Thursday, June 30, 2022

జీవితం

🌷

కొంచెం ఇష్టం కొంచెం కష్టం  
కొంచెం సుఖం, కొంచెం దుఃఖం 
రెండింటి కలబోతే ఈ జీవితం !
రెండూ కలిస్తేనే కదా అసలైన జీవితం !!
రాత్రి వెంట పగలు
పగలు వెంట రాత్రి వోలె 
వస్తూ పోతూ, పోతూ వస్తూ 
వెలుగుతో  పలకరించి పరవశింపజేస్తూ 
చీకటితో నింపేసి అలమటించేలా జేస్తూ 
ఒకపరి పన్నీటిజల్లుతో నవ్విస్తూ 
అంతలోనే కన్నీటిజడితో తడిపేస్తూ...!
అయినా సరే... 
మనిషిని  నిత్యం నడిపిస్తూ
ఆగక ముందుకు పయనింపజేసేదే జీవితం..!!
ఎత్తుపల్లాలు అత్యంత సహజం
పరమార్థమెరిగి వేదాంత సారం గ్రహిస్తే
బ్రతుకంతా ఆనందమయం 🙂

                  *********************




Thursday, June 23, 2022

రేపు సోమవారం.. !

  సాయంత్రం ఆరున్నర దాటింది. టీవీలో కొత్త సినిమా చూస్తోందన్న మాటే గానీ నవీన లో మెల్లిగా ఏదో గుబులు తొలి చేయడం మొదలైంది. పక్కన ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు, అత్తగారు, మామగారు ఇంకా ఆడపడుచూ... అంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. కానీ నవీనే .. ఆ అదృష్టానికి నోచుకోలేక పోతోంది. కారణం?... 
   శనివారం వస్తోందంటే మహదానందం. ఎందుకంటే అది దాటితే ఆదివారం వస్తుంది కదా మరి ! ఆరు రోజులపాటు ఎదురు చూస్తే వచ్చే  ఒకే ఒక ఆటవిడుపు ఆదివారం. అదిగో.. శనివారం రాత్రి గడిచిపోయి తెల్లారింది. అమ్మయ్య ! వచ్చేసింది  ఆదివారం ! అందరికీ ఇష్టమైన,  ఎంతో  ఆత్రంగా ఎదురు చూసే ఆదివారం !! 
    ఆడవాళ్లు ...ఒక్క   ఉద్యోగినులే  కాదు... ఇంటిపట్టున ఉండే గృహిణులు  కూడా ఎంతగానో ఎదురుచూసే దినమిది ! పాపం అమాయకపు ఆడవాళ్లు! అల్ప సంతోషులు!నిజం ! ఆరోజు... రోజుకన్నా పనులు, శ్రమ అధికంగా ఉన్నా... అదే మీ వాళ్ల మనసుకు పట్టదు. ఏదో కాస్త తీరిగ్గా, నిదానంగా, టెన్షన్ కు దూరంగా లాగించవచ్చులే అన్న ఉద్దేశం కావచ్చువారిది ! 
     ఇంతకీ ఆదివారం బెనిఫిట్స్... ( ఇదివరకు ఓసారి చెప్పుకున్నవే అయినా ) మళ్లీ మరోసారి చూద్దాం... 
* ఆలస్యంగా నిద్రలేవచ్చు 
* పిల్లల్ని  త్వరగా రెడీ చేయాల్సిన పని ఉండదు. 
* టిఫిన్లు, భోజనాలు.. స్పెషల్ సే అనుకోండి..               అయినా  హడావుడి పడాల్సిన పని ఉండదు. 
* తీరిగ్గా దినపత్రిక తిరగేయొచ్చు !
* ఆదివారం అనుబంధం ! అదో స్పెషల్! ఇంకా అదనపు ఆనందం !
* OTT లో కొత్త సినిమాలు చూడొచ్చు. అది లేని వాళ్లు! మరే మీ పరవాలేదు, విడుదలైన నెలకే ఏదో ఒక కొత్త సినిమా ప్రతీ వారం టీవీలో దర్శనమిస్తూనే ఉంటోంది ఈమధ్య ! మరింకేం?  పైసా ఖర్చు లేకుండా చూసేయొచ్చు ! 
 ఇలా పెద్ద లిస్టే  ఉంటుంది.. చెప్పుకుంటూపోతే. ఇంకా నాకు తోచనివి కూడా ఉండే ఉంటాయి. మరి... ఇన్ని ఆనందాలు ఉండగా నవీన కి వచ్చిన సమస్య ఏమిటబ్బా?  ఆమె గుబులు  కు కారణం ఏంటి? 
   ఏ గడ్డు సమస్యో  అనుకుంటున్నారా? అదేమీ లేదండీ.. సింపుల్.. ! రేపు.. అంటే తెల్లారితే... సోమవారం.. !! నవీన ఓ గవర్నమెంట్ ఎంప్లాయి. ఆమె బాధలూ,  బాధ్యతలు ఆమెకు ఉంటాయి గా మరి! ఒక రోజంతా  టెన్షన్ ఫ్రీగా గడిపేసి, మళ్లీ బిజీ లైఫ్ లోకి జొరబడాలంటే.. ఏదో చెప్పలేని అనాసక్తి.. ఆ కాస్త సోమవారం గడిస్తే చాలు, మళ్ళీ మామూలే.. !మనసు, శరీరం.. రెండూ కుదుటబడతాయి. 
    చదువుకునే రోజుల్లో ఇంగ్లీషు సబ్జెక్ట్ లో ఓ లెసన్ ఉండేది. Monday morning --- ఆ లెసన్ పేరు. శనివారం మధ్యాహ్నం నుండీ ఆదివారం రాత్రి దాకా తెగ ఆహ్లాదంగా గడిపేశాక, సోమవారం ఉదయం త్వరగా నిద్ర లేవాలన్నా, రెడీ అయిపోయి స్కూలుకు వెళ్లాలన్నా పిల్లలకు  ఎక్కడలేని నీరసం. అమ్మ లేపినా, నాన్న లేపినా ఇంకాసేపు పడుకుంటా అంటూ మారాం చేయడం ! బళ్లో  పాఠాలు వినాలన్నా, బుర్రకెక్కించు కోవాలన్నా, చదవాలన్నా తగని బద్ధకం! అబ్బా ! ఈ ఒక్క రోజు టీచర్ పాఠాలు  చెప్పకపోతే ఎంత బాగుంటుంది కదా ! అనుకుంటూ  అన్యమనస్కంగా ఉండడం స్కూల్ పిల్లలకు మామూలే ! అంతే, ఆ ఒక్క రోజే అలా.. మరుసటి రోజు నుండీ   మళ్లీ కథ మామూలే !
    అలా సోమవారం నాడు పిల్లల 'మూడ్' గురించి వివరించే లెసన్ అది ! కానీ నిజం చెప్పొద్దూ.., ఒక్క పిల్లలకేనా? గృహిణులకూ, ఉద్యోగినులకూ... ఇంకా ఇంకా.. ఇంట్లో అందరికీనూ... ఆదివారం అంటే ఎంత ఇష్టమో.... సోమవారం అంటే అంత అయిష్టం.. కష్టం !ఔనా.. కాదా.. !
    ఇంట్లో అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నా నవీన చేయలేకపోవడానికి అదే కారణం మరి ! ఇంట్లో మిగతా వాళ్లకు ఇంటి పనులు,  వంట పనులు ఇంకా పిల్లల పనులు.. ఇలాంటి అదనపు బాధ్యతలు ఉండవు. తనకు టీవీ చూస్తున్నా అదే ధ్యాస,  అదే చింతన ! తెల్లారితే చేయాల్సినవన్నీ ఇంటాబయటా ఎదురుచూస్తూ ఉంటాయి..! అదన్నమాట సంగతి !
      నాకైతే... రిటైర్ అయిపోయి ఇంతకాలమైనా... ఆదివారం ఉదయం ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో.. సోమవారం ఉదయం అంత నిస్తేజంగా అనిపిస్తూ ఉంటుంది. నాతో పాటు రిటైరయిన నా కొలీగ్ కమలకుమారిదీ ఇదే ఫీలింగ్ ! నేనైతే ఆ ఫీలింగ్ పోగొట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటా గానీ... మనసు మాట వినదే... ! 🙂
                     *******************


Friday, June 17, 2022

'స్టాక్ డేల్ పారడాక్స్ '...!..? ఓ సిద్ధాంతం..

  '  స్టాక్ డేల్ పారడాక్స్ ' ! 
పేరు చాలా కొత్తగా ఉంది. నేనైతేేే ఎప్పుడూ వినలేదు. మొన్నెప్పుడో దినపత్రిక తిరగేస్తుంటే ఈ పేరు చూసి, ఆసక్తికరంగా అనిపించి, ఏదో ఆర్టికల్ లా ఉందే అనుకుంటూ చదివేశాను. చదవడం పూర్తయ్యేసరికి అదోో సిద్ధాంతమనీ నిజంగా ప్రతివారికీ ఎంతో స్ఫూర్తినిచ్చేదనీ ఇంకా ఎంతో అవసరమనీ తెలిసింది. దాని గురించి నాలుగు మాటలు రాయాలనిపించి వెంటనే కలం పట్టుకున్నాను.
    ఆ చిన్న వ్యాసం ఇలా ప్రారంభమయింది ----
 చిన్నచిన్న ఎదురు దెబ్బలకే తల్లడిల్లి పోతుంటాం. అపజయాలకు భయపడుతుంటాం. కానీ ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా స్థిరమైన ఆత్మస్థైర్యంతో నిలబడాలని చెప్పే ఒక విధానం గురించి మీకు తెలుసా?... అదే 'స్టాక్ డేల్ పారడాక్స్' !....
----- అలా ప్రారంభమై, దీని వెనుక ఉన్న  కథను వివరించడం జరిగింది. 
జేమ్స్ స్టాక్ డేల్ అనే అతను ఓ అమెరికన్ సైనికుడు. వియత్నాం యుద్ధంలో ఖైదీగా మరికొందరు సైనికులతో పాటు శత్రు దేశానికి చిక్కాడు. రోజులు గడుస్తున్నాయి. ఆ సమయంలో చిత్రహింసల తో నరకం అనుభవిస్తూ, బెంగతో విడుదల అవుతామన్న ఆశలు బొత్తిగా సన్నగిల్లడంతో అతని తోటి సైనికులంతా ఒక్కరొక్కరే కన్ను మూస్తున్నా జేమ్స్ మాత్రం నమ్మకాన్ని కోల్పో లేదట ! ఎప్పటికైనా ఇల్లు చేరి, తన వాళ్లను కలుసుకుంటానన్న బలమైన విశ్వాసంతో ధైర్యం కూడగట్టుకొని ఉన్న అతన్ని ఎట్టకేలకు ఏడున్నరేళ్ళకి విడుదల చేశారట ! పట్టుబడ్డ ఖైదీల్లో ఎప్పటికైనా మంచి జరుగుతుందని బలంగా నమ్మిన జేమ్స్ మాత్రమే మానసికంగా ధైర్యంగా ఉండి ప్రాణాలతో బయట పడడం జరిగిందన్న మాట ! తదుపరి కాలంలో అతను సైన్యంలో అడ్మిరల్ గా  కూడా పని చేశాడట !!
    ఇంతకీ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జిమ్ కాలిన్స్ అనే రచయిత ! జేమ్స్  అనుభవాల ఆధారంగా ఈ 'స్టాక్ డేల్ పారడాక్స్ ' అనే సిద్ధాంతాన్ని తను రాసిన 'Good to Great ' అనే  పుస్తకం లో ప్రతిపాదించాడని ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.
    ఇంతకీ ఈ  సూత్రం ఏమి  బోధిస్తుందంటే.... ఎలాంటి కష్ట సమయంలోనూ ధైర్యాన్ని కోల్పోకూడదు అని ! చిన్న సమస్య వచ్చినా భయపడి పోకుండా వెంటనే ఈ స్టాక్ డేల్ పారడాక్స్ సిద్ధాంతాన్ని ఓసారి మననం  చేసుకుంటే ఊరట కలిగి ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని నా భావన. 
    బాగా తెలిసిన విషయమే అనిపిస్తోంది కదూ ! నిజమే! పాత సూత్రమే. మానసికంగా బలంగా ఉండేవాళ్ళు పాటిస్తూ ఉంటారు కూడా. కాకపోతే....  ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ఇలాంటి విధానాన్ని మళ్లీమళ్లీ మననం చేసుకోవడం చాలా చాలా అవసరం అనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకే భీతిల్లిపోతూ డిప్రెషన్ లోకి పోవడం.. ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్న యువతకు ఇది మరీ మరీ అవసరం.
   *  భవిష్యత్తులోకి తొంగి చూడటం అలవాటు చేసుకోవాలి. ఆశావహ దృక్పథం అలవరచుకోవాలి. మంచి రోజుల కోసం నమ్మకంగా ఎదురు చూడాలి. ఏమో ! మనకోసం ఏ మంచి ఘడియలు మున్ముందు వేచి ఉన్నాయో !  అంతే కదా !! 🙂😊

                    🌷🌷🌷🌷🌷🌷🌷



Wednesday, June 15, 2022

మానవుడా ! మర్మమెరిగి మసలుకో !

ఈదినం నాదీ నాదనుకుంటున్నది 
రేపటికి మరొకరి సొంతం అన్నది ఎరుగక 
ఓ వెర్రి మానవుడా, 
నీకెందుకంత  ఆరాటం? 
ఆర్భాటం ప్రదర్శిస్తావు 
ఎగిరెగిరి పడతావు, 
ఏదో కావాలనుకుంటావు 
మరేదో అయిపోవాలనుకుంటావు
కానీ --
ఇంకేదో అయిపోయి
డీలా పడిపోతావు  ! 
తల్లి గర్భాన  కళ్ళు తెరిచి
భూగర్భాన మన్నుగ మారి 
కనుమరుగైపోయేదాకా 
విధి మున్ముందే రాసేసిన
నీ నుదుటిరాత.. తిరిగి 
ఆ విధాత సైతం మార్చలేడన్న 
చేదు నిజం ఎరుగక 
ఓ పిచ్చి మానవుడా, 
ఎందుకా పరుగులు ? 
ఏమందుకోవాలనీ 
ఇంతలేసి వృధాప్రయాసలు !
ఉన్నది చాలు, కడుపు నిండా తిను 
మిగులుతుందీ అనుకుంటే 
మరొకరి కడుపు నింపు, దీవిస్తారు !
ఆ దీవెనలే నీకు సదా రక్ష !
వారి మదిలో నీవో చెరగని ముద్ర !
ఇది నిజం ! ముమ్మాటికీ నిజం !!
నీవు లేకున్నా  నిత్యం
కదలాడే నీ తీపి తలపులే
ఇలపై నిను నిలిపే
ఎనలేని కీర్తిప్రతిష్టలు !!
అందుకే -- వినుకో, 
ఓయి వెర్రి మానవుడా, మేలుకో !
మర్మమెరిగి మసలుకో  !!  🙂

                     ****************

Monday, June 13, 2022

లోపాలే వారి బలగం... బలం... !?

*  " భార్య అందంగా లేదనీ, తనకు నచ్చినట్లుగా నడుచుకోవట్లేదనీ విడాకులు కోరిన భర్త " !
*  " అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధిస్తూ పుట్టింటికి తరిమేసిన భర్త!"
* " భర్తకు  సంపాదన లేదంటూ నిత్యం వేధిస్తూ,సణుగుతూ సంసారాన్ని నరకం చేస్తున్న భార్య!"
* తన తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను హతమార్చిన భర్త !"
*  నిత్యం కీచులాటల్తో రోడ్డెక్కిన భార్యాభర్తలు !"
---- ప్రతిరోజు న్యూస్ పేపర్లలో ఇలాంటి వార్తలు ఎన్నో! విషయానికి వస్తే ---
   వివాహ వ్యవస్థ పై ఏ మాత్రం గౌరవమన్నది లేకుండా విలువల్ని పాటించకుండా ఒకరి  లోపాలను ఒకరు విమర్శించుకుంటూ జీవితాల్ని  నరకప్రాయం చేసుకుంటున్న దంపతులు వినాల్సిన ( చదవాల్సిన )
ఉదంతమొకటి కొద్ది రోజుల క్రితం' ఈనాడు' దినపత్రికలో చదివాను.
" దారిచూపు నువ్వు... అడుగేస్తా  నేను.." అన్న హెడ్డింగ్ తో ప్రచురితమైన ఆ వార్త ఎంతగానో ఆలోచింప చేసేదిగా అనిపించింది నాకు..
--- ఆ ఇద్దరూ భార్యాభర్తలు. భర్త పుట్టుకతోనే అంధుడు ! భార్యేమో  నడవలేదు ! అయినా సరే, వాళ్లు నిరాశానిస్పృహలకు లోనుగాలేదు. ఇద్దరి లోపాల్ని ఒకరికొకరు బలంగా భావిస్తూ, పరస్పరం సహకరించుకుంటూ జీవనయానం సాగిస్తున్నారు. ఎలాంటి పని ఎక్కడున్నా అతను సైకిల్ పై భార్యను కూర్చుండబెట్టుకొని, ఆమె దారి చూపిస్తూ ఉంటే ఎంత దూరమైనా, మరి ఎంత ఎండగా ఉన్నా సైకిల్ ని తోసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తాడట ! ఆ ఇద్దరిలోని లోపాలే వారి బలగం అనీ, అదే వారి బలం కూడా అనీ అందులో పేర్కొనడం జరిగింది. 
    కొంతకాలం క్రితం ఇలాంటిదే మరొకటి ! నడవలేని భార్యను భర్త తన వీపు పై మోస్తూ ఓ కార్యాలయానికి అవసరార్థం నడుస్తూ పోతున్నాడు. ఎంతటి మానవీయత ! అందులో ఎంత అవగాహన!  సహనం,  ఓర్పు ! ఇంకా అంతర్లీనంగా ఎంత ప్రేమ దాగి ఉన్నాయో కదా !!
** నిజంగా ముందుగా పేర్కొన్న భార్యాభర్తలు ఎంతగానో ఆలోచించాల్సిన విషయమిది. అన్నీ సవ్యంగా ఉన్నా ఏదో ఒక అసంతృప్తితో చిన్నచిన్న లోపాల్నే  భూతద్దంలో చూస్తూ అనవసరంగా వాటిని పెద్దవిగా చేసుకుంటూ మనశ్శాంతి పోగొట్టుకుంటూ ఉంటారు కొందరు. ఇతరులతో పోల్చుకోవడం, అందరూ తమ కంటే సుఖంగా ఉన్నారనీ, తామే దురదృష్టవంతులమనీ భావించడం ఇలాంటి వాళ్లకున్న  చెడ్డ అలవాటు. ఇంకా చెప్పాలంటే  మానసిక బలహీనత! రుగ్మత ! ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు... వాళ్లు ప్రశాంతంగా ఉండరు.. పక్కన ఉన్న వాళ్ళనీ ప్రశాంతంగా ఉండనివ్వరు.
    వీళ్లంతా ఆ పైన ఉదహరించిన జంటలను చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. లోపాలు ఉండని  మనిషి ఎవరండీ?  ప్రతివారిలోనూ ఏవో కొన్ని మైనస్ లు ( బలహీనతలు) ఉండి తీరతాయి. వాటితో బాటు ప్రత్యేకతలూ ఒకటీ అరా  ఉండే ఉంటాయి. కానీ దురదృష్టమేమిటంటే --- మైనస్ లను మైక్రోస్కోప్ లో చూస్తూ ఉంటారు కాబట్టి ప్లస్ లు మరుగున పడి పోయి  కనిపించవు. అక్కడే వస్తుంది చిక్కంతా ! 
   కాస్త విచక్షణతో ఆలోచించి, విశాల దృక్పథం అలవరచుకుంటే చాలు... పరిస్థితి చక్కబడుతుంది. ఇందులకై కాసింత విజ్ఞత, విలువలకు కట్టుబడి ఉండడం దంపతులిద్దరికీ చాలా  అవసరం. అప్పుడే సంసారాలు విచ్ఛిన్నం కాకుండా కలకాలం పచ్చగా పదుగురికి ఆదర్శంగా నిలుస్తాయి... 
                     🌷🌷🌷🌷🌷🌷🌷🌷
       

Thursday, June 9, 2022

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 9.. టీచర్ అంటే ఎలా ఉండాలి..? ఎలా ఉండకూడదు ?

🌺

    ప్రతీ జీవితంలో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు అత్యంత సహజం. తీపి, చేదు అనుభవాల సమాహారమే కదా జీవితమంటే ! కాకపోతే...తీపి జ్ఞాపకాలు తలచుకున్నపుడు సంతోషాన్నిస్తే... చేదు జ్ఞాపకాలు ముళ్ళుల్లా గుచ్చుకుంటూ బాధపెడతాయి. అయితే... ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. తీపి జ్ఞాపకాలు సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి. అదే చేదువైతే... పాఠాల్ని, గుణపాఠాల్ని చెబుతాయి... నేర్పిస్తాయి. జాగ్రత్త పడమని హెచ్చరిస్తాయి. ఇంకా...అంతర్లీనంగా... ఏదో ఒక సందేశాన్నీ అందజేస్తాయి. ఇది గుర్తించగలిగితే చాలు... చేదును కూడా 'పాజిటివ్' గానే తీసుకోగల ధైర్యం,  ఆత్మస్థైర్యం మనిషికి అలవడతాయి !! 

          *****************************
🌺
   అదో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల. అందులో మధ్యాహ్నం సెషన్.  ఎనిమిదవ తరగతి సోషల్ స్టడీస్ క్లాసు జరుగుతోంది. ముందు రోజే పాఠం  చెప్పడం అయిపోయింది. మరుసటి రోజుకంతా ఆ పాఠం లోని ప్రశ్నలకు జవాబులు  నేర్చుకుని రావాలని టీచర్ గారు చెప్పారు. ఈ రోజు అదే జరుగుతోంది. టీచర్ వరసగా ఒక్కొక్కర్నీ  లేపి ప్రశ్నలు అడగడం మొదలెట్టింది.     
    ఆ టీచర్ అంటే అందరికీ తగని భయం. పొడుగ్గా బలంగా, చామనఛాయలో చూడగానే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో గాని నవ్వదు. ఆవిడ క్లాస్ అంటే అందరికీ లోలోపల ఏదో గుబులుగా ఉంటూ ఉంటుంది. చాలా మటుకు ఆ భయం తోటే అంతా కాస్త జాగ్రత్తగానే చదువుకొని వస్తూ ఉంటారు. 
    అలా ప్రశ్నలు వేస్తూ క్లాసులో ప్రతి ఒక్కరినీ  లేపి అడుగుతున్న ఆమె... ముందు వరసలో కూర్చున్న ఒక అమ్మాయిని లేపి, ఓ ప్రశ్న అడిగింది. దానికా అమ్మాయి జవాబు చెప్పలేక తడబడుతూ నిలుచుండి పోయింది. వెంటనే పక్కనే ఉన్న మరో అమ్మాయిని లేపి  అడిగింది టీచర్. ఆ అమ్మాయి  టకటకా  జవాబు చెప్పేసింది. వెంటనే.. ' గుడ్ ' అనేసి, జవాబు చెప్పని ఆ అమ్మాయికి ముక్కు  చెంపలు వేయమంది. ఆ రోజుల్లో జవాబు చెప్పని పిల్లలకు అదో  'పనిష్మెంట్'!
చెప్పని వారి ముక్కు పట్టుకుని రెండు చెంపలూ వాయించాలన్నమాట ! జవాబు చెప్పిన అమ్మాయి చెప్పని ఆ పిల్ల ముక్కు పట్టుకొని చెంపల మీద మెల్లిగా కొట్టింది. వెంటనే టీచర్, 
" ఏంటీ?  గంధం రాస్తున్నావా?... అలాగేనా ముక్కుచెంపలు వేయడం?... ఎలా కొట్టాలో నేను చూపిస్తాను... "
అంటూ కోపంగా ఆ పిల్లను ముందుకు రమ్మని చేతులు చాపమంది. జవాబు చెప్పిన ఆ పిల్ల భయంతో బిక్కచచ్చిపోయి, ఆసమయం లో ఏమనాలో తోచని అయోమయస్థితిలో కంగారుగా, 
"... మళ్ళీ వేస్తాను టీచర్... " 
అనేసింది. దాంతో ఆ టీచర్, 
" ఇప్పుడు వేశావు గదా, నేను చూశాను గదా, మళ్ళీ వేయడమేమిటి? రా.. ఇలా.. "
అంటూ ఆ విద్యార్థిని రెండు చేతుల మీదా బెత్తం తో చెల్ చెల్ మంటూ గట్టిగా వాయించింది. అంతే ! ఒక్కక్షణం క్లాసంతా 'పిన్ డ్రాప్' సైలెన్స్ అయిపోయింది ఊహించని ఆ పరిణామానికి ! అదేమీ పట్టించుకోకుండా ఆవిడ తన ప్రశ్నావళి కార్యక్రమాన్ని కొనసాగించబోతుండగా బెల్ మోగి, బెత్తం పక్కకు విసిరేసి క్లాస్ నుండి నిష్క్రమించింది. 
  ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు ఆ పిల్ల చుట్టూ చేరి కందిన చేతులు పరీక్షించారు. మిగతా అంతా ఆ టీచర్ సంగతి బాగా తెలుసు గనక మిన్నకుండిపోయారు. 
   ఇంతకీ... అసలు విషయానికొస్తే...  ఆ టీచర్ చేతిలో బెత్తం దెబ్బలు తిన్న ఆ విద్యార్థిని ఎవరో కాదు..నేనే.!. నాకు పదమూడు సంవత్సరాల వయసప్పుడు క్లాసులో జరిగిన ఆ సంఘటన ఎన్నో ఏళ్ళు గడిచినా,  ఓ చేదు జ్ఞాపకంలా ఇప్పటికీ మెదడులో అలా గూడు కట్టుకునే ఉంది.  అంత బాధ లోనూ నా కళ్ళలో చుక్క నీరు రాలేదు. మౌనంగానే భరించాను. నా బాధంతా ఆ టీచర్ అందరిముందూ కొట్టినందుకు కాదు.. జవాబు చెప్పినా, ఏమాత్రం ఆలోచన, విచక్షణ అన్నది లేకుండా.. విద్యార్థి మానసిక స్థితి గురించి అసలు పట్టించుకోకుండా అలా దురుసుగా ప్రవర్తించిన ఆమె తీరుకు  !!
    అదే స్కూల్లో మరొక టీచర్ ఉండేవారు. సైన్స్ సబ్జెక్ట్ బోధించేవారామె. ముప్ఫై  సంవత్సరాల వయస్సు ఉండొచ్చేమో! చాలా హుందాగా ఉండేవారు. ఆవిడ పాఠాలు  చాలా శ్రద్ధగా, విశదంగా చెప్పడం అందరికీ నచ్చేది. ఆమె కూడా గంభీరంగానే ఉండేవారు... కానీ.. ఎప్పుడూ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించే  వారు కాదు. ఆమె క్లాస్ అంటే అంతా ఎదురు చూసే వాళ్ళం కూడా ! ఆమెకు ఎదురు వెళ్లాలంటే అందరూ భయపడేవారు. కానీ ఆ భయం ఆమె పట్ల గౌరవం వల్ల వచ్చినదే !
    ఈ ఇద్దరు ఉపాధ్యాయురాళ్లను  చూశాక.... టీచర్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయంలో ఓ స్థిరాభిప్రాయం నా మస్తిష్కంలో ఆ చిన్న వయసులోనే నాటుకుపోయింది. 
    అలాగని...  ఆ టీచర్ గారి మీద నాకు కోపం గానీ, ద్వేషం గానీ అప్పుడూ లేదు.. ఇప్పుడూ లేదు. 
    అప్పట్లో బోధనా రంగంలో కి వెళ్లాలని గానీ, టీచర్ నవ్వాలనిగానీ... నాకైతే ఏమీ ఉండేది కాదు గానీ... తర్వాతికాలంలో టీచర్ నయ్యాక... ఆ ఇద్దరూ బాగానే గుర్తుకు వచ్చే వారు అప్పుడప్పుడూ ! 
" టీచర్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? "
 అన్న విషయంలో 'స్పష్టత' నాకు వారివల్లే వచ్చి ఉంటుంది బహుశా ! అందుకేనేమో! నా వృత్తిగత జీవితంలో విద్యార్థులను సాధ్యమైనంతవరకు మానసికంగా బాధపెట్టకుండా ఉండటానికే ప్రయత్నించే దాన్ని. టీచర్ పట్ల పిల్లలకు గౌరవభావం, సదభిప్రాయం కలగాలంటే ఒక్క వారి బోధనే కాదు.... వారి ప్రవర్తన కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందని నేననుకుంటాను.ఇంకా,  బోధనా పరంగానే కాకుండా క్రమశిక్షణ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే  దాన్ని. ఎక్కడో ఏ మూలో... వారి దృష్టిలో మా సైన్స్ టీచర్ లా మిగిలి పోవాలన్న ఓ చిన్ని ఆశ నాలో !!   🙂
 ఇదంతా ఈరోజు రాయాలని నాకెందుకనిపించిందంటే... చేదు అనుభవాల నుండి కూడా స్ఫూర్తి పొందవచ్చనీ తద్వారా సరైన దారిలో  నడవొచ్చనీ గుర్తించినందుకే !! 


                 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

                  






Monday, June 6, 2022

పసిపాప

🌷

పసిపాప నవ్వు  ! 
ఆ నవ్వులో  ఎంత స్వచ్ఛత  !
ఆ పసితనంలో ఎంతటి పవిత్రత  !
అప్పుడే విరిసిన పుష్పంలా ఆ వదనం 
ఆహా ! పరవశించిపోదా హృదయం !
కల్మషమెరుగని ఆ చూపుల నిర్మలత్వం
అరవిరిసిన విరజాజికి ప్రతి రూపం !
చూస్తే చాలు, చేతులు చాస్తూ. 
కేరింతల స్వాగతాలు !
బోసినవ్వుల పలకరింపులు !
ఎత్తుకున్నవారికి మురిపాల వరహాలు !
ఈర్ష్యాద్వేషాలకు కడు దూరం ఆ పసిది 
కపటమెరుగని దరహాసం తనది  !!
అమ్మానాన్నల పుణ్యఫలం 
వరమై ఒడిజేరిన క్షణం 
అంబరమంటిన వారి ఆనందం 
వర్ణనాతీతమే కదా !
అది.. అమూల్యం... అపురూపం  !!
పసిపాప !! 🙂 నిజముగ.... 
దేవుడు కొలువైన దేవతాస్వరూపం 
దేవతలు దీవించి ఇలకు పంపిన మరో దైవం !

🙂🙂🙂🙂🙂🙂🌷🌷🌷🙂🙂🙂🙂🙂🙂