~యం. ధరిత్రీ దేవి
విత్తనం..అతి సూక్ష్మరూపం..
అందులో ఉన్నది జీవం...
అనంతమైన శక్తి నిక్షిప్తం.
కంటికి కనిపించని మహత్తుకు అది నిలయం...
ఊహలకందని బలానికి నిదర్శనం!!
రుజువు కోసం నాటు నేస్తం...
నేల పొరల నడుమ ఓ విత్తనం...
అందులో నుండి ఓ మొక్క రావచ్చు..
నీడనిచ్చే వటవృక్షాలూ విస్తరించవచ్చు...!
ప్రకృతి నిండా పచ్చదనం పరిచేది
ఈ వృక్షజాలమే కాదా...! అందుకే..
నేల పొరల నడుమ నాటు నేస్తం...ఓ విత్తనం...
చిలకరించు చారెడు జలం దినం దినం..
చూడగలవు ఓ అద్భుతం..
మూడు రోజుల అనంతరం....
భూమి తల్లి ఒడిని దోబూచులాడుతూ ఓ అంకురం..
తొలిసారి నిను చూసి కురిపిస్తుంది చిరునవ్వుల వర్షం
ఆ దరహాసం అది నీకు పలికే శుభోదయం..!
మారాకుతో అలరించిన ఆ మధుర క్షణం...
తొలిపూత పువ్వుగా మారుతున్న వైనం..!
కాయలు ఫలాలై మురిపిస్తూ సాగే ఆ పయనం..!!
అనిర్వచనీయం... అమూల్యం !!
చెబితే తీరదు మరి... అది అనుభవైకవేద్యం...
రుజువు కోసం నాటి చూడు నేస్తం..ఓ విత్తనం..
ఆ స్వానుభవం చెబుతుంది నీకు ఈ వాస్తవం...!!
🥀🌴🌲🌳🌴🌲🌳🪻🌻🌴🌲🌳🪻🌲🌴🌾
No comments:
Post a Comment