🌷
ఆదివారం మధ్యాహ్నం. సమయం ఒంటిగంట దాటుతోంది. వంటింట్లో బాగా బిజీగా ఉంది మధుమతి. హాల్లోనేమో ఫోన్ రింగవుతూ ఉంది. ఎవరో ఏమిటో...! ఏ టైం లో ఫోన్ చేయాలో బొత్తిగా తెలిసిచావదు జనాలకి... అనుకుంటూ వెళ్లి చూసింది. ఏదో కంపెనీ కాల్. ఛీ ఛీ.. వీళ్ళ ఆగడం పాడుగానూ !గాఢ నిద్రలో ఉన్నవాళ్ళను కూడా తట్టిలేపి మరీ వాళ్ళ బిజినెస్ చేసుకోవడం ! తిట్టుకుంటూ వెనుదిరిగింది. నిమిషం తర్వాత మళ్ళీ రింగ్ ! నీ సంగతి నాకు తెలుసులే... అనుకుని కదల్లేదీసారి. రెండోసారి మళ్ళీ... ఓవైపు పప్పు, మరోవైపు కూర.. ! తప్పదనుకుంటూ విసవిసా వెళ్లి చూసింది. రామేశ్వరి!
అరే.. ఇప్పుడెందుకు చేసిందబ్బా! అనుకుంటూ తీసింది.
"ఏమిటే మధూ, నిన్న పెళ్లికి రాలేదు? మనవాళ్లంతా వచ్చారు, నువ్వు తప్ప.. "
అంది. ఓ క్షణం నివ్వెర పోయింది మధుమతి.
" పెళ్ళా? ఎవరిదే?.. "
"ఎవరిదేంటి... ! మన సరోజిని కూతురిది.. మరిచిపోయావా ఏంటి!"
".. సరోజ కూతురిదా... ! వచ్చే శనివారంకదే... !"
" నీ మొహం.. ! నిన్ననేనే తల్లీ... భలే దానివే. !"
".. ఔనా ! ఉండు... "
అంటూ వెళ్లి ఫ్రిజ్ మీది కవర్ కింద పెట్టిన శుభలేఖ తీసి, డేట్ చూసింది..
"ఔనేవ్.. ! ఈ శనివారమే.. నిన్ననే,. ! ఎంత పనైయిపోయింది!నేనింకా వచ్చే శనివారం అనుకుంటూ.. .ఏ చీర కట్టుకోవాలా... ఏదండ వేసుకోవాలా... ఎలా తయారవ్వాలా అని ఒకటే ప్లానింగ్ లో ఉన్నా.... "
"... అఘోరించావ్ !నువ్వూ నీ మతిమరపూ ! సరూ నీకోసం అడిగింది కూడాతెలుసా !"
తల పట్టుకుంది మధుమతి. దేవుడా... ! తన కూతురి పెళ్ళికి వచ్చి, మంచి గిఫ్ట్ కూడా ఇచ్చింది సరోజ. తనేమో... ఛ ఛ ! వెంటనే ఫోన్ చేయాలి.ఇంకా ... ఈరోజు సాయంత్రమే వెళ్లి కలవాలి... లేకుంటే సంబంధాలే చెడి కూర్చుంటాయ్ ! అనుకుంటూ సోఫాలో కూలబడింది. వంటింట్లో ఏదో మాడుతున్న వాసన వచ్చి ముక్కుపుటాల్ని సోకింది... ఛ ఛ !కూర మాడికూర్చున్నట్టుంది ! ఈ మతిమరుపు రోగం ఏమిటో నాకు! రానురాను శృతి మించుతోంది... అనుకుంటూ వంటింట్లోకి పరుగు తీసింది.
** ** **
మధుమతికి ఈమధ్యే యాభైఐదు నిండాయి. కూతురి పెళ్లి చేశారు. కొడుకు చదువైపోయి ఉద్యోగంలో కుదిరాడు. భర్త ఓ గవర్నమెంట్ ఉద్యోగి. ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఫ్రెండ్ సర్కిలూ ఎక్కువే. అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఎందుకో ఏమిటో మతిమరుపు జాడ్యం మొదలైంది ఆమెలో. ఒక చోట పెట్టి మరో చోట వెతకడం! కింద పెట్టి పైన పాకులాడ్డం అంటారే అలా.. ! చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం! ఉన్నట్టుండి చేయవలసిన పనులు మర్చిపోవడం!! అలాగన్నమాట!
మొన్నటికిమొన్న.. సాయంత్రం ఏవో కొనాలని బజారుకు బయలుదేరింది. ఓ గంట పాటు తిరిగి అంతా పూర్తి చేసుకుని, ఆటో ఎక్కబోతుండగా... ఎదురుగా వేడి వేడి సమోసాలు వేస్తూ కనిపించిందో చిన్నపాటి హోటల్.ఠక్కున ఆగిపోయింది.
"సరే.. ఆయన ఇంటికి వచ్చే టైం అయింది..తీసికెళ్తేపోలా... ఇప్పుడెళ్లి స్నాక్స్ కోసం మళ్ళీ తంటాలు పడ్డమెందుకు !ఎంచక్కా ఇద్దరం కూర్చునితింటూ, టీ తాగుతూ కబుర్లాడుకోవచ్చు .. "
అంతే! ఆమె కాళ్ళు అటువైపు లాగాయి. వెళ్లి ఓ నాలుగు సమోసాలు ప్యాక్ చేయించింది.షాపతను ప్యాకెట్ చేతికిచ్చాడు. తీసుకుని ఓపక్కగా కౌంటర్ మీద పెట్టేసి, బ్యాగ్ లో చేయి పెట్టింది డబ్బు కోసం. చిల్లర నోట్లు కనిపించక లోపలి జిప్ తెరిచి, 200|- నోట్ ఇచ్చింది. అతను తిరిగిచ్చిన నోట్లు జాగ్రత్తగా తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటూ టైం చూసుకుంది. ఆరవుతోంది .
" బాబోయ్.! ఆయన వచ్చేస్తుంటారు.."
అనుకుంటూ గబగబా వెళ్లి రెడీగా ఉన్న ఆటో ఎక్కేసింది. ఇల్లు చేరేసరికి భర్త వచ్చేసి, సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. అమ్మయ్య అనుకుంటూ,
" వచ్చేశారా...నిమిషం.. టీ పెట్టి తెస్తాను... ఈలోగా ఇదిగో... సమోసాలు తింటూ ఉండండి..."
అంటూ బ్యాగులో చెయ్యి పెట్టింది. ప్యాకెట్ తగల్లేదు. కంగారుగా అన్ని అరలూ వెతికింది. అహ !! ఏమైంది! ఆటోలో జారి పడిపోయిందా! ఓరి దేవుడో! ఓ నిమిషం తర్వాత... మెల్లిగా సీన్ రివైండ్ అయింది. ఫ్లాష్ వెలిగింది. షాపతనిచ్చిన ప్యాకెట్ అక్కడే కౌంటర్ మీద పెట్టి, డబ్బు అయితే ఇచ్చేసింది... ప్యాకెట్ తిరిగి తీసుకోవడం మాత్రం మరిచింది...! అదీ జరిగింది!!
తిరిగి వెళ్లి తెస్తానంటూ బయలుదేరబోయింది.
".. బాగుందే నీ తెలివి! అరవై రూపాయల సమోసాల కోసం మరో అరవై ఆటోకు తగలెయ్యడం... అవసరమంటావా!"
గయ్యిమన్నాడు. బిక్కచచ్చిపోయి 'నిజమేస్మీ' అనుకుని నోరెళ్ళబెట్టింది..
"..మధుమతి కాదే... మందమతి... మందమతి అని పెట్టి ఉండాల్సింది మీ వాళ్ళు..."
చిన్నబుచ్చుకుని డీలాపడిపోయింది మధుమతి.
" సరేలే.. సమోసాలెటూ లేవు.. కాస్త టీ నీళ్లయినా నా మోహన కొడతావా...లేదా !"
"అయ్యో... ! కొడతానండీ.... "
చప్పున నాలిక్కరుచుకుని, చెంగున వంటింట్లోకి దూరింది.ఆతర్వాత ఓవారం పాటు...కొనీ తినలేకపోయిన ఆ సమోసాలే మాటిమాటికీ ఆమె కల్లోకి వస్తూ, వెక్కిరిస్తూ నిద్రకు దూరం చేశాయి.
** ** **
శ్రావణమాసం సమీపిస్తోంది. ప్రతీసారి భర్త నడిగి చీర కోసం డబ్బు తీసుకునేది. ఇప్పుడు కొడుకూ సంపాదనపరుడయ్యాడాయె ! ఇద్దరూ చెరో ఐదు వేలు చేతిలో పెట్టేసి, 'నీ ఇష్టం' అనేశారు. మధుమతి ఉప్పొంగిపోయి మరుసటి రోజే షాపింగ్ కార్యక్రమం పెట్టేసుకుంది. పనంతా అయ్యాక రెడీ అయిపోయి, బ్యాగ్ లో డబ్బు జాగ్రత్తగా పెట్టుకొని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంది. టైం చూస్తే పదకొండయింది. భర్త ఆరింటికి గానీ రాడు... కొడుకేమో వేరే ఊర్లో ఉద్యోగం.. ఇంకేముంది.! నిదానంగా టెన్షన్ లేకుండా అన్ని షాపులూ చుట్టేయొచ్చు... ఎంచక్కా.. ! అనుకుంటూ చక చకా బయటపడింది.
ఎండ మండుతూ ఉంది. మెయిన్ రోడ్డు దాకా వెళ్తే గానీ ఆటోలు ఉండవు. పది నిమిషాల నడక తర్వాత ఆటో ఎక్కేసి 'అమ్మయ్య ఇక హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు' అనుకుంది. ఆటో దూసుకుపోతోంది. నిండా సంతోషంగా ఉన్న మధుమతికి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది.
"ఇంతకీ ఇంటికి బయట తాళం వేశానా లేదా!"
అంతే! అనుమానం పెనుభూతం! తొలిచేయసాగింది. బ్యాగులో డబ్బు పెట్టుకోవడం, బీరువా తాళం వేయడం గుర్తుంది, కానీ... బయట మెయిన్ డోర్..!అహ! అసలే దొంగలు పట్టపగలే హల్ చల్ చేస్తున్న వైనాలు! ఇంట్లో పదిహేను తులాల పైనే బంగారు నగలు!గుండెజారింది.
" బాబూ, కాస్త ఆపవా.."
దాదాపు గెంతేసి, చేతిలో డబ్బులు కుక్కేసి, అదోలా చూస్తున్న అతన్ని పట్టించుకోకుండా, తిరిగి చూడకుండా వెంటనే మరో ఆటోఎక్కింది. తీరా చూస్తే.. తాళం సలక్షణంగా వేసే ఉంది. తల పట్టుకుని.. నా మతిమరపు మండా... అనుకుంటూ..
" సరే... ఎలాగూ వచ్చాను.. నాలుక పిడచగట్టుకుపోతూ ఉంది. కాసిని చల్లటి నీళ్లు తాగి వెళ్దాం.."
అని, తాళం తీసి, హ్యాండ్ బ్యాగ్ సోఫా లో పడేసి, ఫ్రిజ్లో బాటిల్ తీసి, తాగుతూ టైం చూసింది.పన్నెండు !
"ఛ ఛ ! టైం అంతా వేస్ట్.."
కంగారుగా బయటికి వచ్చి, ఈసారి చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటూ, తాళం వేసేసి, ఒకటికి నాలుగు సార్లు లాగి లాగి చూసి సంతృప్తి పడింది. సరిగ్గా అప్పుడే ఎదురింటి మీనాక్షి గారి అబ్బాయి.. బీటెక్ కుర్రాడు... ప్రేమ్,
" ఆంటీ, బజారుకా? రండి, డ్రాప్ చేస్తా.."
అన్నాడు.
" అమ్మయ్య, ఈ ఎండకు మళ్లీ ఆటో కోసం ఆయాస పడుతూ నడవడం తప్పించాడు. సమయానికి భలే దొరికాడులే ..."
వెంటనే ఎక్కి కూర్చుంది. మెయిన్ రోడ్డు వద్ద డ్రాప్ చేసి ప్రేమ్ వెళ్ళిపోయాడు. పట్టు చీరల బజారు కోసం మళ్లీ ఆటో ఎక్కాలి, తప్పదు.. అనుకుంటూ ఖాళీగా వెళ్తున్న ఆటోను పిలిచి, బేరమాడుతూ భుజం తడుముకుంది. అంతే ! గుండె గుభేల్ మంది.
"..బ్యాగ్... అయ్యో, నా హ్యాండ్ బ్యాగ్ !ఏదీ? ఎక్కడ? "
కొద్దికాలంగా మధుమతి ఓ అలవాటు చేసుకుంది. బ్యాగ్ లోపల డబ్బులు అన్నీ పెట్టుకుంటే ఆటోలకు ఇంకా ఇతర వాటికి చిల్లర నాణాలు, చిన్న నోట్లు ఒక పట్టాన దొరికేవి కావు. అందుకని ఓ చిన్న పర్సులో కొద్ది చిల్లర నోట్లు పెట్టుకొని అది మాత్రం చేత్తో పట్టుకుని, బ్యాగ్ భుజానికి తగిలించుకొనేది..ఆ అలవాటు ఇప్పుడు బెడిసి కొట్టింది దారుణంగా మరి !!మళ్ళీ సీన్ రివైండ్ అయింది.
ఇంట్లోకి వెళ్ళగానే, మంచినీళ్లు తాగడానికి ఫ్రిజ్ దగ్గరికి హ్యాండ్ బ్యాగ్ సోఫాలో పడేసి, పర్సు మాత్రం అలానే చేత్తో పట్టుకొనివెళ్ళింది.. తిరిగి వస్తూ టైం చూసుకుంటూ ఆ కంగారులో బ్యాగ్ సంగతి మరిచి, బయటికి వచ్చేసింది. తాళం వేసి కదిలేసరికి... ఎదురుగా... ప్రేమ్! అసలు విషయం మర్చిపోయి, అప్రయత్నంగా తాళం చెవి పర్సులో వేసేసుకుని, బైక్ ఎక్కి కూర్చుంది తాపీగా..! ఆ సమయంలో ఆమె 'కాన్సన్ట్రేషన్' అంతా తాళం వేయడం మీదే ఉండిపోయింది మరి! అదీ జరిగింది !! మళ్లీ తల పట్టుకుంది.
" ఛ ఛ.. ! ఈరోజు ముహూర్తం బొత్తిగా బాగున్నట్టు లేదు పట్టు చీర కొనడానికి! ఇప్పుడేం చేయను ! డబ్బుల్లేకుండా షాపింగేంటి నా ఖర్మ!"
తనని తానే తిట్టుకుంటూ పర్సు తెరిచింది.
"ఏంచేస్తావ్ ! పద పద..కొంపకి... "
అంటూ వెక్కిరిస్తూ పకపక నవ్వాయి అందులోని చిల్లర నోట్లు ! చేష్టలుడిగి నిలుచున్న మధుమతి ముందు ఆటో వచ్చి ఆగింది.
"అమ్మా, ఆటో... "
పళ్ళికిలిస్తూ చూశాడు ఆటో వాడు. తీరా చూస్తే... ఇందాక ఎక్కి, తాళం సంగతి గుర్తొచ్చి దిగిన ఆటో వాడే..! మామూలుగా ఉన్నట్లయితే ఆ ఇకిలింపుకు దులిపేసేదే ! కానీ... ఇప్పటి ఆమె'కండిషన్' వేరే ! నిరాశ కమ్మేసి, నీరసం ముంచుకు వచ్చిన మధుమతి మరో మాట చెప్పే ఓపిక లేక గబుక్కున ఎక్కి సీట్లో కూలబడింది.
" ఎంత పని చేసావే...! ముదనష్టపు నా మతిమరుపా! పని జరక్కపోగా.. ఆటో డబ్బులు బొక్క.! మండుటెండలో అనవసర శ్రమ! అంతకుమించి... అంతకుమించి..... "
అనుకున్న పని అనుకున్నట్లుగా అనుకున్న టైంలో జరగక ఆగిపోయినందుకు పిచ్చెక్కినట్లయి తిట్టుకుంటూ, గొణుక్కుంటూ మొహమంతా ముడుచుకుపోయి కూర్చుండిపోయింది పాపం !మధుమతి...మతిమరపు మధుమతి !!
**************************************
No comments:
Post a Comment