Thursday, June 11, 2020

ఎవరు గొప్ప?

' చిన్నారి ' కథ   [ పెద్దలక్కూడా  ]
************  **************
    ఒకసారి ఓ గేదెకూ. ఓ ఎద్దుకూ పోట్లాట వచ్చింది. అవి రెండూ తమలో తాము తీవ్రంగా వాదించుకుని, చివరకు లాభం లేదనుకొని వాటి యజమాని వద్దకు తీర్పు కోసమై వెళ్ళాయి. యజమానీ వాటి వాదనలు ఏమిటో వివరించామన్నాడు. ముందుగా ఎద్దు మొదలెట్టింది. 
   " అయ్యా! నేను పగలంతా కష్టపడి పొలం దున్నుతున్నాను. పొలములోని పంటను ఇంటికి చేరుస్తున్నాను. ఇంటి నుంచి అంగళ్ళ దాక తీసుకెళ్ళి ధాన్యం అమ్మటానికి సహాయం చేస్తున్నాను. ఇంకా ఇతరుల పొలాలు దున్ని మీకు డబ్బు ఆర్జించి పెడుతున్నాను. మీరు పెట్టే కాస్త గడ్డి, చొప్పదిని ఇంత సేవ చేస్తున్నానా? కానీ ఈ గేదె ఒప్పుకోవడం లేదు. నాకంటే అదే మీకు అధికంగా సేవ చేస్తోందట!" నిష్టూరంగా ఉంది ఎద్దు. 
   యజమాని తల పంకించాడు. వెంటనే గేదె అందుకుంది. 
    " అయ్యా! నేను మాత్రం తక్కువ కష్టపడుతున్నానంటారా? కేవలం మీరు పెట్టే పిడికెడు గడ్డి, గాదం తిని శేర్లకొద్దీ పాలిస్తున్నాను. అవి అమ్మి మీరు ఎంతో సొమ్ము చేసుకుంటున్నారు. మీ పిల్లలకు నా పాలు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. పైపెచ్చు, పశు సంపదను వృద్ధి చేస్తూ ఆ విధంగా కూడా మీకు ఎంతో లాభం చేకూరుస్తూ ఉంటినాయే ! ఈ ఎద్దు నా కంటే గొప్పదంటారా?  మీరే చెప్పండి" అంటూ రెచ్చిపోతూ ఫిర్యాదు చేసింది. 
   యజమానీ సాలోచనగా రెండింటి వంక చూశాడు. వీటికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని, తీర్పు వాయిదా వేసి వాటిని అప్పటికి వెళ్ళిపొమ్మన్నాడు. 
  ఆ రాత్రి గేదెకు గాడిలో పచ్చగడ్డి దొరకలేదు. తౌడు లేదు, కుడితి నీళ్లు పెట్టలేదు, మడ్డికూడు మాట అసలే లేదు. మరి ఏ విధమైన ఆహారం దానికి అందించబడలేదు. ఆ రాత్రే కాదు, వరుసగా మూడు రోజులు ఇదే తంతు కొనసాగింది. అవతల ఎద్దుకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. బయటకెళ్ళి ఏదైనా పొలాల్లో గడ్డి అన్నా తిందామంటే పరాయివాళ్ళు రానిస్తారా? రాళ్ల తోటి, కర్రలతోటీ కొట్టిఅవతలికి తోలేశారు. 
   మూడు రోజులు పూర్తయ్యే సరికి, ఎద్దు, గేదె రెండూ డీలా పడిపోయాయి. మూడుశేర్లకు పైగా పాలిచ్చే గేదె ఒక సేరు ఇవ్వడం గగనమై పోయింది. ఇక ఎద్దు అయితే ఇంట్లో నుండి బయటకు నడవడమే కష్టమై నీరస పడిపోయింది. ఇదంతా వాడి పోట్లాట వల్ల, పొగరుబోతు మాటలు వల్ల దాపురించిన అనర్థం అని తెలిసి రాగా కళ్ళనీళ్ళ పర్యంతమై, వెళ్లి యజమాని ఎదుట నిలిచాయి. 
    యజమానీ చిరునవ్వు నవ్వి,  " ఇప్పుడు తెలిసిందా, ఎవరు గొప్పో. నేను పెట్టే తిండిని మీరిద్దరూ ఎంత తేలిగ్గా అంచనా వేశారు! మీ తప్పు మీరు తెలుసుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడూ ఇలా మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకొని, ఎదుటి వారిని కించ పరచకండే,  " అంటూ లోనికి వెళ్ళిపోయాడు. 
   ఎద్దు, గేదె-- రెండూ తమకు తగిన శాస్తి జరిగింది అనుకుని, వాటి వాటి స్థావరాలకు వెళ్ళిపోయాయి. మరెప్పుడూ అవి గొప్పలు చెప్పుకునే సాహసం తలపెట్టలేదు. 
🙂🙂😊🙂😊🙂😇☺️🙂☺️😊☺️🙂😇
                 యం. ధరిత్రీ దేవి
🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹

1 comment:

  1. LRSR:
    నిజమే! దైవ సృష్ఠి గొప్పది కాని ప్రత్యేకంగా ఏది గొప్పది కాదు. GOD is Great.

    ReplyDelete