Thursday, June 9, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 9.. టీచర్ అంటే ఎలా ఉండాలి..? ఎలా ఉండకూడదు ?

🌺

    ప్రతీ జీవితంలో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు అత్యంత సహజం. తీపి, చేదు అనుభవాల సమాహారమే కదా జీవితమంటే ! కాకపోతే...తీపి జ్ఞాపకాలు తలచుకున్నపుడు సంతోషాన్నిస్తే... చేదు జ్ఞాపకాలు ముళ్ళుల్లా గుచ్చుకుంటూ బాధపెడతాయి. అయితే... ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. తీపి జ్ఞాపకాలు సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి. అదే చేదువైతే... పాఠాల్ని, గుణపాఠాల్ని చెబుతాయి... నేర్పిస్తాయి. జాగ్రత్త పడమని హెచ్చరిస్తాయి. ఇంకా...అంతర్లీనంగా... ఏదో ఒక సందేశాన్నీ అందజేస్తాయి. ఇది గుర్తించగలిగితే చాలు... చేదును కూడా 'పాజిటివ్' గానే తీసుకోగల ధైర్యం,  ఆత్మస్థైర్యం మనిషికి అలవడతాయి !! 

          *****************************
🌺
   అదో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల. అందులో మధ్యాహ్నం సెషన్.  ఎనిమిదవ తరగతి సోషల్ స్టడీస్ క్లాసు జరుగుతోంది. ముందు రోజే పాఠం  చెప్పడం అయిపోయింది. మరుసటి రోజుకంతా ఆ పాఠం లోని ప్రశ్నలకు జవాబులు  నేర్చుకుని రావాలని టీచర్ గారు చెప్పారు. ఈ రోజు అదే జరుగుతోంది. టీచర్ వరసగా ఒక్కొక్కర్నీ  లేపి ప్రశ్నలు అడగడం మొదలెట్టింది.     
    ఆ టీచర్ అంటే అందరికీ తగని భయం. పొడుగ్గా బలంగా, చామనఛాయలో చూడగానే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో గాని నవ్వదు. ఆవిడ క్లాస్ అంటే అందరికీ లోలోపల ఏదో గుబులుగా ఉంటూ ఉంటుంది. చాలా మటుకు ఆ భయం తోటే అంతా కాస్త జాగ్రత్తగానే చదువుకొని వస్తూ ఉంటారు. 
    అలా ప్రశ్నలు వేస్తూ క్లాసులో ప్రతి ఒక్కరినీ  లేపి అడుగుతున్న ఆమె... ముందు వరసలో కూర్చున్న ఒక అమ్మాయిని లేపి, ఓ ప్రశ్న అడిగింది. దానికా అమ్మాయి జవాబు చెప్పలేక తడబడుతూ నిలుచుండి పోయింది. వెంటనే పక్కనే ఉన్న మరో అమ్మాయిని లేపి  అడిగింది టీచర్. ఆ అమ్మాయి  టకటకా  జవాబు చెప్పేసింది. వెంటనే.. ' గుడ్ ' అనేసి, జవాబు చెప్పని ఆ అమ్మాయికి ముక్కు  చెంపలు వేయమంది. ఆ రోజుల్లో జవాబు చెప్పని పిల్లలకు అదో  'పనిష్మెంట్'!
చెప్పని వారి ముక్కు పట్టుకుని రెండు చెంపలూ వాయించాలన్నమాట ! జవాబు చెప్పిన అమ్మాయి చెప్పని ఆ పిల్ల ముక్కు పట్టుకొని చెంపల మీద మెల్లిగా కొట్టింది. వెంటనే టీచర్, 
" ఏంటీ?  గంధం రాస్తున్నావా?... అలాగేనా ముక్కుచెంపలు వేయడం?... ఎలా కొట్టాలో నేను చూపిస్తాను... "
అంటూ కోపంగా ఆ పిల్లను ముందుకు రమ్మని చేతులు చాపమంది. జవాబు చెప్పిన ఆ పిల్ల భయంతో బిక్కచచ్చిపోయి, ఆసమయం లో ఏమనాలో తోచని అయోమయస్థితిలో కంగారుగా, 
"... మళ్ళీ వేస్తాను టీచర్... " 
అనేసింది. దాంతో ఆ టీచర్, 
" ఇప్పుడు వేశావు గదా, నేను చూశాను గదా, మళ్ళీ వేయడమేమిటి? రా.. ఇలా.. "
అంటూ ఆ విద్యార్థిని రెండు చేతుల మీదా బెత్తం తో చెల్ చెల్ మంటూ గట్టిగా వాయించింది. అంతే ! ఒక్కక్షణం క్లాసంతా 'పిన్ డ్రాప్' సైలెన్స్ అయిపోయింది ఊహించని ఆ పరిణామానికి ! అదేమీ పట్టించుకోకుండా ఆవిడ తన ప్రశ్నావళి కార్యక్రమాన్ని కొనసాగించబోతుండగా బెల్ మోగి, బెత్తం పక్కకు విసిరేసి క్లాస్ నుండి నిష్క్రమించింది. 
  ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఆ పిల్ల చుట్టూ చేరి కందిన చేతులు పరీక్షించారు. మిగతా అంతా ఆ టీచర్ సంగతి బాగా తెలుసు గనక మిన్నకుండిపోయారు. 
   ఇంతకీ... అసలు విషయానికొస్తే...  ఆ టీచర్ చేతిలో బెత్తం దెబ్బలు తిన్న ఆ విద్యార్థిని ఎవరో కాదు..నేనే.!. నాకు పదమూడు సంవత్సరాల వయసప్పుడు క్లాసులో జరిగిన ఆ సంఘటన ఎన్నో ఏళ్ళు గడిచినా,  ఓ చేదు జ్ఞాపకంలా ఇప్పటికీ మెదడులో అలా గూడు కట్టుకునే ఉంది.  అంత బాధ లోనూ నా కళ్ళలో చుక్క నీరు రాలేదు. మౌనంగానే భరించాను. నా బాధంతా ఆ టీచర్ అందరిముందూ కొట్టినందుకు కాదు.. జవాబు చెప్పినా, ఏమాత్రం ఆలోచన, విచక్షణ అన్నది లేకుండా.. విద్యార్థి మానసిక స్థితి గురించి అసలు పట్టించుకోకుండా అలా దురుసుగా ప్రవర్తించిన ఆమె తీరుకు  !!
    అదే స్కూల్లో మరొక టీచర్ ఉండేవారు. సైన్స్ సబ్జెక్ట్ బోధించేవారామె. ముప్ఫై  సంవత్సరాల వయస్సు ఉండొచ్చేమో! చాలా హుందాగా ఉండేవారు. ఆవిడ పాఠాలు  చాలా శ్రద్ధగా, విశదంగా చెప్పడం అందరికీ నచ్చేది. ఆమె కూడా గంభీరంగానే ఉండేవారు... కానీ.. ఎప్పుడూ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించే  వారు కాదు. ఆమె క్లాస్ అంటే అంతా ఎదురు చూసే వాళ్ళం కూడా ! ఆమెకు ఎదురు వెళ్లాలంటే అందరూ భయపడేవారు. కానీ ఆ భయం ఆమె పట్ల గౌరవం వల్ల వచ్చినదే !
    ఈ ఇద్దరు ఉపాధ్యాయురాళ్లను  చూశాక.... టీచర్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయంలో ఓ స్థిరాభిప్రాయం నా మస్తిష్కంలో ఆ చిన్న వయసులోనే నాటుకుపోయింది. 
    అలాగని...  ఆ టీచర్ గారి మీద నాకు కోపం గానీ, ద్వేషం గానీ అప్పుడూ లేదు.. ఇప్పుడూ లేదు. 
    అప్పట్లో బోధనా రంగంలో కి వెళ్లాలని గానీ, టీచర్ నవ్వాలనిగానీ... నాకైతే ఏమీ ఉండేది కాదు గానీ... తర్వాతికాలంలో టీచర్ నయ్యాక... ఆ ఇద్దరూ బాగానే గుర్తుకు వచ్చే వారు అప్పుడప్పుడూ ! 
" టీచర్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? "
 అన్న విషయంలో 'స్పష్టత' నాకు వారివల్లే వచ్చి ఉంటుంది బహుశా ! అందుకేనేమో! నా వృత్తిగత జీవితంలో విద్యార్థులను సాధ్యమైనంతవరకు మానసికంగా బాధపెట్టకుండా ఉండటానికే ప్రయత్నించే దాన్ని. టీచర్ పట్ల పిల్లలకు గౌరవభావం, సదభిప్రాయం కలగాలంటే ఒక్క వారి బోధనే కాదు.... వారి ప్రవర్తన కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందని నేననుకుంటాను.ఇంకా,  బోధనా పరంగానే కాకుండా క్రమశిక్షణ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే  దాన్ని. ఎక్కడో ఏ మూలో... వారి దృష్టిలో మా సైన్స్ టీచర్ లా మిగిలి పోవాలన్న ఓ చిన్ని ఆశ నాలో !!   🙂
 ఇదంతా ఈరోజు రాయాలని నాకెందుకనిపించిందంటే... చేదు అనుభవాల నుండి కూడా స్ఫూర్తి పొందవచ్చనీ తద్వారా సరైన దారిలో  నడవొచ్చనీ గుర్తించినందుకే !! 


                 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

                  






No comments:

Post a Comment