Wednesday, May 3, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే-16-కవిత్రయం ..

🌺
  
     ఇంటర్ అయ్యాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ విజయవాడ మేరీస్టెల్లా (Maris stella) కాలేజీలో చేర్పించారు మా నాన్నగారు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్.. అమ్మాయిల కోసమే. చాలా పెద్ద కాలేజీ. చుట్టూ పెద్ద కాంపౌండ్... ముందువైపు మూడంతస్తుల బిల్డింగ్. లోపల వెనకవైపు హాస్టల్.. అదీ మూడంతస్తులే. పటమట, బెంజి సర్కిల్ లో ఉండేది. మంచి పేరున్న కాలేజీ అని చేర్పించారు... కానీ, అక్కడి వాతావరణం నాకు అలవాటు కావడానికి కొంత సమయం పట్టింది. నెల రోజులు గడిచాక, కాలేజీలో, హాస్టల్లో నలుగురైదుగురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. 
   ఉదయం బ్రేక్  ఫాస్ట్ అయ్యాక తొమ్మిదింటికి కాలేజీకి వెళ్లడం, మధ్యాహ్నం 12.30 కు లంచ్ కు హాస్టల్ కు రావడం ! డైనింగ్ హాల్ చాలా పెద్దదిగా, బాగా మోడర్న్ గా ఉండేది. పెద్దపెద్ద టేబుల్స్, చుట్టూ ఛైర్స్! దానికి తగ్గట్టే ఫుడ్ ! గంటలో తినడం, తిరిగి మధ్యాహ్నం క్లాసులకు పరుగులు తీయడం !నాలుగున్నరకనుకుంటా...క్లాసులవంగానే హాస్టల్ రూమ్ కి చేరుకోవడం..కాలేజీకి, హాస్టల్ కూ మధ్యలో ఓ కాంటీన్ ఉండేది. చాక్లెట్స్ దగ్గర్నుండి సమోసాలూ, అన్నీ తక్కువ ధరలకే ఇచ్చేవారు. స్టూడెంట్స్ కోసమే ఆ వెసులుబాటు ! పావలాకు ఓ పొట్లం నిండా మిక్చర్, రూపాయి, రెండు రూపాయలకు కేక్స్... అలా ఉండేవి ధరలు!మాకు నచ్చినవి కొనుక్కుని తింటూ రూమ్ కెళ్ళేవాళ్ళం. ఈ దినచర్య అలవాటయ్యాక బాగానే ఉందనిపించింది నాకు. ఆ తర్వాత రోజులు చకచకా జరిగిపోవడం కూడా జరిగింది.
   ఇంతకీ... ఇదంతా ఇప్పుడు ఎందుకు రాయాలని అనిపించింది అంటే... ఫస్ట్ ఇయర్ మొదట్లో క్లాసులో ఎదురైన ఓ చిన్న అనుభవం... ఇప్పటికీ  అలా నా మదిలో నిలిచిపోయింది. అది గుర్తొచ్చినప్పుడల్లా నాలో ఏదో ఆహ్లాదకరమైన భావన!
  చేరి వారమై ఉంటుందేమో! మెల్లి మెల్లిగా క్లాసులు మొదలై పుంజుకుంటున్నాయి. ఆరోజు మధ్యాహ్నం సెకండ్ పీరియడ్. తెలుగు క్లాసు మొదలవబోతోంది.లాంగ్వేజి క్లాస్ కాబట్టి అన్ని గ్రూపులవాళ్లూ కలుస్తారు. అలాగే మా గ్రూప్ వాళ్ళం కూడా వచ్చాము. అప్పటికే మిగతా గ్రూపులవాళ్లంతా వచ్చేసి, క్లాస్ రూమంతా ఆక్రమించేశారు. పెద్ద హాలు !గ్యాలరీస్ తో ! ముందంతా నిండిపోయిఉంది. వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెనక్కి వెళ్లి, అక్కడ మిగిలిపోయిన ఖాళీ సీట్లలో సర్దుక్కూర్చున్నాం. అసలే ఆడపిల్లలు ! గలగల మాటలు, కిలకిల నవ్వుల్తో క్లాసంతా గోలగోలగా ఉంది. అంత గోలా ఠక్కున ఆగి,  నిశ్శబ్దం అలుముకుంది  ఒక్క క్షణంపాటు ! మరుక్షణంలో.... ఒకావిడ నెమ్మదిగా నడుస్తూ వచ్చి స్టేజి ఎక్కి నిల్చుంది. మరీ  ఎత్తు మరీ పొడుగు కాక కాస్త బొద్దుగా ఉంది. గుండ్రటి ముఖం. ముడి వేసుకుని  చాలా హుందాగా ఉంది. అందర్నీ చూస్తూ చిన్నగా నవ్వి, 
" హాయ్! అమ్మాయిలూ, నా పేరు రమాదేవి. తెలుగు లెక్చరర్ని..."
 అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ మొదలెట్టారావిడ. 
"... ఇది మన మొదటి క్లాసు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. ఎలా చెప్తారో చూద్దాం...ప్రశ్నలంటే భయపడకండే .అయితే  నేను అడిగిన వాళ్లు మాత్రమే చెప్పాలి..."
 అంటూ క్లాసంతా తేరిపారజూసింది.ఆచూపులు అటూ ఇటూ, ఇటూ అటూ కలయదిరిగి చివరికి  సరిగ్గా వచ్చి చిట్ట చివర్లో కూర్చున్న నా మీద పడ్డాయి. అంతే !వెంటనే, నావేపు వేలు చూపిస్తూ, 
" అమ్మాయ్, నువ్వు చెప్పు.. కవిత్రయం ఎవరు? "
ముందున్న వాళ్లంతా తలలు వెనక్కి తిప్పి ఎవరా అని నావేపు చూపులు సారించారు.  ఒక్కసారిగా గుండె దడదడలాడింది నాకు.మొదటి క్లాసు. అంతమందిలో లేచి చెప్పాలంటే బిడియంగా అనిపించింది. పైగా చివరిగా దూరంగా ఉన్నాను. జవాబు అయితే బాగా తెలిసినదే... కానీ తప్పదనుకుంటూ బెరుగ్గానే లేచాను. అందరికీ వినబడాలి కదా... ముఖ్యంగా మేడమ్ గారికి !నీళ్లు నములుతూ నిల్చోక,  గట్టిగా గడగడా చెప్పేశాను. (అలా ఎలా చెప్పగలిగానో.. ! తర్వాత నాకే  ఆశ్చర్యం కలిగింది). దీనికే అంత ధైర్యం కావాలా! అనిపించొచ్చు. కానీ ఆ వయసు... ఆ 'సిచువేషన్' అలాంటిది మరి నాకు!! 
" నన్నయ భట్టు , తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ "
చెప్పీచెప్పగానే, 
" గుడ్... వెరీ గుడ్.."
అనేసి, 
"... నీ పేరేంటమ్మాయ్? "
అనడిగారు. చెప్పాను. 
" చక్కటి పేరు..."
అని అందరి వైపు చూస్తూ, 
" ధరిత్రికి కవిత్రయం అంటే చాలా గౌరవంలాగా ఉంది. కవిత్రయం ఎవరు అనడిగితే  అందరూ నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అని  సింపుల్ గా వాళ్లు ముగ్గురూ అదేదో వాళ్ల క్లోజ్ ఫ్రెండ్స్ అయినట్లు చెప్తుంటారు. కానీ ఈ అమ్మాయి నన్నయ భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ అని పూర్తిగా చెప్పేసింది. అలా ఉండాలి రెస్పెక్ట్ అంటే...!"
అని నవ్వేశారామె. క్లాస్ అంతా శృతి కలిపింది. 'అమ్మయ్య' అని నిట్టూర్చి చటుక్కున కూర్చుండిపోయాను. అనూహ్యంగా నాలో ఏదో తెలీని సంతోషం ! అలా  మొత్తం క్లాసంతా అనుకోని విధంగా మొదటి రోజే నా పేరు తెలిసిపోయింది. ఆ రోజు నుండీ క్లాసు బయట ఆ మేడంగారు ఎక్కడ కనిపించినా, నన్ను చూసి పలకరింపుగా నవ్వేవారు. అలా  ఆరోజు జరిగింది నా స్మృతిపథంలో చక్కటి జ్ఞాపకంలా నిలిచిపోయింది. నా  కాలేజీ రోజుల్లోని మరపురాని ఓ మధురస్మృతి అది !! కవిత్రయం అన్న మాట ఎవరి నోట విన్నా, ఎక్కడ చదివినా నాకదే గుర్తొస్తూ ఉంటుంది. 🙂
*****************************************








2 comments:

  1. కర్నూలు నుండి విజయవాడ వరకు వచ్చారా డిగ్రీ కాలేజీ కోసం!! బాగు బాగు.

    నేను లయోలా కాలేజీలో చదివాను లెండి. మీ కాలేజీకి ఎదురుగానే, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రక్కనానూ. సాయంత్రం క్లాసులు వదిలాక హాస్టల్ రూమ్ లో పుస్తకాలు పడేసి, దాదాపు రోజూ మీ కాలేజీ మీదుగా బెంజ్ సర్కిల్ దాకా వెళ్ళడం, అక్కడో కప్పు టీ తాగి, తిరిగి గబగబా నడుచుకుంటూ మా కాలేజీ హాస్టల్ కు వచ్చి పడిపోవడం - ఎందుకంటే ఆరు గంటలకు మా వార్డెన్ ఫాదరీ గారు హాస్టల్ గేట్ మూసేసే వారు. ఆలస్యంగా వస్తే ఫైన్ లు. అదో ప్రపంచం.

    ఆ మధ్యనొకసారి విజయవాడ వెళ్ళినప్పుడు చూస్తే ఊరంతా గుర్తు పట్టలేవంతగా మారిపోయింది. మన కాలేజీలకు దగ్గర్లో బోలెడన్ని కాలనీలు వెలిసాయి. వాటిల్లో ఒక దాంట్లో ఉంటున్న మా బంధువింటికి ఆటోలో వెళ్ళాను. బెంజ్ సర్కిల్ వచ్చినప్పుడు చెప్పు నాయనా, కాస్త చూసి ఆనందిస్తాను అని చెప్పాను. బెంజ్ సర్కిల్ ఇందాకే దాటేసాం కదండీ అన్నాడు 😟😟.

    ReplyDelete
    Replies
    1. చదువయ్యాక అటువేపు వెళ్ళింది లేదు. ఇప్పుడు గనక వెళ్తే నేనూ గుర్తుపట్టలేను సర్ 🙂

      Delete