Friday, February 2, 2024

ఒక వంటకం వండి చూడు..(కథ)

                                        ~~ రచన : యం. ధరిత్రీ దేవి 

" ఏంటిది సుమీ, ఏం కూర ఇది? రుచీ  పచీ లేదు.. "
" బీరకాయ కూరండి.. "
" ఛ ఛ ! ఏదీ  ఆ పచ్చడి ఇలా పడెయ్.. అదైనా తిన బుద్ధవుతుందేమో.. "
 సుమిత్ర మనసంతా అదోలా అయిపోయింది. పెళ్లయి మూడు నెలలు పూర్తి కావస్తోంది. పెళ్లికి ముందు వంటింటి మొహం చూసి ఎరగదు. భర్త సురేష్ కు రుచిగా లేకుంటే ముద్ద దిగదు. పైగా... రోజుకోరకం కావాలంటాడు. ప్రతి పూటా  ఇదే గొడవ!
   సెల్ ఓపెన్ చేసి, యూట్యూబ్ లో వంటల వీడియోలన్నీ చూసేసింది. చేయగలిగినవి.. ఓ నాలుగైదు సెలెక్ట్ చేసుకుని, ట్రై చేసింది. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక  ఊడిందన్నట్లు అయింది ఆమె పరిస్థితి. ! విసుక్కోవడం ముదిరిపోయి చేయి కడుక్కుని లేచిపోవడం మొదలైంది. 
    గుడ్ల నీరు కుక్కుకుంటూ పక్కింటి ప్రభావతి ఆంటీతో  మొరపెట్టుకుంది ఆ పిల్ల తన గోడు. ఆవిడ ఓదార్చి, పెళ్లయిన కొత్తలో ఇలాంటివి మామూలేనంటూ ఆరోజు తను చేసిన వంకాయ కూర ఓ గిన్నెలో పెట్టి ఇచ్చింది. లొట్టలేసుకుంటూ తిన్నాడు సురేష్. అంతటితో ఊరుకోక, 
" సుమీ, నువ్వూ ఇలా చేయడం నేర్చుకోవా.. "
 అంటూ ఓ సలహా పారేశాడు. మరుసటి రోజు చిన్న సీసాలో టమోటా చట్నీ ఇస్తూ, దాంతోపాటు బంగాళాదుంప వేపుడూ ఇచ్చింది ప్రభాతమ్మ. 
" ఎంత బాగుందో... ఎంత బాగుందో! "
 అనుకుంటూ... భార్యను కాదు... ప్రభావతి ఆంటీని మెచ్చుకున్నాడు సురేష్. ఆంటీ నడిగి తెలుసుకుని, రెండు రోజుల తర్వాత అచ్చం అదే పద్ధతిలో చేసి పెట్టింది సుమిత్ర. 
" అబ్బా ఏంటి సుమీ.. ఆంటీ కూర ఎంత బాగుండింది!"
 అంటూ మళ్లీ నసుగుడు, విసుగు! ఆంటీ చెప్పినట్లే తుచ  తప్పకుండా చేసింది.. కానీ ఆ  రుచి రాలేదట అయ్యగారికి!! ఏముంది! ఏడుపు ఒక్కటే తక్కువ సుమిత్రకు.
"ఛఛ...! వంట ఆడవాళ్లే చేయాలని నియమం ఎందుకు పెట్టారో ఏంటో ! ఆ రోజుల్లో అయితే ఓకే. కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా మగవాళ్లతో సమానంగా బయటపడి ఉద్యోగాలు చేస్తున్నారు కదా! మరి.. అలాగే మగాళ్లు కూడా వంట పనులు చేయడం లేదేమిటి! ఎందుకని ఈ వివక్ష !! ఆ మాట అన్నామంటే గయ్యిమని మీదపడి తన్నినంత పని చేస్తారీ మగాళ్లు.."
 తల పట్టుకుంది సుమిత్ర. అయినా.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు...అన్నట్లు "ఓ వంటకం వండి  చూడు" అని చెప్పాలి ఈ మగాళ్ళందరికీ. ! ఒళ్ళు మండిపోయి తలనొప్పి వచ్చేసిందా పిల్లకి...ఆ ఊపుతో రాత్రంతా ఆలోచించింది. అలా వరుసగా వారం రోజులు పాటు ఆలోచిస్తూనే గడిపేసింది. ఆ మరుసటి రోజు, ఆంటీ ఇచ్చిందండీ అంటూ బంగాళాదుంప వేపుడు, మజ్జిగ పులుసు వడ్డించింది. 
" అబ్బ ! ఆంటీ చేతి వంటే వంట !! ఆ చేతిలో ఏముందో గానీ,  అద్భుతం! ఎంత బాగుందో!"
 లొట్టలేసుకుంటూ మళ్లీ మళ్లీ కలుపుకొని తిన్నాడు సురేష్ తృప్తిగా. సుమిత్ర తల పంకించింది. అలా వరుసగా నాలుగైదు రోజులు పక్కింటి ఆంటీ ఇచ్చిందనీ, ఎదురింటి అక్కయ్య రుచి చూడమందనీ రకరకాల కర్రీస్ వడ్డించింది సురేష్ కు. ఏముంది...వాళ్ళను పొగడడం, భార్యను తెగడడం...అలాగే చెయ్యాలంటూ పోరుపెట్టడం..!కొత్త బాధ మొదలైంది సుమిత్రకు.మూడు రోజులు గడిచాయి. ఆరోజు మధ్యాహ్నం మామూలుగా భోజనానికొచ్చాడు సురేష్. 
" చూడండి. ఆంటీలాగే చేశాను.. వంకాయ కూర.. "
అంటూ వడ్డించింది. అతను మొహం అదోలా పెట్టి , 
" అస్సలు కుదర్లేదు సుమీ, ఆ రుచే రాలేదు.ప్చ్ !"
పెదవి విరిచాడు. 
"తెలివి అఘోరించినట్టే ఉంది. మొన్న ఇదే కూర బ్రహ్మాండంగా ఉందంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు...!"
"అవునూ.. అది ఆంటీ చేసినది కదా !"
" మహాశయా, ఆ కూరా ఈ కూరా చేసింది నేనే. అంతేకాదు, వరుసగా మూడు రోజులు వాళ్ళూ వీళ్లూ ఇచ్చారని మీకు చెప్పి వడ్డించిందీ నేను వండినవే. పక్కింటి ఆంటీవి కాదు, ఎదురింటి అప్పలమ్మవీ కావు... "
"..అదేంటే !వాళ్లిచ్చారని చెప్పావ్ !"
" ఆ, అలా చెప్తేగానీ తమరి నోటకెక్కదాయె.. ఏంచేయను మరి !నేను చేస్తే చేదా !వాళ్ళూ వీళ్లూ చేస్తే అమోఘమూ, అద్భుతమూనా !! అయినా, రోజూ కూరలు గీరలూ నాకు సప్లై చేయడానికి నేనేమన్నా వాళ్ల అమ్మ చుట్టాన్నా, అబ్బ చుట్టాన్నా.. !" 
" సుమీ, నిజమా ! నిజంగా నిజమా! అవి కూడా నువ్వే చేశావా..!"
" లేకపోతే... "
" సారీ రా. నువ్వు కూడా వాళ్లంత బాగా చేయాలని అలా అంటుంటాను గానీ..."
".. అదేమీ కాదు లెండి, పొరుగింటి పుల్ల కూర రుచి ఎవరికైనా.."
 ఉడుక్కుంది  సుమిత్ర. అతని వైపు ఓరగా చూస్తూ, గిన్నెలు సర్దుతూ, 
" అయినా, అప్పుడప్పుడైనా పెళ్ళాం వంటల్ని మెచ్చుకోకపోతే అసలుకే మోసం వస్తుందండీ శ్రీవారు.."
దెప్పిపొడిచింది. ఆ రోజు నుండీ సురేష్ భార్య వంటలకు వంకలు పెడితే ఒట్టు! అని అంటాను అనుకుంటున్నారా ఏంటి !! అయ్యో రామ! ఇప్పటికి  పదేళ్లయిపోయింది పెళ్లయిపోయి.. ఇద్దరు పిల్లలు ఇంట్లోకి ఎక్స్ట్రాగా వచ్చారు. సుమిత్ర కష్టపడి ఓపిగ్గా చేస్తూనే ఉంది. ఆయన గారు కడుపారా తింటూనే ఉన్నారు. వంకలు పెడుతూనే ఉన్నారు.. నైజం ఎక్కడికి పోతుందండీ  బాబు! సుమిత్ర మాత్రం తక్కువ తిందా! భర్త మెప్పు కోసం తన వంతు ప్రయత్నం మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంది.. అది ఆమె నైజం!అది మాత్రం ఎక్కడికి పోతుంది పాపం!! పుట్టుకతో వచ్చిన బుద్ధులు మరి !!   
  కాకపోతే... ఓ చిన్న మార్పయితే జరిగిందండోయ్.! ఇది వరకు ప్లేటు  ముందు కూర్చోగానే వంకలు వెదికే భర్త గారి జోరు మాత్రం కాస్తలో కాస్త తగ్గింది. కారణం..! ఆయన గారు నోరు తెరిస్తే చాలు.. బ్రేకులు వేసే సుమిత్ర కస్సుబుస్సులే !! thank god! కనీసం అదైనా అలవడింది ఆ ఇల్లాలికి.. !

******************************************


No comments:

Post a Comment