Friday, October 31, 2025

ఆ నిశీధి వేళ...!!

 


                       ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..
                       విధివిధానము తప్పించుటకై ఎవరు సాహసించెదరూ..

   ఎన్నో ఏళ్ల నాటి పాట.. అందులోని భావం.. కాలాలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ నిలిచిఉండే పచ్చి నిజం...24.10.25 తెల్లవారుజామున కర్నూలు జిల్లా, చిన్నటేకూరు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కారణాలు ఏవైతేనేమి.. బాధ్యులు ఎవరైతేనేమి.. 19 నిండు ప్రాణాలు ఊహకందని విధంగా సజీవదహనం కావడం ప్రతి వారిని దిగ్భ్రమకులోను గావించిన విషయం. ఎంతో జీవితం ముందు పరచుకుని, ఉజ్వల భవిష్యత్తుకై కలలు కంటున్న యువత ఎక్కువమంది ఈ దుర్ఘటనలో బలి కావడం హృదయవిదారకమే ..
  బాధ్యతారహితమైన జీవనశైలి, నిర్లక్ష్యపు ఆలోచనాధోరణి.. చనిపోయిన వారినేగాక  ఎందరిని ఎన్ని విధాలుగా జీవచ్ఛవాలుగా మార్చివేసిందో ఈ దుస్సంఘటన నిరూపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. గాఢనిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో... ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి! కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. క్షణాల్లో చుట్టుముట్టిన అగ్నికీలలు, ఊపిరి సలపనివ్వని  దట్టమైన పొగ కారణంగా..ఎక్కడివాళ్ళక్కడ ఒరిగిపోయి, కాలి మాంసపు ముద్దలుగా స్లీపర్ బెర్తుల మధ్య శవాలుగా మిగిలిపోయారట!! ఓ మృతదేహం బస్సు కిటికీ నుంచి సగభాగం బయటకు వచ్చిన స్థితిలో కనిపించిందట! కిందకి దూకే ప్రయత్నంలో జరిగిన విషాదమిది! ఓ కుటుంబంలో నలుగురు( భార్య,భర్త, కొడుకు, కూతురు ) మరణించడం హృదయవిదారకం. మంటల్లో చిక్కుకున్న సమయంలో తల్లి తన కుమార్తెను గుండెలకు హత్తుకుని అదే స్థితిలో కాలిపోయి కనిపించడం!!19 మంది మృతుల్లో అత్యధికులు 30 ఏళ్ల లోపు వారే అని సమాచారం..అతివేగం, మద్యం సేవించి బండ్లు నడపడం, నిర్లక్ష్య ధోరణి, ఏమవుతుందిలే అన్న బాధ్యతారహిత భావన.., మరోవైపు ప్రమాదం గమనించినా స్వీయ రక్షణకై ఆలోచించడం__ అన్వేషిస్తే ఇలాంటి కారణాలు మదిలో మెదులుతాయి. సర్వేలు కూడా అదే అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నాయి..
      అలా జరిగి ఉంటే బాగుండేది...అలా చేసి ఉంటే బాగుండు... అనుకుంటాం గానీ... ఆ సమయంలో... ఆ క్షణాల్లో... దిక్కుతోచని ఆ దుస్థితిలో... వారి మానసిక స్థితి అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది  అన్నది గ్రహించాలి. ఏది ఏమైనా, బస్సులో ప్రయాణించిన ఏ ఒక్కరూ ఎంతమాత్రమూ ఊహించని దుర్ఘటన ఇది. అలాగే... అర్ధరాత్రి సమయాన బైక్ మీద ప్రయాణిస్తూ ప్రమాదానికి లోనైన అతను , అతని స్నేహితుడు, బస్సు డ్రైవర్ కూడా...! ఊహించని ఘటనలు జరగడమే విధి విలాసం అంటే అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు !! ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ స్పందించి 'అయ్యో' అనుకునేలా చేసిన విషాద ఉదంతమిది....
   ఎన్నో కుటుంబాల జీవితకాల వేదన..! పూడ్చలేని లోటు..! పరిహారమందుతుంది సరే..అయినవాళ్ళతో, కుటుంబసభ్యులతో,జీవితభాగస్వాములతో కన్నబిడ్డలతో పెనవేసుకున్న ఆ బంధాలు.. వాటి మాటేమిటి!? ఆ పరిహారమన్నది కుటుంబ పరిస్థితులు కొంతవరకు సర్దుకోవడానికి ఉపకరిస్తుందేమోగానీ... కనుమరుగైపోయిన ఆ మనుషులను సజీవంగా తిరిగి కళ్లెదుట నిలపడమన్నదైతే జరగదు కదా..! 
_____________________________________________________________________________________________

Sunday, October 26, 2025

'మనసు' చెప్పేది వినాలి...


  శారీరక ఆరోగ్యం గురించి అందరికీ తెలుసు. అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికీ. మరి మానసిక ఆరోగ్యం సంగతేంటి? రెండింటికీ సమన్వయం కుదిరితేనే మనిషి ప్రవర్తన సవ్యంగా ఉంటుంది కచ్చితంగా. మనిషి మానసిక స్థితి అన్నది ఆ వ్యక్తి ఆలోచనా ధోరణిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అది సవ్యంగా లేకున్నచో తీవ్రమైన ఇంకా విపరీత పరిణామాలూ చోటు చేసుకుంటాయి కూడా. అలా జరుగుతున్నవే...ఈమధ్యకాలంలో వెలుగుచూస్తున్న కొన్ని దుస్సంఘటనలు, అమానుషచర్యలు , అమానవీయకృత్యాలూ. నిత్యం వార్తాపత్రికల్లో, టీవీలో కానవస్తున్న ఈ వార్తలకు కొదువ ఉండటం లేదు.
   కారణాలు ఏవైనా కానీయండి... కన్నబిడ్డల్ని గొంతు కోసి చంపడాలూ, ఉరివేసి చంపడాలు.. అనుమానపిశాచంతో భార్యను కడతేర్చడం, ఆ శవాన్ని ముక్కలుగా నరికి పలుచోట్ల పారేయడం..! మద్యపానం కోసం డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే హతమార్చడం.. తండ్రి ఉద్యోగం తనకు రావాలనే దురుద్దేశంతో బ్రతికుండగానే తండ్రిని చంపడం..! వగైరాలు..! ఇలా రాస్తూపోతే ఈ దురంతాలకు అంతన్నది ఉండదంటే నమ్మాలి. కొంతకాలం వరకు స్త్రీలపై హింస, హత్యలు జరగడం వినేవాళ్ళం. కానీ విచిత్రం..! ఇటీవల భార్యలు కూడా ప్రియుడన్న వాడితో కలిసి భర్తల్ని చంపుతున్నారు అన్న శోచనీయమైన  వార్తల్ని  వినాల్సివస్తోంది. మరో విషాదం! వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది.. వివాహేతర  సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో కడుపున పుట్టిన పిల్లల్ని కన్నతల్లే చంపిందన్న వార్తలు!!
   ఇదిలాగుంటే..చిన్నపిల్లలు కూడా తల్లి మందలించిందనీ, స్కూల్లో టీచర్ తిట్టిందనీ ఆత్మహత్యలట!! సెల్ ఎక్కువగా చూడొద్దు అన్నారని ఉరేసుకొని చావడాలు!! టీనేజర్స్ ప్రేమ పురాణాలయితే  కోకొల్లలు! తనను ప్రేమించడానికి నిరాకరించిందని అమ్మాయి గొంతు బ్లేడుతో కోసి చంపేశాడట ఒక ప్రబుద్ధుడు. మరొకడెమో ఆ పిల్ల ఇంట్లో దూరి, కత్తితో పొడిచి అంతమొందించాడట! 
 ఈ భయానక కృత్యాలు వినడానికే భీతి గొల్పుతుంటాయి. ఈ చర్యలకు కారణాలేమిటి? వీళ్లంతా ఇలా తయారవ్వడానికి దారితీస్తున్న పరిస్థితులు ఏమిటి? ఆ మానసిక దౌర్బల్యానికి మూలమేది? కచ్చితంగా ఇది మానసిక అనారోగ్యం అనడంలో సందేహం లేదు. మరి ఎలా బాగుపడాలి ఇలాంటి మనస్తత్వాలు? 
  ఈ చర్యలు నివారిస్తూ కాస్తలో కాస్తయినా పరిస్థితి మెరుగుపరచడానికి ఏర్పడినదే ప్రపంచ మానసిక ఆరోగ్య దినం ( world health day ). ప్రతి సంవత్సరం అక్టోబరు 10వ తేదీన ఇది జరుపబడుతున్నది. మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సలహాలు, సూచనలు చేస్తూ తోడ్పాటు నందించడానికి చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇది. ప్రస్తుత సమాజానికి ఈ దిశానిర్దేశం (counselling ) చాలా చాలా అవసరం.
