Friday, May 19, 2023

ఆచూపు ఎదురుతిరిగిన వేళ...!?

***************************
"ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి... ఆపై హత్య !"
   కొద్దికాలంగా రోజూ ఏదో ఒకచోట ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. అదీ బాగా పరిచయస్తులే !చుట్టుపక్కలవాళ్లే... ఈ దారుణాలకు పాల్పడుతున్న వైనాలు !!
     మధ్యాహ్నం దినపత్రికలో ఆ వార్త చూసిన సంయుక్తకు మనసంతా కకావికలమైపోయింది. ఇటీవల కొందరు సినీతారలు Me too Movement ద్వారా, కొన్ని సంధర్భాల్లో... మరికొందరు ప్రముఖ మహిళలు  తమ చిన్నతనంలో ఇంట్లోవాళ్ళ వల్ల ఇంకా సన్నిహిత బంధువుల నుండీ ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడిస్తూ, ఆ చేదు అనుభవాలు తాము పెరిగి పెద్దయ్యాక, వివాహితులై తల్లులయ్యాక కూడా వెంటాడుతూనే ఉంటూ తీవ్ర మానసిక క్షోభ ననుభవిస్తూ ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆ లేత వయసులో కనీసం తల్లికి కూడా చెప్పుకోలేక ఎంత వేదనకు గురి అయిఉంటారో కదా ఆ చిట్టి తల్లులు!!ఇంకా ఇలాంటివి వెలుగులోనికి రానివి కోకొల్లలు !  సంయుక్తకు ఆ క్షణంలో తన  చిన్ననాటి జ్ఞాపకమొకటి మదిలో మెదిలింది.ఆవెంటనే.. ఆ జ్ఞాపకాన్ని అల్లుకుని జరిగిన పరిణామాలు వరుసగా కళ్ళముందు కదలాడాయి.
              **                **             **
  బస్సు కదలబోతోంది. సంయుక్త,  ప్రకాష్ ఎక్కి కూర్చున్నారు. ఆమె ఒళ్లో రెండేళ్ల పాప. కిటికీ వేపు సర్దుకుని కూర్చున్న తర్వాత సంయుక్త యధాలాపంగా బయటికి చూసింది, ఓవైపు కాస్త దూరంగా... ఒకతను తననే చూస్తున్నాడు... అనుకోకుండా ఆమె చూపు అతని మీద పడింది... అంతే! వెంటనే అతను ఒకలా నవ్వుతూ కన్ను గీటాడు. అలా మళ్లీ.. మళ్లీ...! సంయుక్త అప్రతిభురాలై పోయింది. వెంటనే గుర్తు పట్టిందతన్ని. వాడు.. వాడు.. శివ... శివారెడ్డి! తను ఆరవ తరగతికి చదివేటప్పుడు తనకన్నా రెండేళ్లు సీనియర్. తమ ఊరి వాడే. పదేళ్ళుంటాయి సంయుక్త కప్పుడు. తనను క్లాసు బయట చూసినప్పుడల్లా వెంటనే అదోలా నవ్వడం.. ఆపై...కన్ను గీటడం ! పక్కనే మరికొందరు ఆడపిల్లలున్నా సంయుక్తతోనే అలా ప్రవర్తించేవాడు. చిన్న వయసైనా ఆ పిల్లకు  ఆ వంకర చూపులు అర్థమై జుగుప్స కలిగేది. కానీ పక్కన ఎవరితో చెప్పుకుందామన్నా... ఏదో బెరుకు! ఏమనుకుంటారో తన గురించి!  అందరిలో లోకువైపోతానో ఏమో! అన్న శంక !! చివరికి... ఇంట్లో తల్లికి చెబుదామన్నా... ఎలా చెప్పాలో... ఏమని చెప్పాలో ఆ పసిదాని బుర్రకు తట్టేది కాదు. అలా ఒకసారి, రెండుసార్లు కాదు... చాలాసార్లు జరిగింది. అంతే! వాడలా చూడ్డంతోనే ఆగిపోయింది.. తన స్కూల్ ఫైనల్ ముగిసి, ఇంటర్,  డిగ్రీ కూడా అయిపోయింది. ఆ తర్వాత పెళ్లయింది. పాప కూడా పుట్టింది. వాణ్ణి  పూర్తిగా మర్చిపోయింది కూడా...
