Friday, October 8, 2021

ఓ ' ఫోబియా ' కథ !

                                             🌷🌷🌷🌷🌷🌷🌷🌷
                                                    భువి భావనలు🐦
                                             🌷🌷🌷🌷🌷🌷🌷🌷


       వారం రోజులుగా రామలక్ష్మికి చాలా   చిరాగ్గా, అసహనంగా ఉంటోంది. ఒంట్లో ఏదో తెలీని నలత ! చిన్నగా తలనొప్పి! ఇప్పుడే కాదు, దాదాపు ఒక సంవత్సర కాలం నుండీ ఆమెకిలాగే ఉంటోంది. కానీ చిత్రమేంటంటే ఆ పరిస్థితి ఏ వారమో , రెండు వారాలో  ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది.మళ్ళీ కొద్దినెలల తర్వాత అదే పరిస్థితి ! కారణం రామ లక్ష్మికి   బోధపడదెంతకీ. 
     అరవింద కు డిగ్రీ పూర్తవగానే పెళ్లయిపోయింది. భర్త భరత్ ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్. పెళ్లయిన కొత్తలో అటువైపూ, ఇటువైపూవాళ్ళు ప్రతి పండక్కి ఎవరో ఒకరు ఇంటికి పిలుస్తూ ఉండేవాళ్లు. సంవత్సరం దాకా మహదానందంగా గడిచిపోయిందా  అమ్మాయికి. కొత్తదనం తగ్గిపోయి  ఇప్పుడు పండగలకి పిలవడం కూడా తగ్గిపోయింది. దాంతో చిక్కొచ్చిపడింది అరవిందకి ! పుట్టింట్లో గారాబం  ఎక్కువై ఏ పని చేయడం అలవాటు కాలేదు. ముఖ్యంగా పండగపూట! అన్నీ తల్లే చూసుకోవడం, ఆ పిల్లేమో అమ్మ ఉంది కదాని వంటింటి   మొహం వేపు కనీసం తొంగి  చూడకపోవడం ! అన్న పెళ్లయ్యాక వదిన వచ్చి  తల్లికి  సాయం చేయడం మొదలయ్యాక బాధ్యతారహితంగా తయారై మరీ బద్ధకస్థురాలై పోయింది. ఫలితం ! ఈరోజు ఏ పండగ ఎలా చేయాలో ఏ మాత్రం అవగాహన లేకపోవడం! కనీసం వంటల మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే అదీ లేదు. కానీ పండగ లంటే ఇష్టమే. ఇదిలాగుంటే, భర్తగారేమో భోజనప్రియుడు. పండగపూట మరీ హెవీ గా ఉండాలంటాడు. దాంతో మరో  పెద్ద సమస్యయింది  అరవిందకు. ఎంత పుట్టిల్లైనా మరీ పిలవకుండా వెళ్లడమంటే ఏదో నామోషీ ! అంతే! ఇంకేముంది! పండగలంటే  ఆసక్తి, సంతోషం చచ్చిపోయి ఆ స్థానంలో ఓ విధమైన బెంగ మొదలైంది. అందుకేనేమో, పండగ వారం ఉందనగానే ఆమెలో ఏదో గుబులు! ఎలాగోలా అది కాస్తా దాటి పోగానే పరిస్థితి మళ్ళీ మామూలై పోతోంది. 
     ముందుగా   ప్రస్తావించిన రామలక్ష్మి పరిస్థితీ  ఇదే. నలభై ఏళ్లదాకా రామలక్ష్మిచాలా  హుషారుగా ఉండేది. ఇంటి పనులూ, బయటి పనులు చక్కబెట్టుకుంటూ, మరోవైపు పిల్లల ఆలనాపాలనా ఇంట్లో మిగతా  వాళ్ల అవసరాలు అన్నీ చూసుకుంటూ అంతా  ఒంటిచేత్తో నెట్టుకొచ్చేది. వంటింట్లో అత్తగారేదైనా సాయం చేయబోయినా వారించేది. చేతికి కాలికి అడ్డం అనుకొంటూ ఎవరు సాయం అందించబోయినా సున్నితంగా తిరస్కరించేది. నలభై దాటి రెండేళ్లు గడిచాక నెమ్మదిగా ఆమెలో నిస్సత్తువ ఆవహించడం మొదలై మరో రెండేళ్లు గడిచేసరికి రెట్టింపైపోయింది. 
     ఏమిటో ఈమధ్య వంటింట్లో కాస్త ఎవరైనా పని అందుకుంటే బాగుంటుంది కదాని అన్పిస్తోందామెకి మెల్లిమెల్లిగా. అత్తగారేమో వంటింటి అలవాటు బాగా తప్పిపోయి విశ్రాంతికి అలవాటు పడి అటువేపు చూడ్డం బొత్తిగా మానేసింది. ఆవిడే కాదు ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఓరకమైన 'కంఫర్ట్ జోన్ ' లో పడిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. 
" ఖర్మ !చేజేతులా చేసుకున్నానాయె !తప్పుతుందా !"
అంటూ తల పట్టుకుంటోందా ఇల్లాలు !
" అన్నీ మీదేసుకుని చేయాలనుకుంటే చివరికిలాగే అవుతుంది మరి !"
ఆమె ఆపసోపాలు చూస్తూ భర్త గారు చేసే కామెంట్స్ ఆమెను మరీ ఆలోచనలో పడేస్తున్నాయి. మరీముఖ్యంగా ఈమధ్య పండగల పూట ఆమె అవస్థ చెప్పనలవి గావడం లేదు. పెద్ద సంసారం !తెల్లవారు ఝాము నుండి అన్నీ చక్కబెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనమైపోతోంది. దాంతో పండగ ఏదైనా వస్తోందంటే చాలు ఆమెలో ఏదో అలజడి ! ఈవిధంగా కొద్దికాలం గడిచాక నెమ్మదిగా ఆమెకు అసలు కారణం బోధపడసాగింది. ప్రస్తుతం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని సతమతమై పోతోందా అమాయకురాలు !
      వీరిద్దరి వ్యవహారం ఇలా ఉందా! ఇక భువనేశ్వరి దగ్గరికెళ్దాం. ఆవిడ హై స్కూల్ టీచర్ గా రిటైరై సంవత్సరం దాటింది. ముప్ఫై అయిదు  సంవత్సరాలుగా క్షణం తీరిక లేకుండా ఉద్యోగం చేసి అలసిన ఆమె శరీరం రిటైర్మెంట్ తర్వాత ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు లే అనుకుంటూ ఆ క్షణం కోసం ఎదురు చూసింది. తీరా  ఆ ఘడియలు రానే  వచ్చాయి. కానీ మూడు నెలలు గడిచీ  గడవకముందే ఆమె ఆశలు  ఎండమావులే అని ఆమెకు అవగతమైపోయింది. ఇప్పుడు ఆమెకు బయటకెళ్ళి జాబ్ చేసే పని మాత్రమే తప్పింది.అస్తమానం ఇంట్లోనే ఉంటున్నందుకు  ఇతరత్రా పనులన్నీ ముఖ్యంగా వంటింటి పనులురెట్టింపై పనిభారం విపరీతంగా పెరిగిపోయి, ఈ వయసులో ఆమె శరీరం తట్టుకోలేక బాగా డీలా పడిపోతోంది. ఫలితం! B.P, థైరాయిడ్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు మెల్లిగా చుట్టుముట్టి మీద పడి మరింత హైరానా పెట్టేస్తున్నాయి. మరి ఈవిడకి కూడా పై ఇద్దరి లాగే పండగ వస్తోందంటే గాభరా  ఉండకుండా ఉంటుందా? ప్రస్తుతం భువనేశ్వరి కూడా పనిభారం  ఎలా తగ్గించుకోవాలా అన్న ఆలోచనలో ఉంది.
    ఈ ముగ్గురే కాదు, ఇలాంటి కోవకు చెందిన ఆడాళ్లంతా తమ స్వల్పకాల అనారోగ్యాలకు కారణం అన్వేషిస్తే --- కేవలం ఒత్తిడి! మానసిక ఒత్తిడే 90% ఉంటుందన్న నిజం ఇట్టే ద్యోతకమౌతుంది. రకరకాల ఫోబియాల  గురించి మనకు తెలుసు. ఇదీ  ఒక రకం 'ఫోబియా' అనొచ్చేమో !
    దీనికి పరిష్కారం గురించి చెప్పాలంటే( నా మాటల్లో )---
 కాస్త కష్టమే అనుకోండి-- కానీ అసాధ్యం అయితే కాదు అనుకుంటున్నా---
* ఇంట్లో పని విభజన అన్నది ఉండాలి. ఇంట్లో ఉన్న అందరికీ ఎవరికి  చేతనైన పని వాళ్లకు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి.. అలవాటు పడ్డ ప్రాణాలు కదా, మొదట్లో మొరాయిస్తాయి. అనుమానమే  లేదు. కానీ క్రమంగాదారిలో కొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చెప్పడం అయితే సునాయాసంగా చెప్పగలిగాను, ఆచరణలో మహా కష్టం సుమీ ! కానీ ప్రయత్నించడంలో తప్పేముంది?  
   అలా చెప్పలేమంటారా?  మొహమాటమడ్డొస్తోందా? ఆ ముసుగు తీసేస్తే అన్నీ సర్దుకుంటాయి నేస్తాలూ ! కొందరు తెలివైన ఆడవాళ్ళు మొదటి నుంచీ  ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు మరి! వాళ్లు ఎవరి మాటల్నీ పట్టించుకోరు. అందుకే ఏ 'టెన్షన్ ' లేకుండా ధీమాగా కన్పిస్తుంటారు. మనం కూడా అదే దారిని ఎంచుకుంటే ఈ ఫోబియాలూ గీబియాలు పరారవుతాయి గదా !
    మహా అయితే ఇంట్లో వాళ్ళు కొద్దిరోజులు మనమీద కారాలూ మిరియాలూ నూరతారు, అంతేగా ! మన క్షేమం కోసం ఆమాత్రం భరించాలి మరి !ఏమంటారు? 
    ఇకపోతే, ఇది  ఎక్కువ మంది  ఉన్న కుటుంబాలకు OK. మరి అరవింద లాగ ఇద్దరే ఉంటే ! ఇద్దరి మధ్య కూడా పని విభజన అన్నది ఉండొచ్చు.  అప్పుడు ఇద్దరూ పరస్పర అవగాహనతో, సర్దుబాటు ధోరణితో ఆలోచించాల్సి ఉంటుంది.     మహా కష్టమే అయినా' ప్రయత్నిద్దాం'అన్న  కోణంలో ఇదంతా  సాగాలి !! 

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄

   


No comments:

Post a Comment