Saturday, May 30, 2020

వినిపించని రాగాలు.....

🌺🌷🌺🌷🌺🌷🌺🌷
                🌺🌹🌺🌹🌺🌷

ఉప్పొంగే ఊహల ఊసులు 
భాషకు అందని భావాలై 
అలలు అలలుగా సాగి 
వినిపించని రాగాలై 
కనిపించే అక్షరాలుగా మారి 
పరుగులు తీస్తూ 
నా హృదయపు తంత్రుల్ని మీటి 
పరవశింపజేస్తున్నాయే !
ఇది నిజమా? 
ఔను నిజమే అంటూ 
అదిగో ! మరో భావవీచిక !
నా గుండె తలుపు తట్టుతోంది 
మస్తిష్కంలో జొరబడి 
వినిపించని రాగాలేవో 
పలికిస్తోంది మరి  !!

🌺🌹🌺🌹🌺🌹🌷🌹🌷🌹🌷🌹🌺🌹
🌺🌹🌺🌹🌺🌹🌷🌹🌷🌹🌺🌹🌷🌹

Tuesday, May 26, 2020

ఇక చాలు... విరమించు......

ఎక్కడ పుట్టావో ? 
ఎలా పుట్టావో ? 
ఇలనంతా ఆవరించావు !
మానవాళిని కబళిస్తూ 
మరుభూమిని తలపిస్తున్నావు !
వందలు వేలు లక్షలు !
ఇంకా తీరలేదా నీ దాహం !
ఇంకెన్నాళ్లీ రాక్షసత్వం !
ఇకచాలు
విరమించు 
నీ విజృంభణ !
మనుషులంతా మేల్కొన్నారు 
ప్రాణభయమే కావచ్చు 
పాఠాలెన్నో నేర్చుకున్నారు 
ప్రకృతిని శాసించడం కాదు 
ప్రేమించడం గౌరవించడం 
ప్రధానమన్న పచ్చినిజం 
గ్రహించి పొందారు జ్ఞానోదయం !
అందుకే ----
ఇకచాలు 
విరమించు 
నీ విజృంభణ !
ఈ పాఠాలే గుణపాఠాలై 
దారిచూపే దివిటీలై 
రేపటిదారులు సుగమమై 
ఓ సరికొత్త ప్రయాణం 
సాగుతుందని చేస్తున్నాం ప్రమాణం !
అందుకే ---
చాలు, విరమించు 
నీ విజృంభణ !
ఇక అందుకో 
మా వీడ్కోలు !!

***********************************
యం. ధరిత్రీ దేవి 
***********************************

Sunday, May 24, 2020

' కరోనా ' మరణం

     అదో పల్లెటూరు. ఆ ఊర్లో ఓ ఇంటి ముందు ఓ పదిహేను మంది దాకా విషణ్ణ వదనాలతో దూర దూరంగా నిలబడి ఉన్నారు. లోపల ఓ నలుగురు ఆడవాళ్ళు కన్నీళ్ళొత్తుకుంటున్నారు. ఇంటికి ముందు భాగంలో చాప మీద ఆ ఇంటి యజమాని విశ్వేశ్వర రెడ్డి గారి భౌతిక కాయం! ఓ పక్కగా కన్నీళ్లు ఇంకిపోయి ఆయన భార్య రుక్మిణమ్మ ! ' లాక్ డౌన్ ' పుణ్యమాని సమీప బంధువులు కూడా రాలేక ఎక్కడి వాళ్ళు అక్కడే ఇరుక్కు పోయారు. సాయంత్రం ఆరు గంటలకంతా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇంట్లో రుక్మిణమ్మ మరో నలుగురు బాగా దగ్గరి బంధువులు మిగిలారు. 
                     ++++++++++++++
          ఇంతకీ, రెడ్డి గారి ఆఖరి ప్రయాణం ఎందుకింత విషాదంగా ముగిసింది? ఆయనేమన్నా ఓ అనామకుడా? ఊర్లో అందరికీ సరిపడని వాడా? లేక ఎవరికీ ఏమీ కాని వాడా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం' కాదు ' అనే!
       ఆయన ఊర్లో పెద్ద మోతుబరి. అందరికీ లేదనకుండా సాయం చేసే వ్యక్తి. పైగా ఓ సారి సర్పంచి పదవి కూడా నిర్వహించిన వాడే! ఇక ఆయన సతీమణి రుక్మిణమ్మ చేతికి ఎముక లేని మనిషి! మరెందుకిలా? 
    రెణ్నెల్ల క్రితం రెడ్డి గారు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్లారు. తీరా అక్కడినుంచి వచ్చేద్దాం అనుకునేంతలో ' కరోనా ' వైరస్ విజృంభించి లాక్ డౌన్ ప్రకటించడంతో వెంటనే రాలేకపోవడం, ఆ తర్వాత ఎలాగోలా రకరకాల వాహనాల్ని పట్టుకుని టౌన్ దాకా చేరుకోవడం జరిగింది. కానీ అక్కడే చిక్కొచ్చిపడింది. దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్లందరినీ వెంటనే అక్కడే ఆపేసి తీసుకొనిపోయి టెస్టులు చేయించే నెపంతో క్వారంటైన్ లో ఉంచేశారు. అందులో ఈయనా ఒకరు. పధ్నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరీక్షలంటూ మరికొద్ది రోజులు అక్కడే ఉంచేశారు. అటు పిమ్మట డిశ్చార్జి చేశారు, కానీ ఈ లోగా ఈ వార్త దావానలంలా ఆ పల్లెటూర్లో పాకిపోయింది. 
                  +++++++++++++++++
     చాలా రోజుల తర్వాత రెడ్డి గారు తన వెంట ఒక పెద్ద సూట్ కేసు, మరో చిన్న బ్యాగు పట్టుకుని ఊరి పొలిమేరలో దిగారు. అక్కడ దారికి అడ్డంగా పెద్ద ముళ్ళకంచె కనిపించింది, బయటి వాళ్లెవరూ ఊర్లోకి రాకుండా. రెడ్డిగారు చుట్టూ చూశారు, మనిషి జాడ లేదు. ఎలాగోలా సందు చేసుకుని కంచె దాటి, ఊర్లో అడుగుపెట్టారాయన. అక్కడక్కడా ముగ్గురు నలుగురు కనిపించారు కానీ, తన దగ్గరికి ఎవరూ రాలేదు. ఇదివరకైతే తను కనిపించగానే పదిమంది దాకా పరుగున వచ్చి, చేతిలో బరువు అందుకునేవారు. అలాగే సూట్ కేసు లాక్కుంటూ ఇల్లు చేరారాయన. ఇంట్లో భార్య ఒక్కతే పని చేసుకుంటోంది. కాసేపటికి విషయం అంతా అర్థమైందాయనకి. తనకి కరోనా సోకిందనే అనుమానం తో దగ్గరికి వస్తే వాళ్లకి ఎక్కడ అంటుకుంటుందోనని అంతా దూరంగా ఉండిపోయారన్నమాట !
      ఆయన మనసంతా కకావికలమై పోయింది. ఎంత చేశాడీఊరికి ! ఎంతగా అభిమానించాడు అందర్నీ! ఇన్నాళ్ల తర్వాత వస్తే పలకరించడానికిక్కూడా ఎవరికీ మనసు రాలేదా? 
                   +++++++++++++++
      వారం రోజులు విపరీతంగా మదన పడ్డ ఆయన ఓ అర్ధరాత్రి గుండెల్లో సన్నగా నొప్పిగా ఉందంటూ భార్యను నిద్రలేపాడు. ఆమె కంగారుగా సహాయం కోసం బయటకు వెళ్లబోయింది. వద్దంటూ ఆమె చేయి పట్టుకొని ఆపి తన వద్దే కూర్చోబెట్టుకున్నారు. అంతే! తెల్లారింది. ఆయన బ్రతుకూ తెల్లారి పోయింది"
                    ++++++++++++++++
       అదీ జరిగింది! ఎక్కడో దూరాన ఉన్న కొడుకు కుటుంబంతో మూడో రోజుకుగానీ రాలేక పోయాడు. ఆరోజు రెడ్డి గారి పెద్ద దినం. కొందరు అతి దగ్గర బంధువులు వచ్చారు. తతంగమంతా జరుగుతూ ఉంది. ముఖాన కుంకుమ లేని రుక్మిణమ్మ రెడ్డి గారి ఫోటో ముందు కూర్చుని మౌనంగా రోదిస్తోంది. 
       ఇంతలో ఊర్లో వాళ్ళు కూడగట్టుకొని ఓ పెద్ద గుంపుగా తరలివచ్చారు. అందరి చేతుల్లో పెద్ద పెద్ద పూల దండలున్నాయి. వాటిని ఫోటోకు వేయడానికి ముందుకు కదిలారు వరుసగా. అంతవరకు మౌనంగా ఉన్న రుక్మిణమ్మ దిగ్గున లేచి గట్టిగా అరిచింది. ఎన్నడూ నోరు విప్పని ఆ ఇల్లాలు ఒక్కసారిగా అలా ఉగ్ర రూపంలో కనిపించేసరికి అక్కడందరూ శిలా ప్రతిమల్లా అయిపోయారు. 
   ".... ఆగండక్కడే ! మీకు ఆయన ఫోటో తాకే అర్హత లేదు. ఆయన కరోనా వల్ల చచ్చిపోలేదు. మీ వల్ల, మానవత్వం లేని స్వార్థపూరిత ప్రవర్తన వల్ల.... అందువల్ల చచ్చిపోయారు. వైరస్ వల్ల అందరూ దూరం పాటించండి అన్నారంతే. అంతేగానీ మనుషుల్లో అభిమానం, ఆప్యాయతలూ దూరం చేసుకోమని దానర్థం కాదు. రేపు మీకూ ఇలాంటి మరణం వస్తే ఎలాగుంటుందో కాస్త ఆలోచించండి.... "
     అక్కడంతా మ్రాన్పడి చూస్తుండగా స్థిరంగా అంది,.... "... ఇంకెప్పుడూ ఈ ఛాయలకు రావద్దు... ఆయన ఆత్మ నైనా ప్రశాంతంగా ఉండనీయండి... " అంటూ రెడ్డి గారి ఫోటోకు అడ్డంగా నిలబడింది!
    అంతే! వాళ్ళ చేతుల్లోని పూల దండలు వెలవెలబోయాయి!!
******************************************
( వైరస్ తో చనిపోయిన వారి అంత్యక్రియలకు అడ్డగిస్తూన్న జనాల్ని గురించి విన్నప్పుడు---
 ఎంతోమంది అనారోగ్యాల్ని బాగుపరిచి ప్రాణదానం చేసిన వైద్యుల భౌతికకాయాల్ని సైతం స్మశానం లోకి అనుమతించక తిరిగి వెళ్ళి పోయేలా చేస్తున్న వైనం చదివినప్పుడు---
  మనుషుల్లో స్వార్థచింతన మరీ ఇంతగా వేళ్ళూనుకుని ఉందా! అన్న ప్రశ్న తలెత్తినపుడు కలిగిన స్పందనకు అక్షర రూపం ఈ " కరోనా మరణం ". )
************************************

Friday, May 22, 2020

మధురమైన భాష

తేనెను మించిన మాధుర్యం 
తెలుగు భాషకే సొంతమన్నది నిత్యసత్యం 
ప్రతిపదంలో పరిమళించే కమ్మదనం 
ప్రతీ పాదంలో జాలువారే రసరమ్య భావజాలం !
అమ్మ ప్రేమను గురుతుకు తెస్తుంది ప్రతీక్షణం !

యాభై అక్షరాల కూర్పుతో 
అలరారే తెలుగు అక్షరమాల 
సంస్కృతీసంప్రదాయాల విలువలు 
చాటిచెప్పే వరహాల విరులమాల 

కలం పట్టి కాగితం వేపు అలవోకగా 
చూస్తే చాలు ఆలోచనలు అక్షరాలై 
బారులు బారులుగా సాగిపోతూ 
మధురగీతాలై మది నిండిపోయి 
ఆనందపు వెల్లువలు కురిపిస్తాయి !
 
పరభాషను ప్రేమించటం తప్పని అనం 
తల్లిభాష ప్రాధాన్యం ఎరుగకపోవడమే నేరం 
భావవీచికలు చుట్టుముట్టి 
చెలరేగిన వేళ అవి సరైన ఆకృతి దాల్చి 
నిలిచేది సొంత భాషలోనే 
గుండె వేదనాభరితమై 
కుంగుతున్న వేళ కారే కన్నీటి చుక్కలు 
శిలలను సైతం కరిగించగల 
కావ్యాలయేదీ సొంతభాషలోనే !
అమ్మ తోడి సాన్నిహిత్యం 
మరెవ్వరితోనైనా సాధ్యమా మరి !!

*************************************

Thursday, May 21, 2020

చిట్టి తల్లీ !

😔👸😔😔😔
               చిట్టి తల్లీ !
                   🙎😔😔😔😔

చెత్తకుప్పలో విసిరేయబడ్డ పసిపాప !
చెదలు పట్టిన విషసంస్కృతికి ప్రతీక 
వెర్రితలలు వేస్తున్న పురుషాధిక్య భావన !
ఏ దేవుడాలకిస్తాడో చిట్టితల్లుల ఆక్రందన !

పొత్తిళ్ల నుండి ప్రాయం దాక ప్రాణప్రదమై 
పదిలంగా నున్న అపరంజి బొమ్మ !
పెళ్లి పీటలెక్కి పెద్దరికం వచ్చి 
చిరునవ్వు మరిచి చింతలపాలై పోతోందమ్మ !

అత్తిల్లు కాదది ఆరళ్లకు పుట్టిల్లు 
రక్షకుడు కాడా మగడు భక్షకుడు !
ఆడబ్రతుకెప్పుడూ అరిటాకే 
మారదు ఈ నానుడి ఎన్నడూ మరవబోకు !

