Saturday, September 9, 2023

అంతరంగాలు..2..ఆడజన్మా? మగజన్మా?

                                                ~~ యం.ధరిత్రీ దేవి ~~
ఓ పురుషుడి అంతరంగం....🧔
*******************
మగవాడిగా నను 
పుట్టించావెందుకు దేవుడా !!
బతుకంతా బరువు మోస్తూ.. 
భారంగా వంగిపోతూ.... 
కుంగి కృశించడానికా !!
"తొలిసారి మగబిడ్డ మా ఇంట..." 
అంటూ...మురిసిపోయిన కన్నవాళ్లకు
అయ్యా నేనో వరాల పంట !!
నా బాల్యం మాత్రమే అతి మధురం... 
ఆపై అంతా బాధ్యతలమయం...!
కాలగమనంలో అయిపోయా.. 
అన్నింటికీ అతీతం.. !
అదేమిటో ! అందరి చూపూ నా పైనే... 
అమ్మనాన్నలకు...తోడబుట్టినవాళ్లకు...
అందరికీ నేనే...అందరికోసం నేనే !!
పెళ్లయింది...తోడు దొరికింది...అనుకున్నా... 
ప్రశాంతత కాస్తా కరువై...మాయమైంది!
పెళ్ళాంబిడ్డలు నాలోకం...అనుకున్నా...
నాకంటూ లోకమే లేక..పోయింది.. 
ఆడవాళ్లకు  కొదవేముంది....
సంపాదించే మగడుండగా...!!
భార్య గడప దాటి పనిచేసినా... 
సమస్యల బరువు మగాడిదేగా !
అవసరాలకు నేనే చేయాలి అప్పులు... 
అవి తిరిగి నేనే తీర్చాలి...నాదేగా తిప్పలు !!
వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడని 
ఓ చెయ్యి వేయమంటే చాలు... 
ఆర్థికస్వాతంత్ర్యం లేదంటూ 
ఆరోపణలు...ఆక్షేపణలు..అలగటాలు..! 
తన బాధ చెప్పుకోడానికి నేనున్నాను...
సాధించటానికీ నేనున్నాను..
మరి..నాకు..! ఎవరికి మొర పెట్టుకోను !? 
ఆడవాళ్ళ సంపాదన ప్రశ్నించరుగా.. 
మగాణ్ణి గుచ్చి గుచ్చి..వేధిస్తారు అదే పనిగా !!
వింతలోకం...వింత మనుషులు...!
'ఉద్యోగిని'నంటుందా...
అక్కడి చిక్కులన్నీ ఎంచగ్గా 
తెచ్చి పెడుతుంది నా నెత్తిన...
అదేమంటే..అంటుంది కదా... 
"ఉద్యోగం నాదే..జీతం నీదేగా.." అని !!
పిల్లల బాగోగులు 'అమ్మ'కు అడ్డాల వరకే... 
ఆపిదప అంతా 'తండ్రి' వంతేగా !!
అదేంటో ! మగాళ్ల పాట్లు పట్టవెవ్వరికీ... 
ఆడవాళ్ళపట్లే సానుభూతులందరికీ !! 
కవులకు 'కలికి' కన్నీళ్లే కనిపిస్తాయి...
కవితలు కమనీయంగా అల్లడానికి...!
పురుషుల గురించైతే...
కలం ససేమిరా అంటుందేమో వాళ్లకి !!
నెలతలకు నెత్తి మీదే ఉంటాయి నీటికుండలు... 
కదిలిస్తే చాలు..కురిపిస్తాయి కన్నీటి ధారలు !!
లోలోపల నలిగిపోయేవాళ్ళం మేము... 
బాహాటంగా వెలిగిపోయేది వాళ్ళు !!
అందరి నీరాజనాలు వాళ్ళకే... 
మా మౌనరోదనలు మా వరకే...!
మగాడిగా పుట్టితినాయె....
విలపించే హక్కు నాకు లేదాయె !!
ఏడవలేను..నవ్వలేను... 
ఏడవలేక నవ్వుతున్న 
విషాదజీవి నేను... 
మగాడిగా పుట్టడమే నా నేరమా !
కన్నవాళ్ళ సంతోషం నాకు శాపమా !
మగమహారాజన్న బిరుదేమీ నాకొద్దు... 
అంతకన్నా వంటింట్లో పని ఎంతో ముద్దు...
మరుజన్మ నాకున్న..మగువనై పుడతా...!
ఈ బాదరబందీ బతుక్కి బై బై చెబుతా !!!
భగవంతుడా...!వింటున్నావా నా ఆత్మఘోష !!

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

[ ఇదంతా కాసేపు సరదాగా చదువుకోడానికి మాత్రమే. పొరపాట్లుంటే క్షంతవ్యురాలిని..🙏 
ఇంతకీ...ఏది మంచిది? ఆడజన్మా ?  మగజన్మా ? 
ఎవరి కష్టాలు వారివి...ఎవరి సమస్యలు వారివి....ఎవరి ప్రాధాన్యతలూ...ఎవరి ప్రతిభాపాటవాలూ వారివే...
అంతేకదా  🙂...
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋



 



No comments:

Post a Comment