కొన్ని జ్ఞాపకాలు ఎంత వద్దనుకున్నా మదిలోంచి తొలగిపోవు. మరీ ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాలు. వాటిల్లోంచి ఒకటి ----
నేను హైస్కూల్లో చదివే రోజుల్లో మేముండే చిన్న పట్టణంలో ఓ ' టెంట్ ' ( డేరా ) సినిమా హాల్ ఉండేది. చిన్న పట్టణమన్నానుగానీ, అంతా పల్లె వాతావరణమే అక్కడ ఉండేది. టెంట్ సినిమా అంటే ఆ తరం వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. చుట్టూ డేరా బాగా ఎత్తుగా కట్టేస్తారు. బయట ఉన్న వాళ్ళకి లోపల ఆడే సినిమా అస్సలు కనిపించదు. లోపల ముందు భాగాన తెర, వెనక భాగాన ప్రొజెక్టర్ రూము ఉంటాయి. కిందంతా కూర్చోవడానికి వీలుగా ఇసుక నింపబడి ఉంటుంది. ఇలాంటివి అప్పట్లో ప్రతీ చిన్న పట్టణాల్లో ఒకటి, రెండూ ఉంటూ ఉండేవి. చిన్నా, పెద్ద అందరికీ అవే పెద్ద కాలక్షేపం!
పెద్ద పెద్ద పట్టణాలలో విడుదలైన సినిమాలు అక్కడ ఆడి, బాగా పాతబడ్డాక చిన్న ఊర్లకు వచ్చేవి. అప్పటికే ఆ సినిమా కథ, సన్నివేశాలు, నటీనటులు కరతలామలకం అయిపోయుండేవి. పాటలు సరేసరి! సుపరిచితం అయిపోయేవి.
కొందరు ఔత్సాహికులు రాగం తప్పకుండా పాడేసేవారు కూడా ! అయినా మా ఆనందం వర్ణనాతీతం. పాత సినిమా అయితేనేమి, మాకు కొత్తే కదా అనుకుంటూ ఎంతో ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళం. సినిమా ప్రచారం భలే ఉండేది. ఓ జట్కాబండికి రెండు వైపులా సినిమా పోస్టర్లు అంటించి, వీధి వీధి తిరుగుతూ మైకులో అరుస్తూ అందరికీ తెలియజేసేవారు. అక్కడక్కడ ఆగుతూ, ఆ సినిమాకు సంబంధించిన కరపత్రాలు బండి చుట్టూ మూగే పిల్లలకు పంచిపెట్టేవారు. అందులో టూకీగా సినిమా కథ, నటీనటుల వివరాలు ఉండేవి. ఇప్పుడు మీడియా అనూహ్యమైన రీతిలో విస్తరించి పోయి అలాంటి పబ్లిసిటీ అంతరించిపోయింది.
మా పిన్ని గారి అమ్మాయిలు, చుట్టుపక్కల వాళ్ళు, అప్పుడప్పుడూ క్లాస్మేట్స్ కలిసి వెళుతూ ఉండేవాళ్ళం. వెళ్లేప్పుడు పాత దుప్పటి లాంటిది పట్టు వెళ్ళేవాళ్ళం కింద పరుచుకుని కూర్చోవడానికి!ఇంటినుండి పదిహేను, ఇరవై నిమిషాల నడక . సినిమా వేయడం మొదలెట్టే ముందు' రెగ్యులర్'గా ఓ పాట వేసేవారు. ఆ పాట వినగానే టెన్షన్ తో పరుగో పరుగు, ఎక్కడ స్టార్టింగ్ మిస్సవుతామేమో అని ! టికెట్ ధర 28 పైసలు ఉండేది. వెనకవైపు రెండు మూడు బెంచీలుండేవి. అక్కడ కూర్చోవాలంటే 40 పైసల టికెట్ తీసుకోవాలన్నమాట !
మామూలుగా సినిమాకు ఒకే ఇంటర్వెల్ ఉంటుందికదా, కానీ ఈ టెంట్ సినిమాకు నాలుగైదు ఇన్ ట్రవెల్స్ ఉండేవి.1, 2 రీల్స్ అవగానే ఓ ఇంట్రవెల్! అలా ఉండేది. అలా ఇంటర్వెల్ రాగానే అందరం కాస్త రిలాక్స్ అయ్యేవాళ్ళం, పైన ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు చూస్తూ ! ఈలోగా జరిగిన దాని మీద, జరగబోయే దాని మీద డిస్కషన్స్! మళ్లీ మొదలవగానే ఠక్కున సర్దుక్కూర్చుని కథలో లీనమై పోయే వాళ్ళం. అప్పట్లో అదో అనిర్వచనీయమైన ఆనందం, అనుభూతి మా అందరికీ!
ఓసారి అలాగే వెళ్లి కూర్చున్నాం. సినిమా మొదలైంది. అరగంట గడిచీ గడవకముందే టపటప మంటూ చినుకులు రాలడం మొదలయింది. "ఆ, ఏముందిలే తగ్గి పోతుంది"అనుకున్నాం. అలాగే తలపై చేతులు ఉంచుకుని చూస్తూ ఉన్నాం. కానీ ఉండేకొద్దీ వాన కాస్తా పెద్దదై పోయింది. అయినా ఆశ చావక అలాగే తడుస్తూ చూస్తూ ఉండిపోయాం. కానీ, ఠక్కున సినిమా ఆగిపోయింది. ఓ నిమిషం చూశాం, మళ్ళీ వేస్తాడేమో అని! వర్షం ఉధృతి ఎక్కువైపోయి లాభం లేదనుకుని జనాలంతా లేచి, పొలోమంటూ బయటికి పరుగులు తీశారు. వాళ్లతో పాటు మేమూ. ఆ రాత్రి వేళ, ఆ వర్షంలో, ఆ బురదలో ఇంటికి ఎలా వచ్చి పడ్డామో ఆ దేవుడికెరుక !
అలా మొదట్లోనే సినిమా ఆగిపోతే మరుసటిరోజు ఫ్రీగా చూపించేవాళ్ళు ఓనర్లు. అదో ఆనవాయితీ అక్కడ. అలాగే మరునాడు అంతా వెళ్ళాం. కింద ఇసుక కాబట్టి అంత వర్షం కురిసినా బాగా ఆరిపోయిఉంది. పైగా మా పాత దుప్పటి ఎలాగూ ఉండనే ఉంటుందాయె ! అలా మళ్ళీ సినిమా మొదటినుండీ చూస్తూ ' ఎంజాయ్ 'చేశాం. మరే ! మాకున్న ఒకేఒక్క వినోదం, ఆటవిడుపూ అదొక్కటేనాయే ! ఆనాటి ఆ ముచ్చట ఇప్పటికీ మనోఫలకం మీద చెరగని ముద్రగా మిగిలిపోయింది.
త్రైమాసిక, అర్ధసంవత్సర, ఇంకా సంవత్సరాంత పరీక్షలుంటాయి గదా --- అవి ముగిసిన చివరిరోజు మొదటాటకి ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే. కష్టపడి చదివి పరీక్షల పర్వం ముగిశాక మాకందరికీ అదో 'రిలాక్సేషన్ ' అన్నమాట ! అలా వెళ్లి ఓ సినిమా చూసేస్తేగానీ మనసుకి సంతృప్తి అనేది ఉండేది కాదు.
స్కూల్ చదువు పూర్తయ్యాక ఓ పెద్ద మార్పు వచ్చింది. అదేంటంటే టెంట్ స్థానంలో థియేటర్ రావడం! ఆ ఊర్లో ఓ సంపన్న కుటుంబం ఉండేది. వాళ్ళు కట్టించారని అంతా అనుకునేవాళ్ళు. అలా అలా టెంట్ సినిమా క్రమంగా మాయమై థియేటర్ సినిమా వచ్చేసి, కాస్త నాగరికత అలవాటయిపోయింది జనాలకి! ఆ విధంగా టెంట్ సినిమాల హవా కనుమరుగైపోయింది.ఇప్పటి తరాలకు అదంటే ఏమిటో అవగాహన ఎంతమాత్రం ఉండదు కూడా. ప్రస్తుతం పెద్ద పెద్ద మోడర్న్ థియటర్స్ లో వందల రూపాయలు పోసి టికెట్స్ కొని చూసే సినిమాలే వాళ్లకు తెలుసు.
ఏది ఏమైనా.. రోజులు గతించవచ్చు... కానీ.. గతంలోని జ్ఞాపకాలు..వాటితాలూకు అనుభూతులు గతించవుగా...!అలా...చిన్ననాటి జ్ఞాపకాల్లో టెంట్ సినిమా ఓ మధురస్మృతిగా ఇప్పటికీ మదిలో నిలిచిపోయింది.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
నేను చూసిన టెంట్ సినీమా పాలకొల్లులో "సంసారం". మేము భోజనం చేసి నేల మీద వేసుకోటానికి చాప తీసుకు వెళ్ళాము. దాన్ని టూరింగ్ టాకీస్ అనేవాళ్ళు. ఆరు నెలలు మాత్రమే ఉండేది. డేరాకి పైన కప్పు ఉండటం మూలాన వర్ష భయం లేదు. మీరన్నట్లు జ్ఞాపకాలని మరచిపోలేము.
ReplyDeleteఅవునండీ,అక్కడక్కడా టూరింగ్ టాకీసులు కూడా ఉండేవని విన్నాను.నేను ప్రస్తావించినటువంటివి మా ఊర్లో రెండు ఉండేవి.భారీవర్షాలు కురిసినప్పుడు కొద్ది రోజులు ప్రదర్శన ఆపేసేవారు.తర్వాత మరమ్మత్తులు చేసి వేసేవారు.సరదాగా ఉండేవారోజులు. Thank you very much for the comment 🙏
ReplyDeleteHappy to see Maalika again...త్వరలో పూర్తి స్థాయిలో కొనసాగాలని కోరుకుంటున్నాను.
ReplyDelete