Friday, April 10, 2020

నమస్తే, ఈ రోజు post పెట్టేముందు చిన్న మనవి. 5.4.20న ' కుసుమ పరాగం ' కవిత రెండవ లైనులో ' విరులు ' అని కాక ' వీరులు ' అని ప్రచురించబడింది. అచ్చు తప్పుకు క్షంతవ్యురాలిని. ఇక ఈరోజు ఓ కథ. 

ఇదీ దారి...... 

    ఆరాత్రి పక్కలు సర్దుతున్న రాజేశ్వరికి మనసంతా వికలమై పోయింది. తన భర్త ఇంత కఠినంగా మాట్లాడగలడని ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్న తను ఎంత మాత్రము ఊహించలేకపోయింది. ఇంతకీ తను బాధ పడుతున్న దల్లా జ్యోతిర్మయి గురించే. పాపం! ఆ సమయంలో ఆమె మొహం చూస్తే పగవాడికి కూడా గుండెకరగక పోదు. ఛీ ఛీ, ఈయనకు ఏమైందివాల ! అన్యమనస్కంగానే పనులన్నీ ముగించుకుని ఇవతలకు రాబోతుండగా, అప్పుడే బాలసుబ్రహ్మణ్యం, అదే ఆమె భర్త ఎదురు తగిలి, విసురుగా వెళ్ళి పోతున్న ఆమె చేయి పట్టి లాక్కు వచ్చి మంచం మీద బలవంతాన కూర్చోబెట్టాడు. లేవటానికి శత ప్రయత్నిస్తోన్న ఆమె భుజాల్ని వత్తి పెట్టి, " చూడు, నా మనోగతం నా చెల్లెలు జ్యోతిర్మయి కి అర్థం కాలేదంటే అర్థం ఉంది. కానీ భార్య వైయుండి నీవు ఇలా అయిపోతే ఎలా?.... "
     పెదవి విప్పి ఏదో అడ్డుతగుల బోతున్న ఆమెను మరి మాట్లాడనీయకుండా వెంటనే అందుకుని తన ఆలోచనలన్నీ ఏకరువు పెట్టసాగాడు, బాల సుబ్రహ్మణ్యం. 
                              *****
    అవతల పిల్లలిద్దర్నీ చెరో పక్క వేసుకుని పడుకున్న జ్యోతిర్మయి మెదడంతా కుత కుత ఉడికి పోతూ ఉంది. ఇదేమిటి? తన తోడబుట్టిన అన్నేనా ఇలా మాటలనింది? ఈ ఇంట్లో తనతోపాటు కలిసి పెరిగి, కలిసి జీవించి, అన్ని రకాల అనుభవాలు కలిసి పంచుకున్న తనతో అంత నిర్మొహమాటంగా ఎలా మాట్లాడ గలిగాడు? ఎంత కాదనుకున్నా ఆ సాయంత్రం జరిగినదే ఆమె కళ్ళల్లో పదేపదే కదలాడ సాగింది. 
      " జ్యోతి, నీవిలా వచ్చేయడం, నాకెందుకో నచ్చటం లేదమ్మా, " ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కాఫీ తాగుతూ కూతురికి జడ వేస్తున్న జ్యోతిర్మయి నుద్దేశించి బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా మొదలెట్టాడు. ఊహించని మాట ఎదురయ్యేసరికి ఆమెలో చిన్నగా ప్రకంపనం చెలరేగింది. అన్న కళ్ళల్లోకి చూడాలని ప్రయత్నించింది. బాలసుబ్రహ్మణ్యం చెప్పుకు పోయాడు, " నీ భర్త అకాల మరణం పొందటం, నీ భవిష్యత్తు ఇలా శూన్యంగా మారిపోవడం-- నిజమే! ఇవన్నీ జరగకూడని వే! అయినా పెళ్లి అయిన స్త్రీకి భర్త గారిల్లే శాశ్వతమనే మాట నీవు మరచి పోయావు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీ పిల్లల కోసమైనా అన్ని భరించాల్సి ఉంది. కానీ.... ఇలా వచ్చేస్తే, అంతంత మాత్రం జీతాలతో బ్రతుకుతూ ఉన్న నేను రెండు సంసారాల్ని పోషించగలనని ఎలా అనుకున్నావు?....... "
     ' అన్నయ్యా !' పక్కలో పిడుగు పడినట్లు అదిరిపడింది. ఎన్నడూ చూడని, తాను ఎన్నడూ ఎరుగని అన్నను ఈనాడు తను చూస్తోంది. అమ్మ నాన్న తనను ఏ చిన్న మాట అన్నా కూడా వారినే మందలించి, తనని వెనకేసుకొచ్చిన తన అన్నయ్య ఈనాడు ఇలా ఈటెల్లాంటి మాటలతో తన హృదయాన్ని తూట్లు పొడవటానికి వెనుకాడటం లేదు. 
