Wednesday, July 29, 2020

శకునం.... ' చిన్నారి ' కథ

   చెప్పులేసుకుని ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతున్న శంకరయ్య కాస్తా లోపల ఎవరిదో తుమ్ము వినిపించగానే చటుక్కున వెనుదిరిగి విసుక్కుంటూ కుర్చీలో కూలబడ్డాడు. ఆ పక్కనే పడక్కుర్చీలో పడుకున్న అతని తండ్రి బలరామయ్య కొడుకు చాదస్తానికి గొణుక్కున్నాడు. 
   శంకరయ్యకు విపరీతమైన శకునాల పిచ్చి. కాస్తో కూస్తో చదువుకున్నాడు. చిన్నపాటి ఉద్యోగం కూడా వెలగబెడుతున్నాడు. అయినా మూర్ఖంగా పిచ్చి నమ్మకాల్ని పాటిస్తూ తాను ఇబ్బంది పడుతూ ఇంట్లో వాళ్ళనీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొడుకుతో ఈ అలవాటు మాన్పించడమన్నది బలరామయ్య కు అంతుపట్టని సమస్యగా మారింది. ఈ మధ్య ఈ చాదస్తం మరీ ఎక్కువైంది. అది చాలదన్నట్లు బద్ధకం కూడా అలవడింది. 
ఓ నిట్టూర్పు విడిచి, కూతుర్ని కేకేసి గ్లాసుతో మంచినీళ్లు తెమ్మన్నాడు శంకరయ్య. 
" రేయ్, శంకరా, ఏంట్రా నీ పిచ్చి! అలా చూడు లోపలికి ఓసారి,.. " అంటూ లోపలి గదిలో బూజులు దులుపుతున్న కోడలు రాజేశ్వరివేపు చూపించాడు. 
".... అక్కడ రాజేశ్వరి బూజు దులుపు తుంటే వచ్చే దుమ్ము వల్ల తుమ్మింది. అదీ మంచి శకునం కాదు అంటే ఎలా రా? అవతల పట్నం వెళ్లాలని బయలుదేరావు, బస్సు కాస్తా తప్పిపోతే మళ్లీ మధ్యాహ్నం దాకా మరో బస్సు లేదు, పనంతా ఆగిపోతుంది ఆలోచించావా? " కొడుకు వైపు చూస్తూ అన్నాడు. 
" ఆ ఆ, ఆలోచించాలే, అలాగని ఇదేమీ పట్టించుకోకుండా వెళ్లానంటే మొదటికే మోసం వచ్చి వెళ్లిన పని చట్టుబండలవుతుంది తెల్సా? " 
 ఎదురు చెప్పి తండ్రి నోరు ఒక క్షణంలో మూయించాడు. నెత్తి కొట్టుకుంటూ పడక్కుర్చీలో వాలిపోయాడు బలరామయ్య. మంచినీళ్లు తాగి బయలుదేరిన శంకరయ్య అరగంట తర్వాతఉస్సురంటూ తిరిగొచ్చి తండ్రి పక్కనే చతికిలబడి, 
" హు " తుమ్ము మహిమ! తప్పుతుందా! బస్సు కాస్తా వెళ్ళిపోయింది " అన్నాడు. 
" అదేంటి? కాసేపాగి, మంచినీళ్లు తాగేసి మరీ వెళ్లావుగా" కొడుకు వైపు ఓరగా చూస్తూ అన్నాడు బలరామయ్య. తండ్రి వైపు కొరకొరా చూస్తూ లేచి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు శంకరయ్య. 
" ప్చ్ ! వీడు మారడు " అనుకుంటూ నిట్టూర్చాడు బలరామయ్య. 
  రోజులు గడిచిపోతున్నాయి. శంకరయ్య కూతురు సుమతి పట్నంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది. సుమారు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే కాలేజీకి ప్రతిరోజూ వాళ్ళ ఊరి బస్సు లో వెళ్లి వస్తూ ఉంటుంది. మరుసటి రోజు నుండే సంవత్సరాంతపు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం ఎనిమిదికే పరీక్ష. సుమతికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఆ సమయానికి ఊరి బస్సు రాదు, ఆటో సౌకర్యం లేదు. విధిలేక తండ్రిని బ్రతిమాలు కుంది. తప్పనిసరై శంకరయ్య తానే తన బైక్ మీద కూతుర్ని వదలి రావటానికి ఒప్పుకున్నాడు.  
