Saturday, November 6, 2021

ఆడపిల్ల.. పెళ్లికి ముందు.. ఆతర్వాత..!

                                     
                                                                 

   పాత తెలుగు సినిమాల్లో బాగా గమనిస్తే హీరోయిన్ల విషయంలో ఒక అంశం గమనించవచ్చు. అదేంటంటే... పెళ్లికి ముందు అమ్మాయి...లంగా వోణీ, పొడుగాటి జడ, దాని చివర జడకుప్పెలు, తల్లో  ఓ బంతి పువ్వు, లేదా ఏదో ఒక పూల దండతో చెంగు చెంగు మంటూ చెట్ల వెంటా పుట్టల వెంటా తుళ్ళుతూ, లేడి పిల్లలా  గంతులు వేస్తూ హాయిగా పాట పాడుతూ కనిపిస్తుంది.ఒకటి రెండు సీన్ల తర్వాత పెళ్లయిపోతుంది ఆ పిల్లకి.. అంతే! నెక్స్ట్ సీన్లో పెద్ద ముత్తయిదువులా నిండుగా చీర, నుదుట  కాసంత బొట్టు, చేతినిండా గాజులు, మరీ ముఖ్యంగా ఇంత  పెద్ద కొప్పు వేసుకుని పెద్ద ఆరిందాలా హుందాగా మారిపోయి కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే..... 
     ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి  తర్వాత ఎలా ఉండాలో సినిమాల్లో అప్పట్లో చూపించేవారు. అంటే పెళ్లికి ముందు పుట్టింట్లో ఎంత గారాబంగా ఉన్నా పెళ్లి తర్వాత బాధ్యతగా ఉండాలన్నది దానర్థమేమో ! అప్పట్లో ఆ ట్రెండు నడిచేది ఆహార్యం విషయంలో. ఆహార్యం సరే, ఆమె జీవితం గురించిన మాటేమిటి? అసలు ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు ఉన్నట్లు పెళ్లి తర్వాత కూడా నిశ్చింతగా ఉండే అవకాశం లేదా? ఖచ్చితంగా లేదనే జవాబు వస్తుంది కాస్త ఈ ఉదాహరణలు చూస్తే  --

* రజని  డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరుగా చేరింది. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. తనకంటూ కొన్ని అభిరుచులు, జీవితం పట్ల కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. కానీ అదృష్టమో దురదృష్టమో జాబ్ లో చేరిన కొన్ని నెలలకే పెళ్లి కుదిరిపోయింది. పెళ్లి తర్వాతా భర్త ఉన్నచోటే ఏదైనా జాబ్ వెతుక్కోవచ్చులే అనుకున్న ఆమె ఆశ తీరే  దారి ఎంత మాత్రమూ  లేదని కొద్దిరోజుల్లోనే అర్థమైపోయింది ఆమెకి. కారణం, భార్య ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేకపోవడం!  పైగా ఆమె అభిరుచులు అన్నింటి మీద నిరసన ప్రదర్శిస్తూ ఆమె ఆశలన్నింటి మీద నీళ్లు చల్లడం! భార్య అంటే వండి వార్చే  ఓ మర మనిషి మాత్రమే అన్న సంకుచిత స్వభావి అతను కావడం! అంతే, రజని  ఆశలన్నీ ఆవిరైపోయి జీవితం నిస్సారంగా, నిస్తేజంగా మారిపోయింది. 
* పావనిది  మరో రకం ! పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయవచ్చన్నారు అత్తింటివారు. బాగానే ఉంది. కానీ నెల జీతం అంతా నయా పైసల్తో  సహా తెచ్చి వాళ్ళ చేతిలో పెడితే గానీ ఊరుకునే వారు కాదు. భర్త తల్లి మాటకు తాన తందాన అనే రకం! సంపాదిస్తున్నా, పది రూపాయలు ఖర్చు పెట్టుకునే స్వాతంత్ర్యం లేని బ్రతుకై  పోయింది పావనిది ! పెళ్లికి ముందు ఆమె కన్న కలలన్నీ
 కల్లలై పోయి శూన్యం మిగిలిపోయింది. 
* సమీర ఒక్కగానొక్క కూతురు అమ్మానాన్నలకి. అల్లారుముద్దుగా పెరిగిన ఆ పిల్ల అత్తగారింటికొచ్చి ఊహించని విధంగా ఆ ఇంట్లో జీతభత్యాలు లేని ఓ పని మనిషిగా మారిపోయింది. కాలు కదిపితే కంది పోతుందేమో అన్న  చందాన పెంచుకున్న బిడ్డ ఓ అనాగరిక  కుటుంబంలో పడి అల్లాడి పోతున్నందుకు  తల్లీ దండ్రీ  నెత్తి నోరూ  బాదుకుంటూ చింతించని  క్షణం లేదు. అల్లుడు ఉద్యోగే, కానీ తల్లిదండ్రుల మాట జవదాటడు. భార్యకు అండగా ఉండాలన్న ధ్యాస ఉండకపోగా మాటలతో హింసించే  రకం! ఫలితం! సమీర మొహంలో నవ్వు అన్నది మటు మాయమైపోయింది.
      అందరి పరిస్థితీ ఇలాగే ఉందనీ  చెప్పలేం. కొందరు అదృష్టవంతులూ  ఉంటారు. ఆ కోవకు చెందిందే కమల. 
* ఇంటర్ దాకా  చదివిన కమలకు మోహన్ తో పెళ్లయింది. అతను ఓ ప్రైవేటు యాజమాన్యంలో ఓ చిరుద్యోగి. భార్య చదువులో చురుగ్గా ఉండటం గమనించిన అతను ప్రైవేటుగా డిగ్రీ కట్టించాడు ముందుచూపుతో. అతని ప్రోత్సాహంతో చదువు కొనసాగించిన కమల నాలుగేళ్లలో బీఈడీ కూడా పూర్తి చేసి, లక్షణంగా  ఉద్యోగంలో చేరి పోయింది. ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ఆమె  సంసారం హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఇదంతా కేవలం భర్త సహృదయత, ఆతని అవగాహన వల్లే సాధ్యమైందని చెప్పక్కర్లేదు కదా ! 
* స్నిగ్ధ  బాగా చదువుకుంది, కానీ నోట్లో నాలుక లేని పిల్ల. పెళ్లయి, పోయి పోయి ఓ ఉమ్మడి కుటుంబంలో పడి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అత్తగారు, ఆడపడుచు, తోడికోడలు మాటలతో హింసించడం, పనంతా ఆమె నెత్తినే వేయడం, ఉన్నవీ లేనివీ కల్పించి ఆమెపై దుష్ప్రచారం చేయడం సాగించారు. అంతా భరిస్తూ  మౌనంగా రోదిస్తున్న భార్య పరిస్థితి గమనించిన భర్త కుమార్...అదును చూసి వేరింటి కాపురం పెట్టేసి, ఆమెను ఆ ఇక్కట్ల బారినుండి తప్పించేశాడు.
--- ఇలా...కమల, స్నిగ్ధ -- ఇద్దరూ పెళ్లి తర్వాతా సంతోషంగా జీవనం గడిపే అదృష్టం దక్కించుకున్నారు. అది కేవలం వారికి లభించిన భర్తల సహకారం, అవగాహన వల్ల మాత్రమే సాధ్యమైంది మరి !
    దీన్ని బట్టి చూస్తుంటే ఆడపిల్ల అదృష్టవంతురాలా లేక దురదృష్టవంతురాలా అన్నది లభించిన భర్త మీదే ఆధారపడి ఉంటుందన్నది స్పష్టమవుతున్నది. కమల, స్నిగ్ధ లాంటి అదృష్టవంతుల శాతం బహు తక్కువ అనే చెప్పాలి. అబ్బాయిలు కూడా పెళ్లికి ముందు కాబోయే భార్య గురించి ఏవేవో ఊహించుకోవడం సహజమే! వారు కోరుకున్న విధంగా కూడా జరగని వాళ్ళూ  ఉంటారు. కానీ అబ్బాయిలకున్న  సౌలభ్యాలు అమ్మాయిలకు పెళ్లి తర్వాత ఉండే అవకాశం  మన సమాజంలో పూర్వపు రోజుల్లోనే కాదు, ఈ ఆధునిక రోజుల్లో కూడా ఎంత మాత్రం ఉండడం లేదంటే అతిశయోక్తేమీ కాదు. 
      అంతవరకూ పుట్టిపెరిగిన ఇల్లు, ఆ వాతావరణం, కన్న తల్లీ దండ్రీ, తోబుట్టువులు...ఈ అందర్నీ ఒక్కసారిగా వదిలేసి ఓ కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకి తరలివెళ్లాల్సిఉంటుంది ఆడపిల్ల ! అక్కడ ఆ వాతావరణం, ఆ మనుషులు ఈ అమ్మాయిని సాదరంగా తమలో కలుపుకోగలిగితే అదృష్టవంతురాలే. కానీ ఏమాత్రం తేడా వచ్చినా ఆ పిల్లకు ప్రాణసంకటమే. దానికి తోడు కట్టుకున్న భర్త అన్నవాడు కూడా అర్ధం చేసుకోలేని మనస్తత్వం గలవాడైతే అది మరీ నరకసదృశంగా ఉంటుందా కొత్త ఇంటిలో ! 
     అదే మగవాడైతే ఉన్న చోటు నుండి ఎక్కడికీ కదలాల్సిన పనే ఉండదు. అతని ఇష్టాలు, రుచులు, అభిరుచులు, ఆశయాలు,  తన కెరీర్ గురించిన  లక్ష్యాలు ఏవీ మార్చుకోవాల్సిన  అవసరం ఎంతమాత్రమూ ఉండదు. అందుకోసం ఎవరి అనుమతీ  అవసరం లేదు ఎంచక్కా తన మనుషుల మధ్య యథాతధంగా ఉండవచ్చు. కానీ భార్యగా  ఆ ఇంట  కాలు పెట్టిన ఆడది మాత్రం అన్నీ మార్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ విధంగా తన అభిరుచుల్నీ, అనుకున్న లక్ష్యాల్నీ చంపుకుని జీవచ్ఛవంలా కేవలం కుటుంబం కోసం ఓ ప్రాణంలేని యంత్రంలా  బతకాల్సి వస్తుంది. 
    పూజ కొద్దీ పురుషుడు అంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయింపబడతాయి  అంటారు. అదంతా ఏమోగానీ, ఆడపిల్ల జీవితం మాత్రం నుదుటి రాత ప్రకారం నడుస్తుంది అన్నది నిర్వివాదాంశమే అనిపిస్తుంది ఇలాంటివి  వింటుంటే.
     దృఢసంకల్పం, ఆత్మవిశ్వాసం, భర్తను ఆకట్టుకోగలిగిన  చాకచక్యం, సమస్యల్ని   సొంతంగా పరిష్కరించుకోగల నైపుణ్యం, వీటన్నింటితో పాటు పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం -- ఇవన్నీ ఉన్న అమ్మాయిలు తమ అభిరుచుల్ని, లక్ష్యాల్ని సమాధి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటినీ అధిగమించి తమకంటూ ఓ మంచి భవిష్యత్తును సృష్టించుకో గలరు. అలా నెగ్గుకొస్తున్నవాళ్ళు కూడా ప్రస్తుత సమాజంలో ఉంటున్నారు. ఎటొచ్చీ, ఆ సామర్ధ్యాలు లేకుంటేనే సమస్య!
                             🌹🌹🌹🌹🌹

.
                           







  












Monday, October 25, 2021

అవని... కథ లాంటి ఓ నిజం !

                                               🌷🌷🌷🌷🌷🌷🌷
                                                   భువి భావనలు🐦
                                               🌷🌷🌷🌷🌷🌷🌷
    

" అవనీ, ఇలా అవుతుందనుకోలేదు. మా చెల్లెలు సుధ తెలుసు కదా, మూణ్ణెల్ల  క్రితం తనకి ఓ సంబంధం వచ్చింది. పెళ్లిచూపులు కూడా జరిగాయి... కానీ వాళ్లు ఏ  సంగతీ అప్పుడు స్పష్టంగా  చెప్పలేదు.   దాని గురించి అంతా మర్చిపోయాం  కూడా.  సడన్ గా మొన్న సాయంత్రం ఫోన్ చేసి, మీ సంబంధం మాకు ఇష్టమే, మీరూ  సరేనంటే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పారు. అనుకోని ఆనందం ఇంట్లో చోటు చేసుకుని, అంతా వెంటనే ఓకే చెప్పారు. వాళ్లు నిన్ననే వచ్చి, ఇప్పటికే ఆలస్యం చేశామంటూ తాంబూలాలు పుచ్చుకుని  వెళ్ళిపోయారు... మరో పది రోజుల్లోనే పెళ్లి!."
" సంతోషమేగా, అయితే మరి ఏంటి.? "
 మధ్యలో ఆపి అడిగింది అవని. 
"...అదే చెప్పబోతున్నా,  ఇదంతా మొన్న నేను నీకు ఫోన్ చేశాక జరిగింది. బాగా ఆలోచించాను, మనం అనుకున్న ప్రకారం ఇప్పుడు వెళ్ళిపోవడం సబబుగా తోచలేదు. ఈ విషయం నీకు డైరెక్టుగా చెప్తే బాగుంటుందనిపించి, ఫోన్ చేయలేదు..."
 తదేకంగా అతన్నే  చూస్తూ ఉండిపోయింది అవని.
".. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోయామంటే, కుదిరిన పెళ్లి కాస్తా చెడిపోతుంది. దాని జీవితం చిక్కుల్లో పడి పోతుంది...అందుకే మనం కొద్ది రోజులు..అంటే చెల్లి  పెళ్లయిపోయేదాక... ఆగుదాం.."
నాన్చుతూ విషయం బయట పెట్టేశాడు గిరీష్. మ్రాన్పడిపోయింది అవని !
"అదేంటి గిరీష్, ఇవతల  నా పెళ్లి కూడా ఖాయమయిపోయింది. నాలుగు రోజుల్లో పెళ్లి. నా సంగతేంటి?.. "
" ఇంట్లో చెప్పేయ్ అవనీ, క్యాన్సిల్  చేయించు..."
 వెంటనే అతని నుండి వచ్చిన ఆ మాటకు అవాక్కయిపోయింది అవని !
".. సారీ, అవనీ, ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే మా చెల్లెలి పెళ్ళి జరగడం కష్టమైపోతుంది. అమ్మ నాన్న తట్టుకోలేరు. పైగా  కుదిరిన పెళ్లి ఆగిపోయింది అంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు.. మన విషయంలో ఆ సమస్య ఉండదు. నీవు  పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా మనం పెళ్లి చేసుకుంటాం.."
   షాక్ తగిలినట్లుగా అచేతనంగా  మారిపోయింది అవని. ఆమెలో  మెల్లిగా ప్రకంపనలు !! నిజమే! కుదిరిన పెళ్లి ఆగిపోయిందంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. మరి నాకూ ఇదే సూత్రం వర్తిస్తుంది కదా! గిరీష్ మగవాడు. అయినా ఎంతో వివేకంగా తన చెల్లి గురించి, తన  కుటుంబ పరువు  గురించీ ఆలోచిస్తున్నాడు. మరి, తను  ఆడపిల్ల అయి ఉండీ ఈ ఇంగితం తనకు లేకుండాపోయిందే ! నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఎవడితోనో లేచిపోయింది అనే అపవాదు తన తల్లీదండ్రీ మాత్రం    భరించగలరా ! తన తర్వాత తన  చెల్లి పరిస్థితి ఏమిటి? 
     ఇంటి నుండి బయలుదేరే ముందు అమ్మతో, 
" అమ్మా, పనుంది, బయటికెళ్తున్నా " అని చెప్పింది తను. ఎక్కడికని గానీ, ఏంపని అని గానీ అడగలేదు అమ్మ.. త్వరగా వచ్చేయ్ అని మాత్రమే అనింది. అంటే తన మీద అంత నమ్మకం అన్నమాట! తన కూతురు గాడి తప్పదన్న భరోసా! కానీ...తనేం  చేసింది! మై గాడ్!
     నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లే, గిరీష్ లో కూడా రెండు కోణాలు చూస్తోంది అవని  ఇప్పుడు! తన చెల్లి గురించి, తన కుటుంబం పరువు గురించీ ఆలోచించాడు. అంతవరకూ బాగానే ఉంది, కానీ అదే సమయంలో తను ప్రేమించిన అమ్మాయి జీవితం గురించీ, ఆమె తల్లిదండ్రుల గురించీ ఏ మాత్రం ఆలోచించలేక పోతున్నాడు. అక్కడే  ఏదో తేడాగా అనిపించి క్షణకాలం ఆలోచనలో పడింది అవని.  
 ఎంత తేలికగా చెప్పేశాడు, పెళ్లి క్యాన్సిల్  చేయించు అని!తనను పెళ్లయితే చేసుకుంటాడట, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ! కానీ చిత్రంగా, అవనికి అతనిపై కోపం రావడం లేదు, పైగా వక్రమార్గంలో అడుగులు వేయబోతున్న తనను సరైన దారిలోకి మళ్ళించడానికి వచ్చిన ఓ దూతలా కనిపిస్తున్నాడు ! అందుకే అతన్నేమాత్రం తప్పు పట్టలేకపోయింది. కాస్త ఆలోచిస్తే తన వైఖరి లోనే  లోపం ఉన్నట్లు తెలుసుకోవడానికి మరో క్షణం పట్టిందా అమ్మాయికి.
   క్షణాల్లో ఆ పిల్ల మదిలో స్థిర నిర్ణయం చోటు చేసుకుంది. అంతే ! వెంటనే లేచి, బ్యాగ్ పట్టుకుని ముందుకు పరుగుతీసింది. ఈ హఠాత్పరిణామానికి గిరీష్ విస్తుబోయి ఆమె వెనకాలే పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న  అవని ఉన్నట్టుండి ఆగింది, వెనకే వస్తున్న గిరీష్ వైపు గబగబా నడిచి, అతని చేతులు పట్టుకుని, 
" థాంక్యూ గిరీ, నా కళ్ళు తెరిపించావు. నీకు జన్మంతా రుణపడి ఉంటాను. బై..." 
అంటూ వెళ్లబోయి, ఏదో గుర్తొచ్చి  వెనక్కి తిరిగి, 
"....నాలుగు రోజుల్లో నా పెళ్లి, నీకు వీలైతే తప్పకుండా రా, బై.. "
 అనేసి, అవాక్కై నిల్చుండిపోయిన గిరీష్ ను  అలా  వదిలేసి ,  అటుగా వెళ్తున్న ఆటోలో ఎక్కి కూర్చుని, లోపల మాత్రం "బై ఫరెవర్ " అనుకుంది. తల్లిదండ్రుల ప్రేమ, పెంపకం, ఇంటి పరువు ప్రతిష్టల ముందు రెండు సంవత్సరాల తన ప్రేమ చాలా అల్పంగా, పేలవంగా తోస్తోందిప్పుడు ఆ అమ్మాయికి !చుట్టూ అంతా  చీకట్లు ముసురుకుంటున్నాయి...అవని  మనసులో అప్పుడే వెలుగు పొడసూపడం  మొదలైంది. ఇందాక బయలుదేరిన హైదరాబాద్ వెళ్లే బస్సు ఆటోను దాటుకుని వెళ్లడం గమనించిన అవని చిన్నగా నవ్వుకుంది.కాసేపటి క్రితం అదే బస్సు ఎక్కడానికి  తను పడ్డ ఆరాటం గుర్తొచ్చిందామెకి. కొద్ది నిమిషాల్లోనే తన మానసిక స్థితిలో వచ్చిన మార్పు తలుచుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని 'అమ్మయ్య' అనుకుని 'రిలాక్స్డ్' గా కళ్ళు మూసుకుంది .
                      *************
      మరో పావుగంటలో ఇంటిముందుంది అవని. మేనత్త, పిల్లలు వచ్చినట్టున్నారు, గేట్ చప్పుడు విని, బిలబిలమంటూ బయటికి వచ్చి, అవనిని చుట్టేసి, లోపలికి తీసుకెళ్లారు. ఆ ప్రేమకూ, ఆప్యాయతకూ మనసంతా ఆర్ద్రమయిపోయింది అవనికి.
   ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నాన్న,  బాబాయ్, నానమ్మ భోంచేస్తున్నారు. అమ్మ, పిన్ని వడ్డిస్తున్నారు. అంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా అమ్మానాన్న. ఈ ఆనందాన్నంతా ఒక్కరోజులో సర్వ నాశనం చేయ బోయింది. భగవంతుడా! ఎంత ఉపద్రవం  నుండి నన్ను కాపాడావు తండ్రీ ! గిరీష్ తో వెళ్ళిపోయుంటే మహా అయితే కొద్దిరోజుల పాటు బాగుండేదేమో! ఆ తర్వాత,..!? బంధువుల గుసగుసలు, తన గురించి రకరకాల వ్యాఖ్యానాలు, తల్లిదండ్రుల కుంగుబాటు, చెల్లి దీనావస్థ...!! కుటుంబం పరువు ప్రతిష్టలు మంట గలపడంతో పాటు శాశ్వతంగా తన వాళ్ళందరికీ దూరమైపోయి...దుర్భరంగా..! ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడి,తలచుకుంటేనే వణుకు పుట్టింది అవనికి.
  " అక్కా, ఏమిటింత లేటు? ఎక్కడికెళ్ళావ్? జాకెట్లకోసమా?   రెడీ అయ్యాయా? తెచ్చేసుకున్నావా? ఏవీ, చూడనియ్.." 
 అక్కను చూడగానే అనిత ప్రశ్నల వర్షం కురిపిస్తూ అవని వెంటే గదిలోకి నడిచింది గబగబా.
" అవన్నీ తర్వాత. ముందు పద, ఆకలి దంచేస్తోంది.."
 అంటూ బ్యాగ్ బీరువాలోకి తోసేసి,చెల్లి చేయి పట్టుకుని వంటింట్లోకి నడిచింది అవని. వివాహం నిశ్చయం అయిన క్షణం నుండీ తిండీ, నిద్ర రెండూ  కరువై స్థిమితం అన్నది లేని అవని ఆ రాత్రి  కడుపారా తిని, కంటినిండా నిద్రపోయింది. అవును మరి ! తను నేటితరం అతి  సాధారణమైన ఆడపిల్ల!!
                           
                               🌹శుభం 🌹
   


                    

అవని... కథ లాంటి ఓ నిజం !

                                  ~ యం.ధరిత్రీ దేవి ~
                                              
   ఆటో బస్టాండ్ వైపు సాగిపోతోంది. అందులో కూర్చున్న అవనికి గుండె దడ దడ లాడుతోంది. ఓవైపు చల్లగాలి వీస్తున్నా చెమటలు కారిపోతున్నాయి. మరో ఐదు నిమిషాల్లో ఆటో బస్టాండ్ వద్ద ఆగింది. దిగి, ఆటో వాడి చేతిలో యాభై  నోటు పెట్టి చిల్లర కోసం కూడా చూడకుండా పరుగులాంటి నడకతో బస్టాండ్ లోపలికొచ్చి  పడింది. ఓ నిమిషం పాటు ఊపిరి పీల్చుకుని, చుట్టూ కలయ  చూసింది గిరీష్ కోసం. ఎక్కడా కనిపించలేదు.
    " అదేంటీ, ఐదింటికే  వస్తానన్నాడే , ఐదున్నర కూడా దాటింది, ఇంకా రాలేదేంటీ !"  అనుకుంటూ, వచ్చి  ఎక్కడైనా కూర్చుని ఉన్నాడేమో అని  ఓ సారి ఈ చివరి నుండి ఆ చివర దాకా చుట్టేసింది. నిట్టూరుస్తూ వెళ్లి ఓ మూలనున్న బెంచీమీద కూర్చుండిపోయింది.
   అవని, గిరీష్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఈ మధ్యే  డిగ్రీ పూర్తయింది. గిరీష్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అవని  తండ్రి రాజారావు ప్రతిపాదన మేరకు పి. జీ చేయాలనుకుంటోంది. ఆయన అలా అన్నాడే  గానీ మరోవైపు సంబంధాలు చూడటం కూడా మొదలెట్టాడు. కారణం, అవని  తర్వాత మరో కూతురు కూడా ఉండడమే. రెండు మూడు సంబంధాలు వాకబు చేయడం, వాటిగురించి ఇంట్లో చర్చలు జరగడం చూసిన అవనికి ఆందోళన మొదలైంది. ధైర్యం చేసి గిరీష్ గురించి చెప్పాలనుకుంది గానీ, తండ్రికి ఈ ప్రేమలూ,  దోమలు అసలు నచ్చవు. పైగా గిరీష్ కులం కూడా  వేరేనాయె!అంతకన్నా ముఖ్యమైనది ప్రస్తుతం జాబ్ అన్నది లేకపోవడం.  ఇలాంటి విషయాల్లో ఆయన చాలా కఠినంగా ఉంటాడు. వేరే దారి కనిపించక అవని గిరీష్ తో చెప్పేసింది విషయం. అలా కొద్దిరోజులు గడిచిపోయాయి. 
 ఉన్నట్టుండి ఓరోజు అవనిని చూడ్డానికి పెళ్లివారొచ్చారు.అబ్బాయి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కాస్తో కూస్తో స్థితిపరులే. బాదరబందీలేవీ లేవు . తల్లీ దండ్రికీ, అబ్బాయికీ అవని  నచ్చేసింది. వంకలు పెట్టడానికీ, అభ్యంతరం చెప్పడానికీ ఏమీ లేవనిపించింది అవని తల్లిదండ్రులకి. అంతా చాలా సంతృప్తిగా ఫీలయ్యారు. అయినా అవనిని  కూడా ఓ మాట అడిగాడు రాజారావు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఏం చెప్పాలో తోచక, గాభరాగా ఏదో తలాడించేసింది అప్పటికి.
    అంతే! ఇంక ఆలస్యం దేనికి అనుకుంటూ, అంతేకాక వెంటనే పెళ్లి పెట్టుకోకపోతే మంచిరోజులు కూడా దగ్గర్లో లేని కారణంగా ఇరు పక్షాలవారూ మర్నాడే కూర్చుని మాట్లాడుకుని అబ్బాయికి సెలవు ఎక్కువగా లేదని పెళ్లికి మరో పది రోజుల్లో ముహూర్తం నిశ్చయించేశారు. అవని గుండెల్లో రాయి పడింది. ఇంత త్వరగా అంత మంచి సంబంధం, పెద్దగా కట్నకానుకలు కూడా ఆశించకుండా కుదిరినందుకు తల్లిదండ్రీ మహదానందంగా ఉన్నారు. మరోవైపు చెల్లెలు అనిత హడావుడీ ! ఇప్పుడు తన ప్రేమ విషయం చెప్తే ఇంట్లో పరిస్థితి అంతా తారుమారయిపోతుంది. పైగా గిరీష్ కంటే అన్ని విధాల ఎన్నోరెట్లు గొప్పదైన సంబంధమాయె ! కానీ రెండు సంవత్సరాల ప్రేమను కాదనడానికి ఆమె అంతరంగం ఒప్పుకోవడం లేదు. గిరితో పరిచయం, స్నేహం, ప్రేమ మరీ మరీ గుర్తొచ్చి మనసు సమాధాన పడలేక పోతోంది. బాగా ఆలోచించి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి గిరీష్ కు  విషయం తెలియజేసింది. జవాబుగా ఓ గంటాగి  ఫోన్ చేస్తానన్నాడు గిరీష్. అలాగే మరో గంట తర్వాత మాట్లాడాడు.
" మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అవనీ, నేను కంప్యూటర్ కోర్సులు కూడా చేశాను కదా, ఏదో ఒక జాబ్ దొరక్కపోదు. ఎల్లుండి సాయంత్రం వెళ్లి ముందు రిజిస్టర్ మ్యారేజీకి ఏర్పాట్లు చేసుకుందాం. నా ఫ్రెండ్స్  ఇద్దరు అక్కడున్నారు. వాళ్ళ హెల్ప్ తీసుకుందాం.ఓకేనా?ఇంకా ఆర్యసమాజ్ వాళ్లనూ కలుద్దాం. నీకు ఓకే అయితే ఎల్లుండి సాయంత్రం అయిదింటికి బస్టాండుకు  వచ్చేయ్... "
 ఠక్కున  ఫోన్ కట్ చేసింది. ఓ క్షణం గుండె వేగం పెరిగింది అవనికి. తర్వాత సర్దుకుని, కాస్త  సంతోషంగా అనిపించినా, ఏదో సంకోచం తొలిచేయసాగిందామెని. కానీ, ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లాడ్డం ఎందుకో సముచితంగా అనిపించటం లేదు. కాస్త  టైం అడుగుదామంటే వారం రోజుల్లోపే పెళ్లి ! ఆలస్యం చేస్తే ప్రేమించినవాడికి దూరమైపోయి జీవితమంతా...ఇక ఆలోచించలేక పోయింది. వెంటనే ఫోన్ చేసి సరేనని చెప్పేసింది.    
    చెప్పడం అయితే సులభంగా చెప్పేసింది గానీ, ఆ క్షణం నుండే మొదలైందాపిల్లకి అసలైన నరకం ! పెళ్లికి ఎక్కువ సమయం లేదని కుదిరిన రోజునుండీ ఏవేవో షాపింగులు మొదలెట్టారు ఇంట్లో వాళ్ళు. చీరలు కొనాలంటూ, నగలు కొనాలంటూ బయలుదేరదీసే  వాళ్ళు ముగ్గురూ. దానికితోడు దగ్గరి  చుట్టాలంతా దిగిపోతున్నారు మెల్లి మెల్లిగా. మనసంతా వ్యాకులత ఓవైపు, తప్పేమైనా చేస్తున్నానా అన్న ఆందోళన మరోవైపు-- అవనిని అతలాకుతలం చేయసాగాయి. అలా ఒకరోజు గడిచి, రెండో రోజు మధ్యాహ్నం కూడా దాటిపోయింది. షాపింగ్ నుంచి ఇంటికి వచ్చి, ఏదో తిన్నాననిపించి అలా మంచం మీద వాలిపోయింది. అంతలోనే గిరీష్ ఫోన్! 
" అవనీ, ఏంటి, రెడీయేనా... వస్తున్నావా?... "
 దిగ్గున లేచింది అవని. ఏదో తెలీని  ధైర్యం ఆ వహించినట్లయి,గబగబా  ఓ చిన్న బ్యాగులో రెండు మూడు జతలుబట్టలు,  ఖర్చులకంటూ  నాన్న ఇచ్చిన పదివేలక్యాష్ కుక్కేసుకుని, లేచి తయారైపోయింది. సమయం నాలుగున్నర అయింది. ఓ సారి రూమ్ నుండి బయటకు వచ్చి, తొంగి చూసింది. అమ్మ,  పిన్ని, నాయనమ్మ విశ్రాంతిగా పడుకుని ఉన్నారు. చెల్లి అనిత కాలేజీకి వెళ్ళినట్టుంది. గుండెదడను కాస్త అదుపులో పెట్టుకొని, ఎలాగో గొంతు పెగుల్చుకుని, 
" అమ్మా, బయటికెళ్తున్నా, పనుంది..." 
 అంటూ అమ్మనుద్దేశించి అనడం, 
" సరేలే, త్వరగా వచ్చేయ్.."
 అని తల్లి బదులివ్వడం జరిగిపోయింది.  'బ్రతుకు జీవుడా'అనుకుంటూ బయట పడింది రెండు నిమిషాల్లో.
    బెంచి మీద అటూ  ఇటూ  విసుగ్గా కదిలింది అవని. తనేమో ఇంత టెన్షన్ లో కొట్టుమిట్టాడుతుంటే ఈ మనిషి ఇంకా రాడేమిటి? అప్పుడే తనొచ్చి  అరగంట దాటిపోయింది. హైదరాబాద్ వెళ్లే బస్సులు   రెండు వెళ్ళిపోయాయి తను చూస్తుండగానే. మరోటి కదలడానికి సిద్ధంగా ఉంది.
" ఆలస్యం చేసే వాడు కాదే, ఎందుకిలా?. కొంపదీసి వస్తోంటే  ఏ ఆక్సిడెంట్ అయినా...." 
 అవనిలో అనవసర ఆందోళనలు.. అనుమానాలు !.. అంతలోనే....
" ఛ ఛ !.. అలా ఏమయి  ఉండదు.." 
 అనుకుని  సర్ది చెప్పుకుంది. తన ఆలోచనల్లో తానుండగా మూడో బస్సు మెల్లిగా స్టార్ట్ అయింది. కంగారుగా లేచి నిలుచుంది అవని. 
" ఇలా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు నన్ను చూశారంటే ఇంకేమైనా ఉందా!" 
 క్షణక్షణానికి ఆ పిల్లలో టెన్షన్ అధికమై పోతోంది. బస్సు కదిలింది. ఉస్సురని నిట్టూర్చి, మళ్లీ బెంచీ  వైపు నడవబోయింది. అంతలో దూరంగా వస్తూ కనిపించాడు గిరీష్!.
' అమ్మయ్య'
 అనుకుంటూ గబగబా వెళ్లి, అతన్ని సమీపించి, 
" ఏమిటింత  ఆలస్యం.... పద పద.. బస్సు వెళ్ళిపోతోంది.... " 
 అంటూ అతని చెయ్యి పట్టుకుని ముందుకు కదిలింది. కానీ గిరీష్ ఆమెను వారిస్తూ, 
" అవనీ, కాస్తాగు, నీతో మాట్లాడాలి..."
 అంటూ వెనక్కి లాగాడు.
" బస్సులో కూర్చుని మాట్లాడుకుందాం, ముందు పద.... "
" లేదు అవనీ,...మనం వెళ్ళటం లేదు.."
ఠక్కున అతని  చెయ్యి వదిలేసింది అవని విస్తుబోతూ. 
" అవును,రా,  ఇలా కూర్చో.."
 అంటూ బెంచీ  వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.

                                --- ముగింపు తర్వాతి పోస్టులో---










 

Thursday, October 14, 2021

విధాత సృజన... !

                                              🌷🌷🌷🌷🌷🌷🌷
                                                    భువి భావనలు🐦
                                               🌷🌷🌷🌷🌷🌷🌷


 ఆకుపచ్చని లతలతో అల్లుకున్న ముచ్చటైన పందిరి
 పరచుకున్న పత్రదళాలపై వెదజల్లబడ్డ వజ్రాలకు మల్లె
 విచ్చుకొన్న ఆ జాజిమల్లెల సోయగాల సందడి !
 చిరుగాలికి అల్లనల్లనఊగే ఆ కొమ్మల ఊయల 
 అమ్మ ఒడిలా తోచెనో ఏమో 
 ఒదిగిపోయి కురిపిస్తున్నాయి 
 చిరునవ్వుల పసిడికాంతుల ! 
 అవి విరజిమ్మే సౌరభాల గుభాళింపులతో 
 నిండిన మా లోగిలి తెచ్చిపెట్టింది మా ముంగిట 
 అంతులేని ఆహ్లాదపు  సిరిని !
 ఆస్వాదిస్తూన్న  నామదిని చుట్టుముట్టి 
 ఆ తెల్లని మల్లెలు తలపిస్తున్నాయి
 నింగిని నల్ల నల్లని మేఘాలకు 
 మెరుపులద్దుతూ మిణుకు మిణుకుమంటూ 
 చిక్కగా పరచుకున్న చక్కనైన చుక్కల్ని !
 ఈ మల్లెలకెవరు నేర్పిరో కదా 
 అలా విచ్చుకొమ్మని ! మరి, 
 ఆ చుక్కల కెవరు చెప్పిరో  ఏమో, 
 ఇలా ఇలనంతా రంజింపజేయమని !
 ఆహా ! పరుల కోసం ప్రతీ  నిమిషం
 పరితపించే ఈ ప్రకృతి రీతి  !
 సృష్టించి మనిషికొసగిన 
 ఆ విధాత ఎంతటి సృజనశీలి !

💐💐💐💐🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏
 



Thursday, September 30, 2021

అందరికీ పండుగే !


                                           🌷🌷🌷🌷🌷🌷🌷
                                               భువి  భావనలు
                                            🌷🌷🌷🌷🌷🌷🌷


 బోసినవ్వుల బాపూజీ
 జాతిపిత మన  గాంధీజీ
 ఆ నవ్వులో ఏ మహత్తు దాగి ఉన్నదో !
 ఆ మాటల్లో ఏ మర్మమున్నదో !
 ఆ పిలుపే  ఓ ప్రభంజనంలా
 యావత్తు జనావళి కదిలి 
 నడిచిందాయన అడుగుజాడల్లో!
 బానిస బ్రతుకు వద్దన్నాడు
 భయం వీడి పోరాడమన్నాడు
 అహింసా మార్గం ఎంచుకున్నాడు
 దేశమాత దాస్యశృంఖలాల్ని తెంచాడు 
 మానవతా మూర్తిగా నిలిచాడు
 నిస్వార్థ  జీవి నిరంతర శ్రామికుడు
 కొల్లాయి గట్టిన ఈ  నిరాడంబరుడు
 తెల్లవారిని తరిమికొట్టిన ఘనుడు!
 భరతావని పుట్టి విశ్వవిఖ్యాతి గాంచినాడు 
 చరిత్ర పుటలకెక్కి చరితార్థుడైనాడు !
 కారణజన్ముడు మరెందునా కానరాడు!
 నా జీవితమే నా సందేశమన్నాడు !
 ఏ బిరుదు సరిపోదీ 'మహామనీషి 'కి 
' జాతిపిత' తనొక్కరే ఈ దేశానికి !
 ఆయన పుట్టిన దినం మనందరికీ పండుగ దినం
మరణం తర్వాతా జీవించడం
 మహామహులకే  సాధ్యం !!

💐💐💐💐💐💐🌹🌹🌹💐💐💐💐💐💐

Thursday, September 16, 2021

ఆక్రోశిస్తున్న అంతరంగం

 ముక్కుపచ్చలారని పసిపాపల్లోనూ             
 ఆడతనాన్ని వెతికే నీచనికృష్టులు !
 తల్లి వయసు ఆడదాని లోనూ
 అమ్మను చూడలేని కామాంధులు!
 అడుగడుగునా పుట్టుకొచ్చి 
 అరాచకంగా మారిపోయి మచ్చపడ్డ 
 సమాజం ప్రస్తుతం మనది ! 
 వయోబేధాలు, వావి వరుసలు              
 ఎరుగని మానవమృగాలు ! 
 విలువలు  మరిచి వీధి వీధినీ 
 విచ్చలవిడిగా విహరిస్తూ 
 పడతులకూ, పసిపాపలకేగాదు 
 స్త్రీజాతి  మొత్తానికే రక్షణ లేదని
 నిరూపిస్తున్న నిత్యం జరుగుతున్న అకృత్యాలు!
 మృగాలతో పోలిస్తే మృగాలు సైతం 
 సిగ్గుతో తల దించుకునే దారుణ ఉదంతాలు ! 
 భారతదేశం పవిత్రతకు మారుపేరన్న 
 పరదేశీయుల ప్రగాఢ నమ్మకం 
 నానాటికీ దిగజార్చుతూ 
 పెచ్చరిల్లుతున్న పైశాచికకాండలు ! 
 ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తూ నిలదీస్తున్నాయి 
 చట్టాలకు వెరవని, శిక్షలకు లొంగని 
 కరడు గట్టిన క్రూర మానవుల 
ఈ మారణకాండలు భరించాల్సిందేనా?
భరించి సహించాల్సిందేనా? 
ఎప్పటికైనా  మారునా  ఈ మనుషుల నైజాలు !
 అసలొస్తాయా మారే ఆ రోజులు !
 నేడు  ----
 ఆక్రోశిస్తున్న ప్రతీ అంతరంగం అడుగుతున్న 
 జవాబు దొరకని ప్రశ్న ఇది !!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
                
                 🌹భువి భావనలు 🌹

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷





Saturday, September 4, 2021

గురువులకు వందనం...చిన్నారులకో బాలగేయం

                                         🌺భువి భావనలు 🌺🐦
                                             ************

[ గురు పూజోత్సవం సందర్భంగా చిన్నారులకోబాలగేయం 🌷]

చదువుల బడిలో 'అ ఆ' లు 
 దేవుని గుడిలో బాజాలు
 జీవన గతిలో జేజేలు! 
 అ ఆ లు, బాజాలు, జేజేలు
 భవితకు అవియే బంగరు  బాటలు
 వెయ్ రా అడుగులు ముందుకు 
 వేరే వాదం ఎందుకు పదరా ముందుకు  " చదువుల"

 తూరుపు  దిక్కున తెల్లారేను 
 పడమటి దిక్కున పొద్దారేను 
 అటు ఇటు తిరిగి చూసేలోగా
 కాలం హరించి పోయేను 
 బుడగ వంటిదీ బ్రతుకు
 చితికేలోగా మెరుపై  మెరిసీ 
 కథగా నిలిచీ తరించి  పోరా
 వెయ్ రా అడుగులు ముందుకు
 వేరే వాదం ఎందుకు పదరా ముందుకు  " చదువుల"

 ఆడే వయసున అక్షరమాలతో
 పునాది వేసే పాఠశాలలు 
 మనిషిగ నిన్ను తీరిచిదిద్ది 
 నిలబెట్టే కళాశాలలు 
 తీర్చలేనిదా ఋణము 
 కరములు రెండూ  జోడించి
 నమస్కరించిన చాలునూ 
 వెయ్ రా అడుగులు ముందుకు
 వేరే వాదం ఎందుకు పదరా ముందుకు   " చదువుల"

 బాలలు  మీరు భావితరాలకు
 దూతలుగా వెలుగొందాలీ 
 భాషకు అందని బాధలు ఎరుగని
 మరో జగతియే జనియించాలీ 
 దీక్షా కంకణబద్ధులై
 ధీశాలురు మీరందరూ
 వెలుగూనీడల పోరాటంలో
 అదరక ముందుకు సాగాలీ 
 వెయ్ రా అడుగులు  ముందుకు 
 వేరే వాదం ఎందుకు పదరా ముందుకు " చదువుల"

😇😊😇😊😇😊😇😊😇😊😇😊😇😊😇