Monday, May 31, 2021

ముందుచూపు..... 'చిన్నారి ' కథ

       సీతారాముడు, బలరాముడు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. బలరాముడిది సంపన్నకుటుంబం కాగా, సీతారాముడి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండేది. ఆ పల్లెటూర్లో వానాకాలం చదువు ఏదో అయిందిలే అనిపించారిద్దరూ. వయసొచ్చాక ఇద్దరి వివాహాలు ఇంచుమించు ఒకేసారి జరిగాయి. 
    బలరాముని భార్య కలిగినింటి నుండి వచ్చింది కాబట్టి ఆడంబరంగా ఉండేది. దానికి తోడు బలరాముడి దుబారాతనం కూడా తోడైంది. తరగని ఆస్తి ఉందన్న ధీమాతో విచక్షణారహితంగా ఖర్చు పెట్టేవారు. సీతా రాముడు తండ్రి నుంచి సంక్రమించిన రెండెకరాలతో గుట్టుగా సంసారం సాగించేవాడు. ఉన్నంతలో సర్దుకోవడం అతనికి చిన్నప్పట్నుంచి అలవాటే కాబట్టిగొప్పలకు పోయేవాడు కాదు.ఖర్చులు  పోను కాస్తోకూస్తో వెనకేసుకో  గలుగుతున్నాడు కూడా. అతని భార్య కూడా అనుకూలవతి కావడం అతనికి కలిసొచ్చింది.
   చూస్తోండగానే పదేళ్ళు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో వారి జీవన స్థితిగతుల్లో చాలా మార్పులే  చోటు చేసుకున్నాయి. బలరాముని తండ్రి మరణించాడు. అంతవరకూ చాప కింద నీరులా ఉన్న అతడు చేసిన అప్పులన్నీ ఆయన మరణం తర్వాత ఒక్కసారిగా బయట పడ్డాయి. అప్పులవాళ్ళు చుట్టుముట్టి అందినంతా  లాక్కుపోయారు. ఒక్కసారిగా చెరువులో నుండి బయటపడ్డ చేపలా అయిపోయింది బలరాముడి పరిస్థితి. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని మునుపటిలా జరపడం అతడి శక్తికి మించిన పని అయిపోయింది. ఎక్కడైనా పని చేద్దాం అంటే గతంలో అతని హోదా అందుకు అంగీకరించక సతమతమై పోయాడు. చివరికి గత్యంతరం లేక పక్క ఊర్లో ఓ బట్టల కొట్లో గుమస్తాగా చేరిపోయాడు.కుటుంబపోషణకై అంతకు మించి మార్గం అతనికి కనిపించలేదు. 
      ఒక రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ ఉంటే సీతా రాముడు ఎదురయ్యాడు బలరాముడికి. ఒకే  ఊర్లో ఉంటున్నా వారిద్దరూ కలుసుకోవడం అరుదే. అయినా సీతారాముడు బలరాముడి  గురించిఅన్నీ  తెలుసుకుంటూనే ఉన్నాడు. తన చిన్ననాటి నేస్తం ఈనాడిలా డీలా పడిపోవడం అతనికి బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, బలరాముడు ధనికుల ఇంట పుట్టినా గర్విష్టి కాడు.
    ఆరోజు పట్టుబట్టి బలరాముణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళాడు సీతారాముడు. అతని ఇంటిని చూసేసరికి బలరాముడికి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. అది గొప్పగా ఏమీ లేదు కానీ, ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కనిపించింది. చిన్న పెంకుటిల్లు. చుట్టూ ముళ్ళ కంచె. లోపల అందమైన పూల మొక్కలు విరబూసి స్వాగతం పలుకుతున్నాయి. లోపలకి వెళ్ళగానే సీతారాముడి భార్య చల్లటి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. ఆతని  పిల్లలిద్దరూ ఒకపక్క కూర్చుని బుద్దిగా చదువుకుంటున్నారు.
     వాళ్ల బలవంతం మీద ఆ పూట భోజనం కూడా అక్కడే చేశాడు. భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తుంటే అతని కళ్ళు చెమర్చాయి. వెళ్లేటప్పుడు వారి పెరట్లోని కూరగాయలు ఓ సంచిలో వేసి ఇచ్చాడు సీతా రాముడు. బయటి దాకా వచ్చిన అతనితో బలరాముడు ఇక ఉండబట్టలేక, 
" రేయ్, సీతారాముడూ, అడక్కుండా  ఉండలేకపోతున్నాను, మొదట్నుంచీ నిన్నూ, నీ ఆర్థిక స్థితి గురించీ తెలిసినవాణ్ణి కాబట్టి చనువు  తీసుకుంటున్నాను. ఇంత చక్కగా ఎలా ఉండగలుగుతున్నావురా? "
అతని కళ్ళల్లోకే చూస్తూ అడిగాడు. 
 సీతా రాముడు చిన్నగా నవ్వి, " కేవలం ముందు చూపు మాత్రమే. పైగా గొప్పలకు పోకుండా ఉన్నదానితో సర్దుకుపోయే స్వభావం నాది. ఈ రోజు ఉంది కదా అని పారబోసుకోవడం మంచిపనా చెప్పు?  కూర్చుని తింటే కొండలైన కరిగిపోవా బలరాముడూ,....... "
 స్నేహితుడు ఏ మాత్రం నొచ్చుకోకుండా నెమ్మదిగా, మరింత ఆప్యాయంగా అతని చేయి నొక్కుతూ అన్నాడు సీతారాముడు. 
   అంతే! తాను చేసిన పొరపాటేమిటో అవగతమయ్యే సరికి ఒక్కసారిగా కళ్ళముందున్న తెరలు తొలగిపోయి, కనువిప్పు కలిగినట్లయింది బలరాముడికి. 

**************************************
            🌺 భువి భావనలు 🌺
**************************************













No comments:

Post a Comment