ఈ చేదునిజం జీర్ణించుకున్నదేమో నీ తల్లి 
చిట్టితల్లీ ! నిను కడుపులోనే కాలరాసి 
' హంతకి ' అనిపించుకుంటేనేమిగాక !
నూరేళ్ల బతుకుభారం నీకు దించేసింది సుమీ !!
                   ☺️🙂🙂🙂🙂
------------------------------------------------------
చెత్తకుప్పలో పసిపాప మృత దేహం ----అన్న వార్తలు
పదే పదే చూస్తున్నపుడు కలిగిన స్పందనతో ----
------------------------------------------------------
యం. ధరిత్రీ దేవి
*********************************

Tuesday, May 19, 2020

అమూల్యం

అరవై వసంతాలు 
అలవోకగా సాగిన జీవనం 
తీరిక దొరికి చూద్దునుగదా 
జీవితం కరిగిపోయింది 
వెన్నముద్దలా వెలిగే కొవ్వొత్తిలా !
ఎక్కడ? 
చిరుగజ్జెల సవ్వడితో 
చిందేసిన ఆ పసిడి పదాలు? 
నాన్న ముద్దులతో 
అమ్మ గోరుముద్దలతో 
అలరారిన ఆ పాలబుగ్గలు? 
పట్టు పరికిణీతో 
పచ్చల హారంతో విరబూసిన 
చిరునవ్వుల సందళ్ళు? 
ఎక్కడ? 
అంటూ ప్రశ్నించింది 
అంతరంగం 
మూడు ముళ్ళు !
ముడివడ్డ కొత్త బంధాలు 
అల్లుకున్న పేగుబంధాలు 
అంతే ! 
జారిపోయింది 
మూడుపదుల వయస్సు !
చదివిన చదువు 
ప్రశ్నార్థకమై కుదిపేస్తే 
మరో భూమిక 
ఇచ్చిందో సరికొత్త రూపం !
రెండు పడవల 
ప్రయాణం ఆరంభం !
వైవిధ్య ప్రపంచాలతో 
సంబంధబాంధవ్యాలు 
నిత్యం అనునిత్యం 
ఉరుకులూ పరుగులూ 
ఫలితం !
నేడు వాడివడలిన 
నా ఈ దేహం !
అదిరిపడి అద్దం ముందు 
నిలబడితే 
పరిహసిస్తూ నా ప్రతిరూపం !
ఒక్కక్షణం నివ్వెరపాటు !
మరుక్షణం సాక్షాత్కరిస్తూ 
ఓ కఠోర సత్యం !
ఇది జీవనయానం సుమా !
బాధ్యతలతో పండిపోయినా 
మదినిండిపోయే తృప్తి 
అమూల్యం కాదా అంటూ !"
      💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

యం. ధరిత్రీ దేవి .... మళ్ళీ కలుద్దాం !
**********************************

Monday, May 18, 2020

మళ్ళీ లాక్ డౌన్...

   ' లాక్ డౌన్ ' పొడిగించబడింది మళ్లీ ఈ నెలాఖరు వరకూ. జనాలందరూ బాగా డీలా పడిపోయారు. ఎంత కాలమిలా? దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు మరి! ఎన్నాళ్లని ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడతారు? ఎవరైనా ఎన్నాళ్లని ఎవరినైనా పోషించగలరు? 
   ఓ వర్గం వారి పరిస్థితి ఇలా ఉంటే--- బాగా ఉన్న వాళ్ళ పరిస్థితేమో కలిగి ఖర్మంలా ఉంది. చేతినిండా డబ్బు ఉంది గాని ఏది కొందామన్నా కాలు బయట పెట్టలేని దుస్థితి. ఏ వారానికో పది రోజులకో బయటపడ్డా, దుకాణాలన్నీ బంద్! 
     వారం క్రితం వరకూ కూరగాయలు, సరుకులన్నా దొరికేవి. ఇప్పుడు వాటికీ మొహం వాయాల్సి వస్తోంది. మరీ ' కరోనా ' విజృంభణ అధికంగా ఉన్న కర్నూలు లాంటి రెడ్ జోన్ ప్రకటిత పట్టణాల్లో మందుల షాపులు సైతం మూతబడ్డాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. 
    ఎంత కాలమిలా? కొందరేమో వైరస్ తో సహజీవనం చేయాలి, తప్పదంటున్నారు. కరోనాతో అటుంచి ఈ కఠినతర నియమాలతో జనం అతలాకుతలమై పోతున్నారు. ఈ దుస్థితి తొలగి జనజీవనం ఎప్పటికి మామూలు స్థితికి వస్తుందో!!

*****************************************
యం. ధరిత్రీ దేవి 
మళ్ళీ కలుద్దాం !
*****************************************