   ఈ దినోత్సవం లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యల గురించి జనాలకు అవగాహన పెంచడం. ఆ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం... కారణాలు అన్వేషిస్తే...
* విపరీతమైన మానసిక ఒత్తిడికి లోను కావడం..
* పుట్టి పెరిగిన వాతావరణం..
* తల్లిదండ్రుల మధ్య సఖ్యత లోపించడం..
* పేదరికంలో మగ్గిపోవడం...
* ఇతరులతో పోల్చుకోవడం..
* ఆత్మ న్యూనతకు లోనుకావడం..
* వీటన్నింటితో పాటు వెర్రి తలలు వేస్తున్న 
   సాంకేతిక  పరిజ్ఞానం...
* మంచి దారిలో నడవడానికి బదులుగా 
   దుర్వినియోగం బాట పడుతున్న యువత...
   ప్రస్తుతం అనూహ్యంగా పెరిగిపోయిన సాంకేతికత వల్ల లభ్యమవుతున్న అశ్లీల వీడియోలు, నేర ప్రవృత్తిని ప్రేరేపించే సన్నివేశాలు అరచేతిలోనే అయాచితంగా...క్లిక్ చేస్తే చాలు ప్రత్యక్షమయ్యే విపరీత దృశ్య పరంపరలూ...ఇవన్నీ యువతనేగాక చిన్నపిల్లలకు, పెద్దవారికి సైతం వక్రమార్గాలకు తలుపులు తీస్తున్నాయి. మనసు చెదిరిపోవడానికి దోహదం చేస్తున్న ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతేని ఉన్నది.అలాగే గృహిణుల దగ్గర్నుండీ ఉద్యోగస్తులు,పిల్లలు...ప్రతి ఒక్కరూ రోజువారీ బాధ్యతల నుండి కాస్త విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసమై... 
   మెదడుపై ఒత్తిడి తగ్గించుకోవాలి. విశ్రాంతి తీసుకుంటూ ఎప్పటికప్పుడు శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తగినంత నిద్ర లేకున్నా అది ఆరోగ్యం మీద తద్వారా మానసిక స్థితి మీద క్రమక్రమంగా తీవ్రప్రభావం చూపించే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఇదంతా ఆ వ్యక్తికి ఏమాత్రం తెలియకుండానే జరిగే ప్రక్రియ..,! కోపం,చిరాకు, విసుగు, గట్టి గట్టిగా అరవడాలు...ఇవన్నీ మనిషి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల ఎదురయ్యే ప్రవర్తనా లోపాలే...! కాలక్రమేణా మనిషి హిస్టీరికల్ గా  మారే ప్రమాదమూ పొంచి ఉంటుంది. అలాంటప్పుడు తనకుతానే తన సమస్యను  గుర్తించగలిగితే మంచిదే.. అలా లేనిపక్షాన తెలిసినవారు, సన్నిహితులు సలహాలివ్వడం, సరైన మార్గనిర్దేశం చేయడం పాటించాల్సిఉంటుంది. ఇందుకోసమే ఇలాంటి మానసిక ఆరోగ్య దినోత్సవాలు..
   అందుకే అవసరమైనప్పుడు మన మనసు చెప్పేది వినాలి. విశ్రాంతి తీసుకోవాలి. మానసిక భావోద్వేగ శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. ఇవన్నీ పాటిస్తే... మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మన ఆలోచనలూ సవ్యంగా ఉండి మనతోపాటు మన కుటుంబం కూడా బాగుంటుంది. తద్వారా...మన సమాజం యావత్  ప్రపంచం  సంతోషంగా నిశ్చింతగా ఉండగలదు.
    కాబట్టి చివరగా చెప్పొచ్చేదేమిటంటే... మన ఆరోగ్యం మన చేతుల్లోనే... అది గ్రహించుకుంటే మనకు అంతా మంచే జరుగుతుంది... చెప్పినంత తేలిక అయితే కాదు పాటించడం.. కానీ ప్రయత్నిస్తే సాధించలేనిది ఏముంది..!
____________________________________________

Tuesday, October 21, 2025

సంతోషం పంచుకుందాం....

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

పండగలంటే ఇష్టం...
దీపావళి మరీ ఇష్టం...
దీపాలు వెలిగించడం.. 
ఆ దీపకాంతి ఆస్వాదించడం..
మరీ మరీ ఇష్టం..
వెలిగే దీపాలు వెదజల్లే కాంతులిష్టం 
చీకటిని పారద్రోలే ఆ కాంతిపుంజాలు 
మదిలో రేపుతాయి ఎన్నో భావతరంగాలు
అవి వెలిగించే ఆశాజ్యోతులు
అందిస్తాయి అనిర్వచనీయ ఆనందాలు 
సాయంసంధ్యవేళల కాకరొత్తులు రాల్చే
ఆ వెలుగుల పూలు ఎంతో ఇష్టం 
పైకెగసే తారాజువ్వలు..
గుండ్రంగా తిరిగే భూచక్రాలు...
పైకి ఝుమ్మని ఎగసే చిచ్చుబుడ్లు...
తనివితీరా చూడ్డం ఇష్టం ...
ఆ క్షణాన పిల్లల కేరింతలు..
వెలకట్టలేని ఆ అనుభూతుల సంబరాలు
మదిలో నిక్షిప్తం చేయడం మహా ఇష్టం...

ఇన్ని ఇష్టాల మధ్య కొన్ని 
అయిష్టాలు మాత్రం కష్టం...!!
చెవులు చిల్లులు పడేలా 
టపాకాయల శబ్దం అయిష్టం..
అవి రేపే కాలుష్యం పర్యావరణానికి 
విషతుల్యం..అగ్ని ప్రమాదాలతో
ప్రాణ నష్టం..ఆస్తి నష్టం...!
జాగ్రత్తలు చాలా అవసరం..
పండగ సంబరాలు కాకూడదు కదా బాధాకరం!
ఆహ్లాదంగా జరుపుకోవడం ఆవశ్యకం..
అందరికీ ఆనందదాయకం...
పిల్లలూ.. పెద్దలూ..అందరం పాటిద్దాం..
పెద్దలు చెప్పే మంచి మాటలు
వినడం మన ధర్మం... నిర్లక్ష్యం వీడుదాం..
జాగ్రత్తలతో మెలుగుదాం...
పండగపూట మిఠాయిలు తింటూ
సంతోషం సరదాగా పంచుకుందాం...   
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


 

Wednesday, October 8, 2025

తెలుగు చలనచిత్ర సీమకో గొప్ప వరం ' సూర్యకాంతం '

                                             ~ యం. ధరిత్రీ దేవి


 చాలా సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, జమున నటించిన ' పూలరంగడు'. అందులో ఒక హాస్య సన్నివేశం. డైలాగ్స్ అంతగా గుర్తు లేవు గానీ దాని సారాంశం ఇదీ --

ఓ సందర్భంలో సూర్యకాంతం గారు గుమ్మడి గారితో అంటుందిలా ---

" ఏమండీ, అమ్మాయి పెళ్లవగానే కాశీ, రామేశ్వరం, తిరుపతి, కాళహస్తి, అన్నవరం, సింహాచలం పుణ్య క్షేత్రాలన్నీ వెళ్లి దేవుళ్ళను దర్శించుకుని వద్దామండీ.... "

 దానికాయన వెంటనే అందుకుని, 

".... ఇంకో పని కూడా చేద్దామే... ఆ కాస్తా సముద్రం దాటి అవతల లంకలో ఉన్న నీ అన్న రావణాసురుణ్ణి కూడా దర్శించుకుని వచ్చేద్దాం, ఓ పనైపోతుంది...... " అనేస్తాడు. 

 అంతే, హాలంతా ఒకటే నవ్వులే నవ్వులు! ఇందులో గుమ్మడి గాని, సూర్యకాంతం గానీ అసలు నవ్వరు. కేవలం వారి సంభాషణా చాతుర్యంతో, హావభావాలతోనే ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతారు. రావణాసురుడు నీ అన్న సుమా! అన్న మాట చాలు ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదో ప్రేక్షకులకు తెలిసిపోవడానికి ! ఇలాంటి సన్నివేశాలు అలనాటి తెలుగు సినిమాల్లో  కోకొల్లలుగా కనిపిస్తాయి. వాటిని రక్తి కట్టించిన నటీనటులు ఈనాటికీ చిరస్మరణీయులు. అప్పటి తారల్లో ఘన కీర్తి వహించిన సూర్యకాంతం గారు తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ఈనాటికీ ఓ చెరగని ముద్ర!

    గుమ్మడి గారు ఓ ఇంటర్వ్యూలో ఆవిడతో ( హాస్య ధోరణిలోనే సుమా )...  

" నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అన్న చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు సుమా.. "  

అని అన్నారట! నిజమే కదా ! చంద్ర కాంత, శిరీష, మల్లిక, రోజా...ఇలాంటి పేర్లు వినిపిస్తాయి గానీ సూర్యకాంతం అన్న పేరు దాదాపు ఎక్కడా వినం. గయ్యాళిగా అంతటి బలీయమైన ముద్ర వేసిన ఘనత ఆవిడది మరి ! ఎవరింట్లోనైనా ఇల్లాలు గడసరీ, గట్టి గట్టిగా మాట్లాడేదీ అయితే వెంటనే' అబ్బా, ఆవిడా, సూర్యకాంతం గాదూ !' అనేస్తారు వెంటనే. ఆఖరికి నోరు పెద్దదైన చిన్న పిల్లల్ని కూడా ఇది అచ్ఛం సూర్యకాంతమే బాబూ!అనడం కద్దు !

   ఆవిడ పాత్ర స్వభావం గయ్యాళితనమే కావచ్చు. కానీ తెరపైన ఆవిడ ప్రవేశంతో అందరిలోనూ ఓ విధమైన చక్కటి అనుభూతి! అమ్మయ్య! సూర్యకాంతం వచ్చేసింది, అంటూ ఆమె నటనను ఆనందంగా ఆస్వాదించడానికి సిద్ధపడేవాళ్లు అంతా! ఒకవైపు తిడుతూనే ఆవిడ సన్నివేశాల్ని ఎంతగానో కోరుకునే రోజులవి. నిర్మాతలు కూడా వారు నిర్మించే ప్రతి చిత్రంలో  " మా కాంతమ్మ గారికి పాత్ర ఉండే తీరాలని" పట్టుబట్టే వాళ్ళట  ! అంతలా ఉండేది ఆమె క్రేజ్ అప్పట్లో మరి !

   ఆరోజుల్లో  వచ్చిన అన్ని సినిమాల్లో ఆమె లేనివి దాదాపు లేవనే చెప్పవచ్చు. ఎస్.వీ.ఆర్, గుమ్మడి, రేలంగి, నాగభూషణం, అల్లు రామలింగయ్య లాంటి దిగ్గజాలతో తెర పంచుకుని వారితో పోటాపోటీగా నటించి మెప్పించిన ఘనత ఆమెది! ఇక, పద్మనాభం, రాజబాబు, చలం మొదలైన నటులకు తల్లిగా, అత్తగా వారినో ఆట ఆడుకుందనే చెప్పాలి. అక్కా చెల్లెలు ( ANR, షావుకారు జానకి నటించినది ) సినిమాలో రాజబాబు గారికి కూడా జోడీగా కొద్ది నిమిషాలు తెరపై కనిపించి నవ్వులు పూయించారు. 

   ఆవిడ నటనలో విశేషం ఏంటంటే, ఆమె నవ్వదు, కేవలం హావభావాలతో, ముఖంలో ఓ విధమైన అమాయకత్వంతో హాస్యం ప్రతిఫలించేలా చేస్తుంది. ఆవిడ చీర కట్టు, ఆమె పర్సనాలిటీ, చక్కటి తలకట్టుతో ఉన్న కొప్పు --- ఈ ఆహార్యం చాలు ఆవిడ పాత్రకి ! మనిషి కాస్త భారీగా కనిపించినా, విసవిసా నడవడం, చేతులూపుతూ మాట్లాడడం, కల్లబొల్లి ఏడుపులు ఏడవడం ! --- ఇవీ ఆవిడ నటనలో ప్రత్యేకతలు !

  ఆవిడ నటించిన వందలాది చిత్రాల్లోని పాత్రలు ఎన్నని గుర్తు చేసుకోగలం? ఎన్నని ఉదాహరించగలం ! నాకు జ్ఞాపకమున్నంత వరకు నేను అప్పట్లో చూసిన కొన్ని సినిమాల్లోని పాత్రల్ని ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. 

* తోడికోడళ్లు --- సగటు ఇల్లాలుగా, ఉమ్మడి కుటుంబంలో ఓ కోడలిగా అమాయకంగా కనిపించే ముఖంతో, రాగద్వేషాలు కలబోసుకున్న ఓ గృహిణి అనసూయ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అచ్చెరువొందించక మానదు. 

* మంచి మనసులు--- ఎస్. వీ. ఆర్  భార్య. ఆయనేమో ఉదారస్వభావులు. ఈవిడ దానికి బద్ధ వ్యతిరేకి. ఆవిడకు తెలియకుండా ఆయన కప్పిపుచ్చే విషయాలెన్నో. ఈవిడేమో అమాయకంగా అన్నీ నమ్మేస్తూ ఉండే ఓ సరదా పాత్ర.

* రక్తసంబంధం --- కరకుదనానికి మారుపేరు. మనుషుల జీవితాలతో ఆడుకుంటూ వారిని నట్టేట ముంచే నైజం. అవతలివాళ్ళ మంచితనాన్ని అసమర్థతగా భావిస్తూ, ఆ మంచితనాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే కుటిల పాత్ర.

* అత్తగారు-- కొత్త కోడలు, 

 అత్తలు - కోడళ్ళు --- రెండింటిలోనూ అత్త పాత్ర. ఇక వేరే చెప్పాలా?  ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండే!

* దసరా బుల్లోడు--- బుల్లెమ్మ! పరమ పిసినారి. కనీసం భర్తక్కూడా సరైన తిండి పెట్టని ఆడది. భర్త చూస్తే ఈవిడ మాట జవదాటడు. దాంతో అతనికి నరకం చూపిస్తూ ఉంటుంది.

*అందాల రాముడు -- అట్లమ్ముకునే ఆవిడ. అడపాదడపా మంచితనం కూడా కనిపిస్తూ ఉంటుంది.

* కార్తీకదీపం -- కూతురు కాపురం కోసం సలహాలు ఇస్తూ ఓ తల్లిగా ఆరాట పడుతూ ఉంటుంది.

* సెక్రెటరీ -- వయస్సు మళ్ళినా, పడుచు దానిలాగే ఉండాలన్న కోరిక! ఇందులోANR గారితో ఓ పాటలో కాసేపు స్టెప్స్ కూడా వేయడం చూస్తామండోయ్ !

* గుండమ్మ కథ -- NTR, ANR లాంటి హేమాహేమీలు కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో ఆమె ధరించిన పాత్ర పేరే సినిమా పేరుగా పెట్టడంలో ఆమె ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోతుంది.

   గయ్యాళి పాత్రలే కాదు, సాత్విక పాత్రలూ అడపాదడపా పోషించారని చెప్పొచ్చు. నాకు తెలిసి నేను చూసిన వాటిలో రెండే రెండు సినిమాల్లో అలాంటి పాత్ర పోషణ చేశారామె. 

*మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుని తల్లి' హిడింబి'పాత్ర. ' పుత్రా, సుపుత్రా ' అంటూ ఆమె పలికే తీరు హాస్యధోరణి లోనేకాక విలక్షణంగా కూడా అనిపిస్తుంది. 

* అలాగే' బ్రహ్మచారి' ( ANR, జయలలిత నటించినది ) లో  నాగభూషణంగారి భార్యగా నటించింది. ప్రతీ సినిమాలో భర్తపై అజమాయిషీ చలాయించే ఈవిడ అందులో భర్తకు భయపడుతూ అణిగి మణిగి ఉండే పాత్ర పోషించింది. సూర్యకాంతంలో ఈ కోణం కూడా ఉందే అనిపిస్తుంది అందులో వారిద్దరి సన్నివేశాల్ని చూస్తోంటే !

  ఆవిడ గయ్యాళి తనం తెర వరకే. రీల్ లైఫ్ లో గంప గయ్యాళిగా ముద్ర పడిన ఆమె రియల్ లైఫ్ లో ఎంతో మృదుస్వభావి అనీ, అందర్నీ ఎంతో ఆత్మీయంగా చూస్తారని చెప్తుంటారు. షూటింగ్ సమయాల్లో ఇంటి నుండి వంటలు, పిండి వంటలు తెచ్చి అందరికీ తినిపించేవారట ! తనది కాని స్వభావంతో తెరపైన అంతటి అద్వితీయ నటనను ప్రదర్శించడం అంటే ఎంత గొప్ప విషయం ! ఈనాటికీ తెలుగు చలన చిత్ర సీమలో ఆవిడ స్థానాన్ని భర్తీ చేసే నటీమణి రాలేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అందుకు తార్కాణంగా ఓ విషయం ఇక్కడ చెప్పవచ్చు. గుండమ్మ కథ చిత్రాన్ని బాలకృష్ణ, నాగార్జునగారలతో పునర్నిర్మించాలని ఒకరిద్దరు నిర్మాతలు అన్ని ప్రయత్నాలు చేసుకుని తీరా గుండమ్మ పాత్రకు ఎవర్ని పెట్టుకోవాలో తెలియక సందిగ్ధంలో పడి చివరకు ఆ సినిమా తీసే ప్రయత్నమే విరమించుకున్నారట ! సూర్యకాంతం గారి విశిష్టత ఏమిటో తెలియజెప్పడానికి  ఈ ఒక్క ఉదాహరణ చాలదా ! విలనీని పోషించే నటీమణులు ఎందరో పుట్టుకొచ్చారు గానీ  "ఈ నటి సూర్యకాంతంలా చేస్తోంది సుమా!" అని అనిపించుకున్నవాళ్ళెవరూ ఇంతవరకు కానవచ్చిన దాఖలాలు లేవు మరి...

   అక్టోబర్, 28, 1924 లో జన్మించిన సూర్యకాంతం గారు తల్లిదండ్రులకు పధ్నాలుగవ సంతానమట ! డిసెంబర్, 17, 1996లో పరమపదించిన ఆమె కీర్తి ఎప్పటికీ తెలుగు చలన చిత్ర సీమలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే ఆమె తెలుగు చలనచిత్ర సీమకో గొప్ప వరం అనడంలో సందేహమేముంది? 

******************************************

         [అక్టోబర్ 28 సూర్యకాంతం గారి జయంతి]

*****************************************

                   

Sunday, October 5, 2025

కాకమ్మ కబుర్లు


                                    ~~యం. ధరిత్రీ దేవి

కావు కావు మంటూ కాకమ్మ అదిగో...
కారునలుపు రంగుతో పదునైన 
ముక్కుతో...చురుకైన చూపుతో
కొమ్మచాటు నోసారి..కోటగోడ నొకసారి..
నింగికెగిరి ఒకసారి..నేలను దిగి ఓసారి...

స్నేహానికి ప్రతిరూపం ఈ కాకమ్మ..
పంచుకుని తినే స్నేహశీలి కదా..!
తనవి కాని కోయిల గుడ్లను తన గూటిలో 
పొదిగే పరోపకారి కాకమ్మే కదా!

అందం లేదనా..! అంతః సౌందర్యం
అపారమే కదా!సుగుణశీలి..సులక్షణాల
పక్షి ఇదే కదా..కాకి గోల.. కాకి బలగం..
కాకి బంగారం..పిల్లకాకికేం తెలుసు 
ఉండేలు దెబ్బ..అబ్బో! సామెతలు కోకొల్లలే!!

నేస్తం అస్తమించెనా..స్పందించునే తక్షణం..
చుట్టూ చేరి కాకులన్నీ కలిసి 
ప్రకటించునే సంతాపం..! మనిషిలో లేని
మానవత్వం కనగలం కాకిలో..

పరిసరాల్ని ప్రక్షాళనం చేసే సర్వభక్షకి..
పర్యావరణ హితం గోరు పక్షి..
ప్రకృతిని విస్తరింపజేయు సహాయకారి..
విపత్తులను పసిగట్టగల నేర్పరీ ఇదే కదా!!

పురాతన పక్షిరాజం...పురాణాల్లోనూ 
దర్శనం../పవిత్రమైనదీ వాయసం...
కాలజ్ఞాని..ఇది శనివాహనమే!!ఇక...
పోరాటసమయాన..ఇది సమైక్యతావాది..

సాయంసంధ్యకు గూటికి చేరే కుటుంబ జీవి..
అనాదిగా సాంకేతికత నెరిగిన జ్ఞాని..
అలనాడే అట్టడుగున కూజాలో 
నీళ్లు పైకి రప్పించిన మేధావి మరి!!

గతించిన పూర్వీకులకిది వారధి...
పిండం కాకి ముడితేనే కానీ తృప్తిజెందరే 
మరి పితృదేవతలు !! కాకి కరువైన..
ఆవేళ..పర్వదినం అసంపూర్ణమే..!!

కాకి అరిస్తే చుట్టాలొస్తారట ! 
శుభసూచనలూ అందిస్తుందట!! అయితే...
ఇంతటి చరితగల కాకమ్మ 
కనుమరుగై పోతున్నది ఏమిటమ్మ!!

పలు సుగుణాల కాకమ్మకు రక్షణ కల్పిద్దాం..
ఆశ్రయమిచ్చే చెట్లను పెంచుదాం..పలువిధాల 
పరోపకారికి పిసరంత ఉపకారం చేద్దాం... 
కాకిజాతి అంతరించకుండా కాపాడుకుందాం....
 
 





 

Friday, October 3, 2025

జాతిపిత ఒక్కడే...

    పల్లవి :
    జాతిపిత ఒక్కడే గాంధితాత ఒక్కడే 
    జాతిరత్నమతడే జగతి కీర్తి అతడే
    భరతమాత ముద్దుబిడ్డ అతడే
    భావితరం సందేశం అతడే అతడే            
                                                       //జాతిపిత//
    చరణం 1 :
    పోరుబందరున పుట్టినాడు
    పోరుబాట పట్టినాడు
    అహింసయే ఆయుధమన్నాడు
    అందరినీ ఒకతాటిని నడిపించినాడు
    కొల్లాయి గట్టిన ఒక సామాన్యుడు
    మహాత్ముడై ఇల వెలిసిన అసామాన్యుడు
    ఒక్కడే ఒక్కడే అతనొక్కడే 
                                                      //జాతిపిత//
    చరణం 2 
    తొలగిపొండి తెల్లోళ్లు అన్నాడు
    తెల్లవారి గుండెల్లో నిదురించినాడు 
    బానిసగా బ్రతకడం వద్దూ వద్దన్నాడు
    భరతభూమి మన సొంతం అన్నాడు 
    సత్యాగ్రహమే చేశాడు స్వతంత్రమే తెచ్చినాడు 
    చరిత్ర పుటలకెక్కి చరితార్థుడు అయినాడు 
    ఒక్కడే ఒక్కడే అతనొక్కడే 
                                                       //జాతిపిత//
    మనుషులంత ఒక జాతి 
    మానవతే మన కులమని అన్నాడు 
    సహోదరులు నా జనులని 
    సమతావాదం చాటాడు 
    ఆచరించి చూపి ఆదర్శం అయ్యాడు
    పోరాటం సలిపాడు జైలుపక్షి అయ్యాడు 
    జగతికి తలమానికమయ్యాడు 
    ఒక్కడే ఒక్కడే అతనొక్కడే 
                                                          // జాతిపిత //