Friday, April 3, 2020

కరోనా కలకలం 

      యావత్ప్రపంచాన్నీ గడగడలాడిస్తూ భీతావహుల్ని చేసేసిన ' కరోనా ' మహమ్మారి విశృంఖలంగా ప్రబలిన సమయాన నా మొదటి బ్లాగు రాయడం ఒకింత బాధను కలిగిస్తున్నా ' పెరుగుట విరుగుట కొరకేలే ' అన్న సానుకూల ధోరణితో మొదలెడుతున్నా. 
      ప్రస్తుతం ఈ కరోనా కలకలం అంతాఇంతా కాదు. ఎనభై నుండి తొంభై సంవత్సరాల వృద్దులు కూడా ఇలాంటి వైనం కనీవినీ ఎరగం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. చెప్పాలంటే ఈ వైరస్ ఉదంతం బహుశా ఇదే ప్రథమమేమో కూడా ! 
      రోజుల వ్యవధిలో అనూహ్యంగా ఇంతగా ప్రబలిపోయిన ఈ మహమ్మారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతవరకుIT కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తారంటే ఓహో అనుకున్నాము. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో చేసేవాళ్లు కూడా ఇంటి నుండి పనులు నిర్వహించే రోజులొస్తాయని ఊహించామా ఎన్నడైనా? 
        పిల్లలకు బడులు బంద్, పరీక్షలు లేవు, సినిమాలు లేవు, షికార్లు లేవు. పండగలు పబ్బాల మాట అసలే లేదు. సరదాగా కబుర్లు చెబుతూ కూర్చుందామా, ససేమిరా వీల్లేదంటున్నారు. బయటికెక్కడికెళ్ళినా బారెడు దూరంలో అదీ ముక్కుకూ మూతికీ మాస్క్ తగిలించుకుని నిలబడాలంటున్నారు. కూరగాయలు, సరుకులు, పండ్లు అన్నీ బంద్ !ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. దీనికి తోడు వదంతులు !అవి తినొద్దు ఇవి తినొద్దు అంటూ. ఇప్పట్లో ఇది అంతం అయిపోయేది కాదు కొన్ని నెలలు లేదా ఇంకా ఎక్కువ పట్టినా పట్టొచ్చు అంటూ. TV ఆన్ చేస్తే చాలు కరోనా కరోనా కరోనా !ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకోవడం అవసరమైనా ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోనని హడలెత్తిపోతున్నారు జనం. ఇక పిల్లలు ఏ అమెరికా లాంటి ఇతర దేశాల్లో ఉన్నవాళ్లయితే వాళ్ళ క్షేమం గురించిన ఆందోళన !వాళ్ళకేమో ఇక్కడి వాళ్ళ గురించి టెన్షన్ !ఎక్కడివారక్కడ నిలిచిపోయి మొత్తం ప్రపంచమే స్తంభించి పోయిందిమరి !
     సరే! దీనివల్ల ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కాసేపు పక్కన పెట్టి, దీని మరో కోణాన్ని వీక్షిద్దాం. ఈ గందరగోళ పరిస్థితిలో మనమంతా గమనించడం లేదు గానీ కాస్త లోతుగా ఆలోచిస్తే' మహమ్మారి' అంటున్నాం గానీ ఈ కరోనా మానవాళికి చేస్తున్న మంచి కూడా ఏదో అంతర్లీనంగా ఉన్నట్లు అనిపిస్తోందే, అన్న సందేహం రాక మానదు. ఎలాగంటే కోపగించక కాస్త చదవండి మరి!
    అదేమిటంటే-- ఎన్నడూ ఊహించని మంచి అలవాట్లు మనకు తెలియకుండానే మన సొంత మవుతున్నాయి! అందులో మొట్టమొదటిది---
 శుభ్రత  : ఇదివరకు బయటికి వెళ్లి వస్తే బరబరా వెళ్లి కాళ్ల మీద కాసిని నీళ్ళు గుమ్మరించుకొని, తినడానికి కూర్చునే వాళ్లంతా ఇప్పుడు కాళ్లతో పాటు ముఖం, చేతులు సబ్బుతో అదీ మోచేతుల దాకా శుభ్రపరుచుకుని గానీ భోజనానికి ఉపక్రమించడం లేదు. అంతేకాదు, వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు ఇల్లు ఇంటి చుట్టూ అంతా శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇది మంచి అలవాటే కదా!
 తరువాత పొదుపు  : నిత్యావసరాలైన సరుకులు, కూరగాయలు, దుబారా చేయడం తగ్గింది. ఈ' లాక్ డౌన్ ' వల్ల బయటికి వెళ్ళే దారులు మూసుకుపోయి బయటికి ఖర్చులన్నీ తగ్గి' సేవింగ్స్' పెరిగింది.
 ఆరోగ్యం  : పనివాళ్ళ మీద ఆధారపడడం మాని సొంతంగా చేసుకోవడం వల్ల కెలొరీలు ఖర్చయి ఆరోగ్యం చేకూరింది.
 కాలుష్యం తగ్గుదల  : ఈ రోజు పేపర్లో చదివిన ఓ తాజా వార్త ప్రకారం, రోడ్లపై కాలుష్యం శాతం బాగా తగ్గిపోయింది అట!
 అందరూ బాగుండాలి  : ముఖ్యంగా ఈ ధోరణి బాగా పెరిగిపోయి నట్లు అనిపిస్తోంది. చుట్టుపక్కలంతా బాగుంటేనే నేనూ బాగుంటాను అన్న స్వార్థ చింతన ఇందులో నిబిడీకృతమై ఉందండోయ్! 
 ఇవీ నాకు తోచిన కొన్ని! ఈ మంచి అలవాట్లు అలాగే కొనసాగితే అంతకంటే కావలసింది ఏముంది! కానీ వైరస్ మాయం అవగానే ఇవీ మాయమవుతాయో  ఏమో చెప్పలేం మరి !!
 ఈరోజుకి ఉంటాను మరి!
యం. ధరిత్రీ దేవి, కర్నూలు 
03.04.2020
శుక్రవారం 
        

No comments:

Post a Comment