Saturday, April 20, 2024

బొమ్మ -బొరుసు...చిన్న కథ

                   
                          
                          ~  యం. ధరిత్రీ దేవి   
    

    కొడుకు తెచ్చిన నోట్ల కట్టలు అతి జాగ్రత్తగా లెక్క పెట్టింది పార్వతమ్మ. అంతలోనే ఆమె భృకుటి ముడివడింది.
  " ఇదేమిట్రా, ఐదొందలు తగ్గాయేమిటి?  " నిశితంగా అతన్నే చూస్తూ అడిగింది. 
   " తనకేదో అవసరమంటూ తీసుకుందమ్మా సుగుణ... " నాన్చుతూ చెప్పాడు ఆనంద్. 
  " బాగుంది వరుస ! ఆవిడగారడగడం,నువ్వివ్వడం! ఈరోజు ఐదొందలంటుంది. రేపు వెయ్యంటుంది. తర్వాత అసలుకే ఎసరు పెడుతుంది... "
మూతి మూడు వంకర్లు తిప్పుతూ రుసరుసలాడింది పార్వతమ్మ.
"అలా ఏమీ జరగదులేమ్మా.. నేచెప్తున్నాగా.."
తల్లిని ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు ఆనంద్.
"అది కాదురా,స్కూలు దగ్గరేగా నడిచి వెడుతుంది, ఆటో ఖర్చు లేదాయె..భోజనం పట్టుకెళ్తుంది, తిండి ఖర్చు లేదాయె!సినిమాలు, షికార్లు నీవు తిప్పుతూనే ఉంటావాయే ! ఇంకా ఆవిడ గారికి అవసరాలంటూ ఏముంటాయి? ' దీర్ఘం తీస్తూ నిలదీసింది. 
  " అదేంటమ్మా, పది మందిలో కెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు నలుగురిలో బాగుండాలంటే ఏవో చిన్న చిన్న సరదాలు, అవసరాలు ఉండవా?.... "
భార్యను సమర్థించబోయాడు ఆనంద్.
 మధ్యలోనే అడ్డుకోబోయిన ఆవిడకి గేటు తీసుకుని వస్తూ కనిపించింది సుగుణ. రుసరుసలాడుతూ సణుగుడు ఆపి లోనికెళ్ళిపోయింది విసవిసా పార్వతమ్మ. చెట్టంత ఎదిగినా ఇంకా తన అదుపాజ్ఞలలో ఉంటూ తనదే కాకుండా భార్య జీతం కూడా తెచ్చి తల్లి చేతిలో పోసే కొడుకును చూసుకుని మురిసిపోతూ ఉంటుందావిడ !
   అక్కడే కూర్చుని చదువుకుంటున్న ఆమె చిన్న కొడుకు ప్రశాంత్, చిన్న కూతురు ప్రసూన తల్లి మాటలు వింటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ! వాళ్ళిద్దరూ ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్నారు. 
  పాపం వదిన! తెల్లవారుజామునే లేస్తుంది. ఇంటి పని,వంట పని అంతా దాదాపు తనే పూర్తి చేసి డ్యూటీ కి వెళ్ళిపోతుంది. మళ్లీ సాయంత్రం వచ్చిన దగ్గర నుండీ ఏదో పనిలోనిమగ్నమై ఉంటుంది. అది చాలదన్నట్లు వచ్చిన జీతం అంతా కిక్కురుమనకుండా ఇంటి కోసమే చేస్తూ ఉంటుంది. ఇంత చేస్తున్నా వదిన పట్ల తల్లికి ఎందుకు అంత నిరసననో, అంత అయిష్టతో ఇద్దరి చిన్న బుర్రలకి ఎంతకీ అర్థం అవ్వదు. ఓ నిట్టూర్పు విడుస్తూ మళ్లీ పుస్తకాల్లో తల దూర్చేశారు.
                          *********
    దసరా పండక్కి వచ్చిన పెద్ద కూతురు సునందను కాలు కింద పెట్ట నీయకుండా అపురూపంగా చూసుకుంటోంది పార్వతమ్మ. సునందకు పెళ్లి చేసి రెండేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. డిగ్రీ దాకా చదివి ఏదో ప్రైవేటు కంపెనీలో టైపిస్ట్ గా చేస్తోంది. 
    ఆ రోజు సాయంత్రం ఆనంద్ సుగుణలు ఏవో సరుకులు కొనడానికి బజారెళ్ళారు. ప్రసూన,ప్రశాంత్ లు కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నారు. సునంద అక్కడే సోఫాలో కూర్చుని వీక్లీ తిరిగేస్తోంది. 
    ముంగిట్లో చెట్టుకు కాసిన మల్లె మొగ్గలు కోసుకొచ్చి చక్కగా మాలకట్టి మురిపెంగా కూతురు జడలో తురిమింది పార్వతమ్మ. వెంటనే లోనికెళ్లి చిక్కటి కాఫీ కలుపుకొచ్చి వేడివేడిగా కూతురికి అందించి, మెల్లిగా మొదలెట్టింది. 
   " ఏమే, సునందా, ఏమంటోంది  మీ అత్తగారు?నిన్నేమైనా గునుస్తోందా? అదే, అత్తగారి పెత్తనం లాంటిదేమన్నా... "అంటూ మొదలెట్టింది.
" అదేమీ లేదమ్మా పాపం.. మా ఆయన ఎంత చెబితే అంతే.. "
" అంతే అంతే. అలాగే ఉండాలి. కొంపదీసి మీ ఆయన్ని చేజారిపోనిచ్చేవు సుమా..! ఎప్పుడూ భర్తను కొంగున ముడేసుకుని ఉండాలి. అన్నట్టు...
నీ జీతం గురించి మీ అత్తగారు ఏమైనా అడుగుతుందా? " 
 గుసగుసగా అంది. నా కొడుకు నా మాట జగదాటకూడదు. నా అల్లుడు మాత్రం నా కూతురి అదుపాజ్ఞల్లో ఉండాలి అనే రకం ఆమె.
    " అబ్బే, ఆవిడకి అలాంటి ఆశలు ఏమీ ఉన్నట్టు లేదమ్మా, పైగా ప్రతి పండక్కీ ఆవిడే నాకు చీర కొనిస్తుంది తెలుసా!... ఈసారి కూడా కొనుక్కో మంటూ రెండు వేలు చేతిలో పెట్టి పంపించింది... " తల్లికి భరోసా ఇచ్చింది సునంద.
  "అలాగా!అయితే సరే... నేనూ మరో రెండు వేలు ఇస్తాను, రేపెళ్లి నాలుగు వేలు పెట్టి నీకు నచ్చిన పట్టు చీర ఏదైనా కొనుక్కో... " లోలోపల మురిసిపోతూ దగ్గరగా వచ్చి తగ్గు స్వరంతో అందావిడ. 
     అక్కడే ఉన్న ప్రసూన, ప్రశాంత్ ల చెవుల్లో వీళ్ల సంభాషణ ఎంత వద్దనుకున్నా దూరిపోతోంది. తల్లి ధోరణికి ఆ ఇద్దరూ విస్తుపోయి తెల్లమొహాలేశారు. 
  పాపం! వదిన! అయిదు వందలు, అదీ తన జీతం డబ్బుల్లో నుండి తీసుకుంటేనే రాద్ధాంతం చేసిన అమ్మ ఇప్పుడు అక్కకు ధారాళంగా రెండు వేలిస్తానంటోంది ! 
   పగలంతా కష్టపడి,అలసి సొలసి సాయంత్రానికి ఇంటికి వస్తే ఏనాడైనా ఇలా కాఫీ తన చేతికందించిందా? ఎప్పుడైనా ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడిందా? అక్కకు మాత్రం రాచమర్యాదలు చేస్తోంది!
   కూతురికో ధర్మం, కోడలికో ధర్మమా! ఎందుకో ఏమో గాని ఆ లేత మనసులు రెండూ ఒకింత ఆలోచనలోపడి అయోమయంలో కాసేపు కొట్టుమిట్టాడాయి. 
     నాణెం ఒకటే అయినా దానికి ఒక వైపు బొమ్మ, మరోవైపు బొరుసు ఉన్నట్లుగానే ఒక స్త్రీలో అమ్మ, అత్త అనే రెండు పరస్పర విరుద్ధ భావాలు కలిగిన మనసులు ఒదిగి ఉంటాయన్న లోకం పోకడ ఆ పసి హృదయాలకు తెలియాలంటే వాళ్లకు ఈ వయసు చాలదు. ఇంకొంతకాలం ఆగాలి మరి !
***************************************
   [ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితం ]

🌺🌹🌷🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌺🌹🌷🌷


2 comments:

  1. LRSR:
    ఒకే స్త్రీ అమ్మ అత్త. ఒకే నాణెం బొమ్మా బొరుసు
    రెంటికి చక్కటి పోలిక. మనస్తత్త్వాల విశ్లేషణ అమోఘం! అద్భుతం! 👌👌👌 💐💐

    ReplyDelete