ఈదినం నాదీ నాదనుకుంటున్నది
రేపటికి మరొకరి సొంతం అన్నది ఎరుగక
ఓ వెర్రి మానవుడా,
నీకెందుకంత ఆరాటం?
ఆర్భాటం ప్రదర్శిస్తావు
ఎగిరెగిరి పడతావు,
ఏదో కావాలనుకుంటావు
మరేదో అయిపోవాలనుకుంటావు
కానీ --
ఇంకేదో అయిపోయి
డీలా పడిపోతావు !
తల్లి గర్భాన కళ్ళు తెరిచి
భూగర్భాన మన్నుగ మారి
కనుమరుగైపోయేదాకా
విధి మున్ముందే రాసేసిన
నీ నుదుటిరాత.. తిరిగి
ఆ విధాత సైతం మార్చలేడన్న
చేదు నిజం ఎరుగక
ఓ పిచ్చి మానవుడా,
ఎందుకా పరుగులు ?
ఏమందుకోవాలనీ
ఇంతలేసి వృధాప్రయాసలు !
ఉన్నది చాలు, కడుపు నిండా తిను
మిగులుతుందీ అనుకుంటే
మరొకరి కడుపు నింపు, దీవిస్తారు !
ఆ దీవెనలే నీకు సదా రక్ష !
వారి మదిలో నీవో చెరగని ముద్ర !
ఇది నిజం ! ముమ్మాటికీ నిజం !!
నీవు లేకున్నా నిత్యం
కదలాడే నీ తీపి తలపులే
ఇలపై నిను నిలిపే
ఎనలేని కీర్తిప్రతిష్టలు !!
అందుకే -- వినుకో,
ఓయి వెర్రి మానవుడా, మేలుకో !
మర్మమెరిగి మసలుకో !! 🙂
****************
No comments:
Post a Comment