దాదాపు నలభై సంవత్సరాల క్రితం... పెళ్లయిన కొత్తలో అప్పుడప్పుడూ ఏదైనా హోటల్ కెళ్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో కర్నూల్ లో ELITE అని ఓ రెస్టారెంట్ లాంటిది ఉండేది. అది నాన్ వెజ్ వంటకాలకు చాలా ప్రత్యేకం అని చెప్పుకునేవారు. అక్కడ చికెన్ బిర్యాని నాలుగు రూపాయల యాభై పైసలు..అదీ రెండు ఎగ్స్ తో.. ! ఎంతో నాణ్యతగా, రుచిగా ఉండేది. ఇప్పుడు వందలు పెట్టాల్సి వస్తోంది. ఫ్యామిలీతో వెళ్తే వేలే ! ఇప్పుడు ఆ రెస్టారెంట్ అయితే లేదు. ఎందుకు చెప్తున్నానంటే... అప్పటికీ, ఇప్పటికీ ధరల్లో ఈ మార్పు ( కాలానుగుణంగా సహజమే కావొచ్చు,అయినా.. ) ఎంతలా అబ్బురపరుస్తున్నదో... నన్నే కాదు. నాలా మరెందరినో !
నాన్ వెజ్ మాత్రమే కాదు.. వెజ్ వంటకాలు కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంత వెచ్చిస్తున్నా.. చెప్పుకునే అంత స్థాయిలో రుచి గానీ, నాణ్యత గానీ ఉండటం లేదు మరి !
ఈమధ్య ఆన్లైన్ డెలివరీలు బాగా ఎక్కువైపోయాయి. ఎప్పుడూ ఇంట్లోనేనా, ఒక్కసారి అలా బయటి తిండి కూడా రుచి చూద్దాం, కాస్త రెస్ట్ అయినా దొరుకుతుంది అన్న ఆశతో రెండు మూడు సార్లు ఆన్లైన్లో తెప్పించుకున్నాం. మొదట్లో అయినందుకో ఏమో.... పర్వాలేదనిపించింది. కానీ.. నాలుగైదు సార్లు అయ్యేసరికి... మొహం మొత్తడం మొదలైంది. ఓసారైతే.. కూరల్లో, రైస్ లో ఆఖరికి.. రైతా ( పెరుగు పచ్చడి) లో కూడా అంతా ఉప్పుమయం! తినవశం కాక.. 'ఇక చాలు బాబోయ్' అని ఆన్లైన్ ఆర్డర్ లకు గుడ్ బై చెప్పేశాము. దానికి తోడు ఆ మధ్య... ఒక చోట చదివాను.. రెస్టారెంట్లలో ముందురోజు మిగిలిన కర్రీస్ ఫ్రిజ్ లో భద్రపరిచి, వాటిని మరుసటి రోజు వేడి చేసి వడ్డిస్తుంటారని ! ఎంతవరకు నిజమో తెలీదుగానీ... సందేహం మాత్రం పీడించడం మొదలైంది. అదంతా ఎందుకు బాబు! హాయిగా కాస్త శ్రమ అయినా, ఇంట్లోనే వండుకుని తింటే, రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం ! ఇంకా డబ్బు ఆదా. అనిపిస్తోంది ఈమధ్య.
ఉద్యోగస్తుల జీతాలు బాగా పెరిగాయి. దానికి తగ్గట్టు ఖర్చులూ పెరిగాయి. యాభై ఏళ్ల క్రితం నాలుగు వందల జీతమొచ్చే వాళ్లని చాలా ఘనంగా అనుకునేవారు. వెయ్యి వస్తే.. అబ్బో ! ఆ స్థాయే వేరు! అనేలా ఉండేది. ! మరి ఇప్పుడు!చెప్పాల్సిన అవసరమే లేదు. లక్షల్లో అందుకునే వాళ్లూ ఉంటున్నారు. ఇదీ ఒక మార్పే !అది పక్కన పెడితే...
నా చిన్నతనంలో ఒక రూపాయికి నాలుగు పళ్ళు బొరుగులు ( మరమరాలు ) వచ్చేవి. ఇప్పుడు పడి 8 నుండి 10 రూపాయల వరకూ ఉంది. రూపాయి విలువ అంతలా ఉండేది అప్పట్లో ! పాతికేళ్ల క్రితం వరకూ కంది బేడలు కిలో ఐదు రూపాయలకు వచ్చేవి. ఇప్పుడు వంద దాటిపోయింది. ( మూడు, నాల్గు ఏళ్ల క్రితం ఒక్కసారిగా 220/- కూడా దాటిన సందర్భాలున్నాయి.) ఇలా ఒకటీ అరా కాదు... చాలా చాలా ఉంటాయి చెప్పుకుంటూపోతే. ప్రతీ దినుసూ ఆకాశాన్నంటుతూ ఉంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
అప్పట్లో 100 లేదా 150 పెడితే మంచి నాణ్యత కలిగిన చీరలు లభించేవి. ఇప్పుడు మామూలు ఫ్యాన్సీ చీరలు కూడా మూడు, నాల్గు వేలు పలుకుతున్నాయి. పట్టు చీరల సంగతి.. ఇక అడగక్కర్లేదు. అంత పోసి కొనడానికైనా సిద్ధంగా ఉన్నామా... కాళ్లరిగేలా పది షాపులు తిరిగినా క్వాలిటీ అన్నదీ ఇంకా మనసుకు నచ్చినదీ కాగడా పెట్టి వెతికినా దొరకదు. ఇలాంటప్పుడే పాత రోజులు పదేపదే గుర్తొస్తుంటాయి. అంత మార్పు! విపరీతమైన మార్పు !!
అంతేనా ! సినిమాకి వెళ్తే అప్పుడు ( నలభై ఏళ్ల క్రితం ) 2-30 టికెట్ ! ఏసీ అయితే 3-00 రూపాయలు !ఇప్పుడు... అందరికీ విదితమే! అసలు థియేటర్కు వెళ్లే జనం ఎందరు? ఆడడం లేదు... ఆడడం లేదు.. జనాలు రావడం లేదు.. అంటున్నారు గానీ... అప్పట్లో తీసిందే తీసినా .. చూసిందే పదేపదే చూడ్డం జరగలేదా ! ఇది కూడా ఒక మార్పు అని అనుకోవచ్చు. అప్పుడు సినిమా తీయాలంటే లక్షల ఖర్చు. ఇప్పుడు కోట్లలో !
మా అక్క పెళ్లి జరిగినప్పుడు బంగారం తులం ధర 300 /-. అదే నా పెళ్లి నాటికి...వెయ్యి అయి కూర్చుంది. మా పిల్లల పెళ్లిళ్లు జరిగేనాటికి... పది నుండి పదిహేను వేలకు ఎగబాకింది. మరి ఇప్పుడు...!? యాభై ఎప్పుడో దాటేసిందిగా ! ఇలా ఈ మార్పుల గురించి రాస్తూ పోతే పేజీలు పేజీలు నిండిపోతాయి.
ప్రస్తుతం యాభై ఏళ్ళు దాటిన అందరూ ఎరిగినదే ఇదంతాను.... ఒకసారి ఆ రోజులు తలపుకు వస్తాయి అన్న ఆలోచనతో రాయాలనిపించింది ఇదంతా!
ఏమైనా రోజులు మారాయి... దానికి తగ్గట్టు అన్నీ మారాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా ! ఇంకేముంది ! మనం కూడా.. 🙂 మారామండోయ్🙂!!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కోస్తా ప్రాంతాల్లో నాకు తెలిసి అప్పట్లో బిర్యానీ అనే మాట వాడేవారు కాదు. పలావు అనేవారు …. కోడి పలావు వగైరా. హోటళ్ళ దగ్గర బోర్డ్ మీద కూడా అదే వ్రాసేవారు. బిర్యానీ అంటారని నేను హైదరాబాదు వచ్చిన తరువాతే తెలిసింది. ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ ఆ మాటే అలవాటైపోయినట్లుంది. అరవై యేళ్ళ సాహచర్యం కదా.
ReplyDeleteరెస్టారెంట్లలో నిన్నటి మిగిలిపోయిన పదార్థాలు ఇవాళ కూడా వడ్డిస్తారట అనుకుంటూ మరీ బాధపడిపోకండి. ఎంగిలి పళ్ళెంలో మిగిలిన మాంసం ముక్కలను కూడా పక్కకు తీసి తర్వాత తినడానికొచ్చేవారికి వడ్డిస్తున్నారని కూడా ఆ మధ్య వార్తల్లో మోతెక్కి పోయింది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.
ఒకసారి అమెరికాలో బాగా సాయంత్రం పూట ఓ రెస్టారెంట్లో కాఫీ తాగుతూ కూర్చున్నాం. ఆ షాపమ్మాయి ఓ పెద్ద ప్లేట్ లో కుకీస్ ఇంకా ఏవో పెట్టుకుని మా వద్దకు వచ్చి తీసుకోండి అంది నవ్వుతూ. మేం ఆర్డర్ చెయ్యలేదు, మాకు అక్కర లేదు కూడా అన్నాం. దానికా పిల్ల నిరుత్సాహంగా మొహం పెట్టి మీరు తీసుకోకపోతే పారెయ్యాల్సి వస్తుంది అన్నది. ఎందుకలా అని అడిగాం. ఏ రోజు మిగిలి పోయిన పదార్థాలను ఆ రోజే చెత్తలో పడెయ్యాలి, లేకపోతే ఫుడ్ ఇన్-స్పెక్టర్లు జరిమానా వేస్తారు అంది. మరి మన వ్యాపారులు ఎక్కడున్నారో, ఏ రకమైన మనస్తత్వంలో ఉన్నారో అర్థం అయిందనుకుంటాను.
కాలంతో బాటు ధరలు కూడా పెరుగుతాయి ఎవరూ కాదనరు. కానీ మామూలు శాతంలో పెరగడం అన్నది కార్పొరెట్ల రాకతో ఆగిపోయి, విపరీతమైన పెరుగుదల మొదలై ఇప్పుడు వేళ్ళూనుకుంది. పైగా నాణ్యత తగ్గినట్లే కస్టమర్ అంటే మర్యాద కూడా తగ్గుతూ వస్తోంది. అంతా కృత్రిమం.
సినిమా తియ్యడానికి ఇప్పుడు కోట్లు అంటారేమిటి. వందల కోట్లు అనండి. కొంత మంది “బల”శాలురు అయిన హీరోల పారితోషికం ఒక్కటే వంద కోట్లు దాటిందట.
కాబట్టి వ్యాపారమే లక్ష్యంగా వచ్చిన ఈ విచ్చలవిడి మార్పు గురించి మరీ బాధ పడిపోకుండా (బాధపడి కూడా చేసేదేం లేదుగా) హాయిగా ఇంటిపట్టునే ఉండి, కావలసినవి రుచిగానూ శుచిగానూ ఇంట్లోనే చేసుకుని (ఓపిక లేకపోతే వంటమనిషిని పెట్టుకుని) తిని, సినిమా హాలుకి వెళ్ళే శ్రమ కూడా లేకుండా OTT లో టీవీ మీద ఇంట్లోనే సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చెయ్యడం …. ఉత్తమం …. అని నా అభిప్రాయం.
చక్కని వివరణాత్మక విశ్లేషణ... స్పందన. ధన్యవాదాలు సర్.
Delete