🌷
ప్రస్తుతం థియేటర్లలో సినిమా చూడడమన్నది బాగా తగ్గిపోయింది. ఒకప్పుడయితే రిలీజ్ అయిన ప్రతి సినిమా... అది ఎలాంటిదైనా సరే చూసేవాళ్ళం. రాను రానూ ఏ నెలకో, రెండు నెలలకో ఓసారి అన్నట్టు తయారయాం. ఆపిదప...మావరకూ సెలెక్టెడ్ గా చూసి తీరాలి అనిపించిన వాటిని మాత్రమే చూడడానికి అలవాటు పడిపోయాం మేము. ఇక కరోనా వచ్చి, జనాల్ని పలకరించి, నానా బీభత్సం సృష్టించాక బయటకి వెళ్లి సినిమా చూడడం అనేది పూర్తిగా అదృశ్యం అయిపోయింది. చెప్పాలంటే ఆ కోరిక చచ్చిపోయింది అనాలేమో !
అయితేనేం ! మనకు మన టీవీ ఉందిగా ! ఆ లోటు ఫీల్ కాకుండా... అన్నీ ఇంట్లోనే కూర్చుని పైసా ఖర్చు, శ్రమా లేకుండా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా వీక్షిస్తూనే ఉన్నాం. సరే, ఈ సోదంతా ఎందుకూ అంటారేమో ! అదే చెప్పబోతున్నా...
అలా చూస్తున్న వాటిలో కొద్దిరోజుల క్రితం నేను చూసిన 'రైటర్ పద్మభూషణ్' మూవీ ఒకటి. ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం... అంతే...! అప్పటి వరకే...! వారం దాటితే ఏదీ గుర్తుండదు. కానీ హృదయానికి హత్తుకునేవి, కొంతకాలం వాటి గురించే ఆలోచిస్తూ ఉండేలా చేసేవి బహు అరుదు. అలాంటి కోవ లోకి వస్తుందీ మూవీ ! అంత గొప్పగా ఏముంది అంటారేమో ! దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించిన ఓ కాన్సెప్ట్... బహుశా ఇదివరకు ఎవరూ టచ్ చేయని అంశం (నాకు తెలిసినంతవరకూ) అని నా వ్యక్తిగత అభిప్రాయం.
తల్లిదండ్రులు కూతుళ్లను గారాబంగా పెంచుతారు. కోరిన చదువు చెప్పిస్తారు. వారిలో ఏవైనా ప్రతిభా పాటవాలు గమనిస్తే ఉప్పొంగిపోయి ప్రోత్సహిస్తారు. అందులో నిష్ణాతులు అవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ... అదంతా ఆ పిల్లకు పెళ్లి చేసి ఓఅయ్య చేతిలో పెట్టేసి, అత్తారింటికి పంపించేదాకే..! ఆ పిదప... ఆ ఇంటి వాళ్ళ ఇష్టం... ముఖ్యంగా భర్త అన్నవాడి చేతిలోకే ఆమె భవితవ్యం పూర్తిగా జారిపోతుంది అన్నది నగ్న సత్యం. పెళ్లికి ముందున్న ఆమె ఆశలు, ఆశయాలు, కలలు, అభిరుచులు భర్త గుర్తించి, ప్రోత్సహించి చేయూతనిస్తే ఓకే.. ఆమె అంత అదృష్టవంతురాలు మరెవరూ ఉండరు కచ్చితంగా. కానీ అది మృగ్యమైతే...! అన్నీ అణగార్చుకుని, ఓవిధంగా చంపుకుని నిస్తేజంగా బ్రతుకీడవాల్సిన దురవస్థ ! నాలుగు గోడల మధ్య వండి వార్చుతూ కేవలం పిల్లల్ని పెంచి పెద్ద చేసే ఓ యంత్రంలా మారిపోవాల్సి వస్తుంది. భర్తలో ఉన్న నైపుణ్యాల్ని చూసి భార్య ఎంతో సంతోషపడుతుంది. అతను ఉన్నత స్థాయికి చేరుకోవడానకి తనూ ఓ చేయి వేస్తుంది. భర్త అనుకున్నది సాధిస్తే ఆమె కన్నా గర్వించే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ.. మరి ఎంతమంది భర్తలు భార్య గురించి అలాగే ఆలోచిస్తున్నారు !!?
భార్య ఓ గాయని అయితే గుర్తించరు. ఓ కళాకారిణి అంటే గౌరవించరు. ఓ రచన చేస్తే ఎగతాళి చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఆమె వ్యక్తిత్వానికి విలువ అన్నదే ఇవ్వరు. అదే భర్త తండ్రిగా మారినప్పుడు కూతుర్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తాడు. అందుకోసం ఎంతైనా ఖర్చుకు వెనుకాడడు. రేపు ఆ పిల్లకు పెళ్లయ్యాక తన అల్లుడూ తనలాగే ప్రవర్తిస్తే తన కూతురి పరిస్థితి ఏమిటి ? ఈ ఆలోచన ఆ తండ్రి మస్తిష్కంలో మెదలదు.
మూవీలో ఈ సున్నితమైన అంశాన్ని స్పృశించిన తీరు నాకు చాలా నచ్చింది. భార్య, భర్త, కొడుకు... ఈ మూడు ముఖ్యపాత్రల మధ్య నడిచే చక్కటి కథనం. కొడుకు ఓ సాహిత్యాభిలాషి. తనయొక్క ఓ రచనను స్వయంగా పబ్లిష్ చేసి అమ్మజూపితే ఎవరూ కొనేవాళ్లే ఉండరు. ఉచితంగా ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉండదు. కొడుకు దీనస్థితి చూసిన తల్లి తనకున్న ఒకప్పటి అభిరుచి...అదే...రాసే అలవాటుతో తనే స్వయంగా ఒక కథ రాసి పుస్తకంగా పబ్లిష్ చేసి దానికి రచయితగా కుమారుని పేరు పెట్టి, అతని ఫోటో అందులో వేయిస్తుంది. ఆ పుస్తకం చాలా ప్రాచుర్యం పొంది కొడుకుకు రచయితగా గుర్తింపు వస్తుంది. కానీ... అతనికి తెలుసు...అది తను రాయలేదని.! ఎవరు వ్రాశారా అని తెలుసుకునే ప్రయత్నంలో... ఒకానొక సందర్భంలో అసలు విషయం తెలుసుకుంటాడు. అంతే... తల్లి పట్ల అతని హృదయం ఆర్ద్రత తో నిండిపోతుంది. తల్లి రుణం తీర్చుకోవడానికా అన్నట్లు ... స్వయానా రాయగలిగిన అతను ఓ రచన చేసి,పబ్లిష్ చేసి, దానికి రచయిత్రిగా తల్లి పేరుతో పాటు ఆమె ఫోటో అందులో వేయిస్తాడు. ఈ సస్పెన్స్ సినిమా చివర్లోనే తెలుస్తుంది. ఆ పుస్తకావిష్కరణ జరుగుతున్నప్పుడు ఆహూతులందరిలో ఓరకమైన భావోద్వేగం!!
ఒకాయన వెంటనే తన భార్యకు ఫోన్ చేసి, ఆమెనో మాట అడగాలనుకుంటున్నాను అని పక్కనున్న అతనితో అంటాడు. ఓ చిన్న పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఫంక్షన్ లో ఉన్న వాడి తల్లిని కొంగు పట్టి లాగుతూ అడుగుతాడు...
".. అమ్మా, నువ్వు ఏదైనా అవాలనుకుంటున్నావా? "
అని !! ఆ తల్లి ఉప్పొంగిపోయి పిల్లాడిని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది.ఐదారు నిమిషాల వ్యవధిలో వీక్షకుల కంటతడి పెట్టించే సీన్స్ఇవి రెండూ!
పెళ్లయ్యాక ప్రతీ భర్త తన భార్య అభిరుచులు గుర్తించి ప్రోత్సహిస్తే ఎంత బాగుంటుంది ! పెళ్లి తర్వాత కూడా ఆమెకో వ్యక్తిగత జీవితం అంటూ ఉంటుంది కదా! కొందరు అమ్మాయిలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా పెళ్లి తర్వాత అత్తింటి వారికి ఇష్టం లేదనీ, భర్త వద్దన్నాడనీ మానేసి ఇంటికే పరిమితమౌతూ ఉంటారు. మరి చిన్నతనం నుండీ పెళ్లి వరకూ ఆమె పడ్డ శ్రమంతా వృధాయేనా !? ఇంట్లో ఒప్పించి, తమ కోరిక తీర్చుకునే వారు ఉండరని కాదు...ఉంటారు.. కానీ చాలా అరుదు. అంతటి నేర్పు, దృఢ సంకల్పం అందరికీ ఉండవు కదా! ఇంట్లోవారి సపోర్ట్ కోసమే చూస్తారంతా...ముఖ్యంగా భర్త ఆసరా కోసం !
తల్లి తన పిల్లల్లోని టాలెంట్స్ ని చూసి సంబరపడిపోతుంది. పదిమందికీ చెప్పుకొని మురిసిపోతుంది. మరి పిల్లలు !! పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు... ఇంకా... ఇంట్లో వాళ్లని ఇంట్లో వాళ్ళు మెచ్చుకోరు, గుర్తించరు అన్నచందాన తల్లిని ఏ మాత్రం పట్టించుకోరు.
దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఎంచుకున్న కథాంశం చాలా ప్రత్యేకమైనది. మొదటి సగం పెద్దగా ఆకట్టుకోలేక పోయినా, రెండవ సగం కాస్త ఊపందుకుని క్లైమాక్స్ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. కానీ.. ఫ్లాష్ బ్యాక్ లో చూపే సన్నివేశాలు తొందర తొందరగా క్షణకాలం పాటు మాత్రమే చూపించడం జరిగింది. కథలో కీలకమైన అంశం వీక్షకులకు చేరాలంటే ఆ సన్నివేశాలు కాస్త విశదంగా, బలంగా చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అదే కథకు ఆయువుపట్టు కాబట్టి! (ఈమధ్య చాలా సినిమాల్లో గమనిస్తున్నదిదే. అతి ముఖ్యమైన ఫ్లాష్ బ్యాక్ సీన్లను టపటపా తిప్పేయడం! వీక్షకులు ఓ క్షణం చూపు మరలిస్తే చాలు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి !) అనవసరమైన వాటికి ప్రాధాన్యత తగ్గించి, ఇలాంటి అవసరమైన వాటికి చోటిస్తే బాగుంటుంది.
అమ్మ పాత్ర పోషించిన రేవతి చక్కని నటి. రచయిత్రిగా ఆమె పాత్రను మరి కాస్త విస్తృతపరిచి మరికొన్ని సన్నివేశాలు జోడించి ఉంటే బాగుండేది. రచన పట్ల ఆమెకున్న తృష్ణ, ఎందుకు దాన్ని పక్కన పెట్టేయాల్సివచ్చింది... ఇలాంటి సన్నివేశాలు కొన్ని సృష్టించి ఉండాల్సింది. సుహాస్ ! చక్కని కనుముక్కు తీరు, ఒడ్డు పొడుగూతో పాటు నటనాకౌశలం, నాట్యంలో ప్రావీణ్యం కూడా ఉన్న ప్రతిభగల నటుడు. మేకప్ కు దూరంగా మధ్య తరగతి కుర్రాడంటే ఇలాగే ఉండాలి... అది సినిమా అయినా సరే.. ! అన్నట్లుగా ఉన్నాడు. ఆ సహజత్వమే ఆ పాత్రకు, అతని నటనకు వన్నె తెచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇది సినిమా రివ్యూ మాత్రం కాదు. మూవీలో అంతర్లీనంగా అందించబడ్డ ఓ చక్కటి సందేశం నచ్చి రాయాలనిపించింది. ఏది ఏమైనా.. జీవితాన్ని పంచుకున్న భార్యకూ, జన్మనిచ్చిన అమ్మకూ ఆమె అభిరుచి మేరకు ఓ స్థానాన్ని, ఓ స్థాయినీ కల్పించాలి అన్నది ఎంత చక్కని ఆలోచన !! దర్శకుని అభిరుచి, చేసిన ప్రయత్నం ఎంతేని అభిలషణీయం కదా !
పెళ్లి తర్వాత ఆమె చురుకుదనం, ఆసక్తులూ గమనించి ఆమెను ప్రోత్సహించి, సివిల్స్ కు ప్రిపేరయ్యేలా చేసిన ఓ భర్త గురించి వార్తాకథనం చూశాను. డిగ్రీ దాకా చదివిన భార్యను పెళ్లి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా B Ed పూర్తి చేయించి ఆమె ఓ మంచి ఉద్యోగంలో ప్రవేశించేలా చేసిన భర్త గురించీ విన్నాను. వారికీ, అలాంటి విశాల దృక్పథం గల అందరికీ జోహార్లు.
అలాగే...పిల్లల ఉన్నతి కోసం తమ కెరీర్ ను సైతం త్యజించి అహర్నిశలూ వారి బాగోగులు చూస్తూ అన్నీ అందిస్తూ వారి బంగారు భవితకై నిచ్చెనలై పోతున్న 'అమ్మ'ల గురించి పిల్లలు కూడా కాస్తో కూస్తో ఆలోచిస్తే ఎంత బాగుంటుంది !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment