Saturday, June 20, 2020

సంతోష్ బాబు అమర్ రహే ! ***ఆమె కోరిక ***

దేశాల మధ్య సరిహద్దు రేఖలు
 అటూ ఇటూ సైనికుల పోరాటాలు
 దేశభక్తిని చాటుతూ వీర మరణాలు
 త్యాగధనులు అమరవీరులు
 వినువీధిని ఎగిరే కీర్తి పతాకాలు!
 దేశ సేవే పరమార్థమని
 కుటుంబాల్ని తృణప్రాయంగా
 త్యజించి జీవితాల్ని ధార పోసే
 సైనిక సోదరులారా
 మీకు శతకోటి వందనాలు!
 మనిషికి మరణం తథ్యమే 
 కానీ అకాల మరణం 
 పూడ్చలేని అగాథమే !
 ఆయా కుటుంబాలను 
 కృంగదీసే శరాఘాతమే!
 పరిహారాలు పరామర్శలూ 
 ఉద్యోగాల వితరణలూ 
 సకాలంలో స్పందించడాలూ 
 హర్షణీయమే! 
 ఈ ఊరడింపులన్నీ 
 ఉపశమనాలే దప్ప 
 పోయిన మనిషిని
 పక్కన నిలబెట్టగలవా !
 ఎందరో తల్లుల కడుపు కోత ఇది
 మరెందరో సతుల మౌన ఘోష ఇది!
 ఇంకా-- అటూ ఇటూ మరణాలతో
 ఈ వ్యధ ఇరుపక్షాలదీ !
 సహచరులను కోల్పోయిన వనితలు 
 ధీరవనితలై ఇక సాగించాలి
 కడదాకా ఒంటరి ప్రయాణం!
 ఆది నుండి నేటి దాకా జరిగిన 
 ఈ వీర మరణాలు రేపటికైనా ఆగాలన్నా 
 సైనికుల ప్రాణ త్యాగాలు వృధా కాకూడదన్నా 
' దేశం ' ఇకనైనా తీసుకోవాలి
' కీలక నిర్ణయం ' !
 ఇది ' సంతోషి ' కోరిక ఒక్కటే గాదు 
 ఎందరో వీరమాతల వీరపత్నుల విజ్ఞప్తి!
 అన్నదమ్ముల ఆస్తి పంపకాలు
 భూతగాదాలు సామరస్యంగా
 పరిష్కరించుకొమ్మంటారే పెద్దలు!
 మరి దేశాల మధ్య ఎందుకీ జాప్యాలు? 
 కక్షలు కార్పణ్యాలు !
 సామాన్యులకవగతం గాని 
 చిక్కుముడిది !
 నా ఈ ' స్పందన ' లో దోషమున్నయడల 
 విజ్ఞులను క్షమించమని
 మరీ మరీ వేడుకుంటున్నా  !!

💐💐💐💐🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

Monday, June 15, 2020

శ్రీకాంత్ అడ్డాల.... ' సీతమ్మ వాకిట్లో...... '

    సమయం నాలుగున్నర అవుతోంది. మధ్యాహ్నం ఓ కునుకు తీశాక ఏమీ తోచక  T. V ఆన్ చేశాను. వరుసగా కొన్ని ఛానల్స్ మారుస్తూ ఓ చోట ఆగిపోయాను. ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమా! ఇప్పటికెన్నిసార్లు వచ్చిందో ! నాకు తెలిసి నెలలో నాలుగైదు సార్లయినా వస్తూ ఉంటుంది. చిత్రమేమిటంటే చూడటానికి విసుగన్నది రాకపోవడం! అదేంటోగానీ  కొందరు నిర్మాతలు కోట్లాది రూపాయలు పెట్టి తీస్తుంటారు గానీ రెండో సారి చూడాలని అనిపించదు. కానీ ఇది మాత్రం వచ్చినప్పుడంతా కొన్ని సీన్లయినా చూస్తుంటాను. ఇప్పుడూ అలాగే!
   శ్రీకాంత్ అడ్డాల అద్వితీయంగా రూపొందించిన కుటుంబ కథా చిత్రమిది. అగ్ర హీరోలిద్దరూ తమ పాత్రల్లో మమేకమై నటించారనిపిస్తుంది. ఒకే తల్లి కడుపున పుట్టినా విభిన్న మనస్తత్వాలు కలిగిన ఈ చిన్నోడు, పెద్దోడు పాత్రలు ప్రతి ఇంట్లో తారసపడతాయి. అలాగే తండ్రిగా ప్రకాష్ రాజ్ నటనా మెచ్చుకుని తీరాలి. విలనీయే కాదు కరుణ రసాన్ని కూడా అత్యద్భుతంగా పోషించగలనని నిరూపించారీ విలక్షణ నటుడు. తల్లిగా జయసుధకు ఇలాంటి పాత్ర పోషణ కొట్టిన పిండే. రావు రమేష్ తండ్రికి తగ్గ తనయుడనని చెప్పకనే చెప్పారిందులో. 
   ఇక--- కథకంతా కేంద్ర బిందువు సీత పాత్ర. అంజలి గతంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించినా తన నట జీవితంలో ప్రత్యేకించి గుర్తుపెట్టుకో దగిన చక్కటి పాత్ర ఇది! ఇంకా, ఆమె కెరీర్ కి ఎంతో ఉపయోగపడిందని చెప్పొచ్చు. మిగతా సహాయ పాత్రలు పోషించిన నటీనటుల వల్ల కూడా చిత్రం మరో మెట్టు పైన నిలిచిందని చెప్పవచ్చు. 
    ఈ చిత్రం ఇంతగా ప్రేక్షకుల మెప్పు పొందటానికి నిత్యం మన చుట్టూ కుటుంబాల్లో కనిపించే వైవిధ్య మనస్తత్వాలు కలిగిన మనుషుల్నీ, ప్రతీ కుటుంబంలో సహజంగానే సంభవించే సంఘటనల్ని ఇందులో ప్రస్ఫుటంగా తీర్చిదిద్దిన విధానం కావచ్చు. 
    చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ ఇంతగా అందర్నీ ఆకట్టుకోవడానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారి కథనం, దర్శకత్వ ప్రతిభ మూలం. మిక్కీ జె మేయర్ సంగీతం హృద్యంగా ఉంది. ' వాన చినుకులు ' పాట హైలెట్ గా నిలుస్తుంది. 
   ఇంతా చెప్పి, అసలు సూత్రధారి, మూల స్తంభమైన నిర్మాత దిల్ రాజు గారి గురించి ప్రస్తావించక పోతే ఇది అసంపూర్ణమే అవుతుంది. 
    చివరగా, ఇంత చక్కని చిత్రాన్ని అందించి, ప్రేక్షకుల మదిలో పదికాలాలపాటు నిలిచిపోయే స్థానాన్ని పొందిన నిర్మాత, దర్శకులిద్దరికీ హాట్సాఫ్!!

💐💐💐🌺🌺🌺💐💐💐🌹🌷🌺

Sunday, June 14, 2020

సమదృష్టి

*****************************
ఎల్లలెరుగనిది 
 భాషా భేదాలు
 రంగుల తేడాలు
 కులమతాలు
 అంతస్తుల అంతరాలు
 ఏవీ పట్టనిది 
 గుడిసె వాసినీ 
 బంగళా నివాసినీ 
 బక్కచిక్కిన
 బడుగు జీవినీ 
 మేడలో మహామంత్రినీ
 సమదృష్టితో చూడగలిగే
 విశాల హృదయం గలది!
 అదేదంటే --
' కరోనా ' మహమ్మారి!
 నాకెందుకొస్తుంది? 
 నేను ప్రత్యేకం
 అనుకోకు నేస్తం
 దానికి తెలీదు కదా 
 నీ హోదా నీ స్థానం!
 ప్రాణ రక్షణ ప్రధానం
 అందుకే పాటించు
 స్వీయ రక్షణ!
 ఇంకెంతకాలం అంటావా? 
 తప్పదు మరి కొంతకాలం
 పాటించాలి భౌతిక దూరం
 నీ సహనమే నీకు రక్ష !
**********************************

Friday, June 12, 2020

నా జీవన సహచరి

💐🌷🌹🌺💐🌷🌹🌺💐🌷🌹🌺

ఆమె అందం 
కళ్ళకు కనిపించదు 
అందమైన మనసు దప్ప !

ఆమె గడసరి కాదు
 గొంతులో మార్దవం
 నిండిన గుణశీలి 

 మాటకారి కాదు
 మౌన రాగాలతో 
 ఆకట్టుకునే నేర్పరి!

