Sunday, April 19, 2020

' చిన్నారి ' కథ 
😊😊😇😇🙂🙂

  చిన్నప్పుడు----- స్కూల్లో చదివే రోజుల్లో చిన్న పిల్లల కథల పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉండేది. అందులో ముఖ్యమైనవి ' చందమామ ',  ' బాలమిత్ర
 మాస పత్రికలు. చిన్నప్పటి ఆ అలవాటు బాగా పెరిగి పెద్దయ్యాక కూడా అలాగే కొనసాగింది. ఏమిటీ, ఇంకా చిన్న పిల్లలా ఈ పిల్లల కథలు..... అన్నవాళ్ళున్నారు. కానీ, ఆ ఆసక్తి మాత్రం నా నుండి దూరం కాలేదు. నాలాగే ఈ అలవాటు ఇంకా చాలా మందికి ఉంటుందని నాకు తెలుసు. అందుకే మరి , ఈరోజు ఈ  ' చిన్నారి' కథ. 
    
                             పరివర్తన
                            ********
     ఉదయం హాజరు నమోదు చేస్తున్న వసుంధర తలెత్తి చూసింది. వంశీ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు విసుక్కుంటూ వెళ్లికూర్చోమన్నట్లుగా తల పంకించి, మళ్లీ హాజరు పట్టీలోకి దృష్టి సారించబోయింది. ఇంతలో వంశీ లోనికి వచ్చి, గదంతా ఓసారి పరికించి, విసవిసా వెళ్ళి వెనక బెంచీలో కూర్చున్నాడు. 
   అది గమనించిన వసుంధర, " అదేమిటి వంశీ? ఇక్కడ హరి పక్కన ఖాళీ ఉండగా వెళ్లి అంత వెనకగా కూర్చున్నావే?  " అని ప్రశ్నించింది. వంశీ పలకలేదు. వాడి నిర్లక్ష్య వైఖరికి ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. కారణం, గతంలో కూడా వాడు అదేవిధంగా ఒకటి రెండుసార్లు ప్రవర్తించడమే. గమనించదగ్గ విషయమేమిటంటే, అప్పుడు కూడా వాడు ఇలాగే హరి అనే అబ్బాయి పక్కన ఖాళీ ఉన్నా కూర్చోకుండా వెళ్లడమే!
    ఆ మధ్యాహ్నం భోజనాలయింతర్వాత వంశీని మెల్లిగా పిలిచి, అనునయంగా అడిగింది. " ఏరా, హరి పక్కన కూర్చోవటానికి నీకేమిటి అభ్యంతరం? " చాలాసేపు గుచ్చిగుచ్చి అడిగింతర్వాత వాడు తల మరోవైపు తిప్పుకుంటూ ఆటం బాంబు లాంటి మాటొకటి పేల్చాడు. 
   "...  వాడు... వాడు అంటరానివాడు టీచర్.... " 
    వాడి నోటి నుండి అలాంటి మాట ఊహించని ఆ పంతులమ్మ ఒక్క క్షణం అవాక్కయింది. 
    ఇంత లేత వయసులో వారి మెదడులో ఇలాంటి ఆలోచన పాతుకుపోయిందంటే కేవలం వాడు మాత్రమే దానికి బాధ్యుడు కావడానికి ఆస్కారం లేదని ఆమెకు అనిపించింది. అదే అడిగింది కూడా. 
  " అలా అని నీకెవరు చెప్పారు? " 
  " మా అమ్మానాన్న. వాడు మా ఇంట్లో పశువుల పాక ఊడ్చే రామి గాడి కొడుకు. వాడి తండ్రినీ, వాడినీ మా ఇంట్లో అడుగు పెట్టనివ్వరు.. ఏమంటే వాళ్లను మేం తాకకూడదని చెప్పారు.. ..  "
    వాడు ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు. కానీ వసుంధర మస్తిష్కం మరో కోణంలోకి తిరిగింది. నిజమే! పిల్లల ద్వారా తనోసారి విన్నది, హరి వీళ్ళింట్లో పని చేస్తుంటాడ ట ! వాళ్ళ నాన్నకు వీలుకానప్పుడల్లా గొడ్లను కాయడం, పశువుల పాక శుభ్రం చేయడం, ఇంకా వాళ్లు చెప్పిన బయటి పనులన్నీ చేయడం---- ఇత్యాది పనులన్నీ చేస్తుంటాడట ! అందుకే వాడంటే వంశీకి చిన్నచూపు. హరి క్లాసులో బాగా చదివి మంచి మార్కులు పొందినా, వంశీ మాత్రం అత్తెసరు మార్కులే తెచ్చుకుంటుంటాడు. అయినా వాడిలో హరిపై ఏహ్యభావం పెరుగుతోందే తప్ప తరగడం లేదు. పైగా వాడంటే ఒకింత అసూయ కూడా చోటు చేసుకోవడం మొదలైంది. 
