🌷 🌹 💐 🌹 🌷
************************************************
🌹 సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
చిన్నారి చిలకమ్మా నావారు ఎవరే
నా తోడు ఎవరే ఎన్నాళ్లకొస్తాడే 🌹
--- ఉయ్యాల ఊగుతూ ఊహల్లో తేలిపోతూ పాడుకుంటున్న శ్రీదేవి గుర్తొస్తోంది కదూ ! ఆ ముద్దు మోము, అందాల చిరునవ్వు, అమాయకత్వం, ముగ్ధత్వం కలబోసుకున్న ఆ సోయగం వెన్వెంటనే మన కళ్ళముందు కదలాడి తీరతాయి అంటే అతిశయోక్తి అని ఎవరైనా అనగలరా! పాట... పాటను మించిన అభినయం.... దాన్ని మించిన చిత్రీకరణ ! అత్యద్భుతం ! ఇంతకీ... సిరిమల్లెను ప్రశ్నించడం ఏమిటి తన తోడు ఎన్నాళ్ళకొస్తాడని ? అదంతా కవి భావన అని అందరికీ తెలిసిందే. తనలో చెలరేగే భావాల్ని, కోరికల్ని, ఇంకా చెప్పుకోలేని ఎన్నెన్నో ఆలోచనల్ని ఓ ఆడపిల్ల వ్యక్తీకరించాలంటే మనుషులతో సాధ్యం కానప్పుడు ఇలా ఓ పువ్వును ఆశ్రయించాల్సిందే.. అంతే కదా !
-- ఇలా పూల మీద కవులు, రచయితల కలం నుండి జాలువారిన గీతాలెన్నో.... ఎన్నెన్నో.. ! ప్రకృతికి సొబగులద్దడానికి పువ్వుల్ని మించినవేమున్నాయి !ఆ వర్ణాలు, ఆ సోయగాలు వర్ణనాతీతం ! సృష్టించిన విధాత ఎంత సృజనశీలియో కదా ! ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క రూపం, ఒక్కొక్క పరిమళం అద్ది దేని ప్రత్యేకత దానిదే అన్నాడు.
ఏ కాస్త కవితా హృదయమున్న మనిషికైనా పూలను చూస్తే ఆహ్లాదం పుట్టుకొచ్చి కవిత్వం దానికదే పెల్లుబుకుతుందేమో ! అందుకేనేమో మన సినీ కవులు రకరకాల పుష్పాల వర్ణనలో మునిగితేలుతూ, వాటితో కబుర్లాడుతూ అద్భుతమైన, మధురాతి మధురమైన గీతాల్ని సృష్టించగలిగారు. గాయనీ గాయకులు వారల గళ మాధుర్యంతో వీనులవిందుగా ఆలపించారు. అలాంటి పాటల్ని ఓ సారి మననం చేసుకోవాలని పిస్తోంది నాకీరోజు. మీకూ మరికొన్ని మస్తిష్కంలో మెదలవచ్చు. ప్రయత్నించండి.
🌹 మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా 🌹
ఘంటసాల గారి గళంలో ప్రాణం పోసుకున్న ' నిర్దోషి'
చిత్రంలోని ఈ పాట ఆ తరం వాళ్ళకు సుపరిచితం. తన గోడు వినే వాళ్ళు లేనప్పుడు చుట్టూ ఉన్న పూలతో అన్యాపదేశంగా సందేశాల్ని పంపించవచ్చని కవి భావన కాబోలు !
మల్లెలేనా ! మేమేం తీసి పోయామంటూ గులాబీలు పోటీపడుతూ వచ్చిన పాటలు కోకొల్లలు.
🌹 ఓహో గులాబి బాలా
అందాల ప్రేమమాలా
సొగసైన కనులదానా
సొంపైన మనసు దానా
నీ వారెవరో తెలుసుకో 🌹
-- పాట వినగానే పీ. బి. శ్రీనివాస్ గారు గుర్తుకు రాకమానరు. తను ప్రేమించిన అమ్మాయి ఓ మోసగాడి వలలో చిక్కుకొని పోతున్నదన్న బాధతో తనకు తెలిసేటట్లు, గులాబీని ఉద్దేశించి పాడుతూ ఆమెను హెచ్చరిస్తున్నాడన్నమాట ! అప్పట్లో ఎందరి హృదయాల్నో అలరించిన పాట ఇది.
🌹 ఈ ఎర్ర గులాబీ విరిసినదోయీ
మకరందమంత నీదోయి రావోయీ 🌹
🌹 ఈ ఎర్ర గులాబీ విరిసినదీ
తొలిసారీ నినుకోరీ 🌹
-- అమ్మాయిలు తమని తాము గులాబీలుగా చెప్పుకుంటూ పాడిన పాటలివి.
🌹 రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా రోజా పువ్వా
రోజూ రోజూ పూస్తూ ఉన్న రోజా నువ్వా 🌹
-- పాట వినగానే గుర్తొచ్చేది హీరో రాజశేఖరే ! అతని స్టెప్స్, స్మైల్ అనుకరిస్తూ ఎందరు ఎంత కామెడీ సృష్టించారో... సృష్టిస్తూ ఉన్నారో... తెలియంది కాదు. అలా మరింత గొప్పగా పాపులర్ అయింది ఈ'రోజ్'పాట !
గులాబీ పూలపై మరిన్ని పాటలు మీ మదిలో మెదిలే ఉంటాయి ఈ పాటికి ! 🙂
🌹 చిన్నారి పాపల పొన్నారి తోటలో
విరిసిందో ఎర్రగులాబీ
విరబూసిందో చిన్ని గులాబీ 🌹
--- మళ్లీ శ్రీదేవి ! కాకపోతే బేబీ శ్రీదేవి ! ఆ చిన్ని వయసులోనే ఎంతటి హావభావాలు పలికించిందో కదా ! ఒకసారి చూస్తే చాలు... ఎప్పటికీ మరపురాని ఆ ముఖారవిందం ! పోటీపడుతూ అభినయం !!
--- ఆడపిల్ల మనసు గులాబీలా సుతిమెత్తని దంటూ ఉంటారు. అలాగే అమ్మాయిల్ని బంతిపూలతో పోలుస్తుంటారు కూడా. నిజమే ! బంతి పువ్వు ఎంత ముద్దుగా ముచ్చటగొలుపుతూ ఉంటుంది ! పదహారేళ్లొచ్చిన ప్రతీ అమ్మాయి ఓ ముద్దబంతి పువ్వే! అలాగే... చామంతులు... వీటి మీద వచ్చిన పాటలూ తక్కువేమీ కాదు.
🌹 బంతిపూల రథాలు మా ఆడపడుచులు
పులి బిడ్డలు మా వాడ రైతు బిడ్డలు 🌹
🌹 భామా భామా బంతీ పువ్వా..... 🌹
🌹 చామంతి పువ్వా పువ్వా.....🌹
🌹 బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే.. 🌹
---ఇక విషాద గీతాల్లో మేటి ----
🌹 ముద్దబంతి పూవులో
మూగకళ్ల ఊసులో
ఎనక జనమ బాసలూ
ఎందరికీ తెలుసులే.. 🌹
-- ఈ పాటల్ని ఓ సారి మననం చేసుకుని మీలో మీరే పాడుకోండి చూద్దాం.... 🙂
🌹 ముద్దుకే ముద్దొచ్చే మందారం ముద్దమందారం🌹
జంధ్యాల గారి 'ముద్దమందారం'.... అందులోని ఈ పాట బహుళ ప్రాచుర్యం పొందిందారోజుల్లో ! ఇప్పటికీ మందారం అంటే జంధ్యాలగారి ముద్దమందారమే గుర్తొస్తుంది. కాదంటారా !
----- ఇలా ఎన్నెన్ని పాటలుద్భవించాయో ! అన్నీ సుమధురగీతాలే. అందరికీ సుపరిచితాలే. అలా పూలతో మాట్లాడుతూ, పువ్వుల్ని వర్ణిస్తూ, అమ్మాయిలతో పోలుస్తూ కవి తన భావనల్ని అక్షరాలుగా మారుస్తూ ఆ సౌరభాల్ని అందరికీ పంచు తూ అలరిస్తున్నందుకు మనసారా అభినందనలు.
ఇలా పూలపై చాలా చాలా పాటలొచ్చాయి. నేను కొన్ని మాత్రమే ప్రస్తావించగలిగాను. ఆలోచిస్తే మీక్కూడా మరికొన్ని బుర్రలో తళుక్కున మెరుస్తాయి. --- ఇది కేవలం సరదా కోసమే... కాసేపు కాలక్షేపం కూడా. 🙂🙂🙂
*********************************
No comments:
Post a Comment