Thursday, May 12, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 8.. ' వైద్యో నారాయణో హరిః '

 🌺

        "వైద్యో నారాయణో హరిః"  -- ఈ మాటకు నూటికిి  నూరు పాళ్లూ సరిపోయే ఇద్దరు వైద్య నారాయణులు నా జీవనయానంలో నేనున్నంత వరకూ చెరగని గురుతులే. 
    అది నా మొదటి డెలివరీ సమయం. అప్పుడు నేను ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేస్తుండేదాన్ని. కర్నూల్లో అప్పట్లో బాలాంబ గారనే గైనకాలజిస్ట్ ఉండేవారు. నెల నెలా చెకప్ కు ఆమె వద్దకే వెళ్లేదాన్ని. ఐదవ నెల నడుస్తుండగా కొన్ని టెస్ట్ లు చేయించమన్నారావిడ. ఆ పరీక్షల్లో RH ఫాక్టర్ నెగటివ్ గా వచ్చింది. అలా వస్తే డెలివరీ అయ్యాక 48 గంటల్లో పల ఓ ఇంజక్షన్ తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పారామె. మరో రెండు నెలలు గడిచాక ఆ డాక్టర్ గారికి హైదరాబాద్ బదిలీ జరిగింది. వెళ్తూ వెళ్తూ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, డెలివరీ తర్వాత ఇంజక్షన్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలంటూ దాని పేరు కూడా నాకు రాసి ఇచ్చారు. మంచి డాక్టర్ వెళ్లి పోతున్నందుకు చాలా బాధపడ్డానారోజు.
    నెలలు గడిచి, మరో డాక్టర్ పర్యవేక్షణలో సిజేరియన్ అయింది నాకు. పాప పుట్టింది. బాలాంబ గారు చెప్పినట్లు గానే ఇంజక్షన్ ఇవ్వడం కూడా జరిగింది.  ఐదారు నెలల తర్వాతనుకుంటా... ఓ రోజు నేను స్కూల్లో క్లాసులో ఉండగా... ప్రిన్సిపాల్ గారు పిలిపిస్తే ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్లాను.
  ఆశ్చర్యం! సంతోషం ! రెండూ  ఒకేసారి నాలో ! అక్కడ బాలాంబ గారు !! నా పేరు గుర్తు పెట్టుకుని పిలిపించి, పరామర్శించి డెలివరీ గురించి అడిగారు. ఆవిడ నన్నంత  బాగా గుర్తుపెట్టుకోవడానికి మరో కారణం కూడా ఉంది. నేను చెకప్ కు ఆవిడ వద్దకు వెళ్తున్నప్పుడు డాక్టర్ గారి కుమారుడు అప్పుడు నేను పని చేస్తున్న ఈ స్కూల్లోనే రెండవ తరగతి చదువుతూ ఉండేవాడు. ఆ క్లాస్ టీచర్ నేనే. మొదటిసారి నేను చెకప్ కి వెళ్ళినప్పుడు నా గురించి వివరాలడిగారామె.పరీక్షించాక ఫీజు  ఇవ్వబోతే, 
" మా వాడి టీచర్ వు నువ్వు. నీ దగ్గర ఫీజు తీసుకుంటానా... "
 అంటూ సున్నితంగా వద్దనేశారు. ఓ పెద్ద పేరున్న డాక్టర్ చాలా రోజుల తర్వాత నన్ను పేరుతో సహా గుర్తు పెట్టుకుని నన్ను చూడాలని ఇలా పిలిపించడం ! మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇది జరిగి చాలా సంవత్సరాలయింది. ఈరోజు నేను వారికి గుర్తు ఉండకపోవచ్చు. కానీ నాకు మాత్రం నిన్నా మొన్నా జరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
    అలాగే బాలాంబ గారు హైదరాబాద్ వెళ్ళాక, మరో డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యానని చెప్పాను కదా,  ఆయన డాక్టర్ శ్రీనివాసన్  గారు. గైనకాలజిస్ట్. ఎంత నైపుణ్యం కలిగిన వైద్యుడంటే... మాటల్లో చెప్పలేను. నా రెండవ డెలివరీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది.. ఎప్పుడు కలిసినా  నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆరోగ్యం గురించి అడిగే వారు. నేను నాకు తెలిసిన వాళ్ళనూ, బంధువుల పిల్లల్ని ఆయన వద్దకు పిలుచుకొని వెళ్లి చూపించేదాన్ని కూడా. నన్ను చూసి,  ఫీజు వాళ్ళు ఇవ్వబోయినా తీసుకునేవారు కాదు. ఇప్పుడా  డాక్టర్ గారు లేరు. కానీ నా స్మృతిపథంలో ఎప్పటికీ సజీవంగా  నిలిచే  ఉంటారు. . వీరంతా పెద్ద పెద్ద డాక్టర్లు.. కానీ ఈ సందర్భంగా మరొకరి గురించి చెప్పాలి నేను.
---నా చిన్నతనంలో  మా ఊర్లో శివయ్య గారని ఉండేవారు. అప్పుడు నేను స్కూల్లో చదువుతుండేదాన్ని. ఆయనకు యాభై  పైనే ఉండేది వయసు. ఎంబిబిఎస్ డాక్టర్ కాదాయన. కానీ ఏ  చిన్న అనారోగ్యం ఎవరికి  పొడచూపినా వెంటనే ఆయన కోసం కబురు పెట్టేవారు ఊర్లో ప్రతి ఒక్కరూ. ఆయనేమో క్షణాల్లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. అల్లోపతి,  హోమియోపతి మందులు ఆయనే  ఇచ్చేవారు. ఆయన వచ్చి  చేయి పట్టి చూసి, వెంటనే తన వద్ద ఉన్న  టాబ్లెట్స్ చేతిలో పెట్టి వేసుకోమనేవారు. అంతే ! మరుసటి రోజుకంతా నార్మల్ అయిపోయేది  పరిస్థితి ! అంత గొప్ప హస్తవాసి ఆయనది  !! ఆ ఊరి జనాలకు ఆయనే తిరుగులేని వైద్యుడు ! పైసా ఆశించడు. అలా నిస్వార్ధంగా సేవలందించే వాళ్లని ఈరోజుల్లో చూడగలమా ! అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు !  నా మస్తిష్కంలో మరపురాని గొప్ప వ్యక్తులువీరంతా🙏
     వీరి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించానంటే --
 ఇటీవలి కాలంలో కొందరు డాక్టర్ల తీరు చూస్తే చాలా బాధపడాల్సివస్తోంది. అప్పుడప్పుడు కాదు సరికదా.. రెగ్యులర్ గా  చెకప్ కు వెళ్లే పేషంట్లను కూడా అప్పుడే కొత్తగా చూస్తున్నట్లుగా ప్రవర్తించడం! ఏదో మొక్కుబడిగా చూడడం. అవసరం లేకున్నా ఏవేవో పరీక్షలు చేయించండంటూ రాయడం.. అవసరానికి మించి రకరకాల టాబ్లెట్స్ రాసేయడం.. అవి వేసుకుని రోగి హరాయించుకోగలడా అని ఏమాత్రం  ఆలోచించక పోవడం..! చిన్న అనారోగ్యాన్ని కూడా పెద్దదిగా చూపిస్తూ మానసికంగా భయభ్రాంతుల్ని చేయడం ! 
     డాక్టర్ ను చూడగానే... వారి  చక్కని మాటతీరు వల్లే సగం జబ్బు నయం అవుతుందంటారు. ఆ పరిస్థితి ప్రస్తుత రోజుల్లో చాలా అరుదుగా గోచరిస్తోంది. వ్యాపార ధోరణి బాగా పెరిగిపోయింది కూడా.వైద్యరంగంలో ఇలాంటి ధోరణి సమంజసం కాదు కదా !
                      *****************

                     *****************

      

No comments:

Post a Comment