Monday, June 22, 2020

🌷🌷నాజర్ నటనకు జోహార్ 🌷🌷

మొదటిసారిగా నాజర్ గారిని ఏ చిత్రం లో చూశానో నేను గుర్తు లేదు గానీ కొన్ని చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు చూశాక ఆయా పాత్రల పోషణలో కనబరచిన నటనా చాతుర్యం వల్ల ఆ పాత్రకే వన్నె తెచ్చారనిపించింది.  క్రమ క్రమంగా క్యారెక్టర్ యాక్టర్ గా నాజర్ గారు రకరకాల పాత్రల్లో ఒదిగిపోయిన తీరు ఎంతైనా హర్షణీయం!
   బహుభాషా నటుడైన నాజర్ కు నటనపై ఏ ఆసక్తీ ఉండేది కాదనీ కేవలం తండ్రి ప్రోద్బలంతోనే నటుడిగా మారాననీ ఓ ఇంటర్వ్యూలో స్వయానా చెప్పగా చూశాను. అయినా తర్వాత్తర్వాత నటన మీద అనురక్తి పెంచుకుని ఇంతటి పరిపక్వత చూపించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం! ఆయన చాలా సిగ్గరి అనీ, ఇంకా మొహమాటస్థుడనీ కూడా చెప్పు కున్నారా ఇంటర్వ్యూలో. అవకాశాల కోసం ఎవరినీ అడగకపోయినా కేవలం ప్రతిభాపాటవాలతో ఇంకా అద్భుతమైన నటనా కౌశలంతోనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి అన్ని భాషల్లోనూ. అన్ని ప్రాంతాల వాళ్లూ ఆయన్ని తమ వాడిలా భావిస్తారని విన్నాను. 
      తండ్రి కోరిక మేరకు సినిమాల్లోకి వచ్చినా క్రమేపీ నటనపై ఓ విధమైన బలమైన కోరిక, కసి ( passion, fire ) పెంచుకున్నాననీ, దానిపై పూర్తిగా నిమగ్నం అయ్యానని చెప్పుకున్నారు నాజర్. 
    ఇక పోషించిన పాత్రల విషయానికి వస్తే--- కరుణ రసాత్మకమైనవి, గాంభీర్యం ప్రదర్శించేవీ, బాధ్యత గల తండ్రిగా బరువైన సన్నివేశాల్ని పండించేవీ, వీటన్నింటితో పాటు విలనీ చూపించడంలో కూడా ఏమీ తీసిపోనని నిరూపించారు పలు చిత్రాల్లో. 
  • ' చంటి ' చిత్రంలో పెద్దన్నగా చెల్లెలిపై అవ్యాజ్యమైన అనురాగం ఓ వంక కురిపిస్తూ మరోవంక ఆమె ప్రేమించిన వాడి పై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అతన్ని ఆమెకు దూరం చేసే క్రమంలో అతడు చూపించిన హావభావాలు అత్యద్భుతం!
  • ' కొంచెం ఇష్టం కొంచెం కష్టం'లో కూతురి భవిష్యత్తు గురించి ఓ తండ్రి పడే తపన కళ్ళకు కట్టినట్టు చూపించారు. 
  • ' జీన్స్'లో అన్నదమ్ములుగా వైవిధ్యమైన నటన చిత్రానికే హైలెట్. 
  • ' దూకుడు'లో గాంభీర్యాన్నీ, ' ఆగడు'లో హాస్యం మేళవించిన పోలీసు అధికారి పాత్రనీ అవలీలగా పోషించడం గమనార్హం. 
  •  అతని ప్రతిభకు అద్దంపట్టే పాత్ర అంతర్జాతీయ ఖ్యాతినార్జించి తెలుగు చిత్రసీమకే తలమానికంగా నిలిచిన రాజమౌళి గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న' బాహుబలి' రెండు చిత్రాలు(beginning & conclusion ) లోని  బిజ్జలదేవ ! అందులోఅంగవికలునిగా ఆయన పోషించిన తీరు అనితర సాధ్యం. ఈ చిత్రం మొత్తం మీద నాజర్ కే ఎక్కువ మార్కులిస్తానని స్వయానా రాజమౌళి గారే చెప్పడం విశేషం!
  • ' ఆడవాళ్ళకు మాత్రమే' అన్న సినిమా చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. అందులో స్త్రీ వ్యామోహి ( womanizer ) పాత్రలో సరి కొత్తగా కనిపించారు. అందులో నాయికలు రేవతి, ఊర్వశి, రోహిణిలతో ఓ పాటలో స్టెప్పులు కూడా వేయడం చూసి ఈ నటుడి లో ఈ కోణం కూడా ఉందా అనిపించక మానదు!
  •  అలాగే డబ్బింగ్ చిత్రాలు గా వచ్చిన' నాయకుడు'( పోలీస్ అధికారి పాత్ర) ' బొంబాయి' ( తండ్రి పాత్ర) ఇత్యాది చిత్రాల్లో నటన చిరస్థాయిగా నిలిచేదే ! ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి. 
  •  నటనే కాక' అవతారం' అనే తమిళ చిత్రం ద్వారా దర్శకత్వం కూడా చేపట్టారు కానీ, అది వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. 
 అలాగే తమిళ రాజకీయాల్లో( నడిగర్ సంఘం ) ప్రవేశించిన ఘనత కూడా ఆయన సొంతం ! ఇలా బహుముఖాలుగా పేరు గాంచిన నాజర్ అన్ని ప్రాంతాల వారికీ ఇష్టుడు కావడంలో ఆశ్చర్యం ఏముంది? 
    దర్శక నిర్మాతలు నాజర్ ప్రతిభా పాటవాల్ని మరింతగా ఉపయోగించుకుంటూ వైవిధ్యమైన పాత్రలు ఆయన కోసం సృష్టిస్తూ ప్రేక్షక లోకాన్ని ఇంకా ఇంకా అలరించాలని కోరుతూ సమర్పిస్తున్నా ఈ విలక్షణ నటుడికి జోహార్లు !!
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

No comments:

Post a Comment