Thursday, January 18, 2024

కొత్త అమ్మ కాదు.. చిన్నమ్మ అసలే కాదు.. సొంత అమ్మే... !( కథ )

                                      ~ రచన: యం. ధరిత్రీదేవి 

"వీళ్లేనా శరణాలయంలో చేర్చాలనుకుంటున్న పిల్లలు?" 
ఎనిమిదేళ్లలోపు వయసున్న పాప,  బాబు లను చూస్తూ అడిగింది అనాధ శరణాలయం నిర్వాహకురాలు వసుంధర. 
" అవునమ్మా... " 
 ఆ పిల్లల నాయనమ్మ, తండ్రి ఇద్దరూ ఒకేసారి బదులిచ్చారు బెరుగ్గా, భయం భయంగా చూస్తున్న పిల్లల భుజాల మీద చేతులు వేస్తూ...
" చాలా చిన్న పిల్లలు. ఇంతకూ  ఎందుకు చేర్చాలనుకుంటున్నారు? తండ్రి ఉన్నాడు. నాయనమ్మవు నీవూ  ఉన్నావు.. వీళ్ళ బాగోగులు చూడ్డానికి మరో పెళ్లి కూడా చేశావు నీ కొడుక్కి.. ఇందరుండగా... వీళ్ళు అనాధలెలా అయ్యారు?... "
 భార్య చనిపోయిన ఆర్నెళ్లకే మళ్లీ మనువాడిన అతన్ని చూస్తూ అడిగింది వసుంధర. ఆ సూటి ప్రశ్నలకు క్షణం మాట్లాడలేదు ఇద్దరూ. 
" నిజమేనమ్మ.. కానీ..ఎంతైనా సవతి తల్లి.. కన్నతల్లిలా ఎలా చూస్తుంది.. ! అందుకే... "
 నసిగిందామె చేతులు నలుపుకుంటూ. తల పంకించి, 
" ఆమె వచ్చి ఎన్నాళ్ళయింది? "
 అడిగింది వసుంధర.
" నెల దాటిందమ్మ... "
" నెల రోజులకే ఆమె వీళ్ళని సరిగా చూడదని నిర్ణయించుకున్నావా ?.  "
 చాలా 'కూల్' గా అడగడానికి ప్రయత్నించింది వసుంధర. 
" అవునమ్మ.. ఎందర్ని చూడ్డం లేదూ.. !"
" అలాంటప్పుడు కొడుక్కి పెళ్ళెందుకు  చేశావు? నీవే చూసుకోవచ్చు గదా, సొంత నాయనమ్మవేగా.. "
 వెంటనే అందుకుంది వసుంధర.
" అయ్యో అమ్మ ! నా కొడుకు వయసెంతని?  పైగా రేపో మాపో  పోయేదాన్ని నేను... వీళ్లను ఎన్నాళ్లని చూడగలను?  వంటా గింటా... మిగతా అన్ని పనులూ  నాతో అవుతాయా?... "
" కదా.. అవేవీ  నీతో కావు. అవన్నీ చేయడానికి ఓ ఆడది కావాలి. బయటి వాళ్లు చేయలేరు. చేయరు. ఇంటి మనిషే కావాలి. అందుకు నీ కొడుక్కి పెళ్లే చేయాలి. తప్పదు..."
" అంతే కదమ్మా..."
అన్నదామె.
" చూడమ్మా,అంతవరకూ  ముక్కూ  మొహం ఎరగని ఆమె నుండి అంత ఆశిస్తున్నావు... సరే.. బాగుంది... నీ ఆలోచన నీది. నీ ముందు జాగ్రత్త నీది. అంతవరకు బాగానే ఉంది. నీ ఇంటికొచ్చి, అంతవరకూ  ఏ బంధం  లేని మిమ్మల్ని సొంత వాళ్లుగా, నీ కొడుకు పిల్లల్ని సొంత పిల్లలుగా చూడాలనుకుంటున్నావు నీవు ! అలాంటప్పుడు ఆమెను  మీరూ  మీ సొంత మనిషిలా చూసుకోవాలి కదమ్మా.... "
"................"
 తల్లీకొడుకులిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.
" మీరంతా కోరుకున్న విధంగా ఆమె ఉండాలంటే... ఆమె కోరుకున్న విధంగా మీరూ  ఉండాలి కదా ! నీ కొడుక్కి  రెండో పెళ్లి కావచ్చు... ఆమెకు మొదటిదే కదా! ఎన్ని ఆశలతో తన వాళ్లను వదిలి నీ ఇంట్లో అడుగు పెట్టి ఉంటుంది !.అంతేసి భారం ఆమె మీద మోపాలనుకుంటున్నావు..ఆమె వయసెంతనీ..!"
"................"
".. భార్యను పని చేయడానికే  వచ్చిన దానిలా, మీ అవసరాలు తీర్చడానికే వచ్చింది అన్నట్లుగా ప్రవర్తిస్తే.. మీమీద  తనకి ప్రేమాభిమానాలు ఎలా పుట్టుకొస్తాయి?  చెప్పు బాబూ, నీ భార్యను ప్రేమగా చూసుకుంటున్నావా ? "
 అతని వైపు చూస్తూ ప్రశ్నించింది వసుంధర. తల దించుకున్నాడతను. 