 సోమరి కాదు
 నిత్య శ్రామికురాలు 
 ఆమె నడిచే వెలుగుల దీపం!
 నిత్య స్ఫూర్తికి నిర్వచనం
 ఆమె---
 నా జీవన సర్వస్వం!
 నా దేహంలో సగం
 నా జీవితానికో అర్థం
 నిరంతరం నను 
 నడిపించే ఆశా కిరణం    💐🌹🌷🌺

**********************************
యం. ధరిత్రీ దేవి 
**********************************

Thursday, June 11, 2020

ఎవరు గొప్ప?

                                    
'చిన్నారి' కథ   [ పెద్దలక్కూడా  ]😊🤔
************  **************
    ఒకసారి ఓ గేదెకూ. ఓ ఎద్దుకూ పోట్లాట వచ్చింది. అవి రెండూ తమలో తాము తీవ్రంగా వాదించుకుని, చివరకు లాభం లేదనుకొని వాటి యజమాని వద్దకు తీర్పు కోసమై వెళ్ళాయి. యజమాని వాటి వాదనలు ఏమిటో వివరించమన్నాడు. ముందుగా ఎద్దు మొదలెట్టింది. 
   "అయ్యా! నేను పగలంతా కష్టపడి పొలం దున్నుతున్నాను. పొలములోని పంటను ఇంటికి చేరుస్తున్నాను. ఇంటి నుంచి అంగళ్ళ దాక తీసుకెళ్ళి ధాన్యం అమ్మటానికి సహాయం చేస్తున్నాను. ఇంకా ఇతరుల పొలాలు దున్ని మీకు డబ్బు ఆర్జించి పెడుతున్నాను. మీరు పెట్టే కాస్త గడ్డి, చొప్పదిని ఇంత సేవ చేస్తున్నానా? కానీ ఈ గేదె ఒప్పుకోవడం లేదు. నాకంటే అదే మీకు అధికంగా సేవ చేస్తోందట!" నిష్టూరంగా ఉంది ఎద్దు. 
   యజమాని తల పంకించాడు. వెంటనే గేదె అందుకుంది. 
 "అయ్యా! నేను మాత్రం తక్కువ కష్టపడుతున్నానంటారా? కేవలం మీరు పెట్టే పిడికెడు గడ్డి, గాదం తిని శేర్లకొద్దీ పాలిస్తున్నాను. అవి అమ్మి మీరు ఎంతో సొమ్ము చేసుకుంటున్నారు. మీ పిల్లలకు నా పాలు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. పైపెచ్చు, పశు సంపదను వృద్ధి చేస్తూ ఆ విధంగా కూడా మీకు ఎంతో లాభం చేకూరుస్తూ ఉంటినాయే ! ఈ ఎద్దు నా కంటే గొప్పదంటారా?  మీరే చెప్పండి" అంటూ రెచ్చిపోతూ ఫిర్యాదు చేసింది. 
   యజమాని సాలోచనగా రెండింటి వంక చూశాడు. వీటికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని, తీర్పు వాయిదా వేసి వాటిని అప్పటికి వెళ్ళిపొమ్మన్నాడు. 
  ఆ రాత్రి గేదెకు గాడిలో పచ్చగడ్డి దొరకలేదు. తౌడు లేదు, కుడితి నీళ్లు పెట్టలేదు, మడ్డికూడు మాట అసలే లేదు. మరి ఏ విధమైన ఆహారం దానికి అందించబడలేదు. ఆ రాత్రే కాదు, వరుసగా మూడు రోజులు ఇదే తంతు కొనసాగింది. అవతల ఎద్దుకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. బయటకెళ్ళి ఏదైనా పొలాల్లో గడ్డి అన్నా తిందామంటే పరాయివాళ్ళు రానిస్తారా? రాళ్ల తోటి, కర్రల తోటీ కొట్టి అవతలికి తోలేశారు. 
   మూడు రోజులు పూర్తయ్యే సరికి, ఎద్దు, గేదె రెండూ డీలా పడిపోయాయి. మూడుశేర్లకు పైగా పాలిచ్చే గేదె ఒక శేరు ఇవ్వడం గగనమై పోయింది. ఇక ఎద్దు అయితే ఇంట్లో నుండి బయటకు నడవడమే కష్టమై నీరసపడిపోయింది. ఇదంతా వాటి పోట్లాట వల్ల, పొగరుబోతు మాటలవల్ల దాపురించిన అనర్థం అని తెలిసిరాగా కళ్ళనీళ్ళ పర్యంతమై, వెళ్లి యజమాని ఎదుట నిలిచాయి. 
 యజమాని చిరునవ్వు నవ్వి,  
"ఇప్పుడు తెలిసిందా, ఎవరు గొప్పో! నేను పెట్టే తిండిని మీరిద్దరూ ఎంత తేలిగ్గా అంచనా వేశారు! మీ తప్పు మీరు తెలుసుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడూ ఇలా మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకొని, ఎదుటి వారిని కించ పరచకండే,  " అంటూ లోనికి వెళ్ళిపోయాడు. 
   ఎద్దు, గేదె-- రెండూ తమకు తగిన శాస్తి జరిగింది అనుకుని, వాటి వాటి స్థావరాలకు వెళ్ళిపోయాయి. మరెప్పుడూ అవి గొప్పలు చెప్పుకునే సాహసం తలపెట్టలేదు. 
                                         ~ యం. ధరిత్రీ దేవి 
_____________________________________________
             

Wednesday, June 10, 2020

పాపనవ్వు 🌺🌷🌹

అది ఓ అందాల మేడ 
ఆ పక్కనే వెలవెలబోతూ చిన్ని గూడు !
మేడ చుట్టూ ప్రహరీగోడ 
గుడిసె ముంగిట పేదరికపు క్రీనీడ !
మేడలో మెరిసిపోతూ
 ఓ ముద్దుల పాప
 చూరు కింద మట్టిలో 
 మసకబారి మరో పాప!
 పట్టు పరికిణీ లో 
 పచ్చపచ్చగా ఒకరు
 చిరుగుల ఫ్రాకులో 
 చింపిరి తలతో మరొకరు!
 కడుపు నిండి 
 కళకళలాడుతూ ఒకరు
 కరువునబడి 
 కళ తప్పి ఇంకొకరు !
 ఈడు ఒకటైనా
 ఇరువురి నడుమా 
 పూడ్చలేని అగాథం!
 అన్నింటా అంతులేని
 అంతస్తుల అంతరాలు!
 ఒక్కవారి చిరునవ్వులో
 కల్మష రహిత దృక్కులలో 
 కపటమెరుగని
 హృదయ స్పందనలో దప్ప !!

🌺🌹💐🌷🌺💐🌹🌷🌺💐🌹🌷🌹

Monday, June 8, 2020

కొండంత బలం

🌄🌺🌹🌷🌹🌺🌷🌄

 గుండెల్లో సుళ్ళు తిరుగుతూ
 మెదడును తొలిచేసే తీరని వెలితి 
 చిరకాలంగా వేధిస్తూ వేధిస్తూ
 పరమాత్మను పదేపదే నిందింపజేస్తూ 
 నను దహిస్తున్నది దావాగ్ని

' అందానికి నిర్వచనంలా అలరారుతూ 
 అపార మేధస్సుతో విరాజిల్లుతూ
 నట్టింట సిరుల జడివానలో తడిసి పోతూ 
 నా జీవితం ఎందుకు లేదు? '
 వగచి వగచి విసిగివేసారి
 కడకు కదిలాయి నా కాళ్ళు కోవెల కేసి
 ఆ స్వామిని నిలదీయటానికి!
 దారిలోనే దారుణ దృశ్యాల పరంపర
 చేతులే పాదాలుగా పాకుతున్న ముదుసలి!
 సత్తు గిన్నెలో పడ్డ నాణెం చప్పుడుకే 
 ముఖం విప్పారిన మరో అంధజీవి !
 కాళ్లు చేతులు కరువై పోయి
 కునారిల్లుతున్న కుష్టు రోగి!
 అంతే! వడి వడిగా సాగే అడుగులు
 తడబడి నాలో ఓ కుదుపు!
 భళ్ళున తెల్లారి పోయి
 నా హృదయం విప్పారింది
 ఓ సృష్టికర్తా !
 అంగవైకల్యం లేని తనువునాకిచ్చావు 
 అన్నపానాదులకు లోటు లేని
 లోగిలినిచ్చావు 
 నా చుట్టూ నాఅన్నవాళ్ళనిచ్చావు 
 అంతకుమించిన ఆరోగ్యాన్నిచ్చావు 
 ఇంతకుమించి ఇంకేదో కావాలని
 అలమటిస్తున్న నా కళ్ళు
 ఈ క్షణం ఇట్టే తెరిపించావు 
 నీ తలంపే ఇంతటి శక్తివంతమైతే 
 లిప్తపాటైనా నీ దర్శనం
 నాకు కొండంత బలం
 అన్నది ఎంత నిజం!!
🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌷🌹🌄

ముక్కమల్ల ధరిత్రీ దేవి 

🌄🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌷