Friday, April 28, 2023

' ఆడ ' పిల్లలు కాదు.... ఆదుకునే పిల్లలు.... !

     అదో ప్రభుత్వ ఆసుపత్రి. సమయం సాయంత్రం అయిదు దాటింది. అక్కడే కాంపౌండ్ లో ఓ చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చునిఉన్నాడు శ్రీనివాసరావు. ఉన్నట్టుండి అతని దృష్టి హాస్పిటల్ నుండి విసవిసా పరుగులాంటి నడకతో వస్తున్న ఓ యువకుడి మీద పడింది. అతని వెనుకే ఓ పెద్దాయన, అరవై ఏళ్ళు పైబడి ఉండొచ్చేమో, ఆ యువకుణ్ణి బ్రతిమాలుతున్న ధోరణిలో గబగబా వస్తూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ యువకుడు అదేమీ పట్టించుకోక ఆయన్ని విదిలించి మరింత వేగంగా గేటు వైపు వచ్చాడు. ఆ పెద్దాయన చేసేదేమీలేక అక్కడే మ్రాన్పడి నిలుచుండిపోయాడు.
       అతను తిన్నగా వచ్చి శ్రీనివాసరావుకు కాస్త దూరంలో ఉన్న మరో బెంచీ మీద కూర్చున్నాడు. అతని మోహంలో భరించలేని ఆందోళన,అసంతృప్తి!
ఎందుకో అతన్ని పలకరించాలనిపించింది శ్రీనివాసరావుకి. అతను కాస్త తటపటాయిస్తూ విసుగ్గానైనా విషయం టూకీగా చెప్పి మళ్ళీ అసహనంగా మారిపోయాడు. ఇంతకీ ---
    అతని భార్య ఈ మధ్యాహ్నం ఆడపిల్లను ప్రసవించింది. అంతకుముందే ఇద్దరు ఆడపిల్లల తండ్రి అతను. మూడోసారి తప్పక కొడుకే పుడతాడని ఎంతో నమ్మకంగా ఉన్నాడు, కానీ తీరా చూస్తే --మళ్ళీ పాప ! కనీసం పసిగుడ్డు ముఖమైనా చూడకుండా ఆ స్థితిలో ఉన్న భార్య అవస్థ ఏమాత్రం గమనించకుండా అత్తమామలపై విరుచుకుపడ్తూ, అదేదో వాళ్ళ తప్పిదమైనట్లు ధుమధుమలాడుతూ నానా హంగామా చేస్తూ, ఇదిగో ఇలా ఇప్పుడు బయట పడ్డాడన్నమాట !
    శ్రీనివాసరావు నింపాదిగా అతనివేపు చూస్తూ, "సరే, ఇంతకీ కొడుకు పుడితే ఏమయ్యేదట? "
   చివ్వున తలెత్తి చూసాడతను ఏమిటీ పిచ్చి ప్రశ్న అన్నట్లు !
    అతని మనసులో భావం కనిపెట్టి అనునయంగా మొదలెట్టాడు శ్రీనివాసరావు. 
    ". .. నిజమే, కొడుకు పుడితే బాగుండేది. కానీ పుట్టలేదు. ఏం చేయగలం? చూడు బాబూ, నీవు వింటానంటే ఓ సంగతి చెబుతాను... "
   అతను తల పంకించడం చూసి కొనసాగించాడు. 
"... నీలాగే నేనూ అనుకునేవాణ్ణి. కొడుకు పుడితే ఏదో ఉద్ధరిస్తాడనీ, అవసాన దశలో అండగా ఉంటాడనీ... ఆడపిల్లలయితే పెళ్లిళ్లు చేసుకుని వెళ్ళిపోయే వారేననీ...వాళ్ళవల్ల ఖర్చు తప్ప ప్రయోజనమన్నది ఉండదనీ... అలా అలా ఉండేవి నా ఆలోచనలు. ఇలాగే వరుసగా...అచ్చం నీలాగే  ముగ్గురు కూతుళ్ళు పుట్టారు. అయినా ఆశ చావక నాలుగో సారి చూద్దాం అనుకున్నా. నా ఆశ తీరింది. కొడుకు పుట్టాడు. వాణ్ని చూసుకుని మురిసిపోతూ ముందున్న ముగ్గురు ఆడ పిల్లల్నీ నిర్లక్ష్యం చేశాను. నా ఆశలకు తగినట్లుగానే నాకున్న చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగంతోనే వాణ్ని బాగా చదివించాను. వాడూ బాగా కష్టపడి చదివి గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద ఆఫీసర్ అయ్యాడు. అప్పుడే మొదలైంది అసలు అధ్యాయం! మా ప్రమేయం లేకుండా తన స్థాయికి తగ్గ మరో ఉద్యోగస్తురాలిని పెళ్లి చేసుకుని ఎక్కడో ముంబైలో స్థిరపడి పోయాడు. ఉద్యోగం ఉన్నన్నాళ్ళు ఉన్నదంతా వాడి చదువుకే పెట్టి ఏమీ వెనకేసుకోలేక పోయాను. ఇప్పుడు పెన్షన్ అన్నది లేదు. వాడికి నేను గాని తల్లి గానీ కనీసం గుర్తుకు కూడా రాము. కొడుకు వంశాన్ని ఉద్ధరిస్తాడనీ, చివరి దశలో చూసుకుంటాడనీ, తలకొరివి పెడతాడనీ, పున్నామ నరకం నుండి తప్పిస్తాడనీ ఏవేవో అనుకుంటారంతా. కానీ, అదంతా భ్రమే... " కాస్త ఆగాడాయన. 
    ఆయన్ని చూస్తూన్న ఆ యువకుడు తన అసహనం కాసేపు మర్చిపోయి ఆసక్తిగా వినసాగాడు. ఆయన మళ్లీ మొదలెట్టాడు. 
".... నేను చేసిన పెద్ద తప్పిదం.. నా కూతుళ్లను నిర్లక్ష్యం చేయడం. కానీ వాళ్ల గురించి నేను ఎంత మాత్రం పట్టించుకోకపోయినా వాళ్లు మాత్రం నా పట్ల ద్వేషం పెంచుకోలేదు. పెద్దది ఐదో క్లాస్ వరకు చదివినా టైలరింగ్ నేర్చుకుని ఓ షాపు పెట్టుకుంది. రెండోది పది దాకా చదివింది. ఓ షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా చేస్తోంది. ఇక మూడో పిల్ల, ఇంటర్ తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి ఏకంగా టీచర్ అయిపోయింది. వాళ్లకు పెళ్లి సంబంధాలు కూడా గొప్పగా ఏమీ చేయలేదు నేను. అయినా ఇప్పుడు ముగ్గురూ  చక్కగా స్థిరపడి పోయి పిల్లాపాపలతో సంసారాల్ని ఎంచక్కా నడుపు కుంటున్నారు. అంతేకాదు, అమ్మానాన్నల గురించి పట్టించుకుంటూ చేతనయినంత సాయం చేస్తూ, అవసరమైనప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయాసం ఎక్కువై హాస్పిటల్ లో చేర్పించిన వాళ్ళమ్మను ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసుకుంటున్నారు. ఈరోజు ఆదివారం కదా, అందుకని ముగ్గురూ ఇందాకే వచ్చారు.... " ఆయన మొహంలో సంతోషం ప్రస్ఫుటంగా కనిపించింది. 
".... చూడు బాబూ, ఆడపిల్ల అంటే ఎప్పుడూ 'ఆడ' పిల్లే  నంటూ చాలా తేలిగ్గా చూస్తాం. కాని ఆడపిల్లలు ఎప్పుడూ 'ఆడ ' పిల్లలు కాదు. వాళ్లే ఆదుకునే పిల్లలు.... ఎందుకో నిన్ను చూస్తే నా అనుభవం చెప్పాలనిపించింది. అయినా ఈ సమయంలో అండగా ఉండాల్సిన వాడివి... జరిగిందానికి భార్యను, అత్తమామల్ని బాధ్యుల్ని చేస్తూ ఇలా.... " 
 ఆయన్నే చూస్తూన్న ఆ యువకుడి ముఖంలో విచిత్రంగా ఇందాకటి అసహనం చాలా మటుకు మాయమైపోయింది.  ఆయన మాటలు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపించాయో ఏమో గానీ, ఇంతలో ఆయన ముగ్గురు కూతుళ్ళు హాస్పిటల్ నుండి నవ్వుకుంటూ రావడం చూసి శ్రీనివాస రావు లేచి నిలబడ్డాడు. ఆ ముగ్గురిని చూడగానే ఆ యువకుడిలో ఏదో ప్రసన్నత! ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు శ్రీనివాసరావు. అయినా ఆయనలో ఏదో సందిగ్ధత! తన మాటలు ఇతన్ని ఆవగింజంత అయినా కదిలించాయా? అతని ముఖంలోకి చూస్తూ ఉన్నాడుగానీ అందులోని భావాలు చదవలేక పోతున్నాడాయన. ఓవైపు, అతని మామ గారు దూరంగా వరండాలో నిలుచుని దీనంగా ఇటువైపే చూస్తూ ఉన్నాడు. 
   ఆ అమ్మాయిల నుండి చూపు మరల్చుకుని లేచి, శ్రీనివాసరావు వేపు గౌరవపూర్వకంగా చూస్తూ కరచాలనం చేస్తూ ఉన్నట్టుండి ఆయన రెండు చేతులూ పట్టుకున్నాడు. ఏదో అనిర్వచనీయమైన భావం అతని కళ్ళలో ! బహుశా ఆయనపట్ల కృతజ్ఞత కావచ్చు !ఆవెంటనే వెనుదిరిగి, హాస్పిటల్ వేపు లోనికి నడుస్తూ అక్కడే ఆతృతగా ఎదురుచూస్తున్న అతని మామగార్ని సమీపించాడు. ఆ పెద్దాయన స్థిమితపడ్డం స్పష్టంగా కనిపించింది శ్రీనివాసరావుకు. ఇద్దరూ కలిసి లోపలికెళ్లడం చూసి తృప్తిగా నిట్టూర్చాడు. 
     ఈలోగా ఆ ముగ్గురు ఆడవాళ్లు  శ్రీనివాసరావును సమీపించి, ఆయన్ను దాటుకుని ముందుకెళ్లారు. ఆపిదప.. గేటుదాటి బయటికెళ్లి, అక్కడే ఉన్న ఓఆటో ఎక్కి ముగ్గురూ కనుమరుగయ్యారు. ఆయన్ను పలకరించనైనా లేదు. కనీసం కన్నెత్తి చూడలేదు. అదేమిటీ అంటే... వాళ్ళు ఆయన కూతుళ్లు అయితే గద !!
    కొందరికి ఎదుటివాళ్ళు ఏదైనా సమస్యల్లో  చిక్కుకుని, సతమతమౌతూ ఉంటే చూసి లోలోన ఆనందించడం తెగ సరదా. పైకిమాత్రం సానుభూతి నటిస్తూ ఉంటారు. శ్రీనివాసరావు తద్భిన్నం. వాళ్ళ సమస్య ఏమిటో తెలుసుకుని, తానేమైనా అది తీర్చగలనా అని మాత్రమే ఆలోచిస్తాడు. అది ఆయన స్వభావం. అరుదైన మనస్తత్వం. అదంతే !ఈరోజు జరిగిందదే !
   రెండ్రోజులక్రితం తన సమీపబంధువుకు బైక్ యాక్సిడెంట్ అయి, ఇదే హాస్పిటల్ లో చేరితే పరామర్శించి పోదామని వచ్చాడాయన ఈదినం. అదయ్యాక... వెంటనే ఇంటిదారి పట్టక చల్లగాలికి కాసేపు చెట్టు నీడన బెంచీ మీద కూర్చుండిపోయాడు. అదే సమయంలో ఎదురుగా కంటబడిందా  దృశ్యం !కోపంతో విసవిసా వచ్చిన ఆ యువకుడు గేటుదాటి వెళ్ళిపోయి ఉంటే ఈ కథ మరోలా ఉండేది.కానీ... అతనొచ్చి సరాసరి శ్రీనివాసరావు పక్కనే కూర్చున్నాడు మరి !
     శ్రీనివాసరావు రచయిత అయితే కాదు గానీ... ఆయనలోని ఊహాశక్తి అమోఘం ! నిమిషాల్లో పరిస్థితి గమనించి, అర్థం చేసుకుని, అప్పటికప్పుడు ఓ కల్పితకథ   అల్లేశాడు.అంతే !! నిజానికతనికి కూతుళ్లే లేరు. ఒక్కగానొక్క కొడుకు... పెళ్లయిపోయి ఇదే ఊర్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. శ్రీనివాసరావు ఓ చిరుద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం భార్యతో కొడుకువద్దే నిశ్చింతగా కాలం గడుపుతున్నాడు. 
  ఆయన ఆ యువకునితో మాట్లాడుతున్నప్పుడు.. సరిగ్గా అప్పుడే ఆ ముగ్గురు అమ్మాయిలు అలా వస్తూ  కనిపించడం కేవలం యాదృచ్ఛికం ! వాళ్ళు వీళ్ళను సమీపించకముందే అతను నిష్క్రమించడం శ్రీనివాసరావుకు  కలిసొచ్చిన మరో విషయం ! 
    మామాఅల్లుళ్లిద్దరూ నెమ్మదిగా లోనికెళ్ళడం చూసి తృప్తిగా నిట్టూర్చాడు శ్రీనివాసరావు. చీకట్లో తాను విసిరిన ఓ రాయి గురి తప్పలేదు. ఆయన మనసంతా సంతోషం అలుముకుంది. అబద్దం ఆడితేనేమిగాక... తన ఈ చర్య వల్ల... ఒకరి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఓ ఆడపిల్ల జీవితం నిలబడింది. మరో ముగ్గురు ఆడపిల్లలు తండ్రి ప్రేమకు నోచుకోబోతున్నారు. మరీ ముఖ్యంగా... వృద్ధాప్యంలో  ఉన్న ఓ తండ్రి ప్రాణం కుదుటబడింది.  చాలు !
    నెమ్మదిగా   శ్రీనివాసరావు  అడుగులు ముందుకు సాగాయి.  

************************************************

No comments:

Post a Comment