శ్రావణి ఓ హై స్కూల్ లో టీచర్ గా చేస్తోంది. ఇద్దరు పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగి. ఇంట్లో సహాయపడే వాళ్ళు ఎవరూ లేరు. పనిమనిషిని కుదుర్చుకున్నా సమయానికి రాక, ఉన్నట్టుండి చెప్పాపెట్టకుండా మానివేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండడంతో లేకుంటేనే సుఖమని ఓ దండం పెట్టి మానిపించేసింది. ఇక ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేకుండా ఆమె పని ఒత్తిడి అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆరు రోజుల ఉరుకులు పరుగుల తర్వాత ఆదివారం వస్తోందంటే ఏదో తెలియని ఆనందం శ్రావణికి, కాస్త ఉదయం పూటన్నా నిదానంగా నిద్రలేవచ్చుగదాని!
కల్పన ఓ గవర్నమెంటు ఆఫీసులో ఆఫీస్ అసిస్టెంట్. ఇంకా పిల్లలు లేరు గానీ ఉమ్మడి కుటుంబంలో అంతా కలిసి ఆరేడుగురు ఉంటారు. ఉదయం టిఫిన్లు, రాత్రి వంట డ్యూటీ తనదే. రోజంతా అలసిపోయి వచ్చి అంతమందికి వండివార్చాలంటే శ్రమే మరి! తను కూడా ఆదివారం కోసం ఇంతలేసి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇకపోతే రజిత! గృహిణి. తను తయార వాల్సిన పని లేక పోయినా, పిల్లలకు, భర్తకు అన్నీ రెడీ చేసి లంచ్ బాక్సులు సర్ది బయటకు తోలి, ఉస్సురని నిట్టూర్చేసరికి గడియారం10.30 చూపించి, బ్రేక్ ఫాస్ట్ మీద ఆసక్తిని చంపేస్తుంది. మరి, ఈవిడకీ ఆదివారం అవసరమే మరి!
ఏమిటీ ! ఎంతసేపూ ఆడవాళ్ళ గురించేనా! మా మగవాళ్ళ సంగతి ఏమిటి? మాకు మాత్రం పని వత్తిడి, అలసటా ఉండవా, అంటారా మగవాళ్ళంతా. అయ్యో, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆరు రోజులు నిర్విరామంగా శ్రమించి ఓరోజు ఆటవిడుపు కావాలనుకోవడం ధర్మమే కదా! కాకపోతే, స్త్రీలకు మరీ ముఖ్యంగా ఉద్యోగినుల లైన స్త్రీలకు గోడ వేటు, చెంప వేటు లాగా ఉంటుందీ అంటున్నాను. ఇంటాబయటా విధులు నిర్వర్తించాలి మరి! ఏతా వాతా అందరికీ సెలవన్నది అత్యవసరమే. పండగ సెలవులు ఎప్పుడో ఒకసారి ఎన్నాళ్లకోగానీ రావు. ఆదివారం మాత్రమే క్రమం తప్పకుండా వారానికోసారి వస్తుంది. కాబట్టే దానికోసం అందరి ఎదురుచూపులూనూ !
సరే సరే! మరి మా సంగతేంటంటున్నారా పిల్లలూ? ఇదిగో వస్తున్నా మీ వద్దకే. ప్రతిరోజు ఉదయాన్నే లేవటాలు, హడావుడిగా తయారవటాలూ, దీనికితోడు బండెడు పుస్తకాల బరువు మొయ్యటాలు, అక్కడ స్కూల్లో ఒక దాని వెంట ఒక సబ్జెక్టు తల తినేయటాలూ, ఇంటికిరాంగానే, మళ్లీ హోంవర్క్ లూ ---- అబ్బా! వీటన్నింటినీ టోటల్ గా కాస్త పక్కకు నెట్టేసి, ఊపిరి పీల్చుకునేది టీ. వీ కి అతుక్కు పోయేది ఒక్క ఆదివారమే గా. అందుకే పిల్లలందరికీ ఆదివారం అంటే ప్రాణం మరి! పిల్లలకే కాదు పైన చెప్పిన విధంగా పెద్దలందరికీ కూడా ఆదివారం అంటే ఆటవిడుపే !
సరేగానీ -- ఇదంతా మూడు నాలుగు నెలల కిందటి వైనమూ, ముచ్చటా ఇంకా వైభోగమూనూ. ప్రస్తుతం'కరోనా ' పుణ్యమాని ఇవన్నీ బంద్ అయిపోయి ప్రతీ రోజూ ఆదివారమే అయి ప్రతీ రోజూ పండగే అయిపోయింది పిల్లలకి, పెద్దలకి కూడానండోయ్ ! పండగలు అప్పుడప్పుడు వచ్చి పలకరించి పోతే బాగుంటుంది కానీ ఇలా ప్రతిరోజూ పండగే అంటే పెద్దలకే కాదు పిల్లలక్కూడా విసుగొచ్చి ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెల్దామా అని పిల్లలూ అలాగే డ్యూటీలో ఎప్పుడు చేరుదామా అని ఉద్యోగులూ కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.
అలాగే ఇంట్లో ఇల్లాళ్లు ! House arrest అయిపోయి పొద్దస్తమానం పిల్లా పీచూ, పెద్దా, ముసలీ ముతకా -- అంతా ఇంట్లోనే తిష్టవేసి చీటికి మాటికీ అవీ ఇవీ కావాలంటూ వేధిస్తోంటే వాళ్ళనడుం విరిగిపోతోంది. దీనికంటే మునుపే బెటర్ బాబూ ! అనుకునే పరిస్థితి వాళ్లకి దాపురించింది. ఈ' మహమ్మారి ' ఎప్పుడు అంతమవుతుందా, ఎప్పుడు మళ్లీ మునుపటి పరిస్థితి వస్తుందా అని అందరికంటే ఇంటి ఇల్లాళ్లు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు మరి! మళ్ళీ వారానికి ఒక్కసారి మాత్రమే వచ్చే' ఆదివారం ' కోసం ఎదురు చూసే రోజులెప్పుడొస్తాయో కదా?
" భగవంతుడా! త్వరగా ఈ వైరస్ సమసిపోయి మళ్లీ జనజీవనం ' నార్మల్' అయ్యే రోజు రానీయవా తండ్రీ ! "
స్వార్థ చింతన మానేసి ప్రతీ దినం ఉదయం, సాయంత్రం ప్రతీవాళ్ళూ దేవుణ్ణి కోరుకుంటున్న కోరిక ప్రస్తుతం ఇదే! అవునంటారా, కాదంటారా?
🙏🙏🙏👃👃👃👃👃👃👃👃🙏🙏🙏
No comments:
Post a Comment