     ఈ పరిస్థితి ఎలా మార్చాలి? వసుంధర ఆలోచనలో పడిపోయింది. సనాతన భావాలతో మలినమైపోయిన వాడి పెద్దల మనస్తత్వాలను మార్చడం తనతరమయ్యే పనికాదు. కనీసం ఉపాధ్యాయినిగా, తన వంతు కర్తవ్యంగా ఆ విద్యార్థి మదిలో అయినా పరివర్తన ఎలా తేగలదు తాను? ఏ అద్భుతమో జరిగితే తప్ప అది సాధ్యపడదు. ఆ రాత్రంతా ఇదే ఆలోచిస్తూ ఉండిపోయింది. 
     ఏమైందో ఏమో గాని, మరుసటి రోజు ఉదయం వంశీ, హరి ఇద్దరూ స్కూలుకు రాలేదు. వసుంధర కూడా అన్యమనస్కంగా ఉండి పట్టించుకోలేదు. 
     ఆ మధ్యాహ్నం వంశీ బెల్లయింతర్వాత బిక్క మొగం వేసుకుని వచ్చాడు. 
    " ఏరా, మళ్లీ లేటా! " యధాలాపంగా అడిగింది వసుంధర. సమాధానంగా వాడి కళ్ళ నిండా నీళ్ళు! ఆమె కలవరపడుతూ వాడిని దగ్గరికి పిలిచి, ప్రశ్నార్థకంగా చూసింది. 
   " టీచర్! హరి హాస్పిటల్లో ఉన్నాడు..... " అంటూ ఆపుకోలేక వెక్కివెక్కి ఏడవడం మొదలెట్టాడు. నిటారుగా అయిపోయింది వసుంధర. తెప్పరిల్లింతర్వాత వాడు నిదానంగా వివరించాడు. 
      "... ... నిన్న సాయంత్రం, నేను మా చెల్లి మా పెరట్లో దాగుడు మూతలాట ఆడుకుంటున్నాం. హరి అక్కడే పశువుల పాక శుభ్రం చేస్తున్నాడు. నేవెళ్ళి పాకకు ఆవల గుబురుగా ఉన్న చెట్ల మధ్య దాక్కున్నాను. ఊహించని విధంగా అందులో చుట్టలు చుట్టుకుని ఉన్న ఓ పాము బుస్సున లేచి, నా కాలిపై కాటు వేసింది..... " అంటూ ఊపిరి పీల్చుకోవడానికన్నట్లు కాసేపు ఆగాడు. అప్పుడు గమనించింది వసుంధర, వాడి ఎడమ కాలి పిక్క మీద కట్టు కట్టబడి ఉన్నది. కొనసాగించాడు వంశీ, 
". ... అక్కడే ఉన్న హరి ఇది గమనించి పరుగున వచ్చి, విల విల లాడి పోతున్న నన్ను కింద పడుకోబెట్టి నా కాలిపై గాటువద్ద తన నోటితో రక్తాన్ని పీల్చి ఉమ్మేయసాగాడు........ "
 అంతే! వసుంధరకు దిగ్భ్రాంతితో నోట మాట రాలేదు. ఆ తర్వాత వంశీ చెప్పేది వినకుండానే ఆమెకు అంతా అవగతమైపోయింది. 
    " టీచర్, నన్ను కాపాడబోయి వాడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఇన్నాళ్లు అంటరాని వాడని క్లాసులో వాడి పక్కన కూర్చోవడానిక్కూడా ఇష్టపడే వాణ్ణి కాదు. కానీ ఈనాడు వాడే నాకు ప్రాణదాత అయ్యాడు... "
     వసుంధర వంశీనే చూస్తోంది. ఏదో ఒక అద్భుతం జరిగితేగానీ వంశీలో మార్పు సాధ్యపడదు అనుకున్నది తను. భగవాన్! ఆ అద్భుతం ఇదా ! 
     " ఇంకెప్పుడూ హరికి దూరంగా కూర్చోను టీచర్, మా అమ్మానాన్న కూడా వాడి దగ్గరుండి వైద్యం చేయిస్తున్నారు.... " 
    ఆర్ద్రత నిండిన వాడి కళ్ళలోపశ్చాత్తాపపు ఛాయలు చూసి, వసుంధర తృప్తిగా నిట్టూర్చింది

*****************************************
యం. ధరిత్రీ దేవి 
మళ్ళీ కలుద్దాం !
*************

No comments:

Post a Comment