Sunday, September 11, 2022

మమ్మీ, 'ఉత్తరం' అంటే...!?

     సాయంత్రం ఆరు గంటలవుతోంది. వైదేహి, శ్రీధరమూర్తి తేనీరు సేవించడం పూర్తయి, విశ్రాంతిగా కూర్చుని, ఆ రోజు న్యూస్ పేపర్ లో విశేషాలు ముచ్చటించుకుంటూ ఉన్నారు. మరోవైపు కొడుకు, కోడలు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. వారిద్దరి మధ్యలో ఏడో తరగతి చదువుతున్న మనవరాలు శ్రావ్య ! పుస్తకాల సంచీ  పక్కన పెట్టుకొని, హోంవర్క్ చేసుకుంటోంది. 
   అంతలో వైదేహి ఫోన్ నుండి ఏదో మెసేజ్ సౌండ్ వచ్చింది. తీసి చూసింది. స్నేహితురాలు పావని... శ్రావణమాసం.. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు ఉన్న ఓ కార్డు  ఫోటో ఫార్వర్డ్ చేసింది. నిట్టూర్చింది  వైదేహి ! ఆ చెప్పేదేదో ఓ ఫోన్ కాల్ చేసి చెప్పి ఉండొచ్చు కదా! పోనీ కనీసం తన స్వహస్తాలతో టైపు చేసి, విషెస్ పంపినా సంతోషించేది. ఇదే కాదు... ఈమధ్య ప్రతీ సందర్భానికీ  ఇలాగే రెడీమేడ్ శుభాకాంక్షలు అందించడానికి బాగా  అలవాటు పడిపోయారంతా. ముఖా ముఖీ కలుసుకోకపోతే పోయె... ఎంచక్కా ఫోన్ లో రెండు మాటలు మాట్లాడుకుంటే ఎంత తృప్తిగా, సంతోషంగా ఉంటుంది ! 
" ఏమిటో వైదేహీ.. కాలం ఇలా మారిపోయింది ! పెళ్లి పిలుపులు కూడా వాట్సాప్ లో శుభలేఖ పెట్టి కానిచ్చేస్తున్నారు..."
రెండ్రోజుల క్రితం పక్కింటి శార్వరి వాపోయింది వైదేహి దగ్గర. వెంటనే పక్కనే ఉన్న పార్వతి..
" మంచిదే కదా.. రేపు మనం కూడా అదే ఫాలో అయితే సరి ! శ్రమ, ఖర్చు రెండూ ఆదా... !"
అనేసి, నవ్వింది.
" నిజంగానే రోజులు బాగా మారిపోయాయి సుమా ! శుభకార్యాలంటే ఎంత హంగామా! ఎంత సందడిగా ఉండేది ! పిలుపులకే కొన్ని రోజులు కేటాయించుకునేవాళ్లు."
మళ్లీ అందుకుంది శార్వరి.
"... ఇప్పుడన్నీ సులభ పద్ధతులొచ్చేశాయండీ... అంతా ఈపాడు  సెల్ ఫోన్లొచ్చాకే !! "
సాగదీస్తూ నిష్టూరంగా అంది పార్వతి. అలా మాట్లాడుకుంటూ ఉన్నారా ! తమాషా ఏంటంటే... అప్పుడు ఆ ముగ్గురి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ లు తళతళలాడుతూ ఒకదాన్ని మించి ఒకటి మెరిసిపోతున్నాయి..! వాళ్ళ మాటలు విని, అవి మూడూ పరస్పరం చూసుకుని... తెల్లబోయి, తర్వాత చిన్నబోయి .. ఆ వెంటనే తెప్పరిల్లి... 
" ఏం మనుషులు ! మనం లేకపోతే  క్షణం కూడా తోచని స్థితికి వచ్చారు ఈ జనాలంతా ! కానీ ప్రతిక్షణం తిట్టడం మాత్రం మానరు ! ఎప్పుడైనా బ్యాలెన్స్ లేకనో.. ఇంకే లోపం వల్లనో... కాసేపు మనం పని చేయకపోతే.. పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి !! చేతిలో ఆభరణమే అయిపోయాం కదా ! అయినా ఎందుకో ఈ నిందలు ! "
అనుకుంటూ నొచ్చుకున్నాయి కూడా. అంతలోనే శార్వరి కొనసాగిస్తూ...కాస్త  పాజిటివ్ ధోరణిలోకి వచ్చింది.
"... అయినా...నిజం చెప్పొద్దూ.. వయసు మీద పడి తిరగలేని వాళ్లకు ఓ విధంగా ఇది సౌలభ్యమే కదా! కాకపోతే అవతల అర్థం చేసుకోవాలి బంధుజనం మరి!.. "
పార్వతి అందుకుని, 
"...ఆ.. ఇప్పుడంతా ఫోన్ పిలుపులకు అలవాటుపడిపోయారు లెండి. ఏ ఫంక్షన్ కైనా  ఆ పిలుపులే! ఇది పరస్పర అవగాహన. అందులోనూ టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చి, అందరికీ అదే ప్రాణానికి హాయిగా అనిపిస్తోంది. అందుకే ఏ అపార్థాలూ, అలగటాలూ ఉండక హ్యాపీగానే ఫీలవుతున్నారు  లెండి.."
( సెల్ ఫోన్ లు కాస్త స్థిమితపడ్డాయి. )
మళ్లీ శార్వరి మొదలెట్టింది. 
".. అయినా, ఈ ఫోన్లు వచ్చాక వార్తలు చేరవేయడాలు ఎంత ఈజీ అయిపోయిందో కదా ! ఒకప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, అర్జెంటయితే టెలిగ్రామ్ ఇచ్చుకోవడం ! ఇప్పుడు.. క్షణాల్లో.. ఎంత దూరాలకైనా, విదేశాలకైనా.. !"
" ఔను మరి ! అసలిప్పుడు ఉత్తరాలు రాసుకునేవారున్నారా అని ! నేను డిగ్రీ చదివే రోజుల్లో హాస్టల్లో ఉండేదాన్ని. క్షేమ సమాచారాలు తెలియజేసుకోడానికి ఉత్తరాలే  దిక్కు అప్పుడు! హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర ఓ టేబుల్ వేసి, దానిపై ఓ ట్రే పెట్టి, స్టూడెంట్స్ కు వచ్చిన లెటర్స్ అన్నీ మధ్యాహ్నం వేళ అందులో ఉంచేవారు మా వార్డెన్. ఆటైమ్ లో చూడాలి... మా అమ్మాయిల కోలాహలం ! లెటర్ వచ్చిన వాళ్ళ ఆనందం అబ్బో ! వర్ణనాతీతం ! అదేదో పెద్ద నిధి దొరికినట్టు !! సంతోషం పట్టలేక పరుగులు తీస్తూ రూమ్ కి ఉరికే వారు."
వైదేహి ఒక్క క్షణం కాలేజీ రోజుల్లోకి వెళ్ళింది.
" నిజమే! ఇప్పుడు ఉత్తరాల ఊసేలేదు.. అంతా ఫోన్ లో మెసేజిలే కదా !.."
శార్వరి అంది. 
   వైదేహికి రెండ్రోజుల క్రితం ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ మదిలో మెదిలి, చిన్నగా నవ్వుకుంది. ఇంతలో ఉన్నట్లుండి...
" మమ్మీ, ఇలా చూడు.. 'ఉత్తరం' అంటే ఏంటి మమ్మీ? మన  వీధిలో వినాయక చవితి పూజ, నిమజ్జనం ఎలా జరిగాయో వివరంగా మా ఫ్రెండ్ కు ఉత్తరం రాయాలట! సొంత వాక్యాల్లో...! రేపటికంతా రాసి తీసుకు రమ్మంది మా తెలుగు మిస్.. అసలు ఉత్తరం ఏంటి? ఎలా రాయాలి? డాడీ చెప్పవా..!"
కొడుకు, కోడలూ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు కూతురి ప్రశ్నకు ! వైదేహి కిసుక్కున నవ్వింది. శ్రీధరమూర్తి  కూడా శృతి కలుపుతూ, 
" శ్రావ్యా, ఇలా రా, ఉత్తరం ఎలా రాయాలో నేను చెప్తాను..."
అంటూ పిలిచాడు. పరుగున వచ్చిన శ్రావ్యను పక్కనే కూర్చోబెట్టుకుని, 
" ఉత్తరం అంటే... లేఖ  అని కూడా అంటారు దీన్ని.. అదెలా రాయాలంటే...."
కొనసాగించాడు శ్రీధరమూర్తి.
******************************************






No comments:

Post a Comment