Friday, June 23, 2023

'చిన్నారి' కథ -- మా అమ్మ చొక్కాలు బాగా కుడుతుంది

🙂😇🙎🙋👩🙂😇😅😊😇🙎👩🙎🙂

  సోమవారం. ఉదయం తొమ్మిది దాటి పదినిమిషాలవుతోంది.  ప్రార్థన తర్వాత పిల్లలంతా వచ్చి క్లాసులో  కూర్చున్నారు. అది  ఆరవ తరగతి. క్లాస్ టీచర్ సాధన అటెండెన్స్ తీస్తూ తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉండడం గమనించింది. తన వైపు చూడ్డం చూసి, ఆమె కాస్త ముందుకొచ్చింది. ఆవెనకే ఆమె కొంగు పట్టుకుని ఓ పిల్లాడు... 
" ఏరా, ఏమిటింత లేటు? పైగా మూడు రోజుల్నుంచీ బడికి రావడం లేదు.. ఒంట్లో బాగా లేదా ఏంటి? "
సాధన వాడిని చూసి ప్రశ్నలు సంధించింది. 
" అదేమీ లేదు టీచరమ్మా, వీడు బాగానే ఉన్నాడు. ఈనెల వీడి అన్న... అంటే నా పెద్ద కొడుకు పుట్టినరోజు టీచరమ్మా... వీడి నాన్న వాడికి కొత్తబట్టలు కుట్టించాడు. వీడేమో నాక్కూడా కావాలంటూ కొట్లాట! ఇద్దరికీ ఒకేసారంటే కూలి నాలి చేసుకుని బతికే వాళ్ళం కుదరదు లేరా... రెండు నెలలు అయ్యాక నీ పుట్టినరోజు వస్తుంది కదా... అప్పుడు కుట్టిస్తానంటే ఛస్తే వినడే ! కిందపడి దొర్లి  దొర్లి ఏడుస్తూ, ఇప్పుడే కావాలంటూ వాళ్ళన్న బట్టలు లాగేసుకుంటూ నానా యాగీ చేసి  బడి మానేసి కూకున్నాడు..."
 తల్లి అందుకుని చెప్పింది, రంగాను ముందుకు నెడుతూ. 
పిల్లలంతా తలలెత్తి ఆసక్తిగా వింటున్నారు. 
" అలాగా... ! ఏమిటి రంగా, తప్పు కదూ.. అలా చేయొచ్చా! ఇలారా... నువ్వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను... "
అంటూ రంగాను  దగ్గరికి పిలిచింది. రెండు నిమిషాల్లో అటెండెన్స్ పూర్తి చేసి, 
" పిల్లలూ, చూడండి.. మీకో  చిన్న సంగతి చెబుతాను. అందరూ శ్రద్ధగా వినండి... "
అంటూ అందరి వైపు ఓసారి చూసి మొదలెట్టింది.
" గాంధీ తాత గురించి తెలుసు కదా.. జాతిపిత... మహాత్మా గాంధీ.. ఆయన గొప్పతనం గురించి ఐదవ తరగతి తెలుగు పాఠంలో తెలుసుకున్నారు మీరంతా. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే మనకున్న పీరియడ్లు సరిపోవు. ఇప్పుడు మన రంగా గురించి విన్న తర్వాత నాకో  విషయం గుర్తొస్తోంది. 
"......................"
"... ఓసారి గాంధీజీ ఓ స్కూలుకు వెళ్లారట. ఆయన ఎలా ఉంటారో ఫోటోల్లో  చూశారు కదా... మోకాళ్ళ దాకా పంచె, పైన చొక్కా ఏదీ  ఉండదు...ఓ వస్త్రం కప్పుకొని ఉంటాడంతే... ఆ స్కూల్లో పిల్లలంతా ఆయన గురించి వినడమే గానీ అదే మొదటిసారి చూడ్డం ! అందరికీ వింతగా తోచింది. అందులో ఓ పిల్లవాడికి మరీ విడ్డూరంగా అనిపించింది. 
"అయ్యో ! గాంధీ తాత అంటే చాలా గొప్పగా ఊహించుకున్నానే! కనీసం చొక్కా కూడా లేనంత పేదవాడా !..."
అలా అనుకుని ఊరకే ఉన్నాడా...! వెంటనే ఆయన్ని సమీపించి, 
" మా అమ్మ చొక్కాలు బాగా కుడుతుంది తాతా, 
ఓ చొక్కా నీకోసం అడిగి  తెస్తాను..."
అన్నాట్ట !! ఆయన బోసి నోటితో నవ్వి, 
" అలాగే తీసుకురా... కానీ,  నాకు వేలాది మంది అన్నదమ్ములున్నారు. వాళ్లకు కూడా నాలాగే చొక్కాలు లేవు.మరి...మీ అమ్మనడిగి వాళ్లందరికీ కూడా చొక్కాలు తీసుకురాగలవా? ! వాళ్లకు లేకుండా నేను మాత్రమే చొక్కా వేసుకు  తిరిగితే బాగుండదు కదా..!"
అన్నాడట ! 
" ఏమిటీ ! గాంధీ తాతకు అందరు  అన్నదమ్ములా !"
 ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడంట ఆ  పిల్లవాడు !!
 చూశారా! ఆయన గొప్పతనం ! అన్నదమ్ములంటే ఒకే తల్లి పిల్లలు మాత్రమే కాదు... దేశంలో ఉన్న వాళ్ళంతా నా వాళ్లే... అనుకునేంత విశాల హృదయం ఆయనది. అందుకే జాతిపిత అయ్యాడు... అందరిచే కీర్తించబడుతున్నాడు ఇప్పటికీ. చనిపోయాక  కూడా జీవించడం అంటే ఇదే... !!"
అని చెప్పి, రంగా  వైపు తిరిగి, 
"... రంగా, చూడు, విన్నావు గదా... మరి నీవు సొంత అన్నతోనే అలా ప్రవర్తించవచ్చా...!"
" సారీ టీచర్... ఇంకెప్పుడూ అలా చేయను. ఇంటికెళ్ళాక మా అన్నకు సారీ చెప్పేస్తాను."
సాధన వాడిని దగ్గరగా తీసుకుని, తల నిమిరింది. అప్రయత్నంగానే వాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒకింత నొచ్చుకుని, 
" చూడండి, రంగా చేసింది తప్పేమీ కాదు. చిన్న వయసులో ఉండే ఓ సహజమైన లక్షణమే. మీరంతా చాలా చిన్న పిల్లలు. నేర్చుకునే దశలో ఉన్నారు. ఏది మంచో, ఏది చెడో తెలుకుంటూ ఉండాలి. గాంధీజీ అంత గొప్పగా మనం ఆలోచించలేకపోయినా... కనీసం మన ఇంట్లో అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో సఖ్యంగా ఉండగలగాలి. అది తెలుసుకోవాలనే గాంధీ గారి గురించి చెప్పాను మీకు. మీరు రంగాను చూసి నవ్వడం, ఎగతాళి చేయడం లాంటివి మాత్రం చేయకూడదు. ఏదైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకోవాలంతే... తెలిసిందా...!"
అంటూ రంగాను ఓదారుస్తూ కూర్చోబెట్టింది. పిల్లలంతా ఓ కొత్త విషయం గ్రహించినట్లు తలలూపారు.
🙂😊👩🙆🙆‍♀️😊🙂👧🙂😊👩🙂😊🙆🙋👧😊



No comments:

Post a Comment