇద్దరు పిల్లలు  ఒక్కసారి కదలాడి కళ్ళ నీళ్ళు తిరిగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో రకరకాల రాకూడని అనుమానాలేవేవో బుర్రలో చొరబడి ఆమెను అతలాకుతలం చేస్తూ కుదిపేశాయి. గుండె దిటవు పరుచుకుంటూ నిస్త్రాణగా కళ్ళుమూసుకుంది. అప్పుడే పక్కనున్నామె తన భుజం మీద తట్టి నిన్నే రమ్మంటున్నారని చెప్పగానే ఉలిక్కిపడి, భారంగా అడుగులేస్తూ డాక్టర్ ముందుకెళ్ళి అచేతనంగా రిపోర్ట్ కాయితాలు ఆమె చేతిలో పెట్టేసింది. 
    ఒకే ఒక్క క్షణం అవి తిరగేసి,  " ఓ. కె అమ్మా, మరేమీ భయపడాల్సింది లేదు. అంతా నార్మల్ గా ఉంది. ఇవిగో, ఈ ఐరన్ టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్ లు వాడు. ఇంకా ఈ టానిక్స్ రోజూ తీసుకో, వారం రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఇకపోతే, పని ఒత్తిడి కాస్త తగ్గించుకో, వేళకు భోం చేస్తూ ఉండు.... " అంటూ చీటీ రాసి, ప్రసూన చేతిలో పెట్టేసింది. 
    ఒక్కసారిగా గుండెల మీద నుండి కొండంత భారం అలా పక్కకు వైదొలగి పోయినట్లు అయింది ప్రసూన కు. ఆమె పలుకులు అమృత గుళికల్లా అనిపించి, " నిన్న ఏదో అనుకున్నాను గానీ, ఎక్స్పీరియన్స్డ్  డాక్టర్ పది ప్రశ్నలడిగి, పది మాటలు మాట్లాడాలా ఏమిటి? పేషెంట్ను చూడంగానే ప్రాబ్లం అర్థమై పోదూ ! అయినా ప్రతిరోజు బోలెడు మందిని చూడాలాయె, అంతకంటే వాళ్లు మాత్రం ఏం వినగలరు  "
    నిన్నటికీ, ఈరోజుకి డాక్టర్ల గురించి ప్రసూన వైఖరిలో అనూహ్యమైన తేడా! ఆ క్షణంలో ఆమెకు డాక్టర్ ఓ దేవతలా కనిపించింది. థాంక్స్ చెప్పుకుని ఉత్సాహంగా బయటకు నడిచింది. పక్కనే మెడికల్ షాప్ లో అన్ని తీసుకుని ' అమ్మయ్య' అనుకుందోసారి. అయినా నాలాంటి ఉద్యోగినులకు పని వత్తిడిని మించిన అనారోగ్యం ఏముంటుంది? అది కాస్తా తగ్గించుకుంటే అంతా నార్మలే కదా! హఠాత్తుగా జ్ఞానోదయమైంది ఆమెకి. 
    ఆమె మనసిప్పుడు మబ్బు వీడిన ఆకాశంలా ప్రశాంతంగా ఉంది. శరీరమంతా దూదిపింజలా తేలిపోతున్నట్లు వడివడిగా అడుగులు పడుతుండగా మెయిన్ రోడ్డు మీదకొచ్చి నిలబడింది.. సమయం రాత్రి తొమ్మిది దాటిపోయింది. ఇక ఆటో కోసం వేట!
 అంతవరకు ఆవరించి ఉన్న ఆనందం సగం ఆవిరైపోయి, మళ్లీ నీరసం ముంచుకొచ్చేసింది ప్రసూన కు. రిపోర్ట్స్ టెన్షన్ తో మధ్యాహ్నం అన్నం సయించలేదు. సాయంత్రం అందరికీ టీ ఇచ్చి, హడావిడిలో తను మాత్రం తాగకుండానే రాత్రికి వంట ప్రయత్నాల్లో పడిపోయింది. ఇంతసేపు మరుగున పడ్డ ఆకలి ఒక్కసారిగా మేలుకొందామెలో. మరోవైపు కాళ్లు లాగుతున్నాయి !
    ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఓ ఆటో వచ్చి ఆగింది. ఎక్కడికో చెప్పీ చెప్పగానే తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చింది గానీ విపరీతంగా అడిగాడు. మరోటి క్రిక్కిరిసి వచ్చింది. మరో ఐదు నిమిషాలు ఆటో జాడే లేదు. 
   " ఎక్కువ అయితే మానే, ఇందాక ఆటో ఎక్కి ఉండాల్సింది, ఈ పాటికి ఇల్లు చేరి ఉండేదాన్ని.ఛీఛీ, అత్యవసర సమయాల్లో కూడా ఈ దిక్కుమాలిన పొదుపేమిటో !" తన మీద తనే విసుక్కుంటూ, ఏమైనా సరే, ఈసారి వాడడిగినంతా పడేసి వెళ్లి తీరాలి  " అని డిసైడ్ అయిపోయింది. 
    దేవుడు కరుణించాడు. ఆటో వచ్చింది. అదృష్టం !అనుకున్నదానికంటే తక్కువే అడిగాడు. " బ్రతుకు జీవుడా " అంటూ ఎక్కి చతికిలబడి, దీర్ఘంగా నిట్టూర్చిందోసారి. ఏమిటో ! ఆటోవాళ్ళలో కూడా అప్పుడప్పుడూ దేవుడు కనిపిస్తుంటాడామెకు. 
     మరో పావుగంటలో ఇంటిముందు దిగింది. అంతా భోజనాలు చేస్తున్నారు. ఆటో చప్పుడు విని పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి,  " మమ్మీ, ఏం తెచ్చావ్? " అంటూ తల్లిని చుట్టేశారు. ఇందాకా పడ్డ టెన్షన్ గుర్తొచ్చి ఇద్దర్నీ ఓసారి హత్తుకుంది. మమ్మీ మూడు రోజుల్నుండీ డాక్టర్ చుట్టూ తిరుగుతోందన్న సంగతి తెలీని వయసు వాళ్ళది మరి ! ఠక్కున ఏదో గుర్తొచ్చి బ్యాగ్ లో చేయి పెట్టింది, మొన్నెప్పుడో కొని పడేసుకున్న బార్ చాక్లెట్లు తగిలాయి. చెరోటిచ్చి, లోనికెళ్ళి కుర్చీలో కూలబడింది. ఇంట్లో అత్తమామలు, పతిదేవుడు భోంచేస్తూ సీరియస్ గా ఏదో చర్చించుకుంటున్నారు. తర్వాత తీరిగ్గా వచ్చి,  " ఏమిటి? ఏమిటిట ? ఏమీ లేదంట గదా ! "అంటూ ప్రశ్న, జవాబు తానే అయి పరామర్శిస్తాడాయన. 
   ఉస్సురంటూ లేచి, తినే ఓపిక కూడా లేక వెళ్లి మంచం మీద వాలిపోయింది ప్రసూన. ఒక్కసారిగా 
' రిలాక్స్ ' అయిన ఫీలింగ్ !
    ఏది ఏమైనా ఒకందుకు రిలీఫ్ ! రిపోర్ట్ నిల్ ! ఎవెరీ థింగ్ ఈస్ నార్మల్ !  తృప్తిగా కళ్ళు మూసుకుంది ప్రసూన.

( ఇలాంటి ప్రసూనలు ప్రతీ చోట ప్రతీ ఇంట్లో ఉంటారు. వాళ్ళ సహనానికీ, ఆత్మస్థైర్యానికి నా జోహార్లు ! )
🌷🌺🌹🌺🌷🌺🌹🌺🌷🌺🌹🌺🌷🌺🌹🌺

No comments:

Post a Comment