Thursday, October 12, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే..19..తొలిసారి అచ్చులో నా రచన...

  ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


    
    ఇంటర్ లో చేరినపుడు మాకాలేజిలో అన్నీ అరకొర సౌకర్యాలే... ఆసంవత్సరమే ఇంటర్మీడియట్ కోర్స్ ప్రవేశపెట్టడం  వల్ల, అమ్మాయిలకు ప్రత్యేకించి వెయిటింగ్ రూమ్ అన్నది లేకపోవడం వల్ల హైస్కూల్ లైబ్రరీ లోనే కూర్చోబెట్టేవారు యాజమాన్యం వారు. కొత్త కోర్స్ కాబట్టి, ఇంకా బుక్స్ అన్నీ రాలేదు. అన్ని సబ్జక్ట్స్ కు లెక్చరర్స్ కూడా నియమింపబడలేదు. అందుకని ఖాళీ సమయం చాలా ఉండేది.ఇంకేముంది..! ఎటు చూసినా పుస్తకాలే..! రకరకాలైనవి... అంతవరకూ చందమామ,  బాలమిత్ర కథలకే పరిమితమైన నేను మెల్లిగా ఆ పుస్తకాలు తెరవడం మొదలైంది. విశ్వనాథ సత్యనారాయణ, చలం.. అలాంటి వారివే కాదు. అప్పట్లో బాగా పాపులర్ అయిన రచయితలు, రచయిత్రుల కథలు, నవలలు కూడా కోకొల్లలుగా అందుబాటులో ఉండేవి.వాటిల్లో  యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు.... ఆ శైలి, కథనం, పాత్రల వర్ణనలు.. బాగా ఆకట్టుకునేవి. తర్వాతి  రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తిగారల రచనలు ఎక్కువగా చదవడం జరిగింది. అవన్నీ చదవడంవల్లనేమో... ఏదైనా ఆలోచన తడితే, కాగితంపై మెల్లిగా రాస్తూ ఉండేదాన్ని. అయితే ఎవరికీ చూపించేదాన్ని కాదు. కొన్నాళ్లు గడిచాక, చింపేసేదాన్ని.  

 

ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాక, నిద్రాణమైఉన్న ఆ సృజన మెల్లి మెల్లిగా స్పందించడం మొదలై చిన్న చిన్న కవితల్లాంటివి రాసి, పిల్లల చేత చదివించడం చేసేదాన్ని. అలా రోజులు గడుస్తూ ఉండగా... 'మయూరి' పేరుతో ఓ సచిత్ర వార పత్రిక కొత్తగా పబ్లిష్ అవడం మొదలైంది. అందులో సంపాదకులు ఓ కొత్త శీర్షిక పెట్టారు." పాఠకుల కథలు"... దాని పేరు. అంటే, బాగా పేరున్న, చేయి తిరిగిన రైటర్సే కాదు... చదివే అలవాటున్న పాఠకులు కూడా కథలు రాసి పంపొచ్చు. ప్రతీవారం ఓ టైటిల్ ఇస్తారు. దానికి తగినట్లు అరఠావు మించకుండా కథ రాసి పంపాలన్నమాట..! వాటిల్లో బాగున్న వాటిని ప్రచురిస్తామని ప్రకటన వెలువడింది. 
  అది చూడగానే, ఒక్కసారి ఎలాగైనా సరే, నేను రాసింది అచ్చులో చూసుకోవాలన్న కోరిక మొదలైంది నాలో. అనుకున్నదే  తడవుగా, కాగితం,  కలం పుచ్చుకుని రాసి పంపాను. పబ్లిష్ అవ్వలేదు. రెండో  వారం మరో టైటిల్ ఇచ్చారు.ముందే అనుకున్నట్లుగా మళ్ళీ రాసి పంపాను. అంతే..! పబ్లిష్ అయిపోయింది. ఎన్నోసార్లు ప్రయత్నించాల్సివస్తుందనుకున్న నాకు రెండోసారే  ప్రయత్నం ఫలించడం ! చాలా సంతోషమేసింది. మొదటిసారి.. అచ్చులో నా ఆలోచనలు...నా రాతలు...నా పేరు..! ఆ కథే ఇది...'ప్రయాణం'...పైన ఫొటోలో ఉన్నది...చాలా సంవత్సరాలు అయినందుకు సరిగ్గా కనిపించడం లేదు...చిన్న కథే ! అదీ..పాఠకుల కథ ! అయినా..ఏదో ఆనందం ! సంబరం ! అన్నట్లు దానికి 20/- రూపాయలు పారితోషికం కూడా అందింది 🙂.
  సరే.. పబ్లిష్ అయిందిగా ఒకసారి.. ఇక చాలు అనుకున్నా. కానీ..అప్రయత్నంగానే మళ్లీ రెండు మూడు ఆర్టికిల్స్ రాయడం, అవీ అచ్చవడం జరిగిపోయింది. అలా  మొదలైన ప్రయాణం అడపాదడపా మెల్లిగా కదులుతూ సాగుతూ పోయింది. అప్పట్లో 'వనితాజ్యోతి' అని మహిళల మాసపత్రిక వెలువడేది. అలాగే కర్నూల్ నుండి 'ఉజ్వల' అని ఓ దినపత్రిక కూడా వచ్చేది. వాటికి తీరిక సమయాల్లో రాసి, అప్పుడప్పుడు పంపించేదాన్ని.రాయాలనుకున్నప్పుడు,రాసేటప్పుడు, వాటిని పంపించాక...ఏదో తెలియని తృప్తి కలిగేది. వాటిని అచ్చులో  చూసుకున్నప్పుడు.. పరవాలేదు... నేను రాసినవి కూడా మ్యాగజైన్స్ లో వస్తున్నాయోచ్ అనిపించేది...చిన్న చిన్న రచనలే. కానీ...కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఉండేవి నా ఫీలింగ్స్!కొంతకాలం  గడిచాక ఆంధ్రభూమి వార్తాపత్రిక లోనూ కొన్ని రచనలు పబ్లిష్ అయ్యాయి. అలాగే... చిన్నప్పటినుంచీ నాకెంతో ఇష్టమైన బాలమిత్ర పిల్లల మాస పత్రికలో కూడా...
    బ్లాగులో రాయడం మొదలెట్టేవరకూ అలా మ్యాగజైన్స్ లో పబ్లిష్ అయినవి వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినవే. కానీ, బ్లాగ్ మొదలెట్టాక ఆ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పుడు బయట మ్యాగజైన్స్ రావడం బాగా తగ్గిపోయింది. పైగా...అన్ని ఆలోచనల్ని వాటిల్లో పెట్టడానికి అది సరైన వేదిక కూడా కాదు.ఒక్క బ్లాగింగ్ లోనే అది సాధ్యం. రాయాలన్న తపన, ఉత్సుకత ఉన్నవాళ్లకు బ్లాగ్ ఓ వరమనే చెప్పాలి. ఈ సందర్భంగా బ్లాగ్ అగ్రిగేటర్స్ మాలిక, శోధిని లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి...ఓ ఇష్టమైన వ్యాపకం మనిషికి మానసికంగా ఎంతో బలాన్నిస్తుంది ఖచ్చితంగా... అంతేకాదు...సంతోషాన్ని,సంతృప్తినీ తద్వారా,శారీరక ఆరోగ్యాన్నీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు.జీవనయానంలో ఇలాంటి చిన్నచిన్న ఇష్టాలు, వ్యాపకాలు కూడా ఓ భాగమేగా. అందుకే నలుగురితో పంచుకోవాలనిపించింది.  

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

                             
    






No comments:

Post a Comment