గుండె నిండా గుబులు నింపుకుని భారంగా అడుగులు వేస్తున్నాడు రాజు. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒకటిన్నర కావస్తోంది. బడిగంట వినిపిస్తోంది. మలుపు తిరిగితే బడి కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే వాడి కంట పడ్డదో దృశ్యం. ముందు వెళ్తున్న ఓ అబ్బాయి పుస్తకాల సంచీ కన్నంలోంచి కాంపాస్ బాక్స్ జారి పడిపోయింది. రాజు వెంటనే అరిచి చెప్పబోయాడు. కానీ, అజ్ఞాత శక్తి ఏదో వారించినట్లుగా ఠక్కున వాడి నోరు మూతబడిపోయింది. ఒక్కసారి చుట్టూ చూశాడు. ఎవరూ కంట పడలేదు. వెంటనే వడి వడిగా వెళ్లి దాన్నందుకుని చటుక్కున తన సంచిలోకి జారవిడిచాడు. కొత్త కాంపాస్ బాక్స్. ఆ క్షణంలో వాడి కళ్ళలో బెదురు, ఒంటి గగుర్పాటు చెప్పకనే చెబుతున్నాయి, వాడు చేసింది తప్పని. అయినా వాడు మరేమీ ఆలోచించ దలచుకోలేదు.
దాదాపుపది రోజుల నుండీ కాంపాస్ బాక్స్ కొనమని వేధించే లెక్కల టీచర్, కొందామంటే మొండి చేతులు చూపించే అమ్మానాన్నలు, క్లాస్ లో మిగతా పిల్లల ముందు దీనంగా తలదించుకునేలా చేస్తున్న తన పరిస్థితీ -- ఇవన్నీ కలగాపులగంగా చేరి వాడి మెదడును మొద్దుబారేలా చేసేశాయి. ఆ పూట ఇక స్కూలుకు పోవటం బాగుండదని గిరుక్కున వెనుతిరిగి దౌడు తీశాడు.
మరుసటి రోజు ఉదయం పదినిమిషాలు ముందుగానే బడికి బయలుదేరిన రాజు వడివడిగా నడుస్తున్న వాడల్లా ఏవో అరుపులు వినిపించి చటుక్కున పక్కకు తిరిగాడు.
" వెధవా, కడుపు కట్టుకుని టీనీళ్లు కూడా మానేసి కూడబెట్టి కొనిచ్చిన బాక్స్ రా అది. నీవేమో ఒంటి మీద స్పృహ లేకుండా క్షణాల్లో పోగొట్టుకొని వస్తావా !..."
చేతిలో ఉన్న కర్ర విరిగేలా తన సహాధ్యాయి రాముణ్ణి పట్టుకుని తంతూ వాళ్ళ నాన్న!
రాజు ఒక క్షణం దిమ్మెరపోయాడు. మరుక్షణం గుండె చిక్కబట్టుకుని ముందుకుసాగాడు. తను నిన్న తీసినకాంపాస్ బాక్స్ రాముడి సంచీలోంచి జారి పడినదే ! పేదరికంతో మగ్గిపోతున్న తాను మరో పేదవాడి మనస్థితి అర్థం చేసుకోవడంలో ఎందుకింత పొరపాటు చేశాడు? రాముడి కుటుంబ పరిస్థితి తన కుటుంబం కంటే మెరుగైనది ఏమీ కాదు.
కంపాస్ బాక్స్ తనకిప్పుడు అత్యవసరమే. కానీ దాని కోసం తాను చేసిన పని మాత్రం హర్షణీయం కాదు.ఖర్మగాలి ఈ సంగతి బయటపడిందంటే తనపై శాశ్వతంగా ' దొంగ' అన్న ముద్ర పడిపోతుంది. అది తొలగిపోవడం సాధ్యమా!
టీచర్ అనుమతి కోరి తను బాక్స్ ఈరోజు కాకుంటే రేపైనా కొనుక్కోవచ్చు. ఇలా వాడి మనస్సు పరి పరి విధాల ఆలోచించసాగింది. క్రమంగా వాడిలో అలజడి తగ్గి మనసు నావరించియున్న తెరలు విడివడసాగాయి.
" దారిలో తనకు దొరికిందని చెప్పి, బడికి వెళ్ళగానే టీచర్ కి ఇచ్చేస్తాను. దాంతో రాము వస్తువు రాముకు అంది పోతుంది." ఈ ఆలోచనతో వాడి మనసు కుదుటపడింది.
చేసిన నేరానికి శిక్షగా రాత్రంతా తాను కలత నిద్రతో బాధ పడ్డ సంగతి గుర్తొచ్చింది వాడికి. మనస్సాక్షి అన్నది ఉన్నవాడు తప్పు చేస్తే అది ఎంతటి నరకప్రాయంగా ఉంటుందో వాడికి అనుభవపూర్వకంగా ద్యోతకమయింది. రాత్రి పడ్డ సంఘర్షణతో గాయపడ్డ వాడి లేత మనసు ప్రస్తుతం మబ్బు వీడిన ఆకాశంలా నిర్మలంగా మారిపోయింది.
( పిల్లల మాస పత్రిక' బాలమిత్ర' లో ప్రచురితం )
****************************************
🌺భువి భావనలు 🌺
****************************************
No comments:
Post a Comment