Tuesday, June 30, 2020

శతజయంతి వేళ స్మరించుకుందాం కర్మయోగినోమారు.. 🌷


                           🌷🌷🌷🌷🌷🌷,
                          🌷🌷🌷🌷🌷🌷🌷

( పి.వి. నరసింహారావుగారి వంటి మహోన్నత వ్యక్తి, మహామనీషి గురించి వ్రాసేటంతటి విషయ పరిజ్ఞానం, స్థాయి, అర్హత నాకు ఎంత మాత్రమూ లేకపోయినా వారి శతజయంతి గురించిన వార్తలు చదివాక వారి గురించి నేను తెలుసుకున్న కొన్ని మహత్తరమైన విషయాలు కొందరితో నైనా పంచుకోవాలన్న చిన్ని కోరికే ఈ ప్రయత్నానికి కారణం.   )

  వందల ఎకరాల భూస్వామి అయినా దొరలా జీవించే ఆసక్తి ఏమాత్రం కనబరచక ఓ సామాన్య మధ్యతరగతి జీవనానికే ఆహ్వానం పలికిన అసాధారణ మనీషి పాములపర్తి వెంకట నరసింహారావు గారు. 
   28.06.1921 న లక్నేపల్లిలో జన్మించిన ఆయన ఏ నేపథ్యమూ, బలము, బలగమూ ఇంకా ఏ వారసత్వ ముద్రలు లేకపోయినా మరే ఇతర అండదండలూ మృగ్యమైనా ఏకంగా భారతదేశానికే ప్రధానమంత్రి కావడం అన్నది అద్భుతమే !
   ఒక వ్యక్తి పుట్టుకతో కాదు చేతల వల్ల గొప్పవాడవుతాడు అన్నది పి. వీ  గారి ఈ విషయంలో నిరూపితమైంది. కృషినే నమ్ముకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశీలి, బహుభాషా కోవిదుడు అయిన ఈ కర్మ యోగి శత జయంతి సందర్భంగా కొన్ని మరువలేని జీవిత విశేషాలు. 
  •  ఆయన కోరిక ఇంగ్లాండ్ వెళ్లి ఖగోళ శాస్త్రాన్ని చదవాలని. కానీ అపారమైన ఆస్తిపాస్తులు చూసుకోవడానికై స్వగ్రామం తిరిగి రావాలన్న కుటుంబం ఒత్తిడిపై తన కోరిక విరమించుకుని అయిష్టంగానే నాగపూర్ లో న్యాయశాస్త్రం చదివారు. 
  •  రక్షణ, విదేశాంగ, మానవ వనరులు, హోం శాఖ... ఇలా అనేక కీలక శాఖలు చేపట్టిన పీ. వీ గారు తను ప్రధానిగా పీఠం అధిష్టించాక ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్ గారిని ఎంచుకున్నారు. తన లాంటి సంప్రదాయ రాజకీయవాదులతో దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం కాదనుకున్న ఆయన ఆర్థిక వేత్తే ఆ పదవికి న్యాయం చేయగలడని నిర్ధారించుకోవడమే అందుకు కారణం. 
  • " స్వ లాభం కోసం పాకులాడకుండా, ఫలాపేక్ష లేకుండా విధులు నిర్వహించిన నిజమైన కర్మసన్యాస యోగి పీ. వీ. ఇదేశ సనాతన సంప్రదాయాలు, ఈ దేశ ప్రవృత్తిని అణువణువునా ఇముడ్చుకునికూడా, ఆధునికత దిశగా దేశాన్ని ఉరికించిన ద్రష్ట. గతం, భవిత అనే జోడు గుర్రాలపై నేర్పుగా దూసుకెళ్లిన మహా నాయకుడుపీ. వీ జీ    " అని స్వయానా మన్మోహన్ సింగ్ గారే ప్రస్తుతించడం మన నేత యొక్క ఘనతకు ప్రత్యక్ష నిదర్శనం. 
  •  ఆయన ఆ పదహారు భాషల్లో దిట్ట అని అందరికీ తెలిసిందే. రక్షణ మంత్రిగా చేస్తున్న రోజుల్లో  ( 1985 ) అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆయనకు పీ. వీ గారినుద్దేశించి ఓవ్యాఖ్య చేశారట! " కంప్యూటర్ల దిగుమతులపై మనం సుంకాలను తగ్గించాలి. కానీ నా క్యాబినెట్లోని ముసలి వాళ్లకు కంప్యూటర్ లంటే అర్థం కావడం లేదు" --- ఇదీ దాని సారాంశం! ఇంటికి వెళ్ళాక పీ. వీ గారు ఓ కంప్యూటర్ తెప్పించుకుని, ఓ మాస్టారును నియమించుకుని ఇంకా దానికి సంబంధించిన పుస్తకాలు చెప్పించుకుని ఏడాది తిరిగే సరికల్లా కంప్యూటర్ పై తిరుగులేని పట్టు సంపాదించారట ! దటీజ్ పీ. వీ. జీ !
  •  రాజకీయ పరిణామాల వల్ల ఓ దశలో1990లో కుర్తాళం పీఠాధిపతి అయ్యే అవకాశం వచ్చి స్వీకరించాలన్న ఆలోచనలో ఉన్నారట ఆయన. కానీ అనూహ్యంగా1991 మే 21 న రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం, సోనియా గాంధీ పార్టీ పగ్గాలు స్వీకరించడానికి నిరాకరించడం, మరెవరూ పోటీదారులు లేకపోవడం--- ఈ కారణాల వల్ల ప్రధాన మంత్రి పదవి పీ. వీ గారిని వరించింది. ఇది ఎవరూ ఊహించని ఆయన ఆశించని అద్భుత అవకాశమే! 
  •  ఆ విధంగా కాషాయం ధరించి మహర్షి కావాలనుకున్న ఆయన అనుకోని ఈ పరిస్థితుల్లో రాజర్షి అయిపోయారు. దేశానికి సరికొత్త ఊపిరిలూదారు. భారత జాతిని సగౌరవంగా నిలబెట్టే మన తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన మనవాడు మన తెలుగు వాడు పీ. వీ. నరసింహారావు గారు.   ఇది మనమంతా గర్వించదగ్గ విషయం. 
  •  శతజయంతి సందర్భంగా ఏడాదంతా ఉత్సవాలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఎంతైనా హర్షణీయం. 
  •  ఆ మహనీయునికి మనసారా అంజలి ఘటిద్దాం !
  • 🌹🌷🌺💐🌺🌷🌹🌷🌺💐🌺🌷🌹🌷🌺

No comments:

Post a Comment