".. చూడండీ, పరిస్థితులకు తల ఒగ్గే ఏ ఆడపిల్లయినా ఇలాంటి పెళ్లికి సిద్ధపడుతుంది. అనవసర భయాల్తో, అనుమానాలతో ముందుకుముందే ఆమె గురించి ఓ నిర్ణయానికి రాకండి. ఇంకా ఇంట్లో అడుగుపెట్టక ముందే ఆమె పట్ల ఓ రకమైన ఏహ్యభావాన్ని పిల్లల్లో కలిగించి వాళ్ల పసి మనసుల్ని విషపూరితం చేస్తే ఎలా? "
ఇద్దరిలోనూ చిన్నగా అలజడి !
"... కొత్త ఇంటికి, కొత్త మనుషుల మధ్యకు వెళ్తున్నాను, వాళ్లు నన్ను ఎలా చూసుకుంటారో అన్న భయం, అనుమానం ఆమెకూ  ఉంటాయి కదా ! తన వైపు నుంచి కూడా ఆలోచించాలి గదమ్మా... "
 తెల్లబోయి చూస్తున్న వాళ్లతో నెమ్మదిగా ఇంకా అనునయంగా అంది వసుంధర.
".. మేమేదో అనుకుని వస్తే, ఈవిడేంటి నీతి బోధలు చేస్తోంది మాకు.. అనుకోమంటే... ఒక్క మాట చెబుతాను. ఆ తర్వాత మీ ఇష్టం... "
ఇద్దరూ తలెత్తి  ఆమె కళ్ళల్లోకి చూశారు. 
" మీ పిల్లల్ని సరిగా చూసుకుంటూ ఉన్నదా లేదా అన్న విషయం కొద్దిరోజులపాటు పక్కనబెట్టి, ముందు మీరు ఆమెను ప్రేమగా, ఆప్యాయంగా చూసుకోవడం మొదలెట్టండి ఈరోజు నుండే... ఆమెను ఇంటి కోడలుగా కాకుండా  మీ సొంత మనిషిలా చూస్తూ, నీకు మేమున్నామనే భరోసా, ధైర్యం కలిగించండి. అప్పుడు.. అప్పుడు.. మీరేదయితే ఆమె నుండి ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా మీకు అంది  తీరుతుంది..... "
"..................... "
".. మన ప్రవర్తనని బట్టే ఎదుటి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. పెద్దదానవు..నీకు నేను చెప్పేదేంటి! ... పరాయింటిది అన్న ఆలోచన మాని,...అమ్మలా  ఆమెను అక్కున చేర్చుకో.. భర్తగా నీ గుండెల్లో చోటివ్వు బాబూ.. అప్పుడు నీ పిల్లలకు సవతి తల్లి కాదు.. కన్నతల్లే  దొరుకుతుంది.వాళ్లు ఎప్పటికీ అనాధలు కారు.."
"...కొత్తఅమ్మ కాదు.. చిన్నమ్మ అసలే కాదు, వాళ్లకెప్పుడూ ఆమె అమ్మే ! అలా ఉండాలంటే ముందు మీరు మారండి... "
తల్లీకొడుకులిద్దరూ రెండు చేతులూ జోడించి  నమస్కరించారు. ఇంతవరకూ వాళ్లకు తోచని కొత్త విషయం బోధపడింది.వాళ్ళ కళ్ళల్లో నీటి సుడులు...!!మొహాల్లో అవ్యక్త భావన !!
"అమ్మా, మిమ్మల్ని బాధ పెట్టాలని గానీ, నిరాశపరచాలని గానీ కాదు. ఏ దిక్కూ మొక్కూ లేని వాళ్లకమ్మా ఈ అనాధాశ్రమాలు. కానీ వీళ్లకు మీరంతా ఉన్నారు. ఈ పసితనం, ఈ బాల్యం అయినవాళ్ల దగ్గర హాయిగా గడిచిపోనీయండి. నేను చెప్పినట్లు చేయండి. ఫలితం కనిపించలేదనుకోండి.. అప్పుడు రండమ్మా ఇక్కడికి.. తప్పకుండా చేర్చుకుంటాను పిల్లలని. మరోలా భావించకండి దయచేసి..."
 వాళ్లకి నమస్కరిస్తూ చెప్పింది వసుంధర.
"అయ్యో తల్లీ, తప్పకుండా అమ్మ... ఏదో ఇరుగు పొరుగువాళ్ళు సవతి తల్లి ఏం చూస్తుంది,ఏంచేస్తుంది అంటూ రకరకాలుగా అంటా ఉంటే నిజమే అనుకొని వచ్చామమ్మా... మాకు సరైన దారి చూపించావు తల్లీ. తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తామమ్మా. వెళ్ళొస్తాం.."
 దండం పెడుతూ, బాధగా అందామె.
 పిల్లల్ని పట్టుకుని వెనుదిరిగిన వాళ్ళతో,
" వెళ్ళొస్తాం కాదు వెళ్తాం అనాలి.. "
 నవ్వుతూ అంది వసుంధర. చిరునవ్వుతో నిష్క్రమించారు ఇద్దరూ పిల్లలిద్దరి చేతులు పట్టుకుని. తృప్తిగా నిట్టూర్చింది వసుంధర.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment