Sunday, March 10, 2024

కొత్త కోణం....కథ

🌷🌹
     సెల్ లో  అలారం మోగింది. టైం చూస్తే నాలుగున్నర కావొస్తోంది. దిగ్గున లేచింది విశాలి. నిద్రమత్తు వదిలించుకుంటూ చకాచకా పనుల్లో చొరబడింది. ఏడున్నరకు మిగతావాళ్లూ లేచారు. టిఫిన్ టేబుల్ మీద పెట్టేసి, పిల్లలకు, భర్తకు, మరిదికీ, ఆడపడుచుకూ లంచ్ బాక్సులు సర్దేసింది. ఎనిమిదిన్నరకంతా పిల్లలు, తొమ్మిదింటికి భర్త ఆఫీస్ కూ, మిగతా ఇద్దరూ కాలేజీలకు బయలుదేరారు. అత్తమామలకు టిఫిన్లు పెట్టేసి, స్నానాదికాలు పూర్తి చేసుకుని, టిఫిన్ తిందామని బౌల్ తెరిచింది. ఒకే ఒక్క దోశ, గిన్నెలో అడుగున కాస్త చట్నీ దర్శనమిచ్చాయి. ఫ్రిజ్ లో దోసెల పిండి ఉంది. కానీ మళ్ళీ వేసుకునే ఓపికెక్కడ ?  ఉన్న ఆ ఒక్కటీ ఏదో తిన్నాననిపించి చేయి కడిగేసుకుంది. పన్నెండింటికి అత్తమామలకు  స్టవ్ మీద అన్నానికి పెట్టేసింది. ఉదయమే అందరితోపాటు వండితే... చల్లారిపోయింది తినలేమంటూ సణుగుడు మరి !
              ***      ***        ***
    సాయంత్రం ఆరయింది. అందరూ టీవీ చూస్తూ కూర్చున్నారు. విశాలి వంటింట్లో బజ్జీలు వేస్తూ, మరో చేత్తో అందరికీ ప్లేట్లలో పెట్టి అందిస్తోంది. అంతా లొట్టలు వేసుకుంటూ తింటూ టీవీ ప్రోగ్రాం ఎంజాయ్ చేస్తున్నారు. వంటింట్లో చెమటలు కారిపోతూ విశాలి ! రెండు రోజుల క్రితం భర్త శంకర్ మాటలు గుర్తొచ్చాయామెకు. 
" ఏంటీ, రోజూ ఈ మిక్సరేనా ! మరేదైనా చేసి పెట్టొచ్చు కదా! ఏం చేస్తుంటావు...! రోజంతా ఇంట్లోనేగా... పనీపాట ఏముంది నీకు...!!"
ఆ మాటలు శూలాల్లా  వచ్చి విశాలి గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. గుడ్ల నీరు కుక్కుకుందేగానీ, పెదవి విప్పలేదు. చిన్నా  పెద్దా... అంతాచూస్తున్నా చెవిటి వాళ్ళలా మౌనముద్ర దాల్చారు...! చేసేదేముంది ! ఈరోజు అందుకే ఈ బజ్జీల కార్యక్రమం..!
ఉన్నట్టుండి ఆడపడుచు మానస, 
" అమ్మా, మా కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ గల కొందరు స్త్రీలను సన్మానించాలనుకుంటున్నారు. అందుకోసం స్టూడెంట్స్ అందరినీ మాకు బాగా తెలిసిన కొందరి పేర్లను ఇవ్వమన్నారు. అందులో నుండి కొందరిని సెలెక్ట్ చేస్తారట. నేనేమో..మన  ఎదురింటి ఆంటీ శ్రీవిద్య గారి పేరు ఇద్దామనుకుంటున్నా.. వంటలు బాగా చేస్తుంది. కుట్లు అల్లికలు, టైలరింగ్ అంతా వచ్చు.. చక్కగా మాట్లాడుతుంది. ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి కదా ఆంటీ కి..."
" ఔనౌను, వెనక వీధిలో ఉంటుందే...రాధాబాయి... ఆవిడ పేరు కూడా ఇవ్వు. ఉద్యోగం చేస్తూ కూడా రకరకాలుగా అందరికీ సేవలు చేస్తూ ఉంటుంది..."
"... మరిచిపోయాను, బాగా గుర్తు చేశావు.."
 వద్దనుకున్నా ఆ మాటలు చెవుల్లో దూరి, 
" అంతేలే, గొడ్డు  చాకిరీ  చేస్తూ ఇంట్లో ఉన్న వదిన, కోడలు మాత్రం మీ కంటికి ఆనరు... "
అనుకుని నిట్టూర్చింది. నిజానికి తనకూ రకరకాల టాలెంట్స్  ఉన్నాయి. ఒకటి రెండు కంప్యూటర్ కోర్సులు కూడా చేసింది. ఇంగ్లీషులో చక్కటి పరిజ్ఞానమూ  ఉంది. కానీ ప్రస్తుతం అవన్నీ సమసిపోయి వీళ్ళ దృష్టిలో ఎందుకూ పనికిరాని దానిలా తాను మిగిలిపోయింది. పెరటి చెట్టు మందుకు పనికి రాదు కదా! పొరుగింటి పుల్లకూరే  రుచి మరి !! అలాగని సన్మానాలూ, సత్కారాలూ కోరుకోవడం లేదు తను. కాస్త గుర్తింపు.. అంతే! ఆమెలో బాధ, ఆవేదన అంచలంచెలుగా పెరిగిపోసాగాయి. ఇది ఒక నాటిది కాదు, పదేళ్లుగా గూడు కట్టుకున్న వ్యధ !
   ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునే వరకు తను లేనిదే క్షణం గడవదు వీళ్ళందరికీ. వదినకు కాస్త సాయపడమని చెప్పే ఆలోచన అత్తగారికి ఉండదు. రేపు తనూ ఒకింటి కోడలు కావాల్సిందే కదా ! అప్పుడెలా ఉంటుందో ! వెంటనే...
" తనలా మాత్రం ఉండదులే... ఆ గడుసుదనం, ఆ అతితెలివీ నాకెక్కడివి?  అవేవీ  లేకనే నేనిలా ఉన్నాను..."
అనుకుంది మళ్ళీ. డిగ్రీ దాకా చదివిన విశాలి పెళ్లికి ముందు ఓ ఆఫీసులో చిన్న ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత భర్త ససేమిరా వద్దన్నాడని మానేసింది. పది సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లల తల్లయింది. ఇంట్లో జీతభత్యాలు లేని పనిమనిషి పోస్టు సరే సరి !! 
   ఆమె దృష్టి పక్కనే కూర్చుని పుస్తకాలు ముందేసుకుని హోంవర్క్ చేసుకుంటున్న కూతురు, కొడుకు మీదకు మళ్ళింది. అమాయకంగా కనిపిస్తున్న కూతురు శృతిని చూస్తూ, 
" ఇంత గారాబంగా చూసుకుంటూ, ఇంత లేసి ఫీజులు కడుతూ చదివిస్తున్న ఈ పిల్ల గతి  కూడా రేపు ఇంతేనా ! నాలాగేనా ! అదేదో సినిమాలో ఓ ఆడపిల్ల తండ్రి, 
" ప్రాణప్రదంగా,  అడుగేస్తే ఎక్కడ కందిపోతుందో అని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ వచ్చిన బిడ్డను పెళ్లి పేరిట మరో ఇంటికి   ఓ పనిమనిషిగా పంపిస్తున్నాం ."
అంటాడాయన ఓ సందర్భంలో ఆవేదనగా !! ఆమాత్రానికి అంతంత ఖర్చుపెట్టి వీళ్ళని అంత గొప్పగా చదివించడమెందుకో!తల పట్టుకుంది విశాలి.  టీవీలో పాట వస్తోంది.

"మగువా మగువా 
లోకానికి తెలుసా నీ విలువా 
మగువా మగువా 
నీ సహనానికి సరిహద్దులు కలవా.. "

నిజమే! సహనం ఉండాలి. ఆ సహనానికి హద్దులూ ఉండాలి. ఇంట్లో వాళ్లకే తన విలువ తెలియదు. లోకానికంతా  తెలుసా అనడుగుతున్నాడు. పాటలు ఎంత బాగా రాస్తారు ! పాడేవాళ్లు అంతకన్నా అద్భుతంగా పాడుతారు... కానీ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది... అసలు బాధ..!
  మహిళా దినోత్సవం అనేసరికి గుర్తొచ్చింది ఆమెకు, రెండు సంవత్సరాల క్రితం తను తీసుకున్న ఓ నిర్ణయం గురించి... అది  తను మళ్లీ ఉద్యోగం చేయాలని..! ఏ చిన్నదైనా సరే....చేయాలి..!  తప్పదు.. అనుకుంది. రెండు మహిళా  దినోత్సవాలు గడిచిపోయాయి గానీ, అనుకున్నది మాత్రం జరగలేదు.
    ఎలా ఉండేది చదువుకునే రోజుల్లో ! ఎప్పుడూ  చుట్టూ  పదిమంది ఫ్రెండ్స్! రకరకాల వ్యాపకాలు! ఆ విశాలి ఇప్పుడేదీ? ఎక్కడ ? ఆ గలగల నవ్వులేవీ ? ఏమైపోయాయి? ఇలా మూగగా మిగిలిపోయిందేమిటి!
ఆరాత్రి ఆమె కన్నీటితో చెంపలు తడిసిపోయాయి. ఆ తడి ఆమెకో  పాఠం నేర్పింది. ఆ పాఠమే ఆమెకో దిక్సూచి అయింది . కరడు గట్టిన ఆమె గుండె స్థిరత్వం సంతరించుకుంది.
                 ***       ***           ***
  మూడు నెలలు గడిచిపోయాయి. ఆఉదయం.... పిల్లలిద్దరూ ఆటోలో స్కూల్ కి వెళ్ళిపోయారు. మరిది, ఆడపడుచు కాలేజీకి బయలుదేరుతున్నారు. భర్త షూ వేసుకుంటున్నాడు. అత్తమామలిద్దరూ టిఫిన్ చేస్తున్నారు. ఇంతలో విశాలి రెడీ అయి, బ్యాగ్ భుజానికి తగిలించుకుని వచ్చింది. 
" నేనూ మీతో వస్తున్నా.... నన్ను నవోదయ స్కూలు దగ్గర డ్రాప్ చేయండి. ఈరోజు నుండీ నేను ప్రీ  ప్రైమరీ క్లాస్ టీచర్ గా జాయిన్ అవుతున్నానక్కడ...."
అంతా ఒక్కసారిగా ఆమె వంక చూశారు చిత్రంగా. 
 విస్తు పోయిన శంకర్, 
" అదేంటీ ! చెప్పా  పెట్టకుండా..."
" చెబితే ఏం జరుగుతుందో తెలుసు.. పదండి"
భర్త ముఖం చూడకుండా బయటికి దారి తీసింది విశాలి.
" అది  కాదే... నీవిలా వెళ్ళిపోతే, ఇంట్లో ఎలా? " 
కాస్త దూరంలో రోడ్డు మీద నిలబడి ఉన్న విశాలి పక్కన బండి ఆపాడు శంకర్. 
" ఎలా ఏమిటి? నలుగురున్నారు.. పనులన్నీ తలా కాస్త షేర్ చేసుకోండి... చేతకాకపోతే.. ఓ మనిషిని పెట్టుకోండి.. నేను లేకపోతే ఇంట్లో అంతా స్తంభించిపోతుందని మాత్రం  అనుకోకండి. చూస్తూ ఉండండి. అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి... "
మరో మాటకవకాశం లేకుండా ఎక్కి కూర్చుంది విశాలి. ఆ స్వరంలో, ఆ మొహంలో మునుపెన్నడూ లేని స్థిరత్వాన్ని గమనించిన శంకర్ కు భార్యలో ఇంతవరకూ తానెరుగని ఓ కొత్తకోణం గోచరించింది. క్షణం అతని గుండె రెపరెపలాడింది. మరుక్షణం దీనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.... తనూ కారణమా అనిపించి, ఏదో మూల అతనిలో ' గిల్టీ ఫీలింగ్'!! వెంటనే తనకు తాను సర్ది చెప్పుకుంటూ, బండి స్టార్ట్ చేశాడు.
    విశాలి పెదాలపై చిరునవ్వు ! ఆమెలో ఈ ప్రపంచాన్నే జయించినంత తృప్తి !!

******************************************
[ ప్రతీ ఆడదీ ఉద్యోగమే చేయాలనేమీ లేదు. ఇంట్లో ఆమె శ్రమను గుర్తిస్తే చాలు. ఆమె సహనాన్ని అభినందించాలి. సేవాగుణాన్ని, సర్దుబాటుతత్వాన్ని కొనియాడాలి. ఆమె విలువ  తెలుసుకుని గౌరవించాలి. ప్రతీ ఇంట్లో ఇది జరిగితే... అల్పసంతోషి అయిన స్త్రీ ఆనందానికి అవధులుండవు. ఆమె కంట కన్నీరన్నది అసలుండదు.  ]
******************************************



   

3 comments:

  1. శభాష్ 👏. కానీ గ్రాడ్యుయేట్ అయ్యుండీ మరీ ప్రీ-ప్రైమరీ క్లాసులకు టీచరా 🤨? ప్చ్ ప్చ్.
    🙂🙂

    ReplyDelete
    Replies
    1. అంతే లెండి. ఏదో ఒకటి ఆరంభం అంటూ చెయ్యాలిగా. 👍

      Delete
    2. కథలో విశాలికి పెళ్లయ్యాక చాలా గ్యాప్ వచ్చింది.అప్పటికప్పుడు మంచి జాబ్ రావాలంటే కష్టం. వెంటనే ఏదో చిన్న జాబ్ లో చేరడం ఆమె అభిమతం...అన్నమాట...🙂

      Delete