      ఆమె మనసు చదివిన బాలసుబ్రహ్మణ్యం మెల్లిగా తల పంకించి మళ్లీ మొదలెట్టాడు. " ఇలా అని నిన్ను బాధ పెడుతున్నాను అని తెలుసు. కానీ వాస్తవం నీవు తెలుసుకోక తప్పదు. ఓ అన్నగా నీకో చక్కటి సలహా ఇస్తాను. నీవు అర్థం చేసుకొని పాటిస్తే సరి, లేదా నీవు నీ అత్తగారింటికి వెళ్లే ఏర్పాటు చేస్తాను,... "
      జ్యోతిర్మయి రోషంగా తలెత్తింది..... " నీవు మరొకరి మీద ఆధారపడకుండా, నీ జీవితాన్ని చక్క దిద్దుకుంటూ, నీ పిల్లల భవిష్యత్తు నీవే నిర్ణయించటానికి నీకు దారి చూపిస్తాను. ఆగిపోయిన నీ చదువు మళ్ళీ కొనసాగేలా చేస్తాను. నీ కాళ్ళ మీద నీవే నిలబడగల ఆత్మస్థైర్యం నీకు కలిగేలా చేస్తాను.... "
    అయోమయంగా చూసిందామె, ఈ వయసులో, ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత తను చదువుకోవడం........ హు ! అది అయ్యే పనేనా? అన్నయ్య తనను ఎందుకలాహింసించాలని చూస్తున్నాడు? అమ్మానాన్న పోగానే మరిమరీ ఇలా మారిపోవాలా! 
"... ... ఇందుకు నీవు సమ్మతిస్తే కొంతకాలం పాటు ఇక్కడే ఉండవచ్చు. అదీ నీ చదువు పూర్తయ్యే దాకానే, లేదా రేపే నీ అత్తవారింటికి వెళ్ళిపోవచ్చు... " సమాధానం కోసం ఎదురు చూడకుండా, కనీసం ఆమె ముఖంలో భావాలైనా గమనించకుండా బయటకు వెళ్ళిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. 
    ఆ దృశ్యం గుర్తొచ్చిన ప్రతిసారీ ఆమె కళ్ళనుండి నీరు ధారలుగా కారిపోతోంది. " రేపే నీ అత్త వారి ఇంటికి వెళ్ళిపోవచ్చు" అన్న మాటలే ప్రతిధ్వనిస్తూ ఆమెను కుదురుగా పడుకోనీయకుండా చేయసాగాయి. అటూ ఇటూ ఊగిసలాడుతూ ఏ అర్ధరాత్రి దాటాకో ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చి కంటి మీద కునుకు పట్టింది. 
    మరునాటి ఉదయం ఆమెను వారించడానికి రాజేశ్వరి శతవిధాల ప్రయత్నించింది. కానీ జ్యోతిర్మయి వినలేదు. పిల్లలిద్దరినీ తీసుకుని తన తాలూకు పెట్టే బేడా చేతపట్టుకుని బయటకు నడిచింది. వెళ్లేముందు వెనుదిరిగి అన్నా వదినల్ని ఉద్దేశించి ఒక మాట అన్నది.   
" ఆడపిల్లకు పుట్టిల్లు అన్నది అమ్మానాన్న ఉన్నంతవరకే అని మీరు చాలా చక్కగా నిరూపించారు. చాలా సంతోషం... "  వెక్కిళ్ళు ఆమెను మరి మాట్లాడనీయలేదు. ఆ మాటలు బాలసుబ్రమణ్యం హృదయాన్ని శూలాల్లా తాకినా అతి కష్టం మీద నిభాయించు కున్నాడు. కారణం, అతని దృష్టి అంతా వర్తమానం మీద కాక ఆమె భవిష్యత్తు మీదే కేంద్రీకృతమై ఉండడమే. 
                       **  **  **
    అత్తవారింట్లో జ్యోతిర్మయి జీవనం తిరిగి ప్రారంభమయింది. తెల్లవారుజామున నిద్ర లేవటం తో మొదలైన ఆమె దినచర్య రాత్రి బాగా పొద్దు పోయాక వంటింట్లోనే నడుం వాల్చటంతో ముగిసేది. అత్తామామల కన్నీ అందించటం, ఆడబిడ్డలు, మరుదులకూ వడ్డించడం, వారి పిల్లల ఆలనా పాలనా--- వీటన్నింటితో పాటు ఇంటి పని వంట పని-- క్షణం తీరిక ఉండేది కాదు. ఈ పరుగు పందెంలో మునిగితేలుతున్న ఆమెకు తన పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో, కనీసం బడికి వెళ్తున్నారో లేదో అని చూసుకోవడానికి కూడా సమయం చిక్కేది కాదు. భర్త ఉన్న రోజుల్లోనూ ఈ పనులన్నీ యధావిధిగా నే ఉండేవి. కానీ అప్పుడు తన స్థానం మరోలా ఉండేది. ఈ ఇల్లు నాది, ఈ ఇంటికి నేనే యజమానురాలిని అన్న భావాలు ఆమెలో గూడుకట్టుకుని ఉండేవి. కానీ ఇప్పుడు భర్త లేని ఆ ఇంట్లో ఆమెకు ఉన్న స్థానం పునాదులు క్రమంగా సడలి పోనారంభించాయి. దినాలు గడిచేకొద్దీ కేవలం ఆ ఇంట్లో అందరికీ వండి వార్చే ఓ పనిమనిషిలా ఆమె మారిపోయింది.
     హఠాత్తుగా ఓ రోజు అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూసుకుంది. భర్త పోయి సంవత్సరం తిరగకముందే తనలో ఇంత మార్పా! ఓ పదేళ్లు పై బడిన దానిలా మారిపోయిన తన రూపం తనను చూసి పరిహసిస్తూ ఉన్నట్లుగా అనిపించింది.
      ఆ రాత్రి వంటింటి గడప మీద తల ఆనించి,
కళ్ళు మూసుకున్న ఆమె మస్తిష్కంలో ఆమె అన్న బాలసుబ్రహ్మణ్యం చాలా రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఆనాడు ఆయనన్న మాటలు ఈటెల్లా అనిపించినా అవి ఎంతో ముందుచూపు తో తన భవిష్యత్తుకు సరైన బాట వేయాలన్న తలంపు తోనే అన్నాడని ఈనాడు తనకు తెలిసి వస్తోంది. ఈవయసులో చదువు తనకు సాధ్యమా అని ఆరోజు ఏవగించుకుంది. కానీ, మనసుంటే మార్గముండదా అని ఈరోజు అనిపిస్తోంది. తన అన్న తనను చదివిస్తాను అన్నాడు. తనకు జీవనాధారం కల్పిస్తానన్నాడు. తన జీవితం తానే జీవించేలా చేస్తానని భరోసా ఇచ్చాడు. కానీ అపార్థం చేసుకుని దూషించి వచ్చేసింది.
     ఇక్కడ! తన స్థానం ఏమిటి? బ్రతుకంతా అందరికీ అన్నీ చేస్తూ, ఎవరికీ ఏమీ కాకుండా, చివరికి అనామకంగా రాలి పోవటమే గా! తనకంటూ ఓ వ్యక్తిత్వం ఆపాదిస్తానన్న కాదనుకుని వచ్చి, ఈ నరకంలో కూరుకుపోయి, తన పిల్లల బ్రతుకు కూడా రేపు మరో నరకంలోకి తోయ పోతోంది. ఇంత కాలంగా ఆమె మనసును కప్పుకున్న మబ్బు తెరలు నెమ్మదిగా విడివడసాగాయి. అంతే! క్రమంగా ఆమె ఆలోచనలు మరో దారిలో పయనించ సాగాయి.
                    ** ** ** **
    తలుపు తెరిచిన బాలసుబ్రహ్మణ్యం జీవచ్ఛవంలా నిలబడ్డ చెల్లెల్ని చూసి, ఒకింత కంగారు పడ్డాడు. కానీ ఆమె కళ్ళల్లో మెరుస్తున్న కాంతిని చూసి, కాస్త నెమ్మదించాడు. గడప లో అడుగు పెట్టిన జ్యోతిర్మయి అన్న చేతుల్లో వాలి పోయి బావురుమంది. ఆమెలో కరుడుగట్టిన భారమంతా తీరేదాకా ఊరుకున్నాడతను.
      " వేళ్ళూనుకుని పాతుకుపోయిన సాంప్రదాయాల్ని కాదనుకుని ముందుకు వచ్చే స్త్రీలు మన సమాజంలో చాలా తక్కువ అమ్మా. కఠినంగా మాట్లాడకపోతే నీ ఆలోచనల్లో మార్పు రావడం అసాధ్యం. అందుకే నేను పాషాణంలా మారి పోవాల్సి వచ్చింది. కానీ ఆ రోజు నుండి ఈ క్షణం దాకా నేను అనుభవించిన ఆత్మ క్షోభ వర్ణించలేను. నా ప్రవర్తనకు భంగపడి నీవెలాంటిఅఘాయిత్యం చేస్తావో అన్న భయం ఒకవైపు, అటు అత్తింట్లో పడే వేదన తో ఏ క్షణం ఏమవుతావో అన్న బెంగతో మరోవైపు తల్లడిల్లి పోతూ అనుక్షణం ప్రత్యక్ష నరకమే అనుభవించాను. చివరకు నా నిరీక్షణ ఫలించి, నేనాశించిన లక్ష్యం చేకూరింది.... " గద్గద స్వరంతో చెల్లెలి తల నిమురుతూ అన్నాడతను.
     ధారలుగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకోవడం కూడా మరిచిపోయి అన్న నే దిగ్భ్రమ గా చూస్తూ ఉండిపోయింది జ్యోతిర్మయి. మోడై పోయిన తన జీవితాన్ని గూర్చి తలపోస్తూ ఎన్నో రాత్రులు మౌనంగా రోదించింది. గతించిన భర్త తాలూకు జ్ఞాపకాలు మనసు అట్టడుగు పొరల్లో పడిపోయినా ఆ స్మృతుల సజీవ రూపాలైన పాప, బాబు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే వారి బంగారు భవిష్యత్తు కూలదోసే హక్కు తనకు ఎక్కడిది అని ప్రతిక్షణం అంతరాత్మ ఎదురు తిరిగేది. భర్త నీడ తొలగి పోగానే నా అనుకున్న వాళ్లే కరువైపోయారు అనుకుని కుమిలిపోయిన తను, తోడబుట్టిన వాడు ఒకడు తన కోసం ఇంతగా పరితపించి పోతున్నాడని ఊహించుకో లేకపోయింది. ఆ క్షణంలోనే ఆమెకు అంతులేని ఆలంబన దొరికినట్లయింది.
       అది మొదలు జ్యోతిర్మయి మరి వెనక్కు తిరిగి చూసే అవసరం రాలేదు. దుమ్ము పట్టి, శిథిలమై పోవడానికి సిద్ధంగా ఉన్న ఆమె స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్టు ఆమె ఆశయానికి నాంది పలికింది. అన్నా వదినలకు ఆదరణతో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అనతికాలంలోనే ఉన్నత విద్యార్హతల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ఒక ఉద్యోగిని. అనుక్షణం అందరికీ భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన అవసరం ఆమెకి క లేదు మరి రాదు.
     ఒకప్పుడు మాసిన చీర తో, రేగిన జుట్టుతో, బోసి నొసలు తో దీనాతిదీనంగా అద్దంలో అగుపించిన ఆమె ప్రతిబింబం ఇప్పుడు కొత్త రూపం సంతరించుకొంది. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలనిపించేంత సమున్నత స్థితికి ఆమె ఎదిగింది. దీనికంతా కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం బాలసుబ్రహ్మణ్యం!
    " నా చెల్లెల్ని  ' పోషించటం' కాదు నేను చేయవలసింది, అంతకంటే ముందుగా నేర్పించాల్సింది ఆమె' జీవించటం' జీవించడం ఎలాగో నేర్పించితే ఆమే పదిమందిని పోషించగలదు. మార్గం చూపడం వరకే నా బాధ్యత. ఆ మార్గం గుండా నడిచి వెళ్లడం ఆమె కర్తవ్యం. అందుకు ఇదే సరైన దారి. "
    ఇవీ ఆనాడు అతను అందరితో అన్న మాటలు. అందుకు చెల్లెలు తో పాటు అతను అనుభవించిన తీవ్ర మనోవేదన అంతులేనిది. కానీ ఒక శాశ్వత పరిష్కారం కోసం అది సబబే అన్నది అతని నిశ్చితాభిప్రాయం. అప్పుడు ఇంటాబయటా నిరసనలు ఎదుర్కొన్న అతనే ఇప్పుడు వారి చేతనే నీరాజనాలందుకుంటున్నాడు. దటీజ్ బాల సుబ్రహ్మణ్యం! 
  " ఇప్పుడేమంటావ్ రాజేశ్వరీ.... నేను చేసింది తప్పంటావా, ఒప్పంటావా? " భార్యను తదేకంగా చూస్తూ ప్రశ్నించాడు బాలసుబ్రహ్మణ్యం ఓ రోజు రాత్రి, జ్యోతిర్మయి జీవితంలో పూర్తిగా స్థిరపడ్డాక. భర్తను ఆరాధనగా చూడటం మినహా మరేమీ బదులు చెప్పలేదా ఇల్లాలు. కానీ, ఓ స్త్రీగా ఆమెకు తెలుసు, తన ఆడపడుచు పడ్డ మనోవేదన, ఆమె దీక్ష, సాధన చివరికి ఆమె గమ్యం చేరిన వైనం--- అన్నీను ! వీటన్నింటికీ చేయూత తన భర్తే అనుకుంటే ఆమె పెదాలపై గర్వ రేఖ!
                *** *** ** ** 
    కాలచక్రం నిర్విరామంగా పరిభ్రమిస్తూనేఉంది. ఆగమనంలో జ్యోతిర్మయి బతుకు బండి గతుకుల మాట గట్టెక్కి చక్కటి దారిలో ప్రవేశించింది. అప్పుడు ఒకనాటి రాత్రి తన ఇంటిలో ఆదమరచి నిద్రపోతున్న పిల్లలిద్దరినీ సంతృప్తిగా చూసుకుంటూ, మనశ్శాంతి తో నిట్టూర్పు విడుస్తూ అనుకుంది జ్యోతిర్మయి, " భగవాన్! నీవు ఉన్నావో లేవో అని కొందరికి అనుమానం. కానీ నాలాంటి అభాగినులకు దారి చూపే నా అన్న లాంటివాళ్ళల్లో నిత్యం నీవు కొలువుంటావని ఎందరికి తెలుస్తుంది..... " 

*****************************************
మళ్ళీ కలుద్దాం 
యం. ధరిత్రీ దేవి 
****************

No comments:

Post a Comment