Thursday, August 14, 2025

నేడు స్వాతంత్ర్యదినోత్సవం


  1947 ఆగస్టు 15 న ఆంగ్లేయులు భరతగడ్డను విడిచిపెట్టి భారతీయులకు స్వతంత్రదేశాన్ని స్థాపించే అధికారాన్ని ఇచ్చినందున మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము . ఇది జాతీయ పర్వదినం. కొన్ని పండుగలు కొన్ని మతాలు మాత్రమే జరుపుకుంటాయి. మరికొన్ని పండుగల్ని ప్రాంతాలవారీగా జరుపుకుంటారు. వివిధ రాష్ట్రాలు వారి వారి సంప్రదాయాలకనుగుణంగా పండుగలు జరుపుకోవడం  విదితమే. కానీ, జాతీయ పర్వదినాలు అందుకు పూర్తిగా భిన్నం. ఇవి కేవలం ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించినవి కావు. అందులోనూ..ఆగస్టు 15 ప్రత్యేకత తెలియని భారతీయుడు ఉండడు. ఆనాటి నిస్వార్థ దేశ నాయకులు కలిసికట్టుగా నడుం బిగించి, ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి పరపీడన నుండి భరతమాత దాస్య శృంఖలాలను పగులగొట్టి దేశ ప్రజలందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకొనేలా చేయగా పొందిన ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్రభారతం..!
   ఆ త్యాగధనులు, అమరజీవుల త్యాగనిరతిని గుర్తుచేసుకోవడం.. వారి సేవాభావాన్ని, స్వాభిమానాన్ని స్మరించుకుంటూ స్వాతంత్ర్యం సిద్ధించిన ఈ ప్రత్యేక దినాన జాతీయపతాకాన్ని ఎగురవేయడం స్వదేశం పట్ల, భరతమాత పట్ల మనం చూపుతున్న గౌరవాభిమానాలకు నిదర్శనం.
   కాలమెప్పుడూ ఒకేలా ఉండదన్నది వాస్తవమే అయినా... ప్రాంతీయ దురభిమానాలు, కులమత విద్వేషాలు, స్వార్థపూరిత రాజకీయాలు, ఉగ్రవాదాలు నేడు దేశాన్ని అతలాకుతలం చేస్తూ ఉండడం బాధాకరము, శోచనీయము కూడా. ఇవన్నీ దేశ ప్రగతికి అవరోధాలు కాకుండా అడ్డుకోవడం ప్రతి పౌరుని కనీస ధర్మం, కర్తవ్యంగా భావించవలసిన అవసరం ఎంతేని ఉంది. రేపటి తరాన్ని కాపాడుకుంటూ విలువలుగల చక్కటి పౌరులుగా తీర్చిదిద్దాలి. ఆ విధంగా దేశ సౌభాగ్యాన్ని పదిలంగా ఉంచే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయవలసి ఉంది. అది భారతీయపౌరులుగా అందరి బాధ్యత.
    ఏది ఏమైనా.. దేశాన్ని సుభిక్షంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం అత్యవసరం. 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విషయం మననం చేసుకుంటూ జాతీయపతాకం ఎగురవేద్దాం.

   💐అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు💐

No comments:

Post a Comment