Saturday, September 2, 2023

నీకు నీవే ఆసరా...కథలాంటి ఓ నిజం...

🌷                                        ~~ యం.ధరిత్రీ దేవి ~~

       ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుని ఉంది. ఓ మూల లలిత కింద కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఉంది. ఆమె కళ్ళ నిండా నిర్వేదం ! మరోవైపు పదేళ్ల కొడుకు,ఎనిమిదేళ్ల పాప తల్లినే  చూస్తూన్నారు. ఎదురుగా మంచం మీద లలిత తల్లీదండ్రి... దిక్కు తోచని స్థితిలో !!
   ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక... అంటారు. అందుకు ప్రబల నిదర్శనమే సత్యం అకాల మరణం ! సత్యం చనిపోయి ఇరవై  రోజులైంది. ఉదయం ఆఫీసుకు  సైకిల్ మీదవెళ్తూ సడన్ గా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చివరి మాటలు కూడా లేకుండా అతను నిష్క్రమించిన తీరుకు నెత్తీనోరు బాదుకుంది లలిత ! దగ్గరి బంధువులంతా వచ్చారు.  కర్మ కాండలన్నీ ముగిశాయి. 
     చిన్నపాటి ఉద్యోగం... అంతంత మాత్రం జీతం... అయినా గుట్టుగా సాగుతున్న జీవితాలు... నడి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న నావలా అయిపోయింది లలిత పరిస్థితి... 
 ఇరువైపుల తోబుట్టువులు,  వాళ్ళ కుటుంబాలు దినం అవ్వగానే ఎవరి దారిన వారు సెలవు పుచ్చుకున్నారు. కూతురికి ఏంజరిగినా తల్లిదండ్రులకు వేదనతో పాటు బాధ్యతా తప్పదేమో !! సాఫీగా సాగుతున్న కూతురు బ్రతుకు బండి ఒక్కసారిగా తలకిందులై లలిత అమ్మానాన్నలు మ్రాన్పడిపోయారు. 
" కొన్నాళ్లపాటు మాతో ఉందువుగాని వెళ్దాం పదమ్మా... "
అన్నారిద్దరూ. 
" కొన్నాళ్ల తర్వాత ఎలా నాన్నా..? "
 ప్రశ్నించింది లలిత. అన్నా,  తమ్ముడు ఉన్నారు. ఆఇద్దరి కుటుంబాలు, తల్లిదండ్రులు కలిసే ఉంటున్నారు. ఇప్పుడు తనూ వెళ్లి వాళ్లందరికీ భారం కావాలా ! అలా ఎంతకాలమని ! ససేమిరా అంటూ ఎదురు తిరిగింది లలిత అంతరాత్మ. 
" ఇక్కడే ఏదో పని చేసుకుంటా నాన్నా.. "
గొంతు  పెగుల్చుకుని అంది. అంతవరకూ గడప దాటి ఎరగని కూతురి నోటివెంట ఆమాట రాగానే నిస్తేజంగా చూశాడు వెంకటేశ్వర్లు. తల్లి అయోమయంగా భర్త వైపు చూసింది. వాళ్లకు తెలుసు...తమ ఇంటి పరిస్థితి..! వెళ్తూ వెళ్తూ కొడుకులు మాటవరసక్కూడా లలితను ఇంటికి పోదాం రమ్మని పిలవలేదు...! అందుకే, మళ్ళీ కూతుర్ని రమ్మని పిలిచే ప్రయత్నం చేయలేకపోయారు ఇద్దరూ. 
             **                   **                **
   మరుసటి రోజు లలితను తీసుకొని సత్యం పనిచేసిన ఆఫీస్ కి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. సత్యం అక్కడ రికార్డ్ అసిస్టెంట్ గా చేశాడు. అంతో ఇంతో వచ్చిన సొమ్ము అందజేశారు ఆఫీసు వాళ్ళు... అది  గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి... హ్యుమానిటేరియన్  గ్రౌండ్స్ కింద భార్యకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది...కానీ, లలిత హైస్కూలు చదువు కూడా పూర్తి చేయలేదు. ఏ అటెండర్ గానో, ప్యూన్ గానో రావచ్చు  అన్నారు. లలిత మనసు బాధగా మూలిగింది. భర్త పనిచేసిన చోట గదులు ఊడుస్తూ, కాఫీలు, టీలు అందిస్తూ ఉద్యోగం చేయడం ఎందుకో  ఆమెకు వద్దనిపించింది.
" వద్దు సార్. నేను చేయలేను.."
 అనేసింది  వెంటనే. 
" నీ ఇష్టమమ్మా... కొద్ది రోజులు టైం ఉంటుంది. ఆలోచించుకొని కూడా చెప్పొచ్చు..."
అన్నాడు హెడ్ క్లర్క్. లలిత పెదవి విప్పేలోగా, 
" అలాగే సార్, ఆలోచించుకుని కొద్దిరోజుల తర్వాత మళ్లీ కలుస్తాము... "
వెంకటేశ్వర్లు ముందుకొచ్చిచెప్పి, కూతుర్ని తీసుకుని బయటికొచ్చేశాడు. 
            **                 **             . **
  " చూశావా నాన్నా, ఇద్దరు తమ్ముళ్ళ చదువుల కోసం ఆయన చదువు మానేశాడట... చెల్లెలి పెళ్లి కోసం, అక్క అవసరాల కోసం ఎంత చేశాడు ! ఇప్పుడు ఆయన కుటుంబం కష్టాల్లో ఉంటే ఏమీ పట్టనట్టు వెళ్లిపోయారు..."
"........................ "
"... నా తోడబుట్టిన వాళ్ళు మాత్రం...నా  పిల్లల గురించయినా ఆలోచించారా.... !"
వెళ్తూ వెళ్తూ వాళ్లంతా తన చేతిలో పెట్టిన కొన్ని నోట్లు చూసుకుంటూ తండ్రితో నిష్టూరంగా అంది లలిత, ఇంటికొచ్చాక... 
" వద్దమ్మా, వద్దు తల్లీ... ఎప్పుడూ నువ్వు అలా ఆలోచించొద్దు... చేతనైతే మనకు తోచినంత సాయం ఎవరికైనా చేయాలి గానీ... ఎవరి నుండీ తిరిగి ఆశించకూడదమ్మా..."
".........................? "
" సరే.. ఒకవేళ వాళ్లు నీకేదైనా సాయం చేశారే అనుకో.... ఎంతవరకు చేస్తారు! ఎంతని చేస్తారు? ఎవరి  బాధ్యతలు వాళ్లకుంటాయిగద తల్లీ.... !"
తండ్రి వైపు చిత్రంగా చూసింది లలిత. ఆమె చూపుల్లో భావం గ్రహించిన వెంకటేశ్వర్లు, 
" నన్ను మరోలా అనుకోకమ్మా... మన జీవితాలు మనమే చక్కదిద్దుకోవాలి. మరొకర్ని బాధ్యుల్ని చేయడం, నమ్ముకోవడం అసలొద్దు... గుండె చిక్కబట్టుకుని నీ  కుటుంబాన్ని నీవే నడుపుకోవాలి తల్లీ... ఒకరి ఆసరా గురించి ఎప్పుడూ ఎదురు చూడొద్దు..ఆశించొద్దు.. నీకు నీవే ఆసరా కావాలమ్మా.."
లలిత కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఆ మాటలతో.. ఆమెకు తండ్రి మీద కోపం రాలేదు. ఆయన మానసిక పరిపక్వతకు ఆశ్చర్యపోయింది. చదువుకోలేదు... విషయ పరిజ్ఞానం అంతంత మాత్రమే.. ! కనీసం టీవీలో వార్తలు చూసే అలవాటూ లేదాయనకు ! కానీ, ఆయనకున్న లోకజ్ఞానం అపారం! అది గమనించి, మొదటిసారిగా తండ్రిలోని ఓ కొత్త మనిషిని చూసింది లలిత. తన తల్లి తండ్రిని బాగా అర్థం చేసుకున్నదనిపిస్తుంది లలితకు. ఆమె ఎన్నడూ భర్తకు ఎదురు మాట్లాడడం తను చూడలేదు. భర్త ఏది చెప్పినా... సరిగానే చెప్తాడని ఆయన మీద కొండంత నమ్మకమే దానికి కారణం కావచ్చు !!
   ఆలోచిస్తుంటే తండ్రి మాటలు సబబుగానే తోచాయి లలితకు...నిజమేగా... ఎవరైనా ఎంతవరకు చేయగలరు ! రాను రానూ అది ఇబ్బందికరంగా కూడా పరిణమించవచ్చు...రెండు వైపులా !! అంతకంటే స్వశక్తిని నమ్ముకుంటే మంచిది కదా!
" సరేనమ్మా, రేపు వెళ్ళిపోతాం. కొద్దిరోజులు పోయాక అమ్మ, నేను మళ్ళీ వస్తాము..... "
కూతురుకి చెప్పాల్సింది చెప్పి లేచాడు వెంకటేశ్వర్లు. 
              **              **            **
" అక్కా, నువ్వు పనిచేసే చోట నేనూ  పనిచేస్తా.. మాట్లాడతావా అక్క... "
" నువ్వు చేయగలవా లలితమ్మా.... బరువు పనులు... రోజంతా చేస్తూనే ఉండాలి... "
అడిగింది శివమ్మ. ఆమె ఇళ్ల నిర్మాణాలు జరిగే చోట కూలీగా చేస్తూ ఉంటుంది.తట్టల్లో  మట్టి, ఇటుకలు, రాళ్లు మోసే పని! లలితకు ఆమె బాగా పరిచయం. 
" అలవాటైయిపోతుందిలే అక్కా, ఏదో ఒకటి చేయకపోతే ఇల్లు గడవదు కదా.. వచ్చే పెన్షన్ ఎలా సరిపోతుంది!"
అంది లలిత... 
   వారం తర్వాత... పనిలోకెళ్ళింది శివమ్మ తో కలిసి. వారం గడిచింది.... బొత్తిగా అలవాటు లేని పని ! కొన్ని గంటల పాటు ఎండలో తిరుగుతూ, తల మీద బరువులు మోయాలి. అదీ...నిచ్చెన మీదుగా ఎక్కుతూ,  దిగుతూ  అందివ్వాలి. ప్రాణాంతకంగా అనిపిస్తోంది లలితకు. కానీ తప్పదు, మెల్లిగా అలవాటైపోతుందిలే అనుకుంటూ కొనసాగించింది. నెల గడిచేసరికి, కాళ్లు ఏమాత్రం సహకరించక, ఇంటా బయటా నెట్టుకురాలేక... మంచానపడిపోయింది. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు! తల్లికి సహాయం చేసేంత వయసు లేనివాళ్లు !
" నేను చెప్తిగదా లలితమ్మా, నువ్వు చేయలేవని... "
చూడ్డానికి వచ్చిన శివమ్మ అంది లలితతో. 
" అక్కా, ఏమీ అనుకోకు. ఏవైనా తేలిగ్గా చేసే పనులుంటే చెప్పక్కా... "
ప్రాధేయపూర్వకంగా అడిగింది లలిత.  
" అయ్యో ! అనుకోవడానికేముంది లలితమ్మా, మనిషికి మనిషి సాయం..అంతే కదా...కానీ, చెప్పాలంటేనే నోరు రావడం లేదు..."
కాసేపటితర్వాత తలెత్తి, 
"...ఏం చెప్పమంటావు...నువ్వు చెయ్యాల్సిన పని కాదనుకో...ఇళ్లల్లో పని చేస్తావా చెప్పు... "
ఊళ్ళో ఐదో క్లాసు అయ్యాక, తన ఈడు ఆడపిల్లలు కొందరు టైలరింగ్ నేర్చుకోడానికెళ్ళేవారు. లలిత కెందుకో ఆ ధ్యాస లేకపోయింది. కనీసం అదున్నా ఇప్పుడు పనికొచ్చేది.ఇప్పుడర్థమౌతోంది లలితకు, ఆడపిల్లకు కనీసపు చదువన్నది ఉండడం ఎంత అత్యవసరమో ! పెళ్లయ్యాక...భర్త, పిల్లలు, కుటుంబం...ఇదే ఆమె లోకం అయిపోయి,ఒకలాంటి నిశ్చింతకు అలవాటుపడిపోయింది.చేసేదేముంది!  రెండు నిమిషాలు మౌనంగా ఉండి పోయిన లలిత అంగీకారంగా తల ఊపింది. 
                   **                **              **
  వారం పది రోజులు ప్రయత్నించి, ఓ మూడిళ్లలో పాచిపనులు చేయడానికి  కుదిర్చింది శివమ్మ. తెల్లారుజామున లేవడం, ఇంట్లో పనులు చూసుకుని, ఏడింటికంతా బయటపడి మూడిళ్లకూ వెళ్లిరావడం! అందులో ఒకావిడ రెండు పూటలా రావాలని కచ్చితంగా చెప్పేసింది.
   పనైతే మొదలెట్టింది గానీ... అనుకున్నంత సులభంగా అయితే లేదు లలితకు. పైగా క్షణం తీరికన్నది లేకుండా పోయింది. పని పని పని! రోజంతా ఒకటే పని... కాలు ఒకచోట నిలవనీయకుండా !! ఒళ్లంతా హూనం అయిపోతోందామెకు. రాత్రి పదింటికి నడుం వాల్చితే, మళ్లీ నాలుగింటికే లేవాల్సి రావడం...
   తల్లి కష్టం చూసి, కూతురు సుధ మెల్లిగా ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం చేయడం మొదలెట్టింది. కొడుకు సురేష్ బయటి పనులేవైనా అందుకుంటున్నాడు... అయినా, మూడిళ్లకు తిరగాలంటే... లలితకు తలకు మించిన భారమైపోయింది. ప్రతి పనిలో ఏదో కష్టం ఉంటూనే ఉంటుంది, భరించాలి అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకుంటూ లాగిస్తోంది. పైగా... శివమ్మకు తన కష్టం చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందామెకు. తనకు కానిపని ఇది అని ముందే చెప్పిందాయె !
    ఒకటే ఇబ్బందిగా ఉంది లలితకు... కాస్త ఆలస్యమైతే చాలు... ఇంటి వాళ్ళు విసుక్కోవడం, చేసే పనిలో లోపాలు వెతకడం, వెనకెనకే తిరుగుతూ నిఘా పెట్టడం..అదోలా అనిపిస్తోంది.అంట్ల గిన్నెలు ఉదయానికంతా వాసనకొడుతూ తోమడానికి చాలా ఇబ్బంది పడుతోంది.అదేకాక..మిగిలిన అన్నం, కూరలు తీసికెళ్ళడం నామోషీగా అనిపిస్తోంది లలితకు. కొద్దిరోజులు చూసి సున్నితంగానే వద్దని చెప్పేసింది.అన్నింటికంటే బాధాకరం...తనో పనిమనిషి అన్నట్లు చిన్న చూపు చూడడం!! ఆ సమయంలో భర్త గుర్తొస్తూ బాధ మరింత పెరిగేది. ఆయన ఉన్నప్పుడు తెలీలేదు గానీ... కుటుంబానికి ఓ వటవృక్షంలా, భార్యా పిల్లలకు కష్టమన్నది తెలియకుండా ఎంత అండగా ఉండేవాడు !! ఇప్పుడవగతమవుతోంది లలితకు.భర్త చాటున...ఉన్నంతలోనే  మంచిగా సంసారం చక్కదిద్దుకుంటూ గడిపిన లలితకు ఎక్కడో ముల్లు గుచ్చుకున్నట్లుగా ఉంటూ ఉసూరుమనిపిస్తోంది.  కానీ ఏం చేయగలదు !సత్యంకు సర్వీస్ ఎక్కువ లేదు గనుక వచ్చే పెన్షన్ చాలా తక్కువ. అప్పటికీ  ఆలోచించి తక్కువ అద్దెలో  చిన్న ఇల్లు చూసుకుంది.   
   కుటుంబానికి మూలాధారం, సంపాదించే మనిషి ఇలా అకస్మాత్తుగా కనుమరుగైపోతే ఆ దుస్థితి అనుభవించేవాళ్లకే తెలుస్తుంది. పగలంతా పనులతో ఎలాగోలా  గడిచిపోయినా... రాత్రిపూట తన ప్రమేయం లేకుండానే ధారగా కారిపోయే కన్నీళ్లను ఆపడం లలిత తరం గావడం లేదు. ఆ సమయంలో... తండ్రి లేకపోయినా.. తల్లి ఉందిగా.. అన్న భరోసాతో పక్కనే నిశ్చింతగా, అమాయకంగా నిద్రపోతున్న పిల్లలిద్దరూ తన కన్నీళ్లను ఆపే ఆనకట్టలైపోయేవారు... అంతే! లేని శక్తి కూడదీసుకుంటూ రోజులు వెళ్ళదీయడం క్రమంగా అలవాటు చేసుకుంది.
   ఇలా ఉండగా... ఓ రోజు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటిదారి పట్టిన లలితకు తన ఊరి ఆవిడ...కామాక్షమ్మ...పిన్ని వరస అవుతుంది.. అనుకోకుండా ఎదురయింది.
" ఏంది లలితా, నువ్వేనా! ఏందే! ఇలాగైపోయినావు!ఆ... ఇలాకాక  ఎలాగుంటావులే ! అవునూ... ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటున్నావటగా !! కృష్ణమ్మ చెప్పిందిలే. అయినా... అదేం పనే  లలితా ! ఎంత జరక్కపోతే మాత్రం... అలాంటి పనులా  చేయడం! మన ఇంటావంటా  ఉందంటే! ఫలానా వాళ్ళ పిల్ల ఇళ్లలో పనులు చేసుకుంటూ బ్రతుకుతోంది అంటే... అయిన వాళ్లకు ఎంత చిన్నతనం! ఎంత అప్రతిష్ట! అయినా.. అంతకంటే ఏం చేస్తావులే ! మరోదారి లేదాయె !...."
కొందరికి వాళ్లు మాట్లాడే మాటలు ఎదుటివాళ్లను బాధిస్తాయో ఏమో అన్న ఆలోచన ఏ కోశానా ఉండదు.ఉన్నా... వాళ్ల బాధతో మాకేం పని... అన్నట్లు వాళ్ల మానాన  వాళ్ళు వాగుతూ ఉంటారు.. అలా ఆగకుండా సాగిపోతున్న ఆవిడ వాక్ప్రవాహాన్ని ఎలా ఆపాలో లలితకు  తోచలేదు.
" నేనేం నేరమూ,  ఘోరమూ చేయడం లేదే! నాకు నచ్చిన పని నేను చేసుకుంటే మీ అందరికేంటి నొప్పి? ఆ బాధపడే వాళ్లెవరూ నా కష్టంలో నన్ను ఓదార్చడానికి కూడా రాలేదే...!"
అనాలనుకుంది. కానీ.. ఆ మాటల్ని చిలవలు పలవలు చేసి పదిమంది  దగ్గర దండోరా వేస్తుంది..ఆమె  ధోరణి తెలుసు కాబట్టి...
" తప్పేముందిలే పిన్నీ...కానిపనేమీ నేను చేయడం లేదు కదా... అలాంటప్పుడు ఎవరూ బాధపడాల్సిందేమీలేదులే..వెళ్తాను..లేటయిపోయింది"అని ఆమె వైపు కూడా చూడకుండా ముందుకు కదిలింది. 
" దేవుడా, ఇలా కూడా ఉంటారా!! మన బ్రతుకేదో మనం బ్రతకడానిక్కూడా ఇలా అందరి గురించీ ఆలోచించాలా! అందరి అనుమతి తీసుకోవాలా!...!
లలితకు మనుషుల నైజం గురించి మెల్లిమెల్లిగా అర్థం కావడం మొదలయింది. 
   రెండు నెలల కాలం గడిచిపోయింది అతికష్టంగా. శక్తి కూడదీసుకుని ఎలాగోలా తాను లాగిద్దామనుకున్నా ఆమె దేహం ఏమాత్రం సహకరించక ఓరోజు సాయంత్రం ఇల్లు చేరగానే మంచం మీద వాలిపోయింది. వారం రోజులు మూసిన కన్ను తెరవనీయని జ్వరం ఆమెలోని సత్తువనంతా లాగేసింది. ఆ పరిస్థితిలో ఉన్న లలితకు...భర్త అప్పుడప్పుడు తనతో చెప్పుకున్న మాటలు పదేపదే గుర్తుకు రాసాగాయి. 
" మా ఆఫీసులో అందరూ చాలా మంచివాళ్ళు లలితా, ఎంతో మర్యాదగా ఉంటారు. మా మేనేజర్ సారు కూడా చిన్నా పెద్దా తేడా చూపక అందర్నీ బాగా చూస్తాడు..."
ఏదో మాటల సందర్భంలో తరచుగా అతనన్న మాటలు లలితలో ఆలోచనలు రేపసాగాయి...కాఫీలు, టీ లు అందించేపని మర్యాదకు లోటనుకుంది...కానీ... ఇప్పుడు చేస్తున్నదేమిటి ! అందరిళ్ళలో వాళ్ళుతిన్న కంచాలు, గిన్నెలు తోముతూ...వాళ్ళతో మాటలు పడుతూ..! ఇంతకన్నా తీసిపోయిందా ఆఫీసులో ఆ ఉద్యోగం !!    
    మెల్లిగా ఆమె మనసు మరో కొత్త దారిలో పయనించడం మొదలైంది. తను కరాఖండిగా వద్దని చెప్పబోతుంటే, తండ్రి ఆలోచించుకుని మళ్లీ కలుస్తాం అని ఆరోజు ఆఫీసులో ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థమవుతోంది లలితకు... ఎంతైనా పెద్దవాళ్లు పెద్దవాళ్లే! అనుకుంది. ఈరోజు స్వానుభవం మీద పరిస్థితి ఏమిటో తనకు తానే తెలుసుకుంది. తండ్రి దూరదృష్టిని లోలోపలే మెచ్చుకుంది. ఆ క్షణమే ఆమె ఆలోచనలు  ఓ రూపు దాల్చి, ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది.
                **           **             **
  మూడు నెలలు గడిచిపోయాయి. లలిత ఆఫీసులో చేరిపోయింది. ఆ రాత్రి ఆమె తీసుకున్న ఓ  నిర్ణయం ఆమెకో  కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తండ్రిని రప్పించుకుని ఆఫీసుకి వెళ్లి మాట్లాడాక..కొద్ది  రోజుల్లోనే మానవతా దృక్పథం కింద అటెండర్ స్థాయి ఉద్యోగం ఆమెకు కేటాయించడం జరిగింది.
   సత్యం భార్య అన్న 'సాఫ్ట్ కార్నర్' తో ఆమెను ఆఫీసు స్టాఫ్  అంతా మంచిగా చూసుకుంటున్నారు. ఆమెకు తగిన పనులు మాత్రమే చెప్తున్నారు. త్వరలోనే లలితకు ఆ వాతావరణం, అక్కడి సిబ్బంది బాగా అలవాటైపోయారు. ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంది. అలా... చూస్తుండగానే మూడు నెలల కాలం పరుగులు తీసింది. టెన్షన్ లు  లేని చిన్న ఉద్యోగం... నెల తిరిగేసరికి చేతిలో వచ్చి పడే డబ్బులు...!! ఇక పరవాలేదు.. ఈ బండి నడవడానికి ఈ మాత్రం ఆసరా చాలులే ..అనుకుంది లలిత. 
   ఈ స్వల్ప కాలంలోనే ఆమెకు అర్థమయింది ఓ జీవిత సత్యం... ఎవరికి వారే యమునా తీరే... ఎవరి కష్టాలు వారివే...ఎవరి సమస్యలు వారివే... ఎవరికి వారే తీర్చుకోవాలి... ఎవరో వస్తారనీ, రావాలనీ కోరుకోవడం, ఆశించడం కూడదు... అని !!
   ప్రస్తుతం తన జీవితం ఓ గాడిని పడిందిలే అనుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న దశలో...ఓరోజు  సాయంత్రం లలిత  ఇల్లు చేరగానే పెద్దాడపడుచు రామేశ్వరి, చిన్న మరిదీ ఇంట్లో కూర్చుని ఉన్నారు. రాత్రి భోజనాలయ్యాక, 
" లలితా, పిల్లల చదువులు, ఇంటి బాధ్యతలు.. చాలా కష్టపడుతున్నట్లున్నావుకదూ.అందుకే,ఆలోచించాము లలితా,  సుధను తమ్ముడు,సురేష్ ను నేనూ తీసుకెళ్దామనుకుంటున్నాము. అక్కడే స్కూల్లో చేర్పిస్తాము..."
మెల్లిగా మొదలెట్టింది రామేశ్వరి. ఉన్నట్టుండి వాళ్ల రాకకు కారణం అన్వేషిస్తున్న లలితకు జవాబు దొరికింది.
" అవును వదినా, కనీసం హైస్కూల్ చదువు పూర్తి అయ్యేదాకన్నా నీకు కాస్త భారం తగ్గితే బాగుంటుంది కదాని ఇద్దరినీ తీసుకెళ్లాలనుకుంటున్నాము.."
మరిది వంత  పాడాడు. వాళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉంటున్నారు.. లలితకు పూర్తిగా స్పష్టమైంది విషయం. అతని భార్యకిప్పుడు ఏడో నెల... ఇంట్లో పనికి సాయంగా ఉంటుందని సుధను తీసుకెళ్తానంటున్నాడు
ఆడపడుచుకేమో ఇద్దరూ ఆడపిల్లలే..భర్తేమో  వ్యాపారం పనుల్లో తీరిక లేకుండా తిరుగుతుంటాడు. ఇంట్లో చేదోడుగా ఉంటాడని సురేష్ ను తీసుకెళ్తాను అంటోంది. ఈ మాట భర్త చనిపోయిన వెంటనే అని ఉంటే అప్పుడు తానున్న మానసికస్థితిలో ఒప్పుకొని ఉండేదేమో!! అప్పుడు మౌనంగా ఉండిపోయారు... ఇప్పుడేమో వాళ్ళ అవసరాలు గుర్తొచ్చాయి మరి! స్వామికార్యం, స్వకార్యం...అన్న రీతిని వ్యవహరిస్తున్నారు.. అలా ఆలోచిస్తున్న లలిత మనోఫలకం మీద ఉన్నట్టుండి తండ్రి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఆమెకు తండ్రి మనస్తత్వం గుర్తొచ్చి, తన ఆలోచనల్ని సవ్యదిశలోకి తిప్పేసింది. ఏమో! అప్పుడు.. చెట్టంత  మనిషి పోయిన ఆ పరిస్థితిలో వేరే ఆలోచన చేసే అవకాశం వాళ్లకు వచ్చి ఉండకపోవచ్చు. రోజులు గడిచే కొద్దీ... నా గురించిన బాధ మొదలై ఉండవచ్చు..! వీళ్ళ గురించి ఇప్పుడు నేను మరోలా ఎందుకు అనుకోవాలి !!
   లోలోపలే లెంపలు వేసుకుని, తనను తాను సంభాళించుకుంది.  
" చూస్తావేమేసుధా, వెళ్ళు.. వెళ్లి, నీ బట్టలవీ సంచీలో సర్దుకో... "
 సుధ వైపు   చూస్తూ అంది రామేశ్వరి. ఆ పిల్ల కదల్లేదు.
"వాళ్లెక్కడికీ రారులే వదినా, ఇక్కడ స్కూళ్లు బాగానే ఉన్నాయి. వీళ్లకు అలవాటు అయినవి కూడా... పైగా వాళ్లేమీ నాకు భారం కూడా కాదు..."
నెమ్మదిగా చెప్పింది లలిత. 
" అలా అంటావేంటి లలితా, అయినవాళ్ళం... ఆమాత్రం ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా!ఏమర్రా.. మీ అమ్మ అలాగే అంటుంది...మీరు వెళ్ళండి.. రేపు ప్రయాణానికి రెడీ కండి.. పొద్దుట టైం ఉండదు..."
కాస్త గట్టిగానే అంది రామేశ్వరి పిల్లల వైపు చూస్తూ..
" మేమెక్కడికీ రాములే అత్తా అమ్మ దగ్గరే ఉంటాం.. "
కూర్చున్న చోటు నుంచి లేవకుండా అన్నాడు సురేష్. 
"అవునత్తా, మేం రాము. అమ్మకు తోడు మేము లేకపోతే ఎలా? "
సుధ కూడా అన్న చేయి పట్టుకుంటూ తెగేసి చెప్పింది.
ఆ ఇద్దరికీ   నోట మాట రాలేదు. తను చెప్పే అవసరం లేకుండానే పిల్లలే పరిష్కరించేశారు... లలిత పిల్లలిద్దరినీ  చూసుకుని మురిసిపోయింది. 
మరునాడు ఉదయమే బయలుదేరారు రామేశ్వరి, ఆమె తమ్ముడూ... ఓ విధంగా ముఖాలు మాడ్చుకుని !
వెళ్తున్న ఆ ఇద్దర్నీ చూస్తూ... తల్లికి చెరో  వైపు నిలబడి
ఆమె భుజం మీద చేతులు వేసి, నవ్వుతూ బై చెప్పారు సురేష్,సుధ...లలితకప్పుడు తండ్రి మాటలు మరోసారి గుర్తొచ్చాయి. 
" నీకు నీవే ఆసరా అవ్వాలి తల్లీ..." 
" నాకు నేనే కాదు నాన్నా, నా పిల్లలు కూడా నాకు ఆసరానే..."
అనుకుంది మనసారా...

🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃

No comments:

Post a Comment