   ఈరోజు... పండగ శెలవులకు పుట్టింటికి భర్తతోపాటు వచ్చి, తిరిగి వెళుతుండగా... చాలా ఏళ్ల తర్వాత వీడు మళ్లీ ఇలా...! ఒళ్లో పాప... పక్కనే భర్త !!అయినా  వీడి నైజం... వికృత చేష్టలు!!అసలేమనుకుంటున్నాడు నా గురించి ! ఆమెలో కోపం రగులుకుంది. మరుక్షణమే గుండె దడదడలాడింది. Thank God ! ఈయన చూడలేదు. ఈలోగా వాడిని దాటుకుని, బస్టాండ్ దాటి, బస్సు బయటికి వచ్చేసింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది సంయుక్త. అంతలో అనిపించిందామెకి...  ఇదేమిటి ! నేనేదో తప్పు చేసినట్లు ఇంతలా భయపడి పోతున్నాను!! అనుకుంటూ తల విదుల్చుకుని స్థిరంగా కూర్చుండిపోయింది.
                 **                **            **
    మరో మూడేళ్లు గడిచిపోయాయి. దసరా శెలవులకు పుట్టింటికి వచ్చింది సంయుక్త. ప్రకాష్ పండగ అవంగానే వెళ్లిపోయాడు. తను మరో నాలుగు రోజులయ్యాక పాపతో బయలుదేరి బస్టాండ్ చేరుకుంది. బస్సు ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నారు బెంచి మీద కూర్చుని. అంతలో అల్లంత దూరాన.. వాడే... వాడే!! మళ్లీ... అదే చూపు! అదే అసభ్య ప్రవర్తన!! 
   చిర్రెత్తుకొచ్చింది సంయుక్తకు. ఆ క్షణంలో ఆమెకు అనిపించింది.. ఏమిటో ! ఆలోచిస్తుంటే వీడు తనను ప్రతిసారీ ఇలా కావాలనే వెన్నంటి  వస్తున్నాడేమో ! తన మౌనం వాడికి మరింత బలాన్ని ఇస్తోందా ! ఈమె నన్నేమీ చేయలేదు అనుకుంటున్నాడా... పెళ్లయి ఇన్నేళ్లయినా.... పక్కనే అయిదేళ్ల పాప కనిపిస్తున్నా... వీడికి ఇంగితం అన్నది ఏమాత్రం ఉండటం లేదేమిటి  ! రానురానూ ఈమధ్య ఈ ఊరికి రావాలంటేనే లోలోపల ఏదో సంకోచం... బెరుకు !  ఒళ్లంతా కంపరంగా అనిపించింది సంయుక్తకు... తప్పదు.. ఏదో ఒకటి చేయాలి. తనిప్పుడు స్కూల్లో చదివే ఒకప్పటి చిన్నపిల్ల కాదు... అవివాహితా  కాదు..ముప్ఫై దాటి, మానసిక పరిపక్వత వచ్చిన ఒక స్త్రీ! ధైర్యం, స్థైర్యం నిండుగా సంతరించుకున్న ఓ పరిపూర్ణ ఆడది.!
  అంతే ! ఆనాటి అమాయకత్వం, భయం,  సంకోచం... ఇలాంటివన్నీ ఆ క్షణంలో అదృశ్యమైపోయాయామెలో... స్థిరంగా లేచి నిల్చుంది. 
చీర చెంగు తిప్పి బిగించింది.
" స్మితా, ఇక్కడే కూర్చుని ఉండు...కదలకు.. ఇప్పుడే వస్తా..."
అని పాపతో చెప్పి, ముందుకు కదిలింది. చరచరా వెళ్లి తన వైపే నవ్వుతూ చూస్తున్న అతని ముందు నిలబడింది. అనుకోని ఈ హఠాత్పరిణామానికి దిగ్భ్రమ చెందిన అతను అప్రయత్నంగా రెండు అడుగులు వెనక్కి వేశాడు. అతని మొహం లోకి సూటిగా చూస్తూ, 
" అన్నా ! ఏంటన్నా? నీకీ జబ్బు ఇంకా పోలేదా అన్నా! చిన్నప్పటినుంచీ  చూస్తున్నా.. ఆ కన్ను ఎందుకలా కొట్టుకుంటూ ఉంటుందన్నా? ఖచ్చితంగా ఇది జబ్బే.. ఎవరైనా డాక్టర్ కు చూపించుకో అన్నా..."
 అతని బుర్ర గిర్రున తిరిగిపోయింది ఒక్కసారిగా!! ఎన్నడూ నోరు విప్పని సంయుక్త... తన వైపు చూడ్డానికే జంకే ఈ సంయుక్త.. ! ఉన్నట్టుండి వచ్చి అనుకోని రీతిలో తన ముందు నిలబడ్డం ! అది  చాలదన్నట్టు... అంత ధైర్యంగా తన మొహంలోకి చూస్తూ మాట్లాడ్డం! 
  ఆమె నోటి నుండి మెత్తమెత్తని మాటలే అయినా...శూలాల్లా వెళ్లి అతని గుండెల్లో సూటిగా దిగబడ్డాయి..! అతనికి మరో పెద్ద షాక్! మాటకు ముందు ఓసారి... తర్వాత ఓసారి.. 'అన్నా'.. 'అన్నా' అని సంబోధించడం!!అసలు ఆమె నడిచిరావడంలోని ఊపు చూసిన అతను నేరుగా వచ్చి, తన చొక్కా పట్టుకుని నిలదీస్తుందేమో అనుకున్నాడు... కానీ... అంతకు వేయిరెట్లు పరాభవం ఎదురై అతని తల వాలిపోయింది. 
"...అన్నా, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బన్నా.... ఆడవాళ్లు అపార్థం చేసుకున్నారంటే.. నువ్వు చాలా చిక్కుల్లో పడిపోతావు, జాగ్రత్తన్నా... !"
మెల్లిగా షాక్  నుంచి తేరుకున్న శివారెడ్డి ... మారు మాట్లాడక, తలూపుతూ, 
"అ.. అ " అంటూ గబా గబా వెనక్కి తిరిగాడు. 
" అన్నా.. "
 వెళ్తున్న అతను ఠక్కున ఆగాడు.
"... డాక్టర్ దగ్గరికెళ్లడానికి నీవు మొహమాట పడితే చెప్పన్నా.. మా ఆయనకు తెలిసిన మంచి డాక్టరొకాయన  ఉన్నాడు... నేను చెప్తాను... తీసుకెళ్లి చూపిస్తాడు.."
అంతే!! పరుగు లాంటి నడకతో ఎదురొస్తున్నవాళ్లను తోసుకుంటూ  బస్టాండ్ దాటి క్షణాల్లో మాయమైపోయాడు వాడు... క్షణం ఆగి, బిగించిన కొంగు తీసేసింది సంయుక్త.   
" ఎదవ !  నేను ఆడపిల్లనురా... ఏ చూపు ఎలాంటిదో గ్రహించడం మా ఆడపిల్లలకు వెన్నతో పెట్టిన విద్య! ఈరోజేమిటి ! పదేళ్ల వయసులోనే నీ వికృత చూపులు అర్థమయ్యాయి నాకు...పాపం, నీకే అర్థం కాలేదు ఓ విషయం!ఆడపిల్ల ఎదురు తిరిగి, నోరు తెరిచిందంటే  నీలాంటి వెధవలు,  సంస్కారహీనులు నామరూపాల్లేకుండాపోతారని!
 అసలు...తాననుకున్నదొకటి.. జరిగింది మరొకటి!తనకొచ్చిన కోపానికి చరచరా వెళ్లి వాడి రెండు చెంపలూ వాయించాలన్న తలంపుతో దూసుకు వెళ్లింది  వాడి ముందుకు. కానీ.. ఠక్కున ఏమైందో ఏమో....! మొత్తం మారిపోయి అలా విచిత్రంగా నోటి నుండి జలజలా రాలిపడ్డాయి సుతిమెత్తని  మాటల తూటాలు.... అయినా.. ఛెళ్ళుఛెళ్ళున...కొరడా దెబ్బల్లాంటివి !వెళ్లి,  సరిగ్గా తగలాల్సిన చోట బాగానే తగిలాయి. 
     అదే మంచిదయింది... లేకుంటే అంతమందిలో అక్కడ పెద్ద సీనే క్రియేట్ అయి ఉండేది... వీడు నిజంగా మనిషే  అయితే... మళ్లీ నా వంక చూడ్డం కాదు గదా... నా దరిదాపుల్లోకి రావడానికి కూడా సాహసించడు. అసలు ఈ పని తాను ఎప్పుడో చేయాల్సిన మాట! ఇంత ధైర్యం, తెగింపు రావడానికి ఇన్నేళ్ల కాలం పట్టింది.  సరే... ఇప్పటికైనా తన సమస్య తానే పరిష్కరించుకోగలిగింది...అది చాలు.. పర్యవసానం ఏమైనా కానీ... ఎదుర్కోవడానికి సిద్ధం.."
  తనలో తాను జరిగింది మననం చేసుకుంటూ,  నెమ్మదిగా నార్మల్ అయిపోతూ అడుగులు ముందుకు వేసింది సంయుక్త.
" అమ్మా, ఎక్కడికెళ్లావు? "
" నాకు తెలిసిన ఓ అంకుల్ కనిపిస్తే... పలకరించి వస్తున్నా.. పదపద.. బస్సు వచ్చేసింది..వెళ్దాం.. "
 ఎదురు చూస్తున్న పాపకు చెప్తూ బ్యాగ్ పట్టుకుని బస్సు వేపు  కదిలింది సంయుక్త
      ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ఆ ఊరికి వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో బస్టాండ్ కి  వచ్చాక అప్రయత్నంగానే ఆమె కళ్ళు వాడి కోసం వెతికేవి. కానీ, మళ్లీ ఆ జాడే లేదు. మరెప్పుడూ ఆమె కంట పడలేదు వాడు. వాడి గురించి తల్లి దగ్గర ఆరా తీద్దామా అనుకుంది గానీ... అనవసర చర్చకు తెర లేపినట్లవుతుందని మిన్నకుండిపోయింది.
  సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ జ్ఞాపకం తుడిచిపెట్టుకుపోయింది ఆమెలో. అలా అనుకుందిగానీ... ఈరోజు పేపర్లో వార్త చదివేసరికి, నిద్రాణస్థితిలో ఉన్నదేమో... అది మళ్ళీ పడగ విప్పింది. చెప్పాలంటే తనకు ఎదురయింది చాలా చిన్నది. వాడెన్నడూ తనను సమీపించలేదు.. వాడి  గాలి కూడా తనను సోకలేదు. దూరంగా ఉండి విసిరిన ఆ వక్రపుచూపులే తనని ఏళ్ళ తరబడి ఎంతగానో బాధించాయి... అలాంటప్పుడు అభం శుభం ఎరుగని పసిపాపలు ఈ మృగాల వికృతచేష్టల బారినిబడి ఎంత నలిగి పోతుంటారో గదా !! అలాంటి చిన్నారుల జీవితకాలవేదన ఎలా తీరుతుంది? ఈ సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అన్నది ఎక్కడుంది  ?? 
  అలాంటి కీచకులను నడిబజార్లో నిలబెట్టి, వాడి తల్లి, పెళ్ళాం, బిడ్డలు, జనాలంతా చూస్తుండగా దేహశుద్ధి చేయాలి. కుటుంబ సభ్యులు సైతం చీదరించుకుని, అసహ్యించుకుంటేగానీ వాడెంత హీనుడో వాడికర్థం కాదు. చట్టాలు  కాదు... చుట్టాలు, చుట్టూ ఉన్నవాళ్లు వేసేదే ఈ మానవమృగాలకు  సరైన శిక్ష !
     ఎడతెగని ఆలోచనలతో సంయుక్త భారంగా కళ్ళు మూసుకుంది. 
*****************************************





No comments:

Post a Comment