సాయంత్రం అయిదు దాటింది నేను బయట పడేసరికి. దాదాపు నెల తర్వాతనుకుంటాను, ఇలా ఇల్లు దాటి రోడ్డు ఎక్కడం ! అదేమిటో ! వెంట వెంటనే వెళ్తూ ఉంటే రోజూ కాసేపు బయటకి వెళ్లి అలా తిరిగి రావాలనిపిస్తూ ఉంటుంది. బద్ధకించో లేక ఇంట్లో వేరే పనుల వల్లో బ్రేక్ పడిందా... ఇక అంతే ! ఆ విధంగా ఓ వారం గ్యాప్ వచ్చిందంటే చాలు... విపరీతమైన బద్ధకం ఆవహించి, ససేమిరా ఇల్లు కదల బుద్ధి అవదు. ఆ బద్ధకం వదిలించుకుని, ఎలాగైనా బయటపడి అలా నాలుగు వీధులూ చుట్టి రావాలని రెండు రోజుల క్రితం గట్టిగా నిశ్చయించుకుని... ఇదిగో ఈ రోజిలా ఆచరణలో పెట్టగలిగాను.
హ్యాండ్ బ్యాగ్ లో నాలుగైదు వందలదాకా ఉన్నట్టు గుర్తు. కొనాల్సినవైతే ఏమీ లేవు.ఉబుసుపోక అలా తిరగడమే ! ఆటో దిగి, ఓసారి తేరిపారజూసి, ఎదురుగా కనిపిస్తున్న ఓ ఫాన్సీ షాపు దగ్గరికి దారి తీశాను. లోపలికి ప్రవేశిస్తూ ఉండగా... ఎదురుగా ఓ బోర్డు నాకంటబడింది.
NO MASK.. NO ENTRY..
నవ్వుకున్నాను. అరె ! ఈ బోర్డు ఇంకా తీసివేయలేదా! వెంటనే నాకు రెండున్నర సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న దారుణమైన, దయనీయ దుస్థితి కళ్ళ ముందు కదలాడింది. ఎంత అల్లల్లాడిపోయింది యావత్ప్రపంచం !! చాప కింద నీరులా ప్రవేశించి, ఒక్కసారిగా విజృంభించి, మనుషుల్ని పీడించి, మానసికంగా నిర్వీర్యుల్ని చేసి, వికటాట్టహాసం చేస్తూ మొత్తం ప్రపంచ జనావళినే అయోమయ స్థితిలో పడవేసిన మహమ్మారి 'కరోనా' ఏదీ? ఇప్పుడెక్కడ ? నన్ను నేను ప్రశ్నించుకుంటూ లోపల అడుగు పెట్టాను. అక్కడ ఏవేవో చూస్తున్నాను గానీ, నా ఆలోచనలన్నీ కరోనాను చుట్టుముట్టేశాయి.
బయట కాలు పెడితే చాలు... ముక్కు, మూతి కవర్ చేస్తూ 'మాస్క్' ! ఏది ఉన్నా లేకపోయినా అది మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే ! లేకుండా తిరిగే వాళ్ళకి జరిమానాలు ! ఎంత విడ్డూరం !
" ఎన్నడైనా కనీ వినీ ఎరుగుదుమా !"
అంటూ తాత ముత్తాతలు కూడా ముక్కున వేలేసుకున్నారు గదా... అనుకోని ఆ ఉత్పాతానికి !
బయట నుండి ఇంట్లో అడుగుపెడితే చాలు... సబ్బుతో ముఖం, చేతులు శుభ్రపరుచుకోవడం!చేతులకు శానిటైజర్ తప్పనిసరి ! దీని పుణ్యమాని అప్పట్లో రకరకాల మాస్కులు పుట్టుకొచ్చాయి గదా! ఆ దెబ్బతో మాస్క్ ల , శానిటైజర్ ల వ్యాపారం మహ జోరుగా సాగిపోయిందిగా ! మొత్తానికి ఎంత అలజడి రేపింది ! కొన్ని నెలల క్రితం... ఒక్కటి కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా తల క్రిందులైయిపోయిన పరిస్థితి! హుటాహుటిన వ్యాక్సిన్ ల తయారీ! ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బూస్టర్ డోస్ అంటూ...
పదినిమిషాలు అన్యమనస్కంగా తిరిగా. లోపలికి వెళ్ళినా కరోనా నన్ను వదలదే ! ఏమీ కొనాలనిపించక
అందులోనుండి బయటకొచ్చేశా. మరో షాపు కనిపిస్తే, అసంకల్పితంగానే నా అడుగులు అటువైపు పడ్డాయి. అప్రయత్నంగా నాచూపు షాపు ఎంట్రెన్స్ వద్ద గోడ మీద పడింది. మళ్లీ అదే !!
No mask... no entry !!
తల పట్టుకుని
"అప్పటి ఛాయలు మర్చిపోకుండా ఈ రాతలు జనాలకి బాగానే గుర్తు చేస్తున్నాయిలే "
అనుకున్నాను. ఓ దశలో దీనికి అంతం ఎప్పుడు? అసలు ఉంటుందా? దీన్నుంచి బయటపడే రోజంటూ వస్తుందా! అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికిన క్షణాలు గుర్తుకొచ్చాయి ఒక్కసారిగా ! కరోనా సోకి తల్లడిల్లుతూ, హోమ్ క్వారంటైన్ లో గడుపుతూ, వండి పెట్టే వారు లేక, బయటివారు ఎవ్వరూ వారిని సమీపించే పరిస్థితి లేక... అంటురోగగ్రస్తులై నరకం అనుభవించిన వారు కోకొల్లలు !!
అదో రకమయితే... దాని బారినిబడి ప్రాణాలు సైతం కోల్పోయినవారు ప్రముఖుల నుండీ సామాన్యులు, అతి సామాన్యుల వరకూ ఎందరో ! ఆప్తుల్నీ, కుటుంబానికి ఆధారమైన వ్యక్తుల్నీ కోల్పోయి, విషాదంలో మునిగిపోయి, ఇప్పటికీ ఇంకా కోలుకోలేని దురవస్థలో ఉన్నవారు కొందరైతే... ప్రాణాలు మాత్రం దక్కించుకుని , జీవశ్చవాలుగా మారి, అది మిగిల్చిపోయిన అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా బాధలు పడుతున్నవారు మరికొందరు !
ఆశ్చర్యమేస్తుంది.. తలుచుకుంటుంటే! కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో ఇంత వ్యధ అనుభవించామా అని! దీనివల్ల ఎదుర్కొన్న సమస్యలు ఒకటా, రెండా! కనీ విని ఎరుగని రీతిలో పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లల చదువులు అటకెక్కాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. కూరగాయలమ్మి బ్రతికిన వాళ్లూ ఉన్నారు. జనజీవనం దారుణంగా గాడి తప్పిన క్షణాలవి! ముఖ్యంగా ఎక్కడి వారక్కడ బందీలుగా చిక్కిపోవడం! ఇతర దేశాల్లో ఉన్నవాళ్లు ఇక్కడకి రాలేక, ఇక్కడివారు అక్కడికి పోలేక.... ఇప్పటికీ ఇంకా ఆ సమస్య కొనసాగుతూనే ఉంది.
ఇదంతా కొద్దికాలం క్రితం అనుభవించిన వేదన. ప్రస్తుతం లోకి వస్తే.. ఆ ఆనవాళ్లు కనిపించడం బాగా తగ్గిపోయింది. జనజీవనం 'నార్మల్' అయిపోయినట్లుగా ఉంది. మాస్కులతో ఉన్న మొహాలు మాయమైపోయాయి. శానిటైజర్లు షాపుల ముందు, బ్యాంకుల ముందు కనిపించడం లేదు. ఆ వాతావరణం పూర్తిగా అదృశ్యమై ప్రజలంతా కరోనాను పూర్తిగా మర్చిపోయారు. మర్చిపోయారో... మరి విసిగిపోయి, ఓ విధమైన తెగింపు ధోరణిలో కొచ్చారో !
తీవ్రత బాగా ఎక్కువైన రోజుల్లో పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఇతర అలంకరణలతో పాటు ముఖానికి మాస్క్ కూడా అలంకరణలో ఓ భాగంగా ఉండింది. ఇప్పుడు ఆఛాయలు లేవు. అప్పట్లో హాస్పిటల్స్ లో అయితే డాక్టర్లు, నర్సులు.. వారి వేషధారణ వ్యోమగాముల్ని తలపించేది అంటే అతిశయోక్తి ఏమీ లేదనుకునే వాళ్ళు.. కానీ ఇప్పుడు అక్కడా..అంతా.. 'నార్మల్' ! అలా ఉంది కదా అని కరోనా సమసి పోయింది.. ఇక డోంట్ వర్రీ.. అని అనుకోవడానికి లేదట ! మనం మాత్రం జాగ్రత్తగానే ఉండాలని హెచ్చరికలు !
ఏదేమైనా... ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది. కాకపోతే...అత్యవసరానికి పనికొస్తాయని రెండు, మూడు హ్యాండ్ బాగ్ లలో వేసిఉంచుకున్న ఒకటీ అరా మాస్క్ లు బాగ్ తెరిచినప్పుడల్లా దర్శనమిస్తూ ఆ 'చేదు'ను కళ్ల ముందుకు తెస్తూ కలవరపరుస్తూ ఉంటాయి !!
గత ఆలోచనలను బలవంతంగా పక్కకు నెట్టి, షాపు నుండి మళ్ళీ బయటపడ్డాను. ఎలాగూ వచ్చాను.. కనీసం రెండు కర్చీఫ్స్ అయినా కొందామని నాలుగడుగులు వేసి, ఓ రెడీమేడ్ షాప్ కనిపిస్తే అందులోకి దారి తీశాను. యధాలాపంగా పక్కకు చూసిన నా కంటికి మళ్లీప్రత్యక్షం !!
NO MASK... NO ENTRY !!
******************************************
No comments:
Post a Comment