🌺
హైస్కూల్లో చదివేరోజుల్లో మా సైన్స్ టీచర్ గారి గురించి ఇదివరలో ఓ పోస్ట్ లో ప్రస్తావించాను. సన్నగా, పొడవుగా కళ్ళద్దాలతో చాలా హుందాగా ఉండేవారు. ఆవిణ్ణి ఎప్పుడూ సీరియస్ గా ఉండటమే చూశాం మేము. మిగతా టీచర్లతో కూడా ఎప్పుడూ కలివిడిగా మాట్లాడ్డం మా కంటబడలేదు.
ఆవిడ క్లాసులో అడుగు పెట్టబోతుండగానే అంతవరకూ రణగొణధ్వనులతో నిండిన వాతావరణం ఒక్కసారిగా చప్పున చల్లారి సైలెంట్ గా అయిపోయేది. రాగానే వెంటనే చాక్ పీస్ తీసుకుని,
" ఈరోజు టాపిక్... "
అంటూ వెంటనే బోధన మొదలెట్టేది. అంతా pindrop silence ! చెప్పేది తలకాయలూపుతూ బుద్ధిగా వినడమే తప్ప...ప్రశ్నలు వేయడంగానీ, మాటకు ఎదురు చెప్పడంగానీ... ఉహూ..అసలుండేది గాదు. ఆవిడ మొహంలో చిరునవ్వుకోసం ఎదురుచూసేవాళ్ళం... !సాధ్యపడేది గాదు. అలాంటి ఆ టీచర్ గారు ఒకరోజు యధావిధిగా క్లాసులోకి వచ్చారు.
" ఈరోజు టాపిక్.. 'కీళ్లు'...joints "
అంటూ బ్లాక్ బోర్డు మీద హెడ్డింగ్ రాసి, అందరివైపు చూస్తూ మొదలెట్టారు. కీళ్లలోని రకాలు చెప్తూ, మోచేతి కీలు గురించి వివరించబోతూ ఒక్క క్షణం ఆగారు. చప్పున ఆమె పెదాలపై సన్నగా నవ్వు! మేమంతా షాక్! ఆ నవ్వును కొనసాగిస్తూ,
" ఈ మోచేతి కీలు గురించి చెప్పేముందు, ఓ చిన్న పిట్ట కథ గుర్తొస్తోంది నాకు... అదేంటంటే..."
అంతా నిటారుగా అయిపోయాం ! ఈవిడ నోటి నుండి కథ ! చెవులు రిక్కించాం. అందరిలో ఉత్కంఠ !
"...ఒకమ్మాయికి కొత్తగా పెళ్లయింది. సరే... అత్తారింటికి వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత ఆమె తండ్రి కూతురు ఎలా ఉందో చూసొద్దాం అనుకుని ఆమె అత్తారింటికి వెళ్ళాడు. ఎలా ఉందమ్మా కొత్త కాపురం అని అడిగాడు... ఆ పిల్ల... ఎలా ఉండడమేంటి నాన్నా... చాలా బాగా ఉంది. ఎంత బాగా అంటే... హఠాత్తుగా మోచేతికి ఏదైనా తగిలితే, ఎంత ఆనందంగా ఉంటుందో అంత హాయిగా అన్న మాట..!అని చెప్పింది. ఆ తండ్రి.. ఆహా ! నిజంగా అంత సంతోషంగా ఉందన్నమాట నా బిడ్డ.. ! మరేమీ పరవాలేదు.. అనుకుంటూ గుండెల నిండా సంతోషం నింపుకుని ఇల్లు చేరాడు. కొన్ని రోజుల తర్వాత... ఇంట్లో నుండి బయటకు గబగబా వస్తూ ఉన్న ఆయన మోచేయి అనుకోకుండా గోడకు గట్టిగా కొట్టుకుంది. అంతే! నొప్పితో ప్రాణం గిలగిలలాడిపోయిందాయనకి!
తాళలేక గట్టిగా మోచేతిని పట్టుకొని కూర్చుండిపోయాడు.. హఠాత్తుగా ఆయనకి కూతురు మాటలు గుర్తొచ్చాయి. మోచేతికి దెబ్బ తగిలితే ఇంత నొప్పిగా ఉంటుందా ! ఇంత వయసాచ్చింది నాకు... ఈ విషయం ఇప్పటిదాకా తెలియలేదేంటి ! అంటే నా కూతురు అత్తింట్లో అంత బాధ పడుతోందన్నమాట !! అప్పటికి గానీ ఆ అమాయకపు తండ్రికి కూతురి మాటల్లోని అంతరార్థం బోధపడలేదు... ! అదీ సంగతి! "
కథ ముగిసింది. గుడ్లప్పగించి చూస్తోన్న మేమంతా రిలాక్స్ అయిపోయి, తేరుకుని, వెంటనే ఒక్కసారిగా చప్పట్లు కొట్టాం... కథ గురించి కాదు.. మా సైన్స్ టీచర్ కథ చెప్పారు.. అదీ... నవ్వుతూ... ! అందుకని అసంకల్పితంగానే వచ్చేశాయి ఆ కరతాళధ్వనులు !వెంటనే గలగల నవ్వులు!! శృతి కలుపుతూ మా టీచర్ గారు!
అంతే... ఆ రోజుతో సరి! మళ్లీ మామూలే.. ఆ సీరియస్నెస్సే ! మళ్లీ అలాంటి సందర్భం వస్తుందా! మళ్లీ ఆ నవ్వు చూడగలమా ! అని ఎదురు చూడడమే గానీ... మా ఆశ అయితే ఫలించలేదు. ఒకే ఒక్క కథ అయినందుకో ఏమో... ఆమె చెప్పిన ఆ కథ మెదడులో అలా హత్తుకుని పోయింది ఈనాటికీ... ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కూడా... కథతో పాటు ఆ టీచర్... ఆ జ్ఞాపకమూనూ !!
******************************************
No comments:
Post a Comment