Wednesday, May 24, 2023

ఆ చిన్నిపెట్టె... ఓ జ్ఞాపకం... ఓ ప్రయోజనం 🌷

    కొత్త చీర. కొని రెణ్నెళ్లు కాలేదు. తీగ మీద నుంచి లాగ బోతే కాస్త చిరిగింది. పాప డ్రెస్. అంతా చక్కగా ఉంది. కానీ కుట్లు ఊడిపోయాయి. ఇంకా షర్ట్స్... గుండీలు వదులయి, కొన్ని పగిలి.... అలా అలా.... ప్రతీ ఇంట్లో జరిగే భాగోతమే కదా! పోనీలే అంటూ పక్కన పడేయలేం. కాస్త చేత్తో కుట్టడం తెలిసి, రిపేర్లు చేసుకోగలిగిన ఇల్లాలయితే పరవాలేదు, అలాంటివి వెంటనే మళ్ళీ వాడకంలోకి వచ్చేస్తాయి. కానీ... అది చేతగాని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వెంటనే ఏ టైలర్ వద్దకో పరిగెత్తు కెళ్ళాలి. సమయం లేకపోతే నిదానంగా చూద్దాంలే అని పక్కకు పెట్టేయాల్సి వస్తుంది. అంతే కదా! వాటికి మళ్లీ ఎప్పుడు మోక్షం వస్తుందో చెప్పలేం. ఇంతకీ, ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? చెప్తాను. 
    చాలా సంవత్సరాల క్రితం నాటి మాట. నేను హైస్కూల్లో చదివే రోజులవి. అప్పట్లో మిగతా అన్ని సబ్జెక్టులతో పాటు రెండు మూడు అదనపు విషయాలు కూడా తప్పనిసరిగా ఉండేవి. అయితే వాటికి వారానికి ఒక్క పీరియడ్ మాత్రమే కేటాయించేవారు. అవి డ్రాయింగ్, సూయింగ్, డ్రిల్ క్లాసులు. డ్రాయింగ్ పీరియడ్ టైం టేబుల్ లో చూపించేవారు గానీ ప్రత్యేకించి టీచర్ అంటూ సరిగా ఉండేవారు కాదు. డ్రిల్ మాస్టర్ మాత్రం ఖచ్చితంగా ఉండేవారు. వారంలో ఒకరోజు సాయంత్రం చివరి పీరియడ్ గ్రౌండ్ లో అందర్నీ నిలబెట్టి వ్యాయామాలు చేయించేవారు మాస్టర్ గారు. ఒక్కోసారి ఏమైనా ఆటలాడించేవారు. ఈ పీరియడ్ అంటే మా అమ్మాయిలు ఉత్సాహంగానే ఉండేవారు. కానీ పైన చెప్పిన వాటిలో సూయింగ్ అనేదుందే --- అదంటేనే అందరికీ ఓ మూల చిరాకు! ఆడపిల్లలమైనా, ఉండేది వారానికి ఒక్కసారైనా ఎందుకో ఆ క్లాస్ మీద ఆసక్తి కనబరిచే వాళ్ళం కాదు. అబ్బా! ఏమిటి! బళ్లో కూడా ఈ కుట్లు అల్లికలు! అంటూ అందరూ తెగ విసుక్కునే వాళ్ళు. మాకు ప్రత్యేకించి సూయింగ్ క్లాస్ టీచర్ ఉండేవారు. ఆవిడ సన్నగా, పొట్టిగా, చిన్న ముడితో అతి సాధారణంగా ఉండి, చాలా చిన్నగా, మితంగా మాట్లాడేవారు. కానీ, చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఆ పీరియడ్ వచ్చేసరికి అందరి దగ్గరా సూది, దారం, ఏదో ఒక క్లాత్ ఉండి తీరాల్సిందే. సమయానికి లేకపోతే పక్క క్లాస్ కెళ్ళి  వేరేవాళ్ళ దగ్గర తెచ్చేసుకునేవాళ్ళు కొందరు భయస్థులు ! అంతా లోలోపల విసుక్కుంటూనే మాట వినే వాళ్ళం. నిజానికి ఆవిడ నేర్పించినవి అతి సామాన్యమైనవి. ఇవి కూడా స్కూల్లో