Thursday, April 6, 2023

అమ్మమ్మ-పూలజడ--[మూడవ భాగం]

      వసంతాలు వచ్చి పోతున్నాయి. కాలగతిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కూతురి విషయంలో వెంకటరమణ దృక్పథం మాత్రం చెక్కుచెదరలేదు. దశాబ్దకాలం గడిచింది. శ్రీదేవమ్మ పసుపు కుంకుమలకు దూరమైంది. ఎన్నో ఏళ్లుగా భర్త చాటున మరుగున పడ్డ కూతురుపై ప్రేమ ఆమెను నిలువనీయక తెలిసిన వాళ్ల ద్వారా వాకబు చేయించింది. శ్రావణికి కూతురు పుట్టిందనీ, ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారని మాత్రమే తెలుసుకోగలిగింది. కానీ చిరునామా అయితే కనిపెట్టలేకపోయింది. ఒంటరి ఆడది... ఇక ఏమి చేయగలదు ! 
    చూస్తూ చూస్తూ ఉండగానే అలా మరో పదేళ్ళు దొరలిపోయాయి. ప్రేమగా పెంచుకున్న పూల మొక్కల్నే కన్నబిడ్డలుగా భావిస్తూ, ఆ పూలతోనే మాట్లాడుతూ బ్రతుకీడుస్తూ ఉంది శ్రీదేవమ్మ. 
        అలా ఉండగా ఓ సాయంకాలం... అరుగు మీద కూర్చుని గుండుమల్లెలు ముందు పోసుకుని మాల కడుతున్న ఆమె  ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగింది. ఎవరా అనుకుంటూ లేచి నిలబడింది. సన్నగా,  పొడుగ్గా, బారుజడతో చుడీదార్ వేసుకున్న ఓ అమ్మాయి డ్రైవింగ్ సీట్లో నుంచి డోర్ తీసుకుని దిగి, తిన్నగా ముందుకొచ్చింది. వేలితో శ్రీదేవమ్మ వైపు చూపిస్తూ, 
' శ్రీదేవమ్మ !'
అంది. ఎన్నడూ చూడని ఆ అమ్మాయి వైపు చూస్తూ, 
' ఆ... '
అంది శ్రీదేవమ్మ. వెంటనే వంగి కాళ్ళకు దండం పెడుతూ తల పైకెత్తి, 
" అమ్మమ్మా, నేను అరవింద... శ్రావణి మా అమ్మ... "
అనేసింది. ఆశ్చర్యంతో తలమునకలైన శ్రీదేవమ్మ చేతిలోని  మల్లెలు అప్రయత్నంగా కిందకి రాలాయి. వెంటనే లేచి అమ్మమ్మను హత్తుకుంది  అరవింద... !
    ఇరవై  సంవత్సరాలు దాటాక తొలిసారి మనవరాలిని చూస్తూ విపరీతమైన భావోద్వేగానికి లోనయిపోయిందా ముసలి ప్రాణం. ఊపిరి ఉండగా కన్నబిడ్డను  చూడగలనా అనుకుంటూ పరితపిస్తున్న ఆ తల్లికి అనుకోని వరంలా మనవరాలిని ఇలా ఈరోజు ఇంటికి పంపించిన దేవుడికి లోలోపలే దండం పెట్టుకుంది శ్రీదేవమ్మ. 
                  **               **              **
   ఇప్పటివరకూ తామిద్దరూ కోల్పోయిన అచ్చట్లు ముచ్చట్లు తనివితీరా తీర్చుకున్నారు అమ్మమ్మ, మనవరాలు ఇద్దరూ రెండు రోజులపాటు.. ! మాటల మధ్యలో తండ్రికి ట్రాన్స్ఫర్ అయి   ఇక్కడికే వచ్చేశారని, తనకు పెళ్లి కుదిరిందనీ చెప్పింది అరవింద శ్రీదేవమ్మతో. 
  ఆరాత్రి భోజనాలయ్యాక చల్లగాలిలో ఆరు బయట మంచం వేసుకుని అమ్మమ్మ ఒళ్లో  తల పెట్టుకుని ఆకాశంలో మిణుకుమిణుకుమంటూ వెలుగుతున్న దివ్వెల్లా ఉన్న నక్షత్రాల నడుమ ఎవరో పెట్టిన దీపంలా ప్రకాశిస్తూ వెన్నెల వెదజల్లుతున్న చందమామను తదేకంగా చూస్తున్న అరవింద. 
" అమ్మమ్మా, నీ బట్టలన్నీ సర్దేస్తాను... రేపు ఉదయం మనం ఊరికెళ్ళిపోతున్నాం... "
అంది ఠక్కున. 
" నేనెందుకురా చిట్టితల్లీ !? "
అరవింద నుదుటి మీది ముంగురులు సవరిస్తూ అడిగింది శ్రీదేవమ్మ. 
" ఎందుకేమిటి? నా పెళ్లి చూడవా... నాకు పూలజడ వేయవా..? కళ్యాణతిలకం దిద్దవా?... "
ఒక్కక్షణం విస్తుబోయినా, ఆ కళ్ళలో ఏవో మెరుపులు!! మరుక్షణం మరుగునబడ్డ జ్ఞాపకాలేవో గుర్తొచ్చి ఆమె ముఖం మ్లానమైంది. అదేదీ  గమనించని అరవింద, 
" అమ్మమ్మా, నీకు పూలజడ అంటే చాలా ఇష్టమట కదా!"
" నీకు ఎవరు చెప్పారే ? "
" మా అమ్మ చెప్పిందిలే... చిన్నప్పుడు తనకి వేయబోతే వద్దని పారిపోయేదటగా... !"
" ఇంకా ఏం చెప్పిందేమిటి మీ అమ్మ? "
" చాలా చాలా చెప్పిందిలే నీ గురించి.. అమ్మమ్మా, నాకూ  నీలా పూలజడంటే ఇష్టమే.. "
నేనూ నీ  పార్టీయే తెలుసా.... అన్నట్లు గారాలు పోయింది. 
" కానీ... నేనెలా  వేయగలను ! నీకు కళ్యాణ తిలకం ఎలా దిద్దను ? ఐదవతనం లేని దాన్ని... "
ఆమెలో నిరాశ ! వెంటనే ఒడిలోంచి లేచి, అమ్మమ్మ బుగ్గలు సాగదీస్తూ, 
" పిచ్చి అమ్మమ్మా, వాటిక్కావల్సింది ఐదోతనం కాదు. అదిగో... అలా పైకి చూడు.. ఆకాశమంత విశాలమైన మనసు ! అది  నీకుంది. నాకది చాలు..."
అనేసింది. అబ్బురంగా చూస్తూ, అంత లేత వయసులో అంతేసి సంస్కారానికి పరవశించిపోయింది శ్రీదేవమ్మ. 
               **                  **               **
    మరుసటిరోజు ఉదయం పదిగంటలవుతుండగా, ఇంటికి తాళం వేసి, కారు చుట్టూ మూగిన అందరికీ వెళ్ళొస్తానని చెప్తూ, మనవరాలి పక్కన కూర్చుని ఊరు దాటింది  శ్రీదేవమ్మ. మధ్యాహ్నానికంతా గమ్యం చేరుకున్నారిద్దరూ. 
      ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండు. దగ్గరి  చుట్టాలు వచ్చినట్టున్నారు....  ఇల్లంతా సందడిగా ఉంది. కారు  డోర్ తీసి,  అమ్మమ్మకు ఆసరాగా చేయందించింది అరవింద. దిగి, చుట్టూ పరకాయించి చూస్తున్న ఆమె కాళ్ళకు వంగి నమస్కరిస్తున్న ఆ ఇద్దరినీ చూసి, శ్రీదేవమ్మ భృకుటి ముడివడింది. 
శ్రావణి !! ఇరవైరెండేళ్ల క్రితం ఇల్లు దాటిన తన కూతురు ! ఇప్పుడు పక్కన భర్తతో... !
" అమ్మా, చంద్రం.... చంద్రశేఖర్.. ! మా ఆయన !"
భర్తను చూపిస్తూ, తల్లితో చెప్పింది శ్రావణి. ఆరోజు తన భర్త కూతుర్ని కొడుతుంటే, అడ్డుకున్న ఓ అపరిచితుడు! అదే తన  అల్లుడు ! ఎన్నో ఏళ్ళుగా తన గురించి తల్లి పడ్డ ఆరాటానికి సాంత్వనగా, 
" నేనీయనతో అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నానమ్మా..." 
అన్నట్లు శ్రావణి వదనంలో ప్రశాంతతతో కూడిన చిరునవ్వు! అమాయకపు ఆడపిల్ల! లోకజ్ఞానం లేక ఎక్కడ మోసపోతుందో అని  తల్లడిల్లిన క్షణాలు గుర్తొచ్చాయామెకు. కానీ ఆరోజు పట్టుకున్న తన కూతురి చెయ్యి ఇప్పటికీ వదలక తోడుగా నిలిచే ఉన్నాడు...! రత్నం లాంటి ఇతన్నా...ఆరోజలా అవమానించి గెంటేశాడు తన భర్త !  తనూ మిన్నకుండిపోయింది. గతం క్షణకాలం ఆమె ముందు కదలాడి మనసంతా కుంచించుకుపోయింది. లోలోపల ఆమెలో పశ్చాత్తాపపు నీలినీడలు! కళ్ళలో నీరు ధారలుగా కారుతుండగా ఇద్దర్నీ దగ్గరికి తీసుకుని పొదువుకుంది.
                    **             **                **
        (చివరి భాగం తదుపరి పోస్ట్ లో )



No comments:

Post a Comment