Tuesday, April 28, 2020

అవనిలో వనిత  🌷🌹🌷
*****************************************

                      ఈతరం స్త్రీ 
                      *********

    ' ఏమండీ, ' తలుపు మీద చిన్నగా శబ్దం చేస్తూ పిలిచింది కవిత. లోలోపల విసుక్కుంటూ చదువుతున్న నవల పక్కన పడేసి తలుపు తీసింది కల్పన. ఎదురుగా నిలుచున్న కవితను చూసి, ' ఓ ! మీరా, రండి ' అంటూ ముఖాన కాస్త నవ్వు పులుముకుంటూ లోనికి ఆహ్వానించింది. 
 కల్పనా వాళ్ళ పక్క పోర్షన్లో రెండు రోజుల క్రితం చేరారు కవిత వాళ్ళు. ఇంతవరకూ పరిచయం చేసుకోడానికి కుదరలేదు. మధ్యాహ్నం కాస్త తీరిక దొరకగానే ఈరోజు కల్పనతో కాస్త మాటలు కలుపుదామని బయలుదేరింది కవిత. " ఏమిటో చదువుతున్నట్లున్నారు? డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను,"
 నొచ్చుకుంటూ అంది కవిత. 
    ' ఆ, ఏదో నవల, అన్నట్లు మీరు నవలలు చదువుతారా?  "
         " ఏదో కొద్దిగా, ఈ మధ్య ఇంటర్ ప్రైవేటుగా కట్టిన తర్వాత ఇతర పుస్తకాలు చదవటానికి టైం ఉండటం లేదండి, " 
      " ఏమిటీ ! ఇంటర్ కు కట్టారా? ఎందుకండీ బాబు పెళ్లయి కూడా చదవడం అవసరం గాను, నేను బి ఏ సెకండ్ ఇయర్ చదువుతూ మానేశాను, పెళ్లవడంతో.... " 
       " అలాగా! మరి ఇప్పుడు పూర్తి చేయలేక పోయారా, ఏదైనా జాబ్ కు ట్రై చేయొచ్చు కదా..... "
   ఆమె మాట మధ్యలోనే అందుకుంది కల్పన,
    " ఇంకా నయం, నాకేం ఖర్మఅండీ ఉద్యోగం చేయడానికి? లక్షణంగా ఆయన సంపాదిస్తారు, నేనెందుకు బయటకి వెళ్లి కష్టపడ్డం? కొంపదీసి మీరు ఉద్యోగం చేయడానికే మళ్లీ చదువు మొదలెట్టారా ఏమిటి?, తిరస్కారంగా అంది కల్పన. 
    " ఏదో వేణ్ణీళ్లకి చన్నీళ్ళు తోడు అన్నట్లుగా ఆయన సంపాదనకు నాదీ జత చేద్దామని ఉంది. ఈ రోజుల్లో ఒక్కరి సంపాదనతో సంసారం జరగడం చాలా కష్టంగా ఉంది కదండీ, " ఒకింత ఇబ్బందిగానే అంది కవిత. 
    " ఏమో బాబు, మాకన్నీ మా ఊరి నుండే వస్తాయి. సంసారం జరగకపోవడం అన్న ప్రశ్నే ఉండదు, " ధీమాగా అంది కల్పన. 
    ఆమె మాటల్లో తలెత్తిన అహానికి కించిత్ నొచ్చుకుంది కవిత, కానీ వెంటనే సర్దుకుని,'పోనీలెండి, ఎవరి అభిప్రాయాలు వారివి, ' అంది లేస్తూ. 
                       *******************
     సాయంత్రం స్కూల్ నుండి బయటపడి రోడ్డు మీదకు వచ్చింది కవిత. రోడ్డుకి అవతల నిలబడ్డ ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, " అరే! ఈమె కల్పనలా ఉందే అనుకుంటూ రోడ్డు క్రాస్ చేసి ఆమెను సమీపించింది. 
" హలో, కల్పన గారూ బావున్నారా! " అంటూ చేయి ఊపింది. పిలుపు విని ఇటు తిరిగిన కల్పన కూడా కవితను చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. 
   " మీరా, కవిత గారు, చాలాకాలానికి కనిపించారు. బాగా మారారు కూడాను. " అంది ఆనందంగా చూస్తూ. " అవును, మీలో కూడా మార్పు స్పష్టంగా తెలుస్తోంది సుమా! ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు? 
    " బయలుదేరడం కాదు, ఇంటికి వెళుతున్నాను, స్కూల్ నుండి" అన్నది కల్పన. 
     " స్కూల్ నుండా! అంటే.... "  అర్ధోక్తిలో ఆగిపోయింది కవిత. 
     " అవును, స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మీకు నమ్మకం కలగడం లేదు కదూ! కానీ, ఇది నిజం, రండి, అలా నడుస్తూ మాట్లాడుకుందాం, " అంటూ దారితీసింది కల్పన. దగ్గర్లోని ఓ కాఫీ షాప్ లో కూర్చున్నారిద్దరూ
     " అప్పట్లో మీ మాట చాలా తేలిగ్గా కొట్టిపారేశాను. కానీ, కాలం గడిచే కొద్దీ నాకు పరిస్థితి అర్థం అవసాగింది. పెరిగే సంసారం, పెరిగే ధరలు. ఈ లోగా నా ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం మా వాళ్ళు పొలాలు అమ్మేయాల్సి వచ్చింది. దాంతో అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చేవన్నీ ఆగిపోయాయి. అన్నీ కొనాల్సి వచ్చింది. దాంతో మా వారి సంపాదన ఎందుకూ సరిపోక పరిస్థితులన్నీ ఎదురు తిరిగాయి. చేసేదేమీలేక ఇక తప్పనిసరై తక్కువ జీతం పై కాన్వెంట్ లో చేరాను. ఏమి చేయను మరి? పెళ్లయిన తర్వాత విలువైన సమయమంతా వృధాగా గడిపేసాను. ఇప్పుడు బియ్యే పూర్తి చేద్దాం అంటే నాకు తీరికనేదే కరువై పోయింది. ముగ్గురు పిల్లల తల్లిగా, ఓ గృహిణిగా, మరోపక్క ఉద్యోగినిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికే నాకు ఎక్కడ లేని టైం సరిపోవడం లేదు, " తలదించుకుని చెప్తున్నదల్లా గొంతు జీరబోవడం వల్ల క్షణంపాటు ఆగింది. ఆమె కళ్ళలో పల్చటి కన్నీటి ధర! అది గమనించిన కవిత మనసంతా అదోలా అయిపోయింది. అంతలోనే తన అనుభవం కళ్ళముందు కదలాడింది. 
      ఎంత కష్టపడింది తను! పెళ్లయిన తర్వాత మూడేళ్ల దాకా పిల్లలు వద్దనుకున్నారు. తను ఎంతో శ్రమపడి ఇంటర్ పాసయింది. తర్వాత సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు లక్షణమైన ఉద్యోగం సంపాదించుకుంది. ఇద్దరు పిల్లలతో ఇంటినో స్వర్గధామంగా తీర్చిదిద్దుకుంది. 
     కానీ, దీని వెనుక ఎంత కృషి, ఎంత పట్టుదల, మరెంత ముందుచూపు, ఎంతటి నిగ్రహం దాగి ఉన్నాయో తనకూ, తన భర్తకూ మాత్రమే తెలుసు. ఇప్పుడు కల్పన ను చూసి జాలి పడ్డం, ఓ నిట్టూర్పు విడవటం తప్ప తనేం చేయగలదు? 
       " అందుకే, ఈనాడు అమ్మాయిలు కేవలం వర్తమానాన్నే గాక భవిష్యత్తును కూడా ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి, " 
         తనలో తాను అనుకుంటూ ఓదార్పుగా కల్పన చేతిని తన చేతిలోకి తీసుకుంది కవిత. ఆ క్షణం ఆమె వదనంలో ఈతరం స్త్రీలో ఉండాల్సిన ధైర్యం, ఆత్మస్థైర్యం స్పష్టంగా అగుపించాయి. 
                        *******************

******************************************
యం. ధరిత్రీ దేవి, 🌹🌹🌹మళ్ళీ కలుద్దాం 
*****************

No comments:

Post a Comment