🌺
జీవితమంటే కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు సహజమే. ప్రతి మనిషికీ ఇది తప్పనిదే. ఇంటాబయటా తీపి, చేదు అనుభవాలు లేని వారుండరు. ఉద్యోగస్తులకైతే.. ఆ ఉద్యోగపర్వంలో మరిన్ని జ్ఞాపకాల దొంతరలు !
** ** **
ఓ హెడ్ మాస్టర్ గారు అంటుండేవారు...
" పెద్దపులికి తోకగా ఉండే కంటే చిన్న చీమకు తలకాయగా ఉండడం చాలా మేలు అని..."
అప్పట్లో నాకు ఆయన మాటలు బుర్రకెక్క లేదు. కానీ కాలగర్భంలో కొన్నేళ్ళు గడిచిపోయాక... ఎదుర్కొన్న కొన్ని స్వానుభవాలతో అప్పుడు... అప్పుడు ఫ్లాష్ వెలిగింది మెదడులో..! అదెలాగంటే... కొంత ఉపోద్ఘాతం అవసరం మరి !
ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంటే... నేనే రాజు, నేనే మంత్రి.. నేనే అటెండర్, నేనే ప్యూన్.. అన్న చందాన ఉంటుంది ఆ 'కుర్చీ' పరిస్థితి ! అవటానికి చిన్నబడే. కానీ సవాలక్ష బరువులూ బాధ్యతలు.. అయితేనేం ! ప్రధానోపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడే ! పెద్ద సారు! పెద్ద టీచరు ! అన్న పెద్ద హోదా ! పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా ప్రత్యేక దృష్టితో చూడడం విశేషం! అదో చిన్న చీమ ! దానికి తల హెడ్మాస్టర్ / హెడ్ మిస్ట్రెస్ !
నేను ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలల
HM గా పది సంవత్సరాలు పైగానే పనిచేశాను. రెండింటికీ పెద్ద తేడా ఏమీ కనిపించలేదు నాకు. రెండింటి అడ్మినిస్ట్రేషన్ ఒకలాగే ఉండేది. అసిస్టెంట్ లకు తమ తరగతుల బాధ్యత ఒక్కటి మాత్రమే. కానీ.. HM కు స్కూలు వ్యవహారాలతో పాటు తన తరగతి బోధనా బాధ్యత కూడా అదనంగా ఉండేది. అబ్బో ! తలనొప్పి వ్యవహారాలు చాలా చాలానే ఉండేవి. (ఇప్పుడైతే పెరిగిపోయిన టెక్నాలజీ పుణ్యమా అని మరిన్ని కొత్త కొత్త ఆధునిక బాధ్యతలు వచ్చి పడ్డాయనుకోండి.. ).
అయినా చాలామంది హెడ్ మాస్టర్ లుగా ఉండటానికి ఇష్టపడేవారు. కొందరు అదో బరువు అనుకుంటే మరికొందరికి అది మహదానందంగా ఉండేది. అదో గొప్ప హోదా అని ఫీలయిపోయి... అసిస్టెంట్ల మీద పెత్తనాలు చేసే వాళ్ళని చూశాన్నేను. ఈ తరహా వ్యవహారం హైస్కూల్ హెడ్ మాస్టర్ల దగ్గర, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ దగ్గరా ఎక్కువగా గమనించాను. కొందరైతే అదేదో ఆ కుర్చీీ, ఆ హోదాని మరీ గొప్పగా ఊహించుకొని, అది శాశ్వతమని భ్రమపడి సబార్డినేట్స్, అటెండర్, ప్యూన్... ఇలా అందరిమీద అవసరానికి మించిిన పెత్తనాలు చేసే వాళ్లూ ఉండేవారు. పాపం ! రిటైర్ అయిపోయాక... పలకరించే దిక్కులేక వీళ్ళ పరిస్థితి ఏమిటో కదా... అనిపించేది !
నా సర్వీసులో చివరి పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్ గా చేయడం జరిగింది. అంతవరకూ వివిధ రకాల స్కూలు పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన నాకు ఒకవిధంగా రిలీఫ్ ని ఇచ్చింది ఈ గెజిటెడ్ పోస్ట్ ! చాలా ఎదురు చూశాను కూడా. ఇక్కడ కేవలం.. Time to time... Bell & Bill లా ఉండే సౌలభ్యం ! బోధన మీదే కాన్సెంట్రేట్ చేసే అవకాశం ! అంతా బాగుంది. కానీ కొద్ది కాలం గడిచాక.. ఏదో మూల కాస్త వెలితి అనిపించించసాగింది. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు సీనియర్ మోస్ట్ అయిన నేను.. కాలేజీ ఎడ్యుకేషన్ కు రాగానే, సర్వీస్ మళ్లీ కొత్తగా మొదలై జూనియర్ మోస్ట్ అయిపోయాను.
అవటానికదో పులే ! కానీ దాని తోక లాంటి పరిస్థితి! అంతవరకూ అజమాయిషీ చేస్తూ వచ్చిన నేను..ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి, ప్యాసివ్ మెంబర్ అవడం ! కించిత్ బాధ కలిగించే విషయం అయిపోయింది నాకు ! అప్పటివరకూ స్కూల్లో ఏ కార్యక్రమమైనా అన్నింటినీ ముందుండి నడిపించిన నేను.. ఇప్పుడు ఏమీ పట్టనట్టు ఓ పక్కగా ఉండిపోవడం! ఓ ఇష్టం కోసం మరో ఇష్టాన్ని వదులు కోవడం అంటే ఇదేనేమో !!
కాకపోతే ఓ సంతృప్తి ఏమిటంటే... నేను కోరుకున్న పోస్ట్ లోకి చేరుకున్నానన్న సంతోషం మిగతా అన్నింటినీ జయించింది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే.. సరిగ్గా అప్పుడే అవగతమైంది నా బుర్రకు.. ఒకప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు అన్న మాటకు అర్థం.. ! ఏమిటో.. ! ఈయన మరీ విపరీతంగా చెప్తున్నాడు అనుకున్నానారోజుల్లో.. అదే..
" పెద్ద పులికి తోకగా ఉండడం కంటే చిన్న చీమకు తలకాయలా ఉండడం మేలు "
ఒక విధంగా నిజమే కదా! అనిపించేది నాకు ఆరోజుల్లో ఒక్కోసారి ! అదలా ఉంచితే...
బోధన నాకు ఇష్టమైన అంశం. దానికి మాత్రమే పరిమితమై, నా చిన్ని కోరిక నెరవేరినందుకు నాకు ఎప్పటికీ ఆనందమే !! ☺️
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
This comment has been removed by the author.
ReplyDeleteఆ హెడ్మాస్టర్ గారు అన్న పెద్దపులి తోక చీమ తలకాయ పోలిక బాగుందండి. ఇలాంటిదే ఆంగ్లంలో better to be a big fish in a small pond than small fish in a big pond అంటుంటారు.
ReplyDeleteఅఫ్కోర్స్ ఉద్యోగంలో ఎంతగా విర్రవీగినప్పటికీ “అధికారాంతమందు చూడవలె గదా ఆ అయ్య సౌభాగ్యముల్” అన్నదయితే పూర్తిగా సత్యం.
లెక్చరర్ అవాలని ప్రగాఢంగా కోరుకున్న మీ కోరిక తీరినందుకు అభినందనలు. మరి జూనియర్ నుండి సీనియర్ అయ్యారా రిటైర్మెంట్ నాటికి?
అన్నట్లు ఓ సంగతి చెప్పండి - “ప్రాధమిక పాఠశాల” అంటే నాకు తెలిసి Elementary School (కనీసం నేను చదువుకున్న కాలంలో); ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఎలిమెంటరీ అనే అనేవారు. మరి దాని పైన మీరన్న “ప్రాధమికోన్నత పాఠశాల” అంటే ఏమిటి?
లేదండీ. Eligibility ఉన్నా పదవీకాలం ముగిసినందున sr. లెక్చరర్ అవలేదు.
Deleteప్రాథమిక పాఠశాల ( elementary school ) -- 1 నుండి 5 తరగతులు.
ప్రాథమికోన్నత పాఠశాల( upper primary school ) 1 నుండి7 తరగతులు.
ఇక... 6 నుండి 10..ఉన్నత పాఠశాల
( High school )తెలిసిందే.
ప్రస్తుతం విలీనం పేరిట చాలా చాలా మార్పులు జరగబోతున్నాయని అంటున్నారు మరి !
మీరు చెప్పిన ఇంగ్లీష్ సామెత చాలా చాలా బాగుంది సర్ .👌☺️