   తీరా కూతురికి మాటిచ్చాక తన బైకు రెండ్రోజులుగా పంక్చరయి రిపేరు లో ఉన్న సంగతి గుర్తొచ్చింది శంకరయ్యకు. రేపు కూతుర్ని వదలి రావాలంటే ఈరోజే రిపేరు చేయించాలి అనుకుంటూ బండిని బయటకు తీయబోయాడు. సరిగ్గా అప్పుడే వీధిలో నుండి ఓ నల్ల పిల్లి గేటు దాటి శంకరయ్య కు ఎదురు వచ్చి నిలబడింది. అంతే ! శంకరయ్య ఠకీమని వెనుదిరిగి, బైకు లోపలికి తెచ్చి, వెళ్లి లోపల కూర్చున్నాడు. సుమతి లోపల్నుంచి ఇదంతా గమనిస్తోంది. అప్పుడు సమయం రాత్రి ఏడు దాటింది. ఇప్పుడు దీన్ని బాగు చేయించకపోతే రేపు ఉదయం ఎలా వీలవుతుంది? అనుకుంటూ తండ్రిని మరోసారి హెచ్చరించింది. తలాడించి అరగంట అటూ ఇటూ తిరుగుతూ తాత్సారం చేసి, తీరా బండి తీసుకెళ్లే సరికి ఉన్న ఒక్క మెకానిక్ షాపు కాస్తా మూసేసి ఉంది. మరుసటి రోజు సుమతి వేకువనే లేచి తయారయ్యి, తండ్రి కోసం ఎదురు చూడసాగింది. అసలే మొదటిరోజు. కనీసం అరగంట అయినా ముందుండాలి. ఏడుపు మొహం తో తండ్రిని విసుక్కోవడం మొదలెట్టింది. బలరామయ్య అదిలింపులతో, రాజేశ్వరి సణుగుళ్లతో శంకరయ్య ఎట్టకేలకు తయారై బయటపడి కూతురి వేపు చూస్తూ, 
" మరేం పర్వాలేదు, దగ్గరేగా మెకానిక్ షాపు, త్వరగా పంక్చర్ వేయించుకుని వెళ్దాం పద.... " అంటూ బండి తీశాడు. సుమతి గుండె గుభేలుమంది. అంటే ! నిన్న రాత్రి బండి రిపేర్ చేయించలేదా ?  దేవుడా !ఇప్పుడెలా? మరో ప్రత్యామ్నాయం కూడా లేదు కదా !అనుకుంటూ చేసేదేమీలేక కాళ్ళీడ్చుకుంటూ తండ్రిని అనుసరించింది. తీరా షాపు దగ్గరికి వెళ్ళేసరికి మెకానిక్ ఇంకా రాలేదు ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తూ నిలుచున్నారు ఇద్దరూ. పావుగంట తర్వాత తీరిగ్గా చేతులు ఊపుకుంటూ వచ్చాడు, మెకానిక్. బాగుచేయడానికి మరో పావుగంట! అంతసేపూ విపరీతమైన ఆందోళన తో అంతకుమించి నిస్సహాయస్థితిలో దాదాపు నరకం అనుభవించింది సుమతి. ఇంక కేవలం అరగంట మాత్రమే మిగిలి ఉంది. 
   ఎలాగోలా ఆదరాబాదరాగా బండి నడుపుతూ పరీక్ష సెంటర్ వెదుక్కుంటూ వెళ్లేసరికి పుణ్యకాలం కాస్తా ముగిసిపోయింది. అప్పటికే పరీక్ష ప్రారంభం అయిపోయి పావు గంట గడచిపోయింది. శంకరయ్య ఎంత ప్రాధేయపడినా ఆ అమ్మాయిని అనుమతించలేదు. కనీసం గేటు దాటి లోపలికి కూడా వెళ్లనివ్వలేదు. అంతే! గుడ్లనీరు కుక్కుకుంటూ కూలబడిపోయిందాపిల్ల ! కూతురి కన్నీళ్లు చూసిన శంకరయ్య చలించిపోయి, ఇదంతా తన వల్లే ననుకుని తలదించుకున్నాడు. 
   నల్ల పిల్లి శకునం మంచిది కాదనే కదా, ఆలస్యం చేయడం వల్ల ముందురోజు రాత్రే బండి బాగు చేయించలేకపోయాడు ! అమాయక ప్రాణీ,? నోరులేని ఆ  జంతువు చేసిన పాపం ఏమిటి?  తన అర్థంపర్థంలేని చాదస్తం ఫలితం! ప్రస్తుతం కూతురి తీవ్ర మనోవేదన ! ఆమె చదువుకు అంతరాయం ! ఆ  సంఘటనతో ప్రారంభమైన అంతర్మధనం అతనిలోని శకునాల పిచ్చిని పక్కకునెట్టి, పారద్రోలేలా చేసింది. 
  మనవరాలు తాత్కాలికంగా బాధపడినా, కొడుకును పీడిస్తున్న చాదస్తపు పిచ్చి సమసి పోయినందుకు సంతోషించాడు బలరామయ్య. సుమతి కొద్దిరోజులు బాధపడ్డా రెణ్ణెల్ల తర్వాత మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైందన్నది వేరే విషయం ! 

🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂

No comments:

Post a Comment