Saturday, September 9, 2023

అంతరంగాలు..1.. ఆడజన్మా? మగజన్మా?

                                             ~~ యం.ధరిత్రీ దేవి ~~
ఓ స్త్రీ అంతరంగం... 🤱
*************

నాదో చిన్నపాటి ఉద్యోగం...
అయినా...పనిభారం అధికం !
ఆరుదినాల శ్రమ అనంతరం...
అలసిన ఈ దేహం 
కోరుతుంది కాసింత విరామం... 
ఎదురుచూపులు...ఆదివారం కోసం !
చిత్రం ! ఎన్నెన్నో అదనపు పనులకూ 
ఎదురుచూపులే ఆదినం...నాకోసం !! 
ఆశిస్తుంది పాపం...నా అమాయకత్వం... 
రవంత సహాయం... సహకారం... 
అందదు...విలపిస్తుంది అంతరంగం !!
ఏమిటో...! అందరి చూపూ నాపైనే...!
అమ్మంటే పిల్లలకు అదో నమ్మకం... 
అన్నీ అందిస్తుందని... 
అలిగితే లాలిస్తుందని !
కలతపడితే కరిగిపోతుందని !
భార్యంటే భర్తగారికి భరోసా... 
అంతా చక్కబెడుతుందని...
ఆమె పనితనం మీద 
అంతటి గురి మరి !!ప్రశంసలాంటి 
పదునైన ఆయుధం కాదా అది...!
అంతేనా!మగువల మానసిక దౌర్బల్యంపై 
మనుషులు సంధించి వదిలిన అస్త్రం..
'పొగడ్త' అన్న కనిపించని..ఖర్చవని లంచం !
పెద్దవాళ్లకు నేనో ఆసరా..
కాదు కాదు...నిత్యావసరం !!
అయాచితంగా అందే సౌకర్యం... !
నిజం...నా సహనం వాళ్ళకో వరం... 
వెరశి...అందరికీ ఐపోయా.... 
నడయాడే సజీవ యంత్రంగా !
అందుకుంటా నెలనెలా జీతం.... 
ఏదీ ! ఎక్కడ ? లేదే...ఆర్థిక స్వాతంత్ర్యం!! 
పేరుకే నా ఉద్యోగం..నా ఆదాయం..
అంతా అత్తింటికే ధారాదత్తం  !!
మరోపక్క...జీతభత్యాలు లేని నౌఖరీ... 
జీవితమంతా వెట్టి చాకిరీ !!
ఇంటాబయటా సేవల పర్వం... 
ఫణంగా పెడుతున్నా ఆరోగ్యం !!
అతివ లేక కదలదు జీవనరథం 
కనీసం అరంగుళం.... 
అయినా...వీసమెత్తు గుర్తింపుకైనా 
నోచదే...!అకటా...ఎంత అన్యాయం  !!
'ఓదార్పు'కు చోటు లేదు లేశమైనా... 
'విధి' పగబూని వదిలెనేమో నను భువి పైన !! 
చదువబ్బడమే నేరమాయెనే... 
ఉద్యోగం అదనపు భారమాయెనే !!
మగాడికి బయటి పనులే... 
ఇంటికొస్తే అంతా విశ్రాంతే...వినోదమే...!
మరి మాకో..ఇంట్లో, వంటింట్లో... 
పనులతో స్వాగతాలే !!
ఇక...పండగదినాలు...ఆదివారాలు.. 
ఆడవాళ్ళకవి పరమ శత్రువులే...!
ఈ రెండుపడవల ప్రయాణం.. 
వద్దు బాబూ వద్దు...నమస్కారం...!
ఆడదానిగా నను పుట్టించావెందుకు ? 
అడవిలో మానైనా...
మేలుగా...సుఖపడేందుకు !!
మరుజన్మ నాకొద్దు...ఇస్తే...
మగవాడిగా పుట్టించవా... !
రుణపడిఉంటా నీకు 
జన్మంతా...ఓ దేవదేవా !!🤱

*********************************

--- 'ఓ పురుషుడి అంతరంగం' తదుపరి పోస్ట్ లో...

*****************************************





 

No comments:

Post a Comment