నేర్చుకోవాలా? అనుకునేవాళ్లం, కానీ, చదువులూ, పెళ్లిళ్లూ అయిపోయి, సంసారాల్లో స్థిరపడ్డాక నిత్యజీవితంలో ఆనాడు బడిలో నేర్పించిన చిన్న చిన్ని కుట్లు ఆడవాళ్లు గా మాకు ఇంట్లో ఎంత ఉపయోగపడుతున్నాయో అనుభవం మీద తెలిసొచ్చింది. ఈ పాటి కుట్లు అలవోకగా వచ్చేయవా అనుకుంటాం గానీ ఆ చిన్న పనిలో కూడా ఎంతో నేర్పరితనం కావాలని ఇలాంటివి చేతకాక ప్రతి దానికి టైలర్ ల మీద ఆధారపడే కొందరిని చూస్తే తెలిసొస్తుంది. 
    A stitch intime saves nine అన్నట్లు ఏవైనా దుస్తులు కొద్దిగా చిరిగినా, కుట్లు ఊడినా వెంటనే కుట్టేయకపోతే కొద్ది రోజులకి చిరిగి చాటంత అయి పనికి రాకుండా పోతాయి. అలా అని చెప్పి ఆ కాస్త దానికి టైలర్ దాకా పరిగెత్త లేము. 
   ఆడపిల్లల స్కూళ్లల్లో సూయింగ్ క్లాసులు ఆ రోజుల్లో ఎందుకు పెట్టారో తర్వాత రోజుల్లో నాకు బాగా అవగతమైంది. అప్పట్లో టీచర్ గారి మీద అకారణంగా విసుక్కున్నా ఇప్పుడు తలుచుకుంటే ఆవిడ పై ఎంతో గౌరవం కల్గుతుంది. గట్టికుట్టు, హెమింగ్, కాడకుట్టు --- ఇలాంటి అత్యవసరమైనవి అప్పుడు నేర్చుకున్నవే! ఇప్పుడు ఇంట్లో నాకు ఎప్పుడూ ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు స్కూళ్లల్లో సూయింగ్ క్లాసులున్న దాఖలాలు కనిపించవు !
    ఇకపోతే దీనికోసం కాస్త సరంజామా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే, ముఖ్యంగా మా మహిళామణులకు. చిన్న, పెద్ద సైజుల సూదులు రెండు మూడు, కొన్ని రకాల రంగుల దారాల ఉండలు, కొన్ని హుక్స్, కొన్ని గుండీలు ( buttons ) వీటితో పాటు ఓ చిన్ని కత్తెర, ఇంకా ఓ బ్లేడు -- ఇవన్నీ పెట్టుకోడానికి ఓ చిన్న బాక్స్, అంతే! ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటే సౌకర్యంగా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడూ ఓ చిన్ని పెట్టె వీటితో సిద్ధంగా ఉంటుంది. వినడానికి చాలా చిన్న విషయంగా, ఓస్, ఇంతేనా! అనిపించొచ్చు గానీ దీని ఉపయోగం మాత్రం అపారం. ఇది మా మహిళలందరూ ఎరిగినదే అయినా ఇది చదివాక నిజమే సుమా! అనుకోక మానరు. 
   చిరిగినవీ, కుట్లూడినవి కుట్టుకోవడమే  కాదు, చేతి రుమాళ్లు లాంటివీ తయారుచేసుకోవచ్చు మనక్కావలసినట్లుగా...ఇంకా కరోనా వచ్చిన కొత్తలో  అత్యవసరమైన మాస్క్ లు   చేతితో కుట్టుకున్న రోజులున్నాయి....అవునా, కాదా ! 
     ఇంతటి ప్రయోజనం, ప్రత్యేకత కలిగిన ఈ చిన్నిపెట్టె గురించి నా ఆలోచనలు మా సోదరీమణులతో పంచుకోవాలన్న కోరికతో రాయాలనిపించింది